Previous Page Next Page 
భవ బంధాలు పేజి 24


    లేచి సముదాయించదానికి కూడా ఓపిక లేనట్టూ అలా చూస్తూ వుండిపోయాడు. భోంచేస్తున్న సత్యవతి విసురుగా వచ్చి మొగుడి వైపు తీక్షణంగా చూసింది.....' చంటిపిల్ల ఏడుస్తున్నా వినిపించడం లేదా?..... ఆహా......హా! శత్రుత్వం...... కన్న పిల్లల మీద శతృత్వం సాగించే తండ్రిని మిమ్మల్నే చూశాను..... నోరు ముయ్యవే ముండా, ఎడిచావంటే చంపేస్తాను యీసారి ....రెండు మెతుకులు తినడానికి కూడా నోచుకోలేదు యీ కొంపలో! ...ఎంత పాపం చేసుకుని యీ కొంపలో పడ్డానో! ఏ నోములు, ఏ పూజలు చేసుకుంటే నో యిలాంటి మొగుడు.....యీ పిల్లలు!..... రామచంద్రా పగవాళ్ళకి కూడా వద్దు యీ నరకం.....' తన నెత్తి బాదుకుంది . అంటచేత్తోనే పిల్ల వీపున రెండు బాదింది. తీసికెళ్ళి వంటింట్లో కూలేసింది పిల్లని. సుబ్బారావు కిదేం కొత్తకాదు. పాపం ఒక్కర్తీ చేసుకోలేక యీ సంసారం యీదలెక విసుక్కుంటుంది. ఆ అరుపులు, కేకలు లెక్కచెయ్యకుండా నిర్వికారంగా వుండడం ఏనాడో అలవాటు చేసుకున్నాడు సుబ్బారావు.
    ఎప్పటికో ఇల్లు సద్దుమణిగింది...... "వెధవ దోమలు , ఉక్క అబ్బబ్బ రాత్రన్నా సుఖంగా పడుకోడానికి లేదు గదా, ఆరుబయట పడుకోడానికన్నా అదృష్టం లేదు యీ కొంపలో....."పగలంతా చాకిరి చేసి రాత్రన్నా సుఖ నిద్రకి నోచుకోడానికి లేదని ఆపసోపాలు పడుతూ విసురుకొంటున్న భార్య దగ్గరికి జరిగాడు సుబ్బారావు. "వెళ్ళండవతలికి" విసిరి కొట్టింది చెయ్యి సత్యవతి. "ఏం వున్నా లేకపోయినా, దీనికి లోటు లేదు. నా దగ్గరికి రాకండి..... చెపుతున్నాను , వెళ్ళండవతలకి......సిగ్గులేకపోతే సరి....' విదిలించి కసిరింది సత్యవతి. అన్ని విషయాల మాదిరిగానే యీ విషయంలోనూ భార్య మాటలు విదిలింపులు లెక్క చెయ్యడం మానేశాడు సుబ్బారావు. ఆ కసుర్లు లేక్కచేసి, తన బ్రతుకులో డబ్బవసరం లేని ఏకైక సుఖాన్ని, ఆ కొద్ది క్షణాల ఆనందాన్ని, ఆ స్వర్గాన్ని దూరం చేసుకోలేడు సుబ్బారావు.

                             *    *    *    *
    "సారీ! శాంతా.....అయిదు గంటలకి బయలుదేరే వేళకి అర్జంటుగా ఏదో పనుందని చీఫ్ ఇంజనీరు ఫోను చేసి ఆఫీసుకి రమ్మన్నారు. లేటయి పోయింది." కారు గారేజీలో పెట్టి లోపలికి వస్తూనే అన్నాడు కృష్ణమూర్తి. మొహం ముడుచుకుని లోపలికి వెళ్ళిపోతున్న శాంతతో . శాంత మాట్లాడకుండా లోపలి కెళ్ళి కాఫీ తెచ్చి టేబిల్ మీద పెట్టింది. ముస్తాబు చేసుకుని రడీగా వున్న శాంతని నిరుత్సాహపరచవలసి వచ్చినందుకు నొచ్చుకున్నాడు మూర్తి. "కోపం వచ్చిందా శాంతా!...... ఏం చెయ్యమంటావు చెప్పు, హెడ్ ఆఫీస్ కి వెళ్ళి ఆ కాగితాలు చూపించి పని పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయింది. రేపు వెడదాం."
