Read more!
Next Page 
అంకితం పేజి 1

                                 

       

                                                            అంకితం


                             -యండమూరి వీరేంద్రనాథ్

 


    ఆందోళనని భూతద్దంలోంచి చూస్తే భయం అవుతుంది.

 



                                            *    *    *
   
    అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ, భయంతోనూ కాదు.

    భర్తతో కాపురం చేసిన ఏడాది కాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయి భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది.

    అతన్నించి ఎలాగయినా రక్షించుకోవాలన్నదే ఆమె ప్రయత్నం.

    తనని కాదు...... తన కొడుకుని.


                          *    *    *


    ఆమె చేతిలో ఓ పసిగుడ్డు వుంది. పుట్టి వారంరోజులు కూడా కాలేదు. జరుగుతున్న దారుణం తెలిసో, ఏమో గుండెలవిసేలా ఆ శిశువు ఏడుస్తున్నాడు.

    రాత్రి పన్నెండవుతోంది. దానికి అరగంటముందే జరిగిందా సంఘటన!

    ఆ శిశువుమీద హత్యా ప్రయత్నం!!

    చేసిందెవరో కాదు.

    ఆమెభర్త!!!


                          *    *    *

    గుమ్మందగ్గర ఆలికిడి అవడంతో ఆమె కళ్లు విప్పి చూసింది. అతడు మెల్లగా లోపలి ప్రవేశిస్తున్నాడు. ఆమె నిద్రపోతోందన్నభావంలో వున్నాడు. పసిగుడ్డు పక్కన అమర్చిన దిండు నెమ్మదిగా తీసాడు. చప్పుడు చేయకుండా దాన్ని ఆ శిశువు మొహం మీద పెట్టి చేత్తో బలంగా వత్తసాగాడు.

    ఆమె ఆ దృశ్యాన్ని ఎంత షాక్ తో చూసిందంటే, లిప్తపాటు అది కలో, వాస్తవమో అర్థం కాలేదు. మనుషుల్లో ఇంత కిరాతకులుంటారని ఆ పచ్చి బాలింతరాలు కల్లోకూడా ఊహించలేదు.

    పెళ్ళయినప్పటినుంచీ అతడి అనుమానం  తెలుస్తూనే వుంది.

    గర్భం కన్ ఫర్మ్ అయ్యాక అది సణుగుడుగా మారింది.

    అదింత వికృతరూపం దాల్చిందని ఇప్పుడే తెలుస్తోంది.

    ఆమె కంత బలం ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు! ఒక్క ఉదుటున మంచంమీదనుంచిలేచి, అదే వేగంతో అతణ్ని వెనక్కి తోసేసింది. అతడి తల వెళ్ళి గోడకి కొట్టుకింది.

    "రాక్షసీ!" అనరిచాడు.

    "నేను కాదు, నువ్వు! రాక్షసుడివి!! పెళ్ళాంమీద  నమ్మకం లేక వారంరోజుల పసిబిడ్డని హత్య చెయ్యాలనుకున్నావు. నువ్వు నిజంగా రాక్షసుడివే. కిరాతకుడివి!"

    అతడు నెమ్మదిగా లేస్తూ అన్నాడు, ".......అవును రాక్షసుడినే. పెళ్ళయిన రెండోరోజు నీ డైరీ చదివినప్పుడే నేను రాక్షసుడినయ్యాను. అసలప్పుడే నిన్ను చంపెయ్యాల్సింది. మీది కేవలం పవిత్ర స్నేహమని నువ్వు చెప్పిన కబుర్లకి కరిగిపోయి వదిలేసాను. నేనెంత మూర్ఖుడినో ఇప్పుడర్థమయింది. నా అజ్ఞానం మీదా, అమాయకత్వం మీదా మీరిద్దరూ కలిసి ఎలా ఆడుకుంటున్నారో నిరూపించడానికి ఆ శిశువు పోలికలు చాలు."

    "వారం రోజుల బొడ్డూడని పసిగుడ్డు మొహంలో నీకు  పోలికలేం కనబడ్డాయండీ?" అంత దుఃఖంలో కూడా ఆమె పెదాలమీద జీవంలేని నవ్వు వెలిసింది.

    "అదిగో.... ఆ నవ్వే..... అదే నవ్వు..... నా గురించి, మీరిద్దరూకూడా ఇలాగే నా పరోక్షంలో నవ్వుకుంటూంటారు కదూ!" అంటూ ఆ బిడ్డ మెడవైపు చేతులు సాచాడు.

