Previous Page Next Page 
అశ్రుతర్పణ పేజి 11

    సుబ్బలక్ష్మి ఎన్.ఎన్.ఎల్.పి. పరీక్ష పాపయింది. ఇంటర్ కి కట్టమన్నారు నరసింహారావుగారు. చింటూని చూట్టానికి జానకమ్మ కొడుకులూ, కోడళ్ళూ వచ్చారు. నరసింహారావుగారూ, వాసుదేవరావుగారు కూడా మనవడు పుట్టిన సంతోషానికి అందరికీ చీరలూ, సారెలూ పెట్టారు. సుబ్బలక్ష్మి స్థానాన్ని చూసి జానకమ్మ మురిసిపోయింది. అన్నయ్యలు సుబ్బలక్ష్మితో  స్నేహంగా ఉన్నారు. వదినలు మూతివిరుపులు మానేశారు. నరసింహారావుగారి ఇంటిఖర్చు మాత్రం రెట్టింపైయింది. భార్యకి మందులూ, వగైరా ఖర్చు లెక్కువయ్యాయికదా అని  సర్దుకుంటున్నారు.
    రోజులు గడుస్తున్నాయ్. చింటూ ఊసులకో బోలెడంత కాలక్షేపం సుమతికి, "ఛీ....ఛీ....." అంటే పకపకా నవ్వుతాడు వాడు సుమతికూడ వాడితో శృతి కలుపుతుంది.
    సుమతి చింటూ నాడిస్తుంది అప్పుడు. కెవ్వున కేక వినబడి పరుగెత్తుకెళ్ళింది. నోట్లోంచి నురగోస్తోంది. కళ్ళుతేలేశారు వాసు దేవరావుగారు "నాన్నా" అంటూ భోరుమంది సుమతి. ఆయమ్మ పరుగెత్తుకొచ్చింది. డాక్టరుకి, నరసింహారావుగారికీ ఫోన్ చేసింది. తండ్రిచేతిని తనచేతిలోకి తీసుకుని, తువ్వాలుతో అతని నోట్లోని నురగను తుడుస్తూ, ఏడుస్తుంది సుమతి. వాసుదేవరావుగారు మాట్లాడలేకపోతున్నారు. కానీ, మెల్లగా చెయ్యెత్తి సుమతికళ్ళు తుడుస్తూ ఏడవొద్దని సైగ చేశారు. మరో అయిదు నిమిషాల కల్లా డాక్టరోచ్చాడు. నరసింహారావుగా రందరూ వచ్చారు. వెంటనే ఏదో ఇంజక్షనిచ్చాడు డాక్టరు. కానీ మందు లోపలికి పోలేదు. శాశ్వతంగా వాసుదేవరావుగారి కళ్ళు మూతలు పడిపోయినయ్.
    "నాన్నా" అంటూ అతని శపంమీద పడి గొల్లుమంది సుమతి. ఆమెను ఊరుకో బెట్టడం ఎవరి తరమూ కావడంలేదు. ఆ యింట్లో శోకదేవత తాండవం చేస్తోందా అన్నట్టు ఇల్లంతా శోకంతో నిండిపోయింది.
    "ఆయన్ని  రమ్మనండి మామయ్యా"  అంది సుమతి.
    మెడ్రాసు ట్రైనింగ్ సెంటర్ కి ఫోన్ చేశారు. అరగంట తరువాత దొరికింది లైను. గోవిందుతో డైరెక్టుగా మాట్లాడడానికి వీలులేదని అతని ఆఫీసరు మాట్లాడాడు.
    "ఒక్క రెండురోజుల కోసం గోవిందుని పంపించండి" బ్రతిమాలారు నరసింహారావుగారు.
    "వీల్లేదు. ట్రైనింగ్ మధ్యలో ఒక్కరోజుకూడా ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు. ఏమీ అనుకోకండి, అవి మా రూల్సు " అవతలి కంఠం.
    "పోనీ ప్రొద్దుట ఫ్లేయిట్ లోవస్తే సాయంత్రం ఫ్లేయిట్ లో తిరిగొచ్చేస్తాడు. ఆఖరిసారిగా వాళ్ళమామయ్య శవాన్నైనా చూసే అవకాశం ఇవ్వండి ప్లీజ్."
