Read more!
 Previous Page Next Page 
అర్చన పేజి 2

                          రావిచెట్టుకి ప్రదక్షిణలు ముగించిన స్త్రీ బైటికి వెళ్ళిపోయింది.
    ఆ యువతి ద్వారం చాటునుంచి కదిలి, భుజం మీద నిద్రపోతున్న పాపని రెండు చేతుల మధ్యకి తీసుకుని, తఃదేకంగా పాప మొహంలోకి చూసింది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. చేతులు వణికాయి, గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. తడబడే అడుగులతో రావిచెట్టు గట్టు దగ్గరకి వచ్చి, పాపకి నిండుగా గుడ్డ కప్పి ఆ గట్టు మీద పడుకోబెట్టింది. ఎగిసిపడుతున్న దుఃఖం బైటికి రాకుండా, ఎక్కువ ఆలస్యం చేయకుండా వడివడిగా బైటకి వచ్చి ఆలయం మెట్లు దిగింది.
    అదిరే గుండె చిక్కబట్టుకుని వేపచెట్టు దగ్గరికి వచ్చి, కొంచెంసేపు ఆయాసం తీర్చుకోవడం కోసం అన్నట్టుగా ఓ క్షణం అక్కడే నిలబడింది. అప్పటికే మరోవైపు నుంచి ఇద్దరు స్త్రీలు చేతిలో పూలసజ్జతో గుడివైపు వస్తున్నారు. వాళ్ళు పట్టుచీరలు కట్టుకున్నారు. ఆ చీరలు చాలా పాతకాలం నాటివి. మడికోసం వాడేవి. తడిజుట్టు వేలుముడి వేసుకున్నారు. జుట్టు కొసలనుంచి నీళ్ళు కారుతూ జాకెట్లు తఃడుస్తున్నాయి. ఆ చలిలో....తడిసిన జాకెట్లు, నీళ్ళు కారుతున్న జుట్టుతో ఆ స్త్రీలు ఆలయం లోపలికి వెళుతోంటే ఆ యువతి కళ్ళనుంచి ధారాపతంగా కన్నీరు స్రవించసాగింది. కళ్ళు తుడుచుకుని, