ఎడిటరు కూడా నవ్వాడు "తర్వాత నెమ్మదిగా అన్నాడు" "మీరు ఒప్పేసుకున్నారు కాబట్టి మీకో విషయం చెప్పడం నా ధర్మం"
"ఎడిటరు మొహంలోకి వెదుకుతున్నట్లు చూశాడు ఉదయార్కర్ "చెప్పండి!"
"మీకు వచ్చిన బెదిరింపులాంటిదే నాకూ వచ్చింది."
"ఐసి!" అని కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఉదయార్కర్. తర్వాత అన్నాడు. "అది తప్పదుకదా! నాకే బెదిరింపు వచ్చినప్పుడు మీకు రాకుండా ఎలా ఉంటుంది. అసలు మీకే ముందు వచ్చి ఉండాలే!"
"అవును. సదానంద్ నన్ను మొదటిసారి కలవడానికి వచ్చి వెళ్ళగానే ఒక దిటేనింగ్ కాల్ వచ్చింది. ఉదయార్కర్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ ఫర్మేషన్ వల్ల మీ నిర్ణయం మారుతుందా!"
"నెవ్వర్! అలాంటిదేమీ లేదు" అన్నాడు ఉదయార్కర్ స్థిరంగా.
ఎడిటరు మొహంలో రిలీఫ్ కనబడింది.
ఇంతలో పాన్ వేసుకోవడానికి బయటికి వెళ్ళిన సదానంద్ తిరిగి వచ్చాడు. తాంబూల సేవనంతో ఎర్రగా అయింది అతని నోరు. అచ్చం పాము నోరులాగే వుంది.
అతను కూర్చోగానే అన్నాడు ఎడిటరు.
"ఉదయార్కర్ ఒప్పుకున్నారు వివరాలన్నీ మీరు మళ్ళీ చెప్పండి. అయన ట్రిప్పు ప్లాన్ చేసుకుంటారు."
వెంటనే సదానంద్ మొహం వికసించింది. "వివరాలు నేను చెప్పే కంటే బ్రహ్మచారీ చెబితే బాగుంటుంది. నేను సార్ ని బ్రహ్మచారీ దగ్గరకు తీసుకేళతాను. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేస్తాను. వాళ్ళిద్దరూ నిధిని అన్వేషిస్తూ వెళతారు."
"బ్రహ్మచారీ ఎక్కడుంటారు? ఫారెస్టులోనా?" అన్నాడు ఎడిటరు.
సదానంద్ నవ్వాడు.
"కాదు సార్! అయన టెలిఫోన్స్ లో అపరేటరుగా పని చేస్తున్నారు."
ఆశ్చర్యంగా చూశారు ఎడిటరు, ఉదయార్కర్ ఇద్దరు కూడా. బ్రహ్మచారి అనగానే పెద్ద కుంకుమబొట్టు పెట్టుకుని, రుద్రాక్షమాల వేసుకుని కాషాయవస్త్రాలు ధరించి, అడవుల్లో తిరుగుతూ ఉండే వ్యక్తిని ఊహించుకుంటున్నారు వాళ్ళు అప్పటిదాకా.
"టెలిఫోన్స్! ఏ ఉళ్ళో పని చేస్తున్నారు అయన!" అన్నాడు ఉదయార్కర్.
చెప్పాడు సదానంద్.
"ఎప్పుడు బయలుదేరాదాం మనం."
"నేనూ ఎప్పుడూ రెడీనే సార్! మీ వీలును బట్టి బయలుదేరదాము."
"ఎల్లుండి పొద్దున"
"తప్పకుండా! ఎల్లుండి పొద్దున ఆరింటికల్లా బస్టాండుకి వచ్చి మీకోసం కాచుకుని ఉంటాను." అన్నాడు సదానంద్ లేచి నిలబడుతూ.
అతను సెలవు తీసుకుని వెళ్ళిపోగానే ఎడిటరు , ఉదయార్కర్ మొహమొహాలు చూసుకున్నారు.
"సో ది అడ్వెంచర్ స్టార్ట్! ఇలాంటి ఎక్స్ పెరిమేంట్ సీరియల్ ఇంతకుముందు ఎవరూ అటెంప్ట్ చేసి ఉండరేమో!" అన్నాడు ఎడిటరు.
"ఎవరూ అటెంప్ట్ చెయ్యలేదు కాబట్టే మనకు ఇంత టెంప్టింగ్ గా అనిపిస్తోంది. ఇది నిజంగా సీరియల్! ఇంత ఎగ్జయిటింగ్ ప్రాజెక్టు మొదలెడుతున్నాం! దీనికి ఎవరి దిష్తో తగలకుండా ఉంటే బాగుండు." అన్నాడు ఉదయార్కర్.
ఎడిటరు నవ్వాడు.
సరిగ్గా వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే టెలిఫోన్స్ డిపార్టుమెంటులో ప్రమోషన్స్ లేకుండా రిటైర్డ్ అయిపోతున్న అభిషేకాన్ తలఎత్తి అసూయా, మాత్సర్యం నిండుకున్న చూపులతో పరిసరాలను గమనించి తర్వాత పిల్లిలా వెళ్ళి ట్రంక్ టెలిఫోన్ లైన్స్ కొన్ని విడదీసి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వాటిని కలిపాడు.
వెంటనే హైదరాబాద్ నుంచి బొంబాయి వెళుతున్న ఒక ట్రంక్ లైన్ కట్ అయిపొయింది.
తక్షణం అల్లకల్లోలం! చెప్పలేనంత కన్ ఫ్యుజన్ చోటు చేసుకుంది. కుదరబోతున్న కొన్ని వందల లావాదేవీలు - చెదిరిపోయాయి. అత్వవసరమైన వార్తలు కొన్ని అందకుండా ఆగిపోయాయి.
అలా కొద్ది సేపు గడిచాక ఈవిల్ గా నవ్వుకుని లైన్సు మళ్ళీ సరిగ్గా సెట్ చేశాడు అభిషేకన్.
కానీ అప్పటికే జరగవలసిన నష్టం కొంత జరిగిపోయింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు కూర్చున్నాడు అభిషేకాన్. యాసిడ్ లా కాల్చేస్తున్న తన కడుపుమంట చల్లారడానికి మెదడును మోద్దుబారిపోయేలా చేస్తున్న ఫ్రాస్టషన్ బయట పెట్టడానికి ఈసారి ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ నెమ్మదిగా పన్లోకి జొరబడ్డాడు.
4
"అయితే మీరూ సదానంద్ కలిసి ఎల్లుండి పొద్దున బయలుదేరి వెళుతున్నారు బ్రహ్మచారీని కలుసుకోవడానికి" అన్నాడు ఎడిటరు.
అవునన్నట్లు తల పంకించాడు ఉదయార్కర్.
ఇంతలో తలుపు దగ్గర అలికిడి అయింది. ఎడిటరు తలఎత్తి చూసి "ప్లీజ్ కమిన్" అన్నాడు.
ఇద్దరు స్త్రీలు లోపలకువచ్చారు. చాలా ఫ్యాషనబుల్గా ఉన్నారు వాళ్ళు. ఒకామె బాగా తెల్లగా వుంది. రెండో ఆమె చామనచాయతో వుంది.
"కూర్చోండి" అన్నాడు ఎడిటరు. వాళ్ళు కూర్చోగానే టీ వచ్చింది. తన దగ్గరకు వాళ్ళెవరికీ టీ ఆఫర్ చెయ్యకుండా పంపే అలవాటు లేదు ఎడిటర్ కి.