Previous Page Next Page 
భవ బంధాలు పేజి 25


    శాంత వంటింట్లో దబదబ గిన్నెల చప్పుడు చేస్తుంది..... అంటే కోపం వచ్చిందన్నమాట..... ఇంక, యీ ప్రిజిడేరు కొంటాననేవరకు ప్రాణం వున్నా వాటిమీద, లేనివాటి మీద కంబయిండ్ గా కోపం తీర్చుకుంటుంది. భోజనం దగ్గర కూడా ఏం మాట్లాడకుండా విసురుగా వడ్డించింది. పిల్లలేదో అడిగితె నోరుమూసుకుని అన్నం తిని వెళ్ళండి' అని కసిరింది. పలకరిస్తే మరింత చిందులు తొక్కుతుందని మాట్లాడకుండా తిని లేచి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి.
    పిల్లలకి నైట్ డ్రస్సులు తొడిగి, దోమతేరలు దించి, ఫాను వేసి , గుడ్ నైట్ చెప్పి, టేబుల్ లైటు వేసుకుని పుస్తకం తీసుకున్నాడు. చదవటానికి కృష్ణమూర్తి. శాంత వంటిల్లు సర్ది వచ్చి మాటా మంతీ లేకుండా తనూ ఓ పుస్తకం తెరిచింది.
    కృష్ణమూర్తి పుస్తకం మీద దృష్టి నిలవలేదు. శాంత అలా మాట్లాడకుండా ముభావంగా వుంటే ఏదోలా అనిపించింది. ఉదయం పదిగంటల లోపున పని తొందరలో హడావుడిగా వుంటుంది శాంత. తామిద్దరూ ఏం మాట్లాడుకున్నా రాత్రి భోజనం అయ్యాక ఓ గంటా రెండు గంటలు . శాంత ఏవేవో కబుర్లూ చెప్తుంటే యిట్టే గడిచిపోతుంది కాలం. శాంతతో మాట్లాడకుండా తనొక క్షణం వుండలేడు.
    "శాంతా?...... అలా వున్నావేం...." చేయి పట్టుకుని అడిగాడు.
    "ఎలా వున్నాను! " పుస్తకం లోంచి దృష్టి మరల్చకుండానే అంది శాంత.
    'కోపంగా వున్నావు..... మాట్లాడవేం.....కోపం వచ్చిందా?"
    "వస్తే మీకేం ?"
    "ఏమిటి శాంతా? మరీ చిన్నపిల్లలా అవుతావు....ప్రతిదానికీ అలకేనా .....? నాకు బోలెడు కోరికలున్నాయి..... కానీ మన అంతస్తు చూసుకోవద్దూ!...."
    "ఏం నేనేం కోరరాని కోరికలు కోరాను.....వజ్రాలు, వైడూర్యాలు కావాలన్నానా? ఎయిర్ ప్లేనులలో త్రిప్పమన్నానా? ఎయిర్ కూలర్లు కావాలన్నానా, ఏం మన తాహతు ఫ్రిజిడేరు కొనుక్కునే పాటిది గాదా? ...." పుస్తకం ప్రక్కన పడేసి గయ్ మంది శాంత.
    "ఆ.....ఇదయ్యాక.....ఒక్కొక్కటీ అవీ కావాలంటావు?" నవ్వాడు.
    "కావాలంటే అన్నీ కొనేస్తున్నారు కాబోలు! ప్రతి దానికీ ఇన్ని సార్లు అడిగితె గాని ఏదీ కాదు, అన్నీ అడగ్గానే అమరుస్తున్నట్లు మాట్లాడకండి...... కొనకపోతే మానేయండి..... సరదా నా కోక్కదానికేనా? యిప్పుడు కాకపొతే ముచ్చట ఎప్పుడు తీరుతుంది ? వస్తువు యింట్లో వుంటుంది గదా అని గానీ ....'