    "ఇవాళ ఆఖరి రోజని గాదూ, మీతో అంతలా చెప్పాను. మొహం ముడుచుకునే అంది శాంత.
    'అయితే నన్నేం చెయ్యమంటావు. పోనీ సెకండ్ షో కి వెడదామా?"
    శాంత మొహం ఒక్క క్షణం వెలిగింది. అంతలోనే నిరుత్సాహంగా "పిల్లలో' అంది.
    'పోనిద్దూ .... యీ సినిమా చూడకపోతే చస్తామా . ఇది కాకపొతే మరోటి రేపు చూద్దాం. ఈ నగరంలో సినిమాల కేం కొదవ. రేపు దేనికోదానికి వెడదాం ఒకే" భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని భార్యామణి అలక పోగొట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు కృష్ణమూర్తి.
    'సర్లెండి....వదలండి....." చీర మార్చుకోడానికి లోపల వెళ్ళింది శాంత.
    కాఫీ తాగి, ప్రొద్దుట పూర్తి చేయని పేపరు చేతిలోకి తీసుకున్నాడు . ఆడుకోడానికి వెళ్ళిన ఎనిమిదేళ్ళ రవి, ఆరేళ్ళ బేబి తండ్రి రావడం చూసి పరుగెత్తుకు వచ్చారు. ఇద్దరూ చెరో వైపు తండ్రి మీద పడ్డారు. 'డాడీ బొమ్మల పుస్తకాలు తెచ్చావా? డాడీ నా బూట్సు చాలడం లేదు, క్రొత్తవి కొనాలి డాడీ" అంది బేబి. "ఆ ....నీకేనేంటి క్రొత్తవి, నా బూట్లూ చిరిగి పోతున్నాయి, నాకూ కొనాలి డాడీ" రవి కూడా గొడవ చేశాడు.
    'అలాగే....అలాగే....కొంటునన్నాగా. ఫస్టు రాగానే కొంటానుగా....మరి అల్లరి పెట్టకండి ఇంక. యిప్పుడు గొడవ చెయ్యకండి. జీతం రాగానే కొంటాను...., ఏం" ఇద్దర్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని అభయం యిచ్చాడు మూర్తి.
    "బాగుంది .....బొమ్మల పుస్తకాలకి కూడా ఫస్టు రావాలా ఏమిటి? బొత్తిగా గుమాస్తాలా మాట్లాడుతారు ." నవ్వింది శాంత.
    "పేరుకి గెజిటెడ్ ఆఫీసర్ని. క్లాస్ వన్ ఆఫీసర్నీ , తొమ్మిది వందల జీతం అన్న పేరే గాని మనదగ్గర ఏముంది? నెలాఖరికి దమ్మిడి వుండదు చేతిలో.... ఎంత చెట్టుకు అంతగాలి! రెండొందల జీతగాడికి అది చాలదు, వెయ్యి వచ్చినా మనకు చాలదు..... వెధవది ఓ స్టేటస్ అంటూ ఏడ్చిందిగా , అది మైన్ టైన్ చేయాలంటే......వెయ్యి రూపాయలనగా ఎంత?....."
    "అవునులెండి గానీ ....... యివాళ పేపర్లో చూశాను. కొత్తగా ఆల్వీన్ ప్రిజిడేర్లు వాయిదాల మీద కొనుక్కో వచ్చని వుంది..... మనమూ కొందామా?"
    "మనకు రిఫ్రిజిరేట రెందుకు?" అన్నాడు మూర్తి.
    "మనకెందు కేమిటి? బాగుంది. చల్లని నీళ్ళు త్రాగుతాం. కూరలకి, పళ్ళకి రోజూ బజారుకి పరుగెత్తకుండా వారానికోసారి కొని దాచుకోవచ్చు. .....కొందామండీ .....ఒకసారంటే డబ్బు పోగవదు కానీ, నెలా నెలా తీర్చుకోవచ్చుగా..... ఉత్సాహంగా అంది శాంత.
