చదువయిపోగానే హాస్టల్ ఖాళీచేసి మా వూరెళ్ళిపోయాను. వాళ్ళది ఈ వూరే. అయితే అదృష్టవశాత్తు నాక్కూడా ఈ వూళ్ళోనే ఉద్యోగం దొరకటంతో- బ్యాచిలర్స్ హెవన్ (మా బ్రహ్మచారుల ముఠా వుండే ఆ అగ్గిపెట్టె గదుల్ని అలా పిలుచుకునే వాళ్ళం)లో సెటిలయ్యాను.
కాలేజీ రోజుల్లోనే నేను సుమద్యుతిని గాఢంగా ప్రేమించాననుకుంటే అది చాలా పొరపాటు! నవలల్లో లాగానో, సినిమాల్లో లాగానో కనీసం ఏదో ఓ గొప్ప సంఘటనతో అయినా మా పరిచయం ప్రారంభం కాలేదు. ఆ అమ్మాయి కుడివైపు మొట్టమొదటి వరసలో కూర్చునేది. నేను మధ్య వరుసలో రెండవ బెంచీలో కూర్చునేవాణ్ణి! లెక్చరర్ పాఠం చెపుతున్నంతసేపు ఆమె మీదుగా ద్వారంలోంచి బయటకి కనబడే చెట్లనీ, ప్లేగ్రౌండ్ నీ చూస్తూ వుండేవాడిని. ఆ అమ్మాయి ఎడమవైపు చెంపమీదకి కాసింత జుట్టు-చిన్న పాయలాగా జారేది. రూమ్ లోకి గాలి కెరటం వచ్చినప్పుడల్లా అది కదులుతుండేది. ప్రతి పిరియడ్ లోనూ అదెన్నిసార్లు కదిలిందో లెక్కకట్టి ఒక పుస్తకంలో నోట్ చేసేవాడిని.
ఇదంతా, ఇప్పుడు తల్చుకుంటుంటే నాకేమీ నవ్వు రావడంలేదు. ఆ వయసులో అలాంటి అనుభవం ఒకటయినా లేకపోతే మనం ఏదో విస్సయిపోయామన్న విషయాన్ని నేను ఇప్పటికే నమ్ముతాను. సంవత్సరంపాటు నేను నోట్ చేసిన ఆ పరిశోధనా పత్రాన్ని - చదువు పూర్తయి విడిపోబోయే ముందు నేను ఆ అమ్మాయికి ప్రజంట్ చేసాను.
పుస్తకాన్ని అటూ యిటూ తిప్పుతూ...... "ఏమిటిది?" అది అడిగింది.
ఒక ప్రొఫెసర్ తన దగ్గర రీసెర్చి చేస్తున్న స్టూడెంట్ కి విశదీకరించిన లెవల్ లో.....
".......ఈ మొదటి కాలమ్ 'తేదీ', రెండవకాలం 'పిరియడ్ నెంబరు', మూడవ కాలమ్ 'మీరే చీర కట్టుకోచ్చారో ఆ వివరాలు', చివరి కాలమ్ మీ ముంగురుల పాయ ఎన్నిసార్లు కదిలిందో ఆ సంఖ్య....."
ఆమె మొట్టమొదటి రియాక్షన్ అదిరిపడటం! ఆ తర్వాత నన్ను పిచ్చాసుపత్రినుంచి వచ్చినవాణ్ని చూసినట్టు చూసి...... "మీకేమైనా మతిపోయిందా? ముంగురులు ఊగిన సంఖ్యేమిటి?" అంది.
నేనింతకాలం ఏం చేస్తూ వచ్చానో చెప్పాను. ఆమె నోట మాట రానట్టు అవాక్కయి చూస్తుండిపోయి...... "లెక్చరర్ చెప్పిందేమీ వినకుండా సంవత్సరంపాటు అలా నోట్సు తయారీచేస్తూ కూచున్నారా?" అని చివర్లో అడిగింది.
"చూస్తూ వుండండి, ఫస్టు క్లాస్ రాకపోతే అప్పుడడగండి"
"అంత నిశ్చయంగా ఎలా చెప్పగలరు?".
"లెక్చరరు చెప్పేదేదీ వినలేదు కాబట్టి".