    "అవుననుకో , కాని డబ్బేది..... చూస్తున్నావుగా ఖర్చులు ! ....పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. రేపొద్దున్న వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ జరగాలి!....ఈ రోజుల్లో చదువులు, ఉద్యోగాలకి అవస్థలు ఎలా వున్నాయో చూస్తున్నావుగా. వాళ్ళ భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తే బెంగగా వుంటుంది..... వాళ్ళకి పెద్ద చదువులు చెప్పించాలంటే యిప్పుడు మనం జాగ్రత్తగా వుండాలి."
    "అబ్బ!....ఏదో పిల్ల పెళ్ళికి ఎదిగి కూర్చున్నట్టు, మొగపిల్లలిద్దరూ ఏ మేడిసనో , ఇంజనీరింగో చదువుతున్నట్లు మాట్లాడతారేమిటి? .... పట్టుమని పదేళ్ళయినా లేని పిల్లల గురించి యిప్పటి నించీ బెంగ?
    "యిప్పటి నించీ లేకపోతె అప్పుడెలా వస్తుంది?....."
    "బాగుంది .....ఎల్లకాలం మీరీ జీతంతోనే వుంటారా? పిల్లలు పెద్ద వాళ్లయినట్టే మీ జీతం పెద్ద దవదా?.... అయినా, నే నెడడిగితే వెంటనే చేశారు గనక.....వద్దులెండి.....మానేయండి..... సరదాకి అడిగాను అంతే...." మొహం ముడుచుకుని అంది శాంత.
    "అదిగో ఆ కోపమే వద్దన్నాను.....అంత కోపం అయితే ఎలా? సరే....నాకేం పోయింది. కొనమంటే కొంటాను.... నా ఆరాటం అంతా మీ గురించేగా ....... మీ భవిష్యత్తు గురించి నీకంత నిబ్బరం వుంటే నాకు మాత్రం ఏం భయం? ..... అలాగే రేపు వెళ్ళి కొందాం .....సరేనా ?.... "
    భార్య మొహంలో విరిసిన అనందం చూసి తృప్తిగా నవ్వాడు కృష్ణమూర్తి. శాంత యీసారి భర్త చేయి తీసేయలేదు.

                                  *    *    *    *
    
    పార్టికోలో కాడిలేక్ కారాగింది. డ్రైవరు తలుపు తెరిచి పట్టుకున్నాడు. రాజారావు చిరాగ్గా ఏదో ఆలోచిస్తూ కారు దిగి, ఎదురొచ్చిన నౌకరు మీదికి చేతిలో కోటు విసిరాడు.  బెడ్ రూమ్ లోకి వెడుతూనే ..... కేకలు పెట్టాడు బంట్రోతు మీద...... 'నీ కెన్నిసార్లు చెప్పాను, నేనోచ్చేసరికి యీ గది చల్లగా వుండాలని! యిప్పటివరకు ఏం చేస్తున్నావు?"
    నౌకరు నీళ్ళు నమిలాడు. గబగబ వెళ్ళి ఎయిర్ కూలర్స్విచ్ అన్ చేశాడు.
    "గెటౌట్!' విసుగ్గా అరిచాడు రాజారావు. వాడు అతివినయముగా 'చా తెమ్మంటారా సాబ్!' అనడిగాడు.....రాజారావు ఫోమ్ సోఫాలో ఫోమ్ తలగడకి జారగిలబడి కాళ్ళూ చేతులూ జాచుకుని కూర్చున్నాడు..... వాచీ చూచుకున్నాడు......' అక్కర్లేదు ...." అన్నాడు.... వాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఏదో గుర్తు వచ్చి "అమ్మగారేరి?" అడిగాడు.
    "క్లబ్బుకి వెళ్ళారు సాబ్!...."
    "ఎవరితో?"
    "తులానీ సాబ్ వచ్చారు....ఇద్దరూ వెళ్ళారు ...."