    ఆమె అతడి చేతుల్ని దూరంగా తోస్తూ "...... వదలండీ..... వదలండీ....." అనరిచింది.

    "వదలను. వీడు పెరుగుతున్నంతకాలం నాకూ మనశ్శాంతి వుండదు" అంటూ మరింత బలంగా మెడ నులమసాగాడు.

    ఆమె మరేమీ ఆలోచించలేదు. పక్కన ముక్కాలి పీటమీద ఉన్న ప్లాస్క్  చేతిలోకి తీసుకుని, బలంగా అతడి మొహంమీద చరిచింది.

    అనూహ్యమైన ఈ పరిణామానికి అతడు అప్రయత్నంగా ఒకడుగు వెనక్కి వేశాడు.

    ఆమె ఆ శిశువుని తీసుకుని బయటకి పరుగెత్తింది.

    అతను వెంటాడాడు.

    వేటగాడి బారినుంచి తప్పించుకోవడానికి పరుగెత్తే లేడిలా ఆమె చీకట్లో దూసుకుపోతోంది. కానీ పచ్చి బాలింతరాలు. ఎంతదూరం పరుగెత్తగలదు?

    ఒకవైపు నుంచి ఆవేశం, మరోవైపునుంచి మైకం కమ్ముకొస్తున్నాయి. ఆమె  మలుపు తిరిగి చెత్తకుండీ పక్కన చప్పున కూచుంది. బిడ్డ ఏడుపుని ఆపడానికి స్తన్యాన్నిచ్చింది.

    కొన్నిక్షణాల తర్వాత అతడా వీధిలోకి వచ్చాడు. ఆమె కనబడకపోవడంతో ఓ బూతుమాటతో ఆమెని బిగ్గరగా తిట్టాడు.

    ఆమె గుండెలరచేత పట్టుకుని, బిక్కచచ్చిపోయి, భయం భయంగా అతడివైపు చూస్తోంది.

    అతడు కళ్ళు చిన్నవిచేసి చీకట్లో ఆమెకోసం పరీశీలనగా చూస్తున్నాడు. ఎక్కడా అలికిడి లేకపోవడంతో అతడు నెమ్మదిగా అడుగుల వేసుకుంటూ వీధి అటు చివరివైపుకి వెళ్ళాడు.

    చెత్తకుండీ పక్కనుంచి ఆమె నెమ్మదిగా పైకి లేచింది. శబ్దం చేయకుండా రెండడుగులు వేసి రోడ్డుమీదకి వచ్చి అక్కడినుంచి తూనీగలా వెనుకదిశగా పరుగెత్తింది. ఈసారి కుడివైపు తిరిగి ఒక విశాలమైన వీధిలోకి ప్రవేశించింది. ఒక ఎత్తరుగులున్న ఇంటి గుమ్మంముందు ఆ శిశువుని పడుకోబెట్టింది.

    తనివితీర తన కొడుకుని ఆఖరిసారి చూసుకుంది.

    గుండెలనిండా బలంగా గాలి పీల్చుకుని నెమ్మదిగా మెట్లు దిగింది. గుండెలనుంచి భారం దిగినట్టయింది. అయితే అది తాత్కాలికమే!

    ఆ రాత్రి ఆ శిశువు బతుకుతాడో- ఏ కుక్కల పాలయినా అవుతాడో అన్న ఆందోళన ఒకవైపు- బతికితే ఎవరిపాల పడతాడో- భవిష్యత్తులో ఏమవుతాడో అన్న భయం మరోవైపు! మూర్ఖపు తండ్రి కసాయితనంవల్ల కన్నకొడుకుని చేజేతులా వదులుకోవలసి అన్న దుఃఖం, ఆ భాయన్నీ, ఆందోళననీ అధిగమిస్తోంది.

    ఆమె ఆలోచనల్లో తన ఇంటివైపు వెడుతుండగా వెనుకనుంచి భుజంమీద చేయిపడింది. ఆమె కెవ్వున అరవబోయి అతి కష్టంమీద ఆపుకుని వెనుదిరిగి చూసింది.

    "ఎక్కడ పడేసావ్ వాడిని?" జుట్టు బలంగా పట్టుకుని, మెడని విరిచేసేలా వెనక్కి వంచుతూ అడిగాడు."

    "చెప్పను" అందామె.

    "చెప్పకపోతే నిన్ను చంపేస్తాను" కర్కశంగా అన్నాడు.

    "చంపినా సరే చెప్పను" అంతే నిశ్చయంగా అంది.

