చంద్రానికి జ్వరం వదిలి, స్వస్థత కలిగేందుకు నెలరోజులు పట్టింది. ఆ తరువాత ఓ వారంరోజులు గడవగానే, చంద్రం, యిక తను వెళ్ళిపోతానన్నాడు. భద్రయ్య ఒప్పుకోలేదు. "మరికాస్త ఆరోగ్యం కలగ్గానే వెళ్ళుదువుగాని. మా ప్రకాశం నీ గురించి అంతా చెప్పాడు నువ్వు డెహరాడూన్ కో ఎక్కడికో వెళ్ళి చదువుకోవాలనుకొంటున్నావట. అలాగే చదువుకో. ప్రకాశం పాసయితే, కాలేజీ చదువుఖర్చులకు ఉంటుందని ఏడు సంవత్సరాలుగా కొంత డబ్బు కూడబెట్టాను. అది యిప్పుడు ఆరు వందలయింది. ఆ డబ్బు నీకిస్తాను. అది తీసుకొని మరికొంత ఆరోగ్యం కలిగింతరువాత, నువ్వెక్కడ చదువుకోవాలంటే, అక్కడికి వెళ్ళు. నువ్వు బాగా చదివి, ప్రయోజకుడివై తిరిగి రావాలని నా కోరిక" అన్నాడు భద్రయ్య.
"నాకు డబ్బవసరం లేదండీ, నా తిప్పలు నేను పడగలను" అన్నాడు చంద్రం.
"ఈ డబ్బే నీ తండ్రి యిస్తానంటే వద్దనగలవా?" అన్నాడు భద్రయ్య నిట్టూరుస్తూ.
"చంద్రం, నాన్న చెప్పినట్టు చెయ్యి. నాన్నకూ, నాకూ కూడా సంతోషం కలుగుతుంది" అన్నాడు ప్రకాశం.
వాళ్ళు చూపిన ఆదరానికి చంద్రం కళ్ళల్లో నీళ్ళు తిరిగినై. ఇంత ఆదరం, ప్రేమా అతడేనాడూ ఎరగడు. డబ్బు తీసుకోవడానికి ఒప్పుకున్నాడు. కాని అతడికోసంగతి తెలుసుకోవాలని వున్నది. తమ కుటుంబానికీ, యీ కుటుంబానికీ ఎందుకంత బద్ధవైరం? భద్రయ్య కాస్త తటపటాయించి, చివరికిలా చెప్పాడు:
"నువ్వింకా చిన్నవాడివి, అయినా బలవంతం చేశావు గనక చెపుతున్నాను. మా తాతగారిదీ, మీ ముత్తాతగారిదీ ఒకే ఊరు. అప్పట్లో మాది చాలా మోతుబరి కుటుంబం కింద లెక్క. మీ ముత్తాతగారు కుటుంబ పోషణకు చాలా అవస్థలపాలవుతుండేవారట. ఆయన ఒకసారి మా తాతగారితో అన్ని సంగతులూ చెప్పుకున్నారు. మా తాత ఆయనకు మూడువందల రూపాయలిచ్చి, గుంటూరు వెళ్ళి పొగాకు దుకాణం పెట్టుకోమని సలహా యిచ్చారు. ఆనాడు మూడు వందల రూపాయలంటే యిప్పటి మూడువేల రూపాయలతో సమానం.
మీ ముత్తాతగారు గుంటూరు వెళ్ళి వ్యాపారం సాగించారు. గిట్టుబాటుగానే వుంది. మరికొంత పెట్టుబడి పెట్టి, భారీ ఎత్తున వ్యాపారం చేయాలని ఆయనకు ఆలోచనవచ్చి, ఆ మాట మా తాతగారితో చెప్పారు. వ్యాపారంలో భాగస్వామి కమ్మన్నారు. అందుకొప్పుకొని, మా తాత, వున్న పొలమమ్ముకుని గుంటూరు చేరారు.