    "చూడండి రావుగారు ! ఇలాంటి సెంటిమెంట్స్ కి మాదగ్గర తావులేదు. ప్రాణాలు పోయాక ఎంత దగ్గరవారైనా వచ్చి ఏం చేస్తారు? జనన మరణాలకి పొంగిపోవడం,కృంగిపోవడం మామూలు మనుష్యుల స్వభావం. రెంటికీ తొణకకుండా కర్తవ్య నిర్వహణే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగడం మా ధ్యేయం. కనుక క్షమించండి. గోవింద్ ని పంపిచడానికి వీలవదు. అతను బాధ పడకుండా మేము చూసుకుంటాం. వాసుదేవరావుగారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తాం. మిసెన్ గోవింద్ గారికి మా సంతాపాన్ని తెలియజెయ్యండి.  ఉంటా.
    "బై....బై....".
    "బై....బై...." ఫోన్ పెట్టేశాడు జనరల్ మేనేజర్. బిక్కమొహంతో దిగులుగా కూర్చున్నారు నరసింహారావుగారు.
    భూమి దద్దరిల్లేలా ఏడుస్తున్న సుమతిని ఊరుకోబెట్టలేక సతమత మయిపోతున్నారు ఇంటిల్లిపాదీ. అయిన వాళ్లందరికీ కబురు చేశారు. ఐస్ లో  ఉంచిన వాసుదేవరావుగారి శవాన్ని అగ్నికాహుతి చేసి, కర్మకాండ ప్రారంభించాడు సుమతి పిన్నికొడుకు విశ్వేశ్వర్రావు.
    నన్నెందు రోజులూ ఎలాగో గడచిపోయాయి. పదమూడో నాడు ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు.  సుమతిని తమతో రమ్మన్నారు. తమనే నమ్ముకున్న   పనివాళ్లందరినీ పంపించెయ్యడం ఇల్లు తాళం పెట్టడం ఇష్టంలేక ఆయమ్మని అక్కడే ఉండమంది సుమతి. ముఖ్యమైన వాళ్లెవరూ లేకుండా కేవలం పనివాళ్లు  వండుకు  తింటూ, అంతఇంట్లో వుండడం అర్ధంలేని  పని అనిపించింది నరసింహారావుగారికి. కానీ సుమతి అభీష్టానికి అడ్డు చెప్పలేక పోయారు.
    రోజులు గడుస్తున్నాయ్. రాత్రీ, పగలు - పగలూ, రాత్రి కాలంలో మార్పులేనట్టే సుమతి జీవితంలోనూ మార్పులేదు. తండ్రి జ్ఞాపకం వస్తే  ఏడవడం, పిల్లాడు ఊమలాడుతూంటే నవ్వడం, గోవిందుని తలుచుకొని బెంగపెట్టు కోవడం  ఆవిడకి రోజులో ఒక భాగంగా అయిపోయాయి. కామాక్షమ్మగారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే వుంది. మూడు రోజుల కొకసారి గుండెదడ ఎక్కువవుతుంది. సుమతి ఆరోగ్యం కోసం, గోవిందు రాక కోసం ఆమె చెప్పలేనంత బెంగ పెట్టుకుంది.
    సుబ్బలక్ష్మి కాలేజిలో చేరుతానంది. "సరే" నన్నారు నరసింహారావుగారు. " వయసొచ్చిన పిల్లా. కాలేజి బాధ్యత ఇదంతా మనకెందుకండీ" అంది కామాక్షమ్మగారు.
    "పోనీలేవే. చదువుకుంటానంటే ఎదుక్కాదనాలి? గోవిందా పెద్దవాడైపోయాడు. వేరే బాధ్యత లేంలేవు. డబ్బుకేమీ లోటులేదు భగవంతుని దయవల్ల. పోనీ  స్తోమత లేని  ఒక ఆడపిల్లకి చదువు చెప్పించి సాకుతున్నాం. అనుకో. ఒక మంచి పనిచేస్తున్నాం అన్నంతతృప్తి మనలో కలిగిననాడు మిగతా కారణాలు అంతగా  బాదించవు. అనవసరంగా మనసు పాడుచేసుకోకు నామనసు పాడుచెయ్యకు" చిన్నగా హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు నరసింహారావుగారు. మరి  మాట్లాడలేక పోయింది కామాక్షమ్మ. ఎంతైనా ఎవరి బంధుప్రేమ వారిది అనుకుని వూరుకుంది. ఆనాటినుండి సుబ్బలక్ష్మి విషయంలో నరసింహారావుగారికి సలహాలివ్వడం మానేసింది.