    అతడు మోకాలితో ఆమె పొత్తి కడుపుమీద బలంగా తన్నాడు. ఆ నిర్మానుష్యమైన నిశీధి నిశ్శబ్దంలో ఆమె కేక నలుదిశలా విస్తరించింది. ఆమె కెవ్వు కెవ్వున కేకలు పెడుతూనే వుంది.


                         *    *    *


    కెవ్వుకెవ్వున వినిపిస్తున్న అరుపులకి నాకు మెలకువ వచ్చింది.

    ఏం జరుగుతూందో అర్థంకాలేదు.

    నా పడగ్గదే......నా మంచమే.

    అరుపులు మాత్రం ఆగకుండా వినిపిస్తున్నాయి.

    చప్పున లేచి కూర్చొని పక్కకి చూసాను, పక్కన పడుకున్న అరుంధతి నిద్రలో అరుస్తోంది. అయితే అది భయంతో కాదు.

    అలా ఎందుకనిపించిందంటే - ఆమె శరీరంలో ఎక్కడా కదిలికగానీ, అలజడిగానీ లేదు. మొహం మీదగానీ, వంటిమీదగానీ చెమట పట్టలేదు. ఊరకే అరుస్తోందంతే.

    బలంగా తట్టి లేపాను. ఎక్కువ కష్టపడనవసరం లేకుండా మొదటిసారి తట్టగానే మేల్కొంది.

    'నేనెక్కడున్నాను?" అని అడిగింది అయోమయంగా.

    "మరీ సినిమాలో గతం మర్చిపోయిన హీరోయిన్ అన్నట్టు ఏమిటి ఆ డైలాగు" అన్నాను.

    "భలే భయమేసిందండీ!"

    "కలొచ్చిందా?"

    "అవును! నేను భవిష్యత్తులోకి వెళ్ళిపోయానట. కూరగాయాల షాపులో బేరం చేస్తున్నానట. వంకాయలు కిలో ముప్పై రూపాయలని అన్నాడు. కెవ్వున అరిచాను. చామదుంపలు యాభై అన్నాడు.

    "మళ్ళీ కెవ్వున అరిచావు. అలా ఆ కొట్టువాడు ఒక్కొక్కదాని ధర చెప్పటమే- నీ ఒక్కొక్క అరుపుకి కారణమంటావ్".

    "అవునండీ! భయపడ్డారా?"

    "భయపడలేదు నేను. నా కలలో కనబడిన అమ్మాయి అరిచిన అరుపుతో నా భార్య అరుపు మ్యాచ్ అవడమే విచిత్రంగా అనిపించింది".

    నాకొచ్చిన కళ గురించి అరుంధతికి చెప్పాలనుకున్నాను కానీ నాకెందుకో వద్దనిపించింది. చెపితే బాధపడుతుంది...... 'అంత భయంకరమైన భర్తలుంటారండీ" అని ఆశ్చర్యపోతుంది. బాలింతరాల్ని అర్థారాత్రి అలా నడివీధిలో తరుముకుంటూ, స్వంత కొడుకుని చంపేస్తానంటూ పరుగెత్తే రాక్షసులా రచనల్లో తప్ప నిజ జీవితంలో వుండరని వాదిస్తుంది.


                         *    *    *


     అరుంధతి దేవుడు నాకిచ్చిన అదృష్టం!

    పెళ్ళికాకముందు నేనెలా వుండేవాడినో తల్చుకుంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. వరసగా అగ్గిపెట్టెల్లా వున్న గదుల్లో బ్యాచిలర్స్ అందరం వుండేవాళ్ళం. రోజుకి మూడు ప్యాకెట్ల సిగరెట్లు, వారానికి మూడుసార్లు సెకండ్ షో సినిమాలు, మెస్ లొ భోజనం...... ఇదీ మా దినచర్య! మాలో కొంతమంది అర్థరాత్రి సినిమా హాలుకి వెనకవైపుకి కూడా వెడుతుండేవారు. మా బ్యాచ్ కి మాత్రం ఆ అలవాటు అబ్బలేదు.

    ప్రతిరోజు సాయంత్రం అయిదింటికి క్రమం తప్పకుండా గాంధీ బొమ్మ నుంచి నేతాజీ రోడ్డు వరకూ నడిచేవాణ్ణి! వర్షం వచ్చినా, వరద వచ్చినా ఈ క్రమం తప్పేది కాదు. డానికి కారణం వుంది.

    సుమద్యుతి వుండేది ఆ వీధిలోనే!

    కాలేజీలొ చదివే రోజుల్లో తనూ, నేను క్లాస్ మేట్స్ మి.

Next Page