మా తాతా, మీ ముత్తాతా వ్యాపారంలో భాగస్వాములయ్యారు. వ్యాపార గొడవలన్నీ మీ ముత్తాతగారే చూసేవారు. వ్యాపారంలో ఎంత లాభాలు వస్తున్నదీ మా తాతకు తెలియదు. కుటుంబ ఖర్చులకు డబ్బుమాత్రం తీసుకుంటూ వుండేవారు. కొన్నేళ్ళు గడిచాయి. వ్యాపారం ఏపాటి లాభసాటిగా నడుస్తున్నదో తెలుసుకునేందుకు మా తాత, మీ ముత్తాతను ఆ వివరాలు అడిగారు. ఆ వివరాలన్నీ చెపితే నీకు వున్నమతిపోతుంది. కుటుంబ ఖర్చులకు సరిపడా డబ్బిస్తున్నానుగదా? కాలక్షేపం చేసెయ్యి అన్నారట మీ ముత్తాతగారు. ఇద్దరూ ఘర్షణ పడ్డారు. అసలు నీకు వ్యాపారంలో వాటాయే లేదు, పో పొమ్మన్నాడట మీ ముత్తాత. పల్లెలో మిగిలిన కొద్ది పొలమూ అమ్మి. కోర్టుకు వెళ్ళాడు మా తాత. కేసు గెలవలేదు. లెక్కలు పుస్తకాల్లో ఎక్కడా మా తాత వాటాదారుడన్న సంగతే లేదు. ఏదో జీతండబ్బులు తీసుకుని పనిచేసేవాడన్న ధోరణిలో ఆ లెక్కలన్నీ రాసివున్నాయి.
ఆ దెబ్బతో మా తాత మంచంపట్టి మూణ్ణెల్లు తిరక్కుండానే చనిపోయాడు. అప్పట్లో మా నాన్న హైస్కూల్లోనే అనుకుంటాను - చదువుతూండేవాడు. ఆ రోజులలో ఆయన చాలా దుడుకుమనిషి. చదువు పాడవడం, వున్న చదువుతో మంచి వుద్యోగం దొరక్కపోవటంతో, ఆయన బాగా పగబట్టి, ఒకరోజున దారిలో ఒంటరిగా మీ ముత్తాతను దొరకపుచ్చుకొని బాగా కొట్టాడు. అప్పటికే ముసలివాడై వున్న మీ ముత్తాత, ఆ దెబ్బలతో మంచంమీంచి లేవలేని స్థితికి వచ్చాడు. మా నాన్నమీద కోర్టులో కేసుమాత్రం పెట్టలేదు. కదిలిస్తే డొంకంతా కదిలి, తన పాత మోసాలన్నీ మళ్ళీ కోర్టు కెక్కుతాయని భయపడి వుంటాడు. ఏదేమయితేనేం, ఆనాటినుంచీ - మీ కుటుంబం మా కుటుంబం బద్ధశత్రువులైపోయారు.
మానాన్న - ఎక్కడా సరైన ఉద్యోగం దొరక్క, గోతాలమిల్లులో కూలీపనికి కుదిరాడు. ఆయన వారసత్వమే నాకూ వచ్చింది. ఎలాగో కాలక్షేపం చేస్తున్నాను. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ప్రకాశంమీదే నా ఆశలన్నీ. ఈ సంవత్సరం పరీక్ష తప్పాడని, నాకేం కోపం లేదు. మరో సంవత్సరం చదివి పాసవుతాడు. నువ్వూ, ప్రకాశం స్నేహితులు కావటం, నాకెంతో సంతోషంగా ఉంది. వాణ్ణి రైలుకింద పడకుండా కాపాడి, మా వంశాన్ని నిలబెట్టావు. ఒకప్పుడు మీ కుటుంబమే మా కుటుంబానికి రుణపడి వున్నదనుకునేవాడ్ని. ఇప్పుడు మేమే మీకెంతో రుణపడివున్నాం. మీ రుణం రూపాయలూ, అణాల్లో తీర్చగలిగింది కాదు."
భద్రయ్య చెప్పినదంతా శ్రద్ధగా విన్న చంద్రానికి తన కుటుంబం ఎంత నీచానికి ఒడిగట్టి, యీనాడు యింత ధనాన్ని కూడబెట్టిందో అర్థమైంది. కూలి చేసుకుని పొట్టపోసుకునే భద్రయ్య ముందు తనూ, తన అన్నా ఎంతో అల్పులు! భద్రయ్య దారిద్ర్యానికి తన కుటుంబమే కారణం. కాని ఈనాడు ఆ భద్రయ్యే తన చదువుకోసం డబ్బిస్తున్నాడు!
చంద్రం హృదయంలో భద్రయ్య మీద కృతజ్ఞతాభావం పొంగిపొర్లింది. అతడు మైకం కమ్మినవాడిలా లేచి, భద్రయ్య కాళ్ళమీద పడిపోయాడు. భద్రయ్య అతన్ని ఎంతో ఆప్యాయతతో పైకెత్తి గుండెలకు హత్తుకున్నాడు.
7
ఎనిమిది సంవత్సరాలకాలం యిట్టే గడిచిపోయింది. సంఘజీవితంలో చెప్పలేం కాని - వ్యక్తి జీవితంలో ఎన్నో మార్పులు కలగటానికి ఎనిమిది సంవత్సరాలు చాలు.