"ఆమె ఫక్కున నవ్వేసింది. నేనన్నాను..... "నాకా దృశ్యం చాలా బావుండేది సుమద్యతిగారూ! మీ పేరుకి అర్థమేమిటాని డిక్షనరీ వెతికాను. చాలా మంచి అర్థం కదూ..... అది తెలియడంతో మరింత ఆసక్తి పెరిగింది. బయట ఆటస్థలంలో చెట్ల ఆకుల కదలికకీ, మీ చెంపమీద వెంట్రుకల కదలికకీ పోలిక కనబడేది. గంటల తరబడి చూస్తుండిపోవడం- అని పుస్తకాల్లో రాస్తారే. అలా వుండిపోయేవాణ్ణి. ఈ విషయం మీకు ముందే చెప్దామనుకున్నాను. చెంపదెబ్బలు గొడతారేమోనని భయపడ్డాను. ఇది చివరిరోజు కాబట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఈ పుస్తకం మీరుంచేసుకోండి" అన్నాను.
ఆ అమ్మాయి అర్థంకానట్టు- "నేనా? ఎందుకు?" అంది.
"మీకో అరవై ఏళ్ళొచ్చి, బాగా ముసలివాళ్ళయి పోయాక, మీ మనవల్నీ, మనవరాళ్ళని కూచోబెట్టుకుని సరదాగా చెప్పవచ్చుకదా! 'నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక ఆషికీ వుండేవాడు. ఇలా స్టాటిస్టిక్స్ తీసి నాకు ప్రజెంట్ చేసాడు' అని చెప్పండి. ఆ తరంవారికి అప్పటికి జీవితం మరీ మోకానికల్ అయిపోతుంది. అమ్మాయికీ- అబ్బాయికీ మధ్య ఇలాటి చిన్న చిన్న అనుభూతులు వుంటాయన్న విషయం వాళ్ళు కలలో కూడా వూహించలేరు. ఆరోజు లొచ్చేసరికి డైరెక్ట్ ప్రపోజల్ తప్ప ఇంకేమీ వుండదు. మీరు మీ దగ్గర వాళ్ళని కూచోబెట్టుకుని ఇదంతా చెపుతుంటే వాళ్ల నాయనమ్మవైపు అంటే మీ వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా స్నేహితుల మధ్య వుంటాయా అని గత తరాల గురించి అనుకుంటారు....."
సుమద్యుతి నవ్వేసి..... "మీరు చెప్పినంత సీనేమీ వుండదులెండి" అంటూ పుస్తకం బ్యాగ్ లో పెట్టుకుంది.
ముందు చెప్పినట్టు ఆ తర్వాత నాకు మళ్ళీ అదే ఊళ్ళో ఉద్యోగం రావడం జరిగింది.
ఓ రోజు సాయంత్రం మ్యాటినీ చూసి వస్తుండగా గాంధీబొమ్మ చౌరస్తాలో కనబడింది సుమద్యుతి. విప్పారిన కళ్ళతో నవ్వుతూ-" ఎంత ప్లెజంట్ సర్ ప్రైజ్!" అంది.
బహుశా ఆ క్షణమే నేను ప్రేమలో పడి వుంటాను.
"నాక్కూడా!" అన్నాను.
"అదే మా ఇల్లు" అంటూ గాంధీబొమ్మకి కుడివైపు సందులో ఉన్న నాలుగో ఇంటిని చూపిస్తూ.
"అన్నట్టు మీకో విషయం చెప్పాలని చాలా అనుకున్నాను. కానీ మీరెక్కడుంటారో తెలీలేదు" అంది.
"నాకిక్కడే ఉద్యోగం వచ్చింది."
"గుడ్ న్యూస్!"
"ఇంతకీ మీరేం చెప్పాలనుకున్నారు?"
"ఆరోజు మీరిచ్చిన పుస్తకం- అది తీసుకుంటున్నప్పుడేమీ అనిపించలేదు. కానీ, తర్వత్తర్వత భలే అనిపించింది. గమ్మత్తుగా ఉందికూడా!"
"కేవలం గమ్మత్తేనా" అందామనుకున్నాను. కానీ నా బలహీనత- అధైర్యం.
నేనేదో అనబోతుండగా ఆ అమ్మాయే చెప్పింది...... "ఎన్నోసార్లు ఆ పుస్తకం చూసుకున్నాను. ప్రతిసారీ కొత్తగా, ప్రెష్ అనిపిస్తూంది".