    'అబ్బ ఇప్పుడు ఎందుకు చెప్పు, కోరికలకి అంతంటూ ఎక్కడ వుంది! కారు అన్నావు.....దాని లోను యింకా తీరలేదు.....యిప్పుడు మళ్ళీ దీనికి కూడా జీతంలో  నెల నేలా కోత అవుతుంటే యింక మిగిలింది మనం ఏం తింటాం ?"
    "మీరెప్పుడూ యింతే! ఏ సరదా లేదు....ఎప్పుడూ ఏదో తిండికి మాడిపోతున్నట్టు మాట్లాడతారు.... చేసేది ఆఫీసరు పని! ఆ మాత్రం ప్రిజిడేరు కొనుక్కునే తాహతు మనకు లేదా? ..... ఆ రామ్మూర్తి మీ కంటే పెద్ద అఫీసరా ఏమిటి?
    రామ్మూర్తికేం .....ప్రిజిడేర్లూ కొంటాడు.....ఎయిర్ కూలర్లు పెట్టిస్తాడు....అతనితో మనకేమిటి వంతు.....అడ్డదార్లు తొక్కితే ఏదన్నా చెయ్యొచ్చు...."
    "పెద్ద సత్యసంధులు బయలుదేరారులెండి..... ఏది చెప్పినా యిలాగే అంటారు. ....' కోపంగా లేచి వెళ్ళిపోయింది శాంత.
    ఈ ఆడవాళ్ళకి బొత్తిగా ముందు చూపండదేమిటో ఖర్మ ! చిరాకు పడ్డాడు మూర్తి. యీ కోరికలకి అంతెక్కడ! స్కూటర్ అంది ముందు తరవాత పిల్లలు ముగ్గురయ్యారు. స్కూటర్ చాలదు, కారు కొనాల్సిందే అంటే లోను తీసుకుని కారుకోన్నాను. పోనీ కారుంటే టి.ఏ వస్తుంది కారు లోను తీరిపోతుంది లే అని ఒప్పుకున్నాను. ఇప్పుడు ఫ్రిజిడేరు అంటుంది..... తరువాత టేపురికార్డర్ , రేడియోగ్రా మంటుంది. ఇంకొన్నాళ్ళు పొతే ఎయిర్ కూలరు లేకపోతె వుండలేనంటుంది..... అఫీసరన్న పేరు తప్ప గవర్నమెంటు జీతలెంత? ఏం సరిపోతుంది? ఇంటద్దె రెండు వందలు, సరే హోదాకి తగినట్టు ఇంట్లో ఫర్నిచరుండాలి గదా! సరే, వంటవాళ్ళని యీ రోజుల్లో భరించలేం గదా అని శ్రీమతి కష్టపడకుండా గ్యాస్ స్టవ్ లు, ఫ్రెషర్ కుక్కర్లు మొదలైన ఆధినిక సామాగ్రి కొన్నాడింట్లో..... పిల్లలు ముగ్గురు ఇద్దరికి కాన్వెంటు స్కూలు  జీతాలు బస్సు ఖర్చులు, తిండి ఖర్చు ఏది తగ్గించుకోలేరుగా! వాళ్ళకి పాలు, పళ్ళు గ్రుడ్లు, ఏదీ మానలేరు. పిల్లల్ని సవ్యంగా పెంచాలని గాదూ ముచ్చటగా ముగ్గురుని కన్నది. వాళ్ళ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం. ఇంకా సరే సినిమాలు, మ్యాగజైన్సు ...... చిల్లర ఖర్చులు ఎన్నో! ఏదీ మానలేదు, నెలాఖరికి దమ్మిడీ మిగలదు. క్రింద తరగతి వారితో కలవలేరు. పై తరగతి వాళ్ళని అందుకోలేరు. ఎటూ కాని త్రిశంకు స్వర్గం తమది.
    యీ బాధలెం ఆడవాళ్ళకి అర్ధం కావు. పెళ్ళయిందగ్గర నించి  సినిమా సెట్టు లాంటి యిల్లు, సినిమా జీవితం లాంటి జీవితం రావాలి..... విసుగ్గా అనుకున్నాడు మూర్తి.

 Previous Page Next Page