Read more!
 Previous Page Next Page 
అర్చన పేజి 3

    తాయారమ్మ భయంగా చూసింది. "ఈ పాపని వదిలిపెట్టి వెళ్ళారా? ఎవరు?"
    "తెలీదు తెలిస్తే దాని తాట వలిచేవాళ్ళంగా" అంది వెంకటలక్ష్మి.
    "మన ఊళ్ళో ఇట్టాంటి పనిచేసేవాళ్ళు ఎవరున్నారు?"
    "మన ఊరివాళ్ళు కాదు. పొద్దున్నే వచ్చిన ఫస్టు బస్సులోంచి ఎవరో అమ్మాయి దిగిందని, ఆ అమ్మాయి చేతిలో పాపుందని మన సూరయ్య చెప్పాడు."
    "అలాగా! ఏడి వాడు?"
    "వస్తున్నాడు. వెనకాల పూజారిగారు ఆ అమ్మాయి ఎక్కడుందో వెతకమని పంపించారు. ఇదెంత పెద్ద ఊరని ఏ బస్టాండులోనో ఉంటుంది. వెళ్ళి లాక్కురమ్మన్నారు."
    "అదిగాదే. చూసినవాడు ఆ అమ్మాయి ఎవరింటికి వెళుతోందో, ఎక్కడినుంచి వచ్చిందో ఎందుకడగలేదు?"
    "వాడు కడుపులో గాభరాగా ఉండి తొందరగా పరిగెడుతోంటే కనిపించిందిట. సరేలే ఎవరింటికో తరువాత తెలుస్తుంది కదా అనుకున్నాట్ట."
    "మన ఊళ్ళో ఇంత గోరం జరిగితే ఎవరికీ తెలీకపోవడం ఏంటమ్మగారూ! అందరం ఎప్పుడో నిద్దర్లు లేచి పనులు చూసుకుంటున్నాం కదా! ఆశ్చర్యంగా ఉందే పొరుగూరునుంచీ ఎవరో రావడం ఏంటి? ఈ పిల్లముండని గుళ్ళో వదిలేసి పోడం ఏంటి?"
    "ఈ మజ్జెన ఆడపిల్లలు పుడితే ఇట్టాగే వదిలేత్తున్నారంటగా. ఏ పిల్ల అయితే మాత్తరం వదిలెయ్యడానికి మనసెట్టా ఒప్పుతుందో?" అంటూ పాపను ముద్దాడుతూన్న నీలవేణి చేతికి తడిగా తగిలింది.
    "అయ్యో! బట్టలు తడిపేసింది" అంటూ పాపకి కట్టిన లంగోటీ విప్పింది.
    "అమ్మగారూ! పాప కాదు బాబు" అంది గట్టిగా.
    "బాబా!?" అందరి దృష్టి బాబుమీద పడింది.
    ఇంతలో కిర్రుచెప్పుల శబ్దం విని తలపైకెత్తి చూసిన ఆండాళ్ళు "అడుగో సూరయ్య వస్తున్నాడు" అంది.
    నలుగురూ సూరయ్య వస్తున్న వైపు చూశారు. సూరయ్య, అతడి వెనకాలే కృష్ణస్వామి గారువస్తున్నారు.
    "ఏరా దొరికిందా?" అడిగింది వెంకటలక్ష్మి.
    వాడు మాట్లాడకుండా కృష్ణస్వామిగారి వైపు చూశాడు.
    అందరి కళ్ళూ ఆయనవైపు తిరిగాయి.
    ఆయన మొహం గంభీరంగా ఉంది.
    ఆయన మొహం చూసిన వాళ్ళెవరికీ ఇంక వివరాలు డిగే ధైర్యం చాల్లేదు. ఆయన మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆడాళ్ళంతా మొహా మొహాలు చూసుకున్నారు.
    "ఏమైందిరా?" తాయారమ్మ కొంచెం కలవరంగా అడిగింది.
    సూరయ్య ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వీధి అరుగుమీద కెళ్ళి కూర్చున్నాడు.
    ఆండాళ్ళు అయోమయంగా అడిగింది.
    "వీడినేం చేద్దాం?"
    "నేను పెంచుకుంటానమ్మగారు." నీలవేణి మురిపెంగా అంది "సీరామ సెందుడ్లా ఉన్నాడు. నేను పెంచుకుంటాను."
    "అదేవిటే. పెళ్ళీ పెటాకుల్లేకుండా పిల్లాడిని పెంచుకుంటే పరువు పోదూ? నీకు మళ్ళీ పెళ్ళి అవుతుందా?" వెంకటలక్ష్మి విస్తుబోతూ అంది.