మరో రెండు నిముషాలు మాట్లాడి ఆమె శలవు తీసుకుని వెళ్లిపోయింది. ఇంటికి ఆహ్వానిస్తుందేమో అనుకున్నాను. వాళ్ళ నాన్నగారు నన్ను నిలువెల్లా గంభీరంగా పరికించి చూసి, తల పంకిస్తారని, ఆ అమ్మాయి కాస్త బెదురుతూ వాళ్ళ నాన్నతో నా గురించి చెప్తుందని, కాస్త తర్జనభర్జనలు జరిగాక, ఒక ఆహ్లాదకరమైన సాయంత్రం సుమద్యుతి రాగరంజితమైనా మొహంతో వాళ్ళింట్లో మా ప్రేమ విషయమై అంగీకారం తెలిపారని నాకు చెప్తుందని- ఆ రాత్రి చాలా కలలు కన్నాను. కానీ చెప్పానుగా. అధైర్యం!
మరుసటి రోజునుంచి ప్రతిరోజూ సాయంత్రం పూట వాళ్ళింటి ముందు రౌండ్ కొట్టడం నా దినచర్యలో ఓ భాగమయింది. ఆ అమ్మాయి డాబామీద కనిపించిన రోజు పర్వదినమయ్యేది. కనిపించని రోజు భారమయ్యేది.
నవలల్లో హీరో హీరోయిన్లు తరచూ కలుసుకోవడానికి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. అయితే నా నిజజీవితంలో అటువంటిదేమీ జరగలేదు. సంవత్సరంపాటు రోజు అలా ఆమె ఇంటిచుట్టూ స్పుత్నిక్ లా తిరిగాక నాకొక విశ్వరహస్యం అర్థమయింది. నేనిలాగే కొనసాగిస్తే నాకు ట్రాన్స్ ఫరో, తనకి పెళ్ళి అయ్యేవరకూ ఇలా తిరగడం తప్ప ఇంకేమీ మిగలదని!
అందుకని ఓ రోజు సాయంత్రం ధైర్యం తెచ్చుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. అప్పటికి కొద్దిగా చీకటి పడుతోంది. నా కాళ్లు వణుకుతున్నాయి. ఎడమకన్ను అదిరింది. పహిల్వాన్ లాంటి వాళ్ల అన్నయ్య ఎవరయినా ఉంటారేమోనని బెదురుతూ, మెల్లగా తలుపు తట్టాను.
"ఎవరదీ?" అని వినబడింది.
"ఆ అమ్మాయి తండ్రనుకుంటా- బయటికొచ్చాడు. అచ్చు గుమ్మడిలా ఉన్నాడు. "రండి.... రండి" అంటూ సాదరంగా లోపలికి ఆహ్వానించాడు. నాకొక్కక్షణం అర్థంకాలేదు. పూర్వకాలంలో ఇంటికి ఎవరొచ్చినా కుల, మత, ఆర్ధిక స్థితులకి అతీతంగా ఇలాగే ఆహ్వానించేవారట! నాకు కాబోయే మామగారికి ఇలాంటి అంశ ఉన్నందుకు మనసులోనే సంతోషిస్తూ కుడికాలు లోపల పెట్టాను. అయితే ఆయన నా ఆనందాన్ని ఎక్కువసేపు ఉండనివ్వకుండా "మీ వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు" అన్నాడు.
మా వాళ్ళెవరో నాకర్థం కాలేదు. లోపల దృశ్యం చూడగానే గతుక్కుమన్నాను. సోఫాలో సత్యనారాయణ, అన్నపూర్ణ కూర్చుని ఉన్నారు. కాస్త దూరంగా ఒద్దిగ్గా సుమద్యుతి (ఏ నటీమణి నా స్నేహితురాలి అందానికి సరిపోదు. అందుకని పోలిక తీసుకురాదల్చుకోలేదు!) కూర్చుని ఉంది. మధ్యలో టేబిల్ మీద స్వీట్లూ, హాట్లూ ఉన్నాయి. సోఫాకి కుడివైపు మరో కుర్చీలో పెళ్లికొడుకు ఉన్నాడు.
"మీ అన్నయ్యగారొచ్చారు" అన్నాడు ద్యుతి నాన్నగారు నన్ను అతడికి చూపిస్తూ.