                     *        *        *
    పిల్లాడితో వంట ఇంటిలోకి వెళ్లడానికి సుమతికి కొంచెం కష్టంగానే వుంది. సుబ్బలక్ష్మికి కాలేజి. ఫ్రండ్స్, సినిమాలు. బొత్తిగా ఇంటిలో వుండడంలేరు. కామాక్షమ్మ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఆలోచించి సుమతి ఓ  నిర్ణయానికొచ్చింది. నరసింహారావుగారితో అంది "ఆయమ్మని మనం  పిలపించుకుందాం. ఆ యింటిని లైబ్రరీగా మారిస్తే బాగుంటుందనిపిస్తోంది. నాన్నగారి దగ్గర రెండు, మూడు షెల్ఫుల పుస్తకాలున్నాయి. గవర్నమెంటు వారితో సంప్రదించి ఆ పుస్తకాలాన్నీ వాళ్ళకి 'డొనేట్' చెయ్యొచ్చు. అప్పుడు మాలినీ, పనివాణ్ణి వాళ్ళే అట్టిబెట్టుకుని జీతాలివ్వోచ్చును. కారూ, డ్రైవరూ ఎలాగా మనదగ్గరే వుంటారు. ఏమంటారు మామయ్యా?"
    నరసింహారావుగారికీ ఈ సలహా వచ్చింది. "అలాగేనమ్మా! ఆ ఏర్పాట్లు చేస్తాను ఆయమ్మ నిక్కడికి పిలుచుకొచ్చేస్తాను" అన్నారు.
    వారంరోజుల్లో ఏర్పాట్లన్నీ అయ్యాయి. ప్రభుత్వ  గ్రంథాలయంవాళ్ళు వాసుదేవరావుగారి ఇంటిని అద్దెకు తీసుకున్నారు. నెలకు  వెయ్యిరూపాయలుఅద్దె. 'వాచ్ మన్ కమ్ మాలీగా' మాలీకి ఉద్యోగం ఇచ్చారు. పనివాడికి హెల్పర్ ఉద్యోగం ఇచ్చారు. టెలిఫోను లైబ్రరీవాళ్ళకిచ్చేసింది సుమతి ఇన్ని పుస్తకాలు, షెల్పులతో సహా లైబ్రరీకి దానం చేసినందుకు 'వాసుదేవ లైబ్రరి' అని పేరు పెట్టడానికి అభ్యంతరం చెప్పలేదు ప్రభుత్వం. లైబ్రరీ ప్రారంభోత్సవానికి చింటూతోసహ అందరూ వెళ్లారు. ఒకప్పుడు తమ  ఇల్లు ఇప్పుడు   పుస్తకాలతో నిండిపోయింది. పడకగది, భోజనాల గది. డ్రాయింగ్ రూమూ అనేక జ్ఞాపకాలకూ, మమతలకూ నిలయమై మదిని నింపేస్తూంటే, అవి నింపుకున్న పుస్తకాలను చూస్తూ ఏదో తన్మయత్వంలో తేలిపోతోంది సుమతి. తండ్రి  గదితోసహా అన్నిగాదులూ చుట్టి చుట్టి చూసింది. పసిపిల్లలా తిరుగాడుతూన్న సుమతిని చూసి  కళ్ళంట నీళ్ళేట్టుకుంది ఆయమ్మ. పిల్లా, పాపలతో, వచ్చే పోయే అతిధులతో, కలకలలాడుతూ. నిత్య కల్యాణం,  పచ్చలోరణంలో  వెలిగిపోయే ఈ ఇల్లు చలనం పుస్తకాలతో, నిశ్శబ్దాన్ని నింపుకుని, మూగగా వుండడం సహించలేక పోయింది. ఎంతమందికి ఈ ఇంటిలో తమ  చేతుల మీదుగా  వండి వడ్డించింది!! అటువంటి వంటయిల్లు చిన్నబోయి తనకేసి చూస్తూన్నట్టనిపించింది ఆయమ్మకి. వెక్కివెక్కి ఏడ్చింది ఆయమ్మ.
    "పద ఆయమ్మా! వెళదాం" అంది సుమతి. 

 Previous Page Next Page