    "హు' రాజారావు చేతిలో సిగరెట్టు వేళ్ళమధ్య నలిగిపోయింది. కసిగా నలిపి ఎష్ ట్రేలో పారేశాడు. "తులానీ " ఆ పేరు తలుచుకుంటే రాజారావు వళ్ళు మరింత చిటపటలాడింది. లేచి విసురుగా పచార్లు సాగించాడు. మళ్ళీ కూర్చుని తల రెండు చేతులతో నొక్కుకున్నాడు..... కణతలు బ్రద్దలవుతున్నాయి. ఫ్యాక్టరీలో యింతసేపూ రెండొందల మంది కూలీలు ఘోరావో చేసి కదలనీయలేదు! తలనొప్పి మరింత ఎక్కువయింది ఇంటి కొచ్చేసరికి...... ఎప్పుడూ అంతే! తన తలనొప్పి యింటి కొచ్చేసరికి మరింత ఎక్కువవుతుంది. శారీరక బాధ .....మానసిన ఆవేదన రెండూ మరచి పోవాలంటే ఒకటే దివ్యౌషధం ....... ..... "ఖుషీ రామ్ !" పెద్ద కేకపెట్టాడు రాజారావు....నౌకరు చేతులు కట్టుకు నిలబడ్డాడు. "గ్లాసులు , ఐసు తీసుకురా!" అన్నాడు. బీరువా లోంచి వాట్ 69 తీసి ఐసు వేసుకుని కలుపుకున్నాడు రాజారావు సోడా వేసి..... ఒక పెగ్ త్రాగేసరికి మనసు చల్లబడింది.... అలా సిగరెట్టు త్రాగుతూ రెండు మూడు పెగ్ లు పూర్తి చేశాడు.... అలవాటయిన కారణంగా అతనికేం కాలేదు. కానీ ఈ లోకంలోంచి కాస్త మైమరపించింది ఆవేదన తగ్గిందనిపించింది.... ఓ గంట అయ్యాక మళ్ళీ నౌకరుని పిలిచాడు.....' స్నానం చేస్తాను, టబ్ నిండా నీళ్ళు నింపు" ఆజ్ఞాపించాడు. ఖుషీ రామ్ టబ్ నిండా నీళ్ళు నింపి, టవల్స్ రెడీ చేశాడు. అయ్యగారి బూట్లూ విప్పి, బాత్ రూము శాండల్సు కాలికి తొడిగాడు.  చన్నీళ్ళలో లవండర్ సబ్బుతో స్నానం చేశాక కాస్త సేదదీరి , అతని వళ్ళు , మనసు చల్లబడింది. అలా టబ్ లో పడుకునే సిగరెట్టు వెలిగించుకున్నాడు..... ఎదురుగా తీసిన తలుపు సందులోంచి గదిలోని రమ బస్టు సైజు ఫోటో నవ్వుతుంది. రాజారావు మొఖం తిప్పుకున్నాడు. రమ! రమాదేవి లక్షల కదికారి రాజారావు భార్య! .....లోకానికి అంతే తెలుసు! పేరుకి మాత్రమే తన భార్య! రాజారావు క్రూరంగా నవ్వుకున్నాడు. ఆవిడకి తన డబ్బు, తన హోదా పనికొస్తుంది. తను పనికిరాడు. ఆవిడా లోకం వేరు. తన లోకం వేరు. ఆవిడ లోకం క్లబ్బులు, కోక్ టైల్సు, పార్టీలు, డాన్సులు ఫ్రెండ్సు ! ..... తన లోకం ఫ్యాక్టరీలు, కూలీలు ఘోరావోలు , స్త్రయిక్ లు లాభ నష్టాల బేరీజులు . ఆమె లోకంలోకి తన లోకం నించి వెళ్ళలేడు. వెళ్ళడానికి మనసూ లేదు. టైమూ లేదు! తన లోకంలో పడి శ్లేష్మంలో ఈగలా కొట్టుకుంటున్నాడు. ఆవిడా లోకంలో విహంగంలా విహరిస్తుంది.

 Previous Page Next Page