పెళ్ళికొడుకు తల్లి కంగారుపడి "అతను మా పెద్దబ్బాయికాదు" అంది. 'అధికారికంగా, అనధికారికంగా కూడా కాదు' అన్న లెవల్ లో.
ఈసారి తత్తరపడడం పెళ్ళికూతురి తండ్రి వంతయింది. ఆయన నావైపు ప్రశ్నార్థకంగా చూసాడు.
".......నేను.......నేను.... ద్యుతి వాళ్ళ క్లాస్ మేట్ ని" అన్నాను తడబడుతూ. సుమద్యుతి తలెత్తి నా వైపు చూసింది. జీవంలేని నవ్వొకటి నా మొహంలో కదలాడింది. ఆమె తల దించుకుంది.
అక్కడ సూది పడితే వినబడేంత నిశ్శబ్దం వ్యాపించింది. ఈ పెళ్లి చెడగొట్టడానికి సరియైన సమయంలో వచ్చినకూతురి తాలూకూ ప్రేమికుణ్ణి అనుకున్నాడేమో, పెళ్ళికూతురి తండ్రి ఒకడుగు ముందుకేసాడు. అది కొట్టటానికో, నా చేతులు పట్టుకుని బతిమాలుకోడానికో తెలుసుకునే రిస్క్ తీసుకోకుండా "మళ్ళీ వస్తానండీ" అంటూ అక్కడినుంచి బయటికొచ్చేసాను.
వస్తుండగా రఘువరన్ లాంటి పెళ్లికొడుకు (ఆ రోజుల్లో రఘువరన్ ఎక్కడున్నాడని అడక్కండి!) నావైపు చూసిన చూపు మాత్రం నేనిప్పటికీ మర్చిపోలేను. అతని బొటనవేలు- మిగతా నాలుగువేళ్ళ అంచులమీదా కదుల్తూంది. అది చాలా చిత్రమైన అలవాటులా అనిపించింది నాకు.
* * *
నా ప్రేమ ప్రహసనం అలా ముగిసింది. ఆ తర్వాత ఆరునెలలకి అరుంధతితో నాకు పెళ్ళయింది.
పెళ్ళయిన కొత్తలో చాలామంది మగాళ్ళు తమపాత్ర ప్రేమకథల్ని పురాణగాథల్లాగా పెళ్ళాలకి వినిపించడాలూ- సిగ్గువల్లో, కొత్తవల్లో, భయం వల్లో, సదరు భార్యలు ఆ పురాణశ్రవణాన్ని మింగలేక, కక్కలేక ఆస్వాదించడాలూ మామూలేనండీ...... వీటిగురించి అంత పట్టించుకోనక్కర్లేదు. అలా అనుకుంటే మా ఊళ్ళో గుడి వెనక సుబ్బారావు నన్నెన్నిసార్లు ముద్దు పెట్టుకోలేదూ!" అంది.
"ఏమిటీ?" కీచుగా అరిచాను.
"చూసారా మరీ? అందుకే ఇలాంటివి చెప్పి ఎప్పుడూ బాధపెట్టకండి".
"కానీ సుబ్బారావు...."
"సుబ్బారావు లేడు- అప్పారావు లేడు. పెళ్లి కాకముందు ప్రేమించడం గొప్ప బ్రహ్మవిద్యేమీ కాదు. పెళ్ళయిన తర్వాత మొదలు పెట్టి, చివరివరకూ భార్యాభర్తలు దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం" అంది.
పైకి సాధారణంగా కనబడి, లోపల కాస్త తెలివితేటలున్న- బోలా బోళా అమాయకమైన స్త్రీ నా భార్య - అన్న విషయం ఆ విధంగా నాకర్థమయింది.
అరుంధతిలో ద్వంద్వ ప్రవృత్తి నాకు బాగా నచ్చేది. కిలో వంకాయల ధర కలలో తెలియగానే కెవ్వుకెవ్వున అరిచే మనస్తత్వం గురించి ముందే చెప్పాను కదా! మరోవైపు అప్పుడెప్పుడో క్లబ్ లో పేకాడుతున్నప్పుడు పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తే, ఆరోజు రాత్రి పోలీసుస్టేషను దగ్గరా, మరుసటిరోజు దగ్గరా నిబ్బరంతో ఆమె ప్రవర్తించిన విధానం నాకిప్పటికీ గుర్తే.