కృష్ణారావు నడుపుతున్న చిన్న పొగాకు కంపెనీ పెద్ద ఫ్యాక్టరీగా మారింది. పాత సైన్ బోర్డు స్థానాన్ని, 'శేఖర్ టుబాకో ఫ్యాక్టరీ' అన్న కొత్తబోర్డు ఆక్రమించుకున్నది. గుంటూరు టౌనుకు చిన్న సిటీ లక్షణాలు ఏర్పడినై. మెడికల్ కాలేజీతోపాటు, మరికొన్ని కొత్త కాలేజీలూ, హాస్పిటల్సూ వచ్చాయి. పల్లెటూళ్ళలో నివసించే ధనిక కుటుంబాలవాళ్ళు చాలామంది పిల్లల చదువుకోసం అంటూ పట్టణం మీదికి ఎత్తివచ్చారు. బీద కుటుంబీకులు, విడవకుండా కూలీనాలీ దొరుకుతుందన్న ఆశతో గ్రామాలు వదిలి లేచివచ్చారు.
పై చూపులకు పట్టణం బాగా మారింది. వాతావరణం మరింతగా మారింది. కాని ఫ్యాక్టరీలలో, కార్ఖానాలలో కష్టించి పనిచేసే కూలీల జీవిత విధానంలో మార్పులేదు. కృష్ణారావు యాజమాన్యంలో నడుస్తున్న పొగాకు ఫ్యాక్టరీకి అంతదూరంలో వున్న మైదానంలో మరికొన్ని కొత్త పూరిగుడిశెలు లేచాయి. వాటితోపాటు అక్కడ మురికీ, బీదతనం కూడా మరికొంత పెరిగింది.
పూర్వం వేలల్లో నడిచిన కృష్ణారావు వ్యాపారం యిప్పుడు లక్షలమీద నడుస్తున్నది. పాత డాబా యింటిస్థానంలో రెండంతస్తుల విశాలమైన మేడ కట్టించాడు. అతడిప్పుడు నవనాగరిక జీవితానికి అవసరం అయిన అన్ని హంగులూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంటికి కావలసిన ఫర్నిచరంతా ఆర్డరిచ్చి బొంబాయినుంచి తెప్పించాడు.
కృష్ణారావు ఏకైక పుత్రిక రజనికి యిప్పుడు పన్నెండో ఏడు. రజనిని అందరూ అచ్చం బాబాయి పోలిక అంటారు. చంద్రం యిల్లు వదిలిపోయినప్పుడు రజని మూడేళ్ళ పిల్ల. ఆ కారణంగా ఆమెకూ చంద్రం ఏమీ గుర్తులేడు. కాని, హేమ దగ్గిరకు వెళ్ళినప్పుడల్లా రజని చంద్రాన్ని గురించి అడుగుతూండేది. ఎలాంటివాడు? కోపధారా? నిదానస్తుడా? ఎర్రగా వుండేవాడా? చామనఛాయా? ఈ ప్రశ్నలెప్పుడైనా తల్లినడిగితే, ఆవిడ కస్సుమనేది, తండ్రి నడిగితే ముభావంగా తలవంచుకు వూరుకుని, బాధపడుతున్నట్టు కనబడేవాడు.
చంద్రం బాబాయికి తానంటే చాలా ప్రేమ అనీ, ఎప్పుడూ భుజంమీద వేసుకుని తిప్పుతుండేవాడనీ, హేమ ద్వారా తెలుసుకుని రజని చాలా ఆనందపడేది. బాబాయి యిప్పుడెంత ఎత్తు పెరిగివుంటాడు? ఏనాటికైనా ఇంటికి తిరిగివస్తాడా? ఇలాంటి ప్రశ్నలతో రజని సతమతమైపోతూ వుండేది.
రజని చాలా చురుకైన పిల్ల. తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడంవల్ల ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొంటున్నారు. తల్లి కాంతమ్మకు రజనిమీద ఈగవాలినా ఎక్కడ కందిపోతుందోనన్నంత భయం. రజని మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఆ ఇంటిలో ఎవరికీ లేదు. కొంచెం కోపగిస్తే చాలు. అలిగి కూర్చునేది. ఆమెకు సినిమా పత్రికలూ, డిటెక్టివు నవలలూ చదవడంలో వున్న శ్రద్ధ, స్కూలు పుస్తకాలమీద లేదు. అందువల్లనే రజని రెండు సంవత్సరాలుగా థర్డుఫారంలోనే వుండిపోయింది. కృష్ణారావు కూతురు చదువు అశ్రద్ధ చేస్తున్నదని తెలిసి, గట్టిగా కోప్పడాలనుకునేవాడు. కాని కాంతమ్మకు భయపడి అతడామెను మందలించలేకపోతున్నాడు.