Previous Page Next Page 
భవ బంధాలు పేజి 23


    గుమ్మంలో తనకి స్వాగతం పల్కడానికి నిల్చున్న పెళ్ళాన్ని చూసేసరికి గుండె గుభేలుమంది సుబ్బారావుకి. బియ్యం , పాలడబ్బా ...... ఆ మాటలు గుర్తొచ్చేసరికి భార్య మొహం చూడడానికి భయం వేసి వెనక్కి తిరిగి పారిపోవాలనిపించింది! ....ప్చ్..... లాభం లేదు. ఎన్నాళ్ళు ఎక్కడికి పారిపోగలడు? బెదురుతూనే సైకిలు దిగాడు. సైకిలు వంక ఆశగా చూసిన సత్యవతికి ఫైళ్ళు తప్ప ఏం కనపడలేదు, కొరకొర చూస్తూ లోపలికి వెళ్ళింది.
    'పాలడబ్బా తేలేదన్న మాట. మనం ఇన్ని నీళ్ళు తాగి పడుకోగలం గానీ, నోరు వాయి లేని ఆ పసిదాన్ని ఎలా వూరుకో బెట్టను! అన్నింటికి గంగిరెద్దులా తల ఊపి , వెళ్ళి ఆ ఆఫీసులో కూర్చుంటారు, ఇంట్లో పెళ్ళాం పిల్లలు చచ్చిందీ, బ్రతికిందీ మీ కక్కరలేదు..... ప్రొద్దుట వెళ్ళి సాయంత్రం ఇంటి కొచ్చే మీకు నాచావేలా తెలుస్తుంది......"దండకం ఆరంభించింది భార్య. ఆమాటలు క్రొత్తవి, విననివిగావు, కనక సుబ్బారావు జవాబు చెప్పలేదు. చెప్పడానికే ముంది బట్టలు విప్పి లుంగీ చుట్ట బెట్టుకున్నాడు.
    "మాట్లాడకండి , నేను వాగి వాగి చావడం తప్ప మీకేం బాధ. పసిపిల్లకి పాలు లేవని చెప్పినా మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలా ఊరుకునే మీరు మనిషా, బండరాయా? బియ్యం లేవు..... ఇంకాసేపటికి ఆవురావురుమని పిల్లలోచ్చి పడతారు.....ఏం పెడతాను వాళ్ళకి నా శ్రార్ధం?...... మాట్లాడరేం...."
    "ఏం మాట్లాదమంటావు? డబ్బుంటే తేవాలని నాకు తెలీదా? డబ్బు కోసం అందర్నీ అడిగాను. ప్రతినెలా ఇరవై తారీకు నించి మన బ్రతుకు అప్పుల బ్రతుకే . ఎవరిస్తారు అస్తమానూ.... అవి తీరవని వాళ్ళకి తెలిసి.....ఎలా యిస్తారు....." నీర్సంగా అన్నాడు సుబ్బారావు.
    మరెలా ?..... పిల్లలకేం పెట్టను?.... ఏ నీళ్ళో ఆ నీళ్ళు ఆవుపాలు పడదామన్నా , పాలది రెండునెలలు బకాయి ఇస్తేనే గాని పాలు పోయనంది. దాని కాళ్ళా వెళ్ళా పడితే అర్ధశేరు ఇస్తుంది. కాఫీకి, మజ్జిగ నీళ్ళకి సరిపోతున్నాయి అవి....నేనేం చేస్తాను...." దిక్కుతోచక తల కొట్టుకుంది సత్యవతి.
    "వెధవ సంసారం , వెధవ పిల్లలు..... అందరం కలిసి కట్టగట్టుకు చద్దాం. అప్పటికి గాని మనకి విముక్తి లేదు. వెధవ పిల్లలు, పిల్లలా నా శత్రువులు గానీ, ఎక్కడ లేని డబ్బూ వీళ్ళ పాలడబ్బాలకి, మండులకే చాలడం లేదు."
    'అవునవును...... పిల్లల్ని కనడం తెలుసు కాని, పోషించేసరికి శత్రువులవుతారు..... పదండి వాళ్ళ పీకా, నాపీక నొక్కేయండి..... తర్వాత హాయిగా వుందురు గానీ...." అరుస్తూ కళ్ళువత్తుకుంది సత్యవతి.
