Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 2


    "లేదు లేదు నేను నమ్ముతాను. నువ్వు ఏం చెప్పినా అదే మీరు ఏం చెప్పినా నమ్ముతాను" అంటూ మాటలు తడబడ్డాయి. ఆమెను ఏకవచనంతో సంబోధించి పొరపాటు దిద్దుకున్నాడు. అంబిక అదోలా నవ్వి "మరి ఆరోజు నమ్మలేదు, నమ్మనివాళ్ళని నమ్మించాలని చూడటం నాకు ఇష్టంలేదు."


    "నేను ఏమనుకున్నానంటే మీరు నన్ను....." అంటూ మాట మధ్యలో ఆపేశాడు. ఆ తరువాత ఏం చెప్పాలో అతనికి అర్దంకాలేదు.


    "మిమ్మల్ని ఏదో మోసంలో ఇరికించడానికి ఇలా అంటున్నాను అనుకున్నారు అంతేనా?"


    "అంతే.... అంతే" అన్నాడు ఏం అనాలో తోచక.


    "అయితే మీకు యింటికి రండి ఫోన్ లో కాదు యింటి దగ్గర అయితే మీకు వివరంగా చెప్పటం వీలవుతుంది. ఫోన్ లో అయితే ఎవరయినా వింటారు" అంది కంఠస్వరం మెల్లిగా తగ్గించి.


    "మరి కృష్ణమౌళి" అన్నాడు సందేహంగా.


    "యింటి దగ్గర లేరు. ఎవరో ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళాడు. మళ్ళీ రాత్రికిగాని రారు" అంది


    అతను మాట్లాడలేదు యింటికి వెళ్ళాళా! వద్దా! ఆలోచనలో పడి పోయాడు.


    "ఏమిటి ఆలోచిస్తున్నారు! ఇంటికి రావడానికి భయమనిపిస్తుందా!" అడిగింది.


    "భయమా?" అంటూ నిర్లక్ష్యంగా నవ్వి "నాకు అలాంటి భయాలేమీ లేవు. నాకు భయమంటే ఏమిటో కూడా తెలీదు. మీ యింటికి పదినిమిషాల్లో వస్తాను"


    "మీకోసం ఎదురుచూస్తుంటాను" అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది.


    జయరామ్ తన కారులో తిన్నగా కృష్ణమౌళి ఇంటికి వెళ్ళాడు. మేడమీద బాల్కనీలోంచి అంబిక అతని రాకకోసం ఎదురుచూస్తూ నిలబడింది.


    కారు దిగి తల పైకి ఎత్తి చూశాడు.


    అంబిక చెయ్యివూపి ఆగమన్నట్టు చెప్పి ఆమె వెనుదిరిగింది.


    మేడ దిగివచ్చి అతన్ని లోపలకు తీసుకువెళ్ళింది. తిన్నగా తన గదిలోకి రమ్మని చెప్పి సోఫా చూపించింది అతన్ని కూర్చోమని చెపుతూ.


    ఆ బంగళా చూస్తూనే జయరామ్ ఆశ్చర్యపోయాడు. కృష్ణమౌళి ఎలా వుండేవాడు!


    ఒకానొక అప్పుడు తమ దయా ధర్మాలమీద ఆధారపడినట్టుగా తల్లి, కొడుకు ఉండేవారు.


    ఇప్పుడు! ఒక్కసారిగా ఇంత అయిశ్వర్యవంతుడు ఎలా అయిపోయాడు.


    తమతో సరిసమానం అయిపోతాడా!


    అయిశ్వర్యంతో కళ్ళకు పొరలు క్రమ్మేశాయా!


    పొగరు తలకెక్కి ఇందూని పెళ్ళి చేసుకుంటాను అంటాడా! ఇందూని పెళ్ళి చేసుకోవటం మాట అంటుంచి తమ ఇంట్లోకి అడుగు పెట్టగలడా!


    నన్ను ఎదురించేటంత మొనగాడు అయిపోయాడా!


    ఈ జయరాం అంటే ఏమిటో అనుకుంటున్నాడు.


    ఇందూకి తను ఎలాంటి సంబంధం చూసి చేస్తాడో ఎవరి ఊహకు అందదు.


    అంత గొప్ప సంబంధం చూసి చెయ్యాలి.


    ఇందూకి కాబోయే భర్త చాలా అందగాడు, అయిశ్వర్యవంతుడు, విద్యావంతుడు. గుణవంతుడయి వుండాలి. అంతేగాని ఇలాంటివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తానా?


    పేకముక్కలతో ఎంత యెత్తున అయినా యిల్లు కట్టవచ్చు కాని ఏమాత్రం గాలి తగిలినా కుప్పకూలిపోతుంది ఆ మేడ. అతని అయిశ్వర్యం ఈ బంగళా కూడా అంతే పేకముక్కలు లాంటివి.


    ఉఫ్ అని ఊదితే నేలకూలిపోయే అంతస్తులు కావు తాము కోరేవి జీవితాంతం వుండాలి ఆ అంతస్తులు.


    తన బంగారు చెల్లెలు సుందర బంగారు భవనాల్లో వుండాలి, జయరాం ఆలోచిస్తుంటే కృష్ణమౌళిమీద తేలికయిన భావం వచ్చేసింది.


    ఆలోచనల్లోనుండి తేరుకుని అంబికవైపు చూశాడు. అంబికలో గంభీరత్వం పోయి బేలతనం వచ్చేసింది.


    కళ్ళలో మెరుపుతగ్గి దిగులు అలుముకుంది. ఆమెలో హుందాతనం నిర్లక్ష్యం పోయి అధైర్యం ఆమెను నిలువెల్లా చుట్టేసినట్టుగా వుంది.


    అతనికి ఎదురుగా కూర్చుని వుంది.

 Previous Page Next Page