Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 1

                                 


                                        సౌందర్య దీపం-2

 

                                                                                   -ఆర్. సంధ్యాదేవి 

  

                       

    
            
                                             47


    జయరామ్ ఆ రోజు ఉదయమే కంపెనీకి బయలుదేరి వెళ్ళిపోయాడు.


    అతని ఫ్రెండు ఒకతను వచ్చి ఆఫీసు రూమ్ లో మాట్లాడసాగాడు జయరామ్ తో.


    జగన్నాధరావు చెప్పిన మాటలు వింటూనే జయరామ్ అలా ఉండిపోయాడు.


    జగన్నాధరావు భార్య సుశీల అంబికకు బాగా స్నేహము ఉందని చెప్పాడు.


    అతను మొదట మామూలుగా ఊ కొట్టాడు.


    నా భార్య ప్రెగ్నెంట్ డెలివరీకి ఆవిడ తన హాస్పిటల్లో చేర్పించమంటే చేర్పించాను. డెలివరీకి రెండు రోజులు టైముందని హాస్పిటల్ లోనే ఉంచమని చెప్పింది. అయితే నిన్న అంబిక హాస్పిటల్ కి రాలేరు. మా ఆవిడకు డెలివరీ టైము దగ్గర అయింది.


    నేను వెళ్ళి తీసుకువద్దామని ఆవిడ యింటికి వెళ్ళాను. కృష్ణమౌళిగారు నన్ను లోపలకు వెళ్ళనివ్వలేదు. అంతే ఆ మాట వినటంతో కుతూహలంగా కనుబొమ్మలు పైకెత్తి ఆ మాటలు శ్రద్ధగా వినసాగాడు.


    ఎందుకు అతను నిన్ను యింట్లోకి రానివ్వలేదు అన్నట్టు చూడసాగాడు జగన్నాధరావువైపు.


    అతను అదోలా నవ్వి చెప్పాడు. "అంబిక చాలాసార్లు మా ఆవిడతో అతని విషయం చెప్పేది. తను మంచివాడు కాదని, ఆమెను చదివించిన కారణంగా అతనితో ఉండిపొమ్మని పైకి చెప్పుకోసేని విధంగా ఆ ఇంట్లో ఖైదీగా ఉంచాడని చాలా బాధలుపడుతూ ఆ యింట్లో ఉంటున్నానని చెప్పింది. కృష్ణమౌళి పైకి చాలా శాంతంగా కనిపించినా అతను మంచివాడు కాదు. నేను యింటికి వెళ్ళానా, గుమ్మంలో ఎదురయి ఎందుకు అని చాలా కోపంగా అడిగాడు. నేను చెప్పాను మా ఆవిడ్ని హాస్పిటల్ లో జాయిన్ చేశామని. ఈ ఊళ్ళో ఇక డాక్టర్లే లేరా! ఆవిడ ఒక్కర్తేనా? ఇకనుండి అంబిక బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు. బయటకు అడుగు పెట్టిందో ఆమె ప్రాణాలతో ఉండదని ఖచ్చితంగా చెప్పేసి మీ ఆవిడ్ని మరో హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమని చెప్పాడు" అంటూ చెప్పి అతని ముఖంలోకి చూశాడు జగన్నాధరావు.


    జయరామ్ ముఖంలో గబగబ రంగులు మారాయి. మొదట అతని ముఖం ఆపుకోలేని కోపంతో ఎర్రబడింది.


    ఆ తరువాత తను ఊహించనిదానికి వ్యతిరేకంగా జరిగింది. కృష్ణమౌళి ఆమెను నిజంగానే బాధలు పెడుతున్నాను అనుకుంటుంటే అతని ముఖం తెల్లగా పాలిపోయింది. అతను పెట్టే బాధలు సహించలేక ఎవరు సహాయం చేసినవాళ్ళు లేరని చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంటే!


    ఆ ఊహ రాగానే అతని ముఖం నల్లబడిపోయింది. ఆమె చెప్పింది అంతా నిజమ! వట్టిదే అని కొట్టిపారేశాడు.


    తనమీద దెబ్బ తీయడానికి కుట్ర పన్నుతుందనుకున్నాడు.