    "నోరు ముయ్యి కాసేపు, వెధవ గోల, అక్కడ చచ్చీ చెడి యింతికొచ్చేసరికి యిక్కడ నీ గోల, వెధవ సంసారం ఒక్కనాడూ సుఖం లేదు. మీరు కాదు నేనే చావాలి ఉరెట్టుకుని..... ఎక్కడ సుఖపడి పోతానో అని పీకకి నిన్ను కట్టబెట్టారు గుదిబండలా! చావటాని కన్నా లేకుండా.....' చేతకాని ఉక్రోషంతో అరిచాడు సుబ్బారావు.
    'అనండనండి .... ఇంట్లో వస్తువులు లేదనడం నా తప్పే! ఎక్కడ నించి తెచ్చి మీ అందరికి వండి వారుస్తా ననుకున్నారు..... ఇరుగింటి నించి, పొరుగింటి నుంచి పూట గడుపుకోస్తుంటే తెలీకుండా వుంది. యింక నా వల్ల కాదీ బదుళ్ళు తేవడం, ఎలా తెస్తారో, ఎక్కడ నించి తెస్తారో బియ్యం తెస్తేనే వండుతాను...... లేకపోతె పస్తులుండండి...." విసురుగా వెళ్ళిపోయింది సత్యవతి.
    సుబ్బారావుకి ఈ సంసారం గురించి తలచుకోటానికి భయం. నలుగురు పిల్లలతో నూట ఎనబై రూపాయల జీతంతో ఈ సంసారం ఎలా యీదాలో సుబ్బారావుకి తలబద్దలు కొట్టుకున్నా తెలియదు. చాలీచాలని జీతం. ఆకాశాన్నంటే ధరలు, ఆకలి ఏడ్పు, రోగాలు, రొచ్చులు , మొత్తుకోళ్ళు , వీటన్నింటినించి తనకి విముక్తి ఎలాగో పాపం సుబ్బారావుకి అర్ధం గాని విషయం! 'లేదు' 'లేదు ' అన్న పదం తప్ప 'వుంది' అన్న మాట సుబ్బారావు డిక్షనరీలో ఎంత వెతికినా కనపడదు.
    'లేదు' యీ పూట అన్నం లేదు గాబోలు! ఆమాట అనుకుంటే సుబ్బారావు ఆకలి మరింత పెరిగింది. సాయంత్రం ఇంటికొచ్చాక ఆ పోసే కాఫీ నీళ్ళన్నా పోయ్యలేదు భార్య ఉదయం రెండు చెంచాలు కాఫీ గుండ అప్పు తెచ్చి కాఫీ చేసింది. కాఫీ పొడి లేదని నిన్ననే చెప్పేసింది. తెలుసుండీ అడిగీ చివాట్లు తినడం ఎందుకని ఊరుకున్నాడు సుబ్బారావు. సత్యవతి ఎక్కడో అప్పు తెచ్చి అన్నం వండి వుండదా అన్న చిన్న ఆశ వుంది అతనికి. భోజనానికి పిలుపు కోసం వళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూశాడు. ఎంతకీ సత్యవతి పిలవలేదు. నిజంగానే చేయలేదా ఏమిటి ఖర్మ! ... వంటింటి వైపు వెళ్ళి చూడాలంటే అభిమానం అనిపించింది. చాపేసుకుని, కాళ్ళు ముడుచుకుని పొట్టలో పెట్టుకుని పడుకున్నాడు సుబ్బారావు. చిన్న కునుకు పడుతుండగా 'అన్నానికి దయచేయండి' అన్న సత్యవతి పిలుపు వినిపించింది. దిగ్గున లేచాడు సుబ్బారావు. ఆ పిలుపులో ఆప్యాయత, ఆదరణ, లేదని తెలిసిన, పౌరుషం అన్న మాటకి అర్ధం మరిచి పోయిన సుబ్బారావు వెంటనే లేచి వెళ్ళి విస్తరి ముందు కూర్చున్నాడు. ఆవురావురుమంటూ వెళ్ళిన సుబ్బారావుకి విస్తరి చూసేసరికి ఆకలి చచ్చిపోయింది. ఇంత పెసర పచ్చడి వేసి అన్నం వడ్డించింది భార్య.... 'కూరేం చెయ్యలేదూ ?" భయపడుతూనే అడిగాడు సుబ్బారావు ..."ఆ..... చేస్తాను.....సంచులతో కూరలు తెచ్చి నా మోహన దిమ్మరిస్తున్నారు......రెండు పూటలా కూరలు వండి వారుస్తాను....' చేతులు తిప్పుతూ పెళుసుగా అంది సత్యవతి. పచ్చడి కలిపి నోట్లో పెట్టుకుంటే గొంతు దిగనంది. "ఓ నెయ్యి చుక్కో, నూనె చుక్కో వెయ్యి' అందామని నోరు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు సుబ్బారావు. వచ్చే జవాబు తెలిసి.