    "కాకపోతే పోనీండి. ఈ అనాధని ఎవరు పెళ్ళాడతారు? ఎట్టాగా నాకు పెల్లి కాదు. వీడిని పెంచుకుంటాను. వీడు అనాధ కాకూడదు" అంటూ బ్బుని గుండెలకి హత్తుకుంది.
    వెంకటలక్ష్మి, ఆండాళ్ళ మనసు ద్రవించిపోయింది.
    "ఎంత మంచి మనసే నీది. ఆ వేణుగోపాలుడు చల్లగా చూడాలి నిన్ను" అంటూ తాయారమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
    తాయారమ్మకి అంతా అయోమయంగా అనిపించింది. భర్త అలా గంభీరంగా ఎందుకున్నాడో, సూరయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడో ఉదయాన్నే నిద్రలేస్తూనే ఈ బాబెవరో గుమ్మంలోకి రావడం. అంతా గందరగోళంగా ఉంది.
    నీలవేణి బాబుని తీసుకుని పెరటివైపు వెళ్ళిపోయింది. తాయారమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. కృష్ణస్వామి హాల్లో ఉన్న దివాన్ మీద కుడిచేయి కళ్ళమీద అడ్డంగా పెట్టుకుని, ఎడం చేయి పొట్టమీద పెట్టుకుని పడుకున్నారు. తాయారమ్మ ఆయనకి సమీపంగా నడిచింది. నెమ్మదిగా "ఏవండీ" అని పిలిచింది.
    రెండుసార్లు పిలిచాక ఆయన చేయి అడ్డం తీసి కళ్ళు తెరిచాడు.
    "ఏం జరిగింది?" అడిగింది. ఆవిడ మనసేదో కీదుని శంకించసాగింది.
    ఆయన మౌనంగా లేచి కూర్చున్నాడు. దిండు కింద పెట్టిన కాగితం మనద్త తీసి అందించాడు.
    "ఏంటిది?" అడిగిందావిడ వణుకుతున్న స్వరంతో.
    "చదువు" గంభీరంగా అన్నాడాయన.
    ఆవిడ కళ్ళు కాగితం మీద ఉన్న అక్షరాల వైపు పరిగెత్తాయి.
    "పూజ్యులైన కృష్ణస్వామిగారికి,
    పరమ పవిత్రమైన, సంప్రదాయబద్ధమైన మీ ఇంటికోడలిగా, బుద్దిమంతుడైన మీ కుమారుడు వేణు భార్యగా ఎంతో గౌరవంగా బతకాల్సినదాన్ని. నా జీవితం గాడి తప్పింది. నాకీ బతుకుమీద మమకారం లేదు. అస్సలు బతకాలని లేదు. కానీ, నా కడుపులో ఊపిరిపోసుకున్న బాబు నా బాధ్యతని గుర్తుచేశాడు. అందుకే ఈ తొమ్మిది నెలలూ ఒంటరిగా జీవితంతో పోరాడి, మీ మనవడిని, వేణు కొడుకుని భూమ్మీద పడేయడానికి ఎంతో కష్టపడ్డాను. విధాత నా నుదుట రాసిన రాత వీడి నుదుట నేను రాయడం నాకిష్టం లేదు. అందుకే వీడిని మీకు వదిలివెళ్ళిపోతున్నాను. నా జీవితాన్ని ఎలా గడిపినా, ఎలా ముగించిన మీ వంశాంకురం అయిన బాబుని మీకే అప్పగించి వెళ్ళిపోతున్నాను. వీడు మీ మనవడు. ఇకనుంచీ వీడి బాధ్యత మీదే. ఇంతకాలం తరువాత వేణుని కలవాలని, ఇడుగో నీ కొడుకు అంటూ వీడిని తనకి అప్పగించాలని నేను అనుకోడం లేదు. వేణుని కలిసే శక్తి కూడా నాకు లేదు. అందుకే నేను మీ వంశం నుంచి నిష్క్రమిస్తున్నాను. అత్తయ్యగారికి నా పాదాభివందనాలు.

                        సెలవ్,
                        అర్చన."

    ఆ కాగితం అలాగే రెండు చేతుల్లో పట్టుకుని, కింద కూలబడిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది తాయారమ్మ.

 Previous Page Next Page