    తనని ఏదో మోసంలో ఇరికిస్తుందని తలచి ఆమె మాటలు నమ్మకుండా యింటికి వచ్చేసి ఆ విషయం పూర్తిగా మర్చిపోయాడు.


    జగన్నాధరావు చెప్పేవరకు నిజమని నమ్మలేకపోయాడు.


    ఇప్పుడు ఏమిటి చెయ్యాలి! ఆ అమ్మాయికి తను ఎలా సాయం చెయ్యాలి!


    అతని బుర్ర అంతా మొద్దుబారినట్లయింది.


    ఎప్పుడు ఏ విషయం గురించి పెద్దగా ఆలచించని జయరామ్ అంబిక విషయంలో మాత్రం ఎక్కువ ఆలోచిస్తున్నాడు.


    జగన్నాధరావు కాస్సేపు అలా అంబిక విషయాలు చెప్పి ఆ తరువాత తన ఆఫీసు విషయాలు మాట్లాడసాగాడు.


    జగన్నాధరావు మాటలు ఒక్కటికూడా బుర్రకి ఎక్కటంలేదు.


    అతను ఎంత త్వరగా అక్కడనుండి వెళ్ళిపోతాడా అని చూడసాగాడు.


    జగన్నాధరావు ఒక అరగంట కూర్చుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అతృతగా పక్కనేవున్న ఫోను రిసీవర్ చేతిలోకి తీసుకుని నెంబర్ డయిల్ చేశాడు.


    అవతలి కంఠం హలో అంది. అది అంబిక కంఠస్వరం కాదు.


    "డాక్టర్ గారు ఉన్నారా?" అడిగాడు.


    "లేరు" అంది అవతలి కంఠస్వరం ముక్తసరిగా.


    "ఎన్ని గంటలకు హాస్పిటల్ లో ఉంటారు?"


    "హాస్పిటల్ కి రావటంలేదు."


    "ఎందుకు రావటం లేదు!" ఆతృతగా ప్రశ్నించాడు.


    "ఏమో మాకు తెలీదు" అంటూ రిసీవర్ ఠపీమని పెట్టేసిన శబ్దము అయింది.


    జయరామ్ కి కోపం ముంచుకు వచ్చింది. ఎవరా ఫోను పెట్టేసింది. అంత పొగరా తను మాట్లాడుతుంటే సరిగ్గా సమాధానం ఇవ్వకుండా అనుకుంటూ కృష్ణమౌలి యింటికి చేశాడు. నౌకరు ఫోనులో ఎవరు కావాలి అని అడిగాడు. డాక్టర్ అంబిక గారితో మాట్లాడాలి పిలవమని చెప్పాడు. ఆ అమ్మగారు ఇప్పుడు ఎవరితో మాట్లాడరని చెప్పాడు.


    "ఏం"


    "ఒంట్లో బాగోలేదు. మేడమీద పడుకున్నారు"


    "జయరామ్ గారు ఫోన్ చేశారని చెప్పు! వస్తారు" అన్నాడు.


    "సరే ఉండండి పిల్చుకువస్తాను" అంటూ వెళ్ళాడు.


    తిరిగి పదినిమిషాల తరువాత అంబిక ఫోను దగ్గరకు చ్చి "హల్లో" అంది. ఆ అనటం ఎంతో నీర్సంగా శక్తిలేనట్లు ఉంది ఆ కంఠస్వరం.


    "ఎవరూ అంబికా! నేను జయరామ్ ని" అన్నాడు ఆతృతగా.


    "మీరా! అంది. ఆ కంఠస్వరంలో భయం కదిలినట్లయింది. నేనే మీ హాస్పిటల్ కి ఫోన్ చేస్తే మీరు హాస్పిటల్ కి రావటంలేదని చెప్పారు."


    "అవును. హాస్పిటల్ కి వెళ్ళటం మానేశాను" అంది నీరసంగా. ఆ మాటలు ఎక్కడో నూతిలో నుండి వెలువడినట్లుగా ఉన్నాయి.


    "ఎందుకని!" ఆతృతగా అడిగాడు.


    అతని ప్రశ్నకు ఆమె నవ్వింది. "చెబుతాను, కాని మీరు నమ్ముతారనే నమ్మకం లేదు. అందుకే నేను చెప్పదలుచుకోలేదు" అంది చాలా నెమ్మదిగా, తాపీగా.

Next Page