    "మధ్యాహ్నం పాదున కాసిన నాలుగు దొండకాయలు మీ మట్టుకు కూర చేసాను, పిల్లలకైనా ఓ ముక్క వేయకుండా. గుప్పడి పెసర పాప్పుంటే యీ పూటకి పచ్చడన్నా చేశాను. రేపు అదీ వుండదు.....' సత్యవతి ఏదో చువుతూనే వుంది. సుబ్బారావు పచ్చడి ముద్దలు గుటుకు గుటుకు మింగి చారు అనబడే వేడినీళ్ళు పోసుకుని రెండు ముద్దలు తిని మజ్జిగ అనే చల్లనీళ్లు వేసుకున్నాడు.....' యింత ఉప్పన్నా తగలెయ్యి" మొగం చిట్లించి అన్నాడు మజ్జిగ అన్నం నోట్లో పెట్టుకుని.
    "బావుంది విసుగు, గడ్డ పెరుగు వేస్తాను, మీరు రెండు చేతుల్తో డబ్బు పోస్తున్నారని..... డబ్బు మాట ఎత్తితే నా అంత ఎత్తు ఎగురుతారు గానీ, విస్తరి ముందు కూర్చునే సరికి విస్తరి నిండాలి...."
    'నోరు మూద్దూ.....యీ తిండన్నా తిననిస్తావా, వెధవ సోదా నీవూ.....' కసిరాడు సుబ్బారావు చెయ్యి కడుక్కుని గదిలోకి వెళ్ళేసరికి పిల్లలు చింకి చాపల మీద, కుళ్ళు బొంతల మీద ఒకర్కొకరు కరుచుకుని నిద్రపోతున్నారు. వాకిట్లో వున్నా మంచి ప్రక్క మీద నడుం వాల్చాడు. గట్టిగా కాళ్ళు చాచుకుంటే ఏ పెట్టెలో, సామానులో కాళ్ళకి తగుల్తాయి. ఒకే గది - సామాను గది, పడకగది అన్నీ అదే. ఇంకోటి వంటగది నలుగురూ ఒక్కసారి కూర్చొని భోజనం చెయ్యడానికి సరిపోదు .... అదే ముప్పై రూపాయలద్దే..... నిద్ర పోతున్న పిల్లల వైపు చూడడానికి కూడా సుబ్బారావుకి భయం. వాళ్ళ భవిష్యత్తు భూతంలా ఎదుట నిలబడి భయపెడ్తోంది. వెధవ బ్రతుకు కన్నపిల్లలే శత్రువుల్లా కనబడుతున్నారు. తనలాంటి వాళ్ళు అసలు పెళ్ళి చేసుకోడానికి వీలులేదని గవర్నమెంటు రూలు పెట్టాలి. పెళ్ళి చేసుకున్నా పిల్లల్ని కనరాదని రూలు ఉల్లంఘించినవారికి ఉరిశిక్ష వేయాలి, అప్పుడు గాని తనలాంటి వారికి విముక్తి లేదు.... తన ఆలోచనలు తనకే విపరీతంగా కనిపింస్తాయి సుబ్బారావుకి, చేతకాని చవట ఆలోచనలు.... చంటిది లేచి ఆకలి గాబోలు గీపెట్టి ఏడుస్తుంటే సుబ్బారావు ఆలోచనలు చెదిరిపోయాయి.

 Previous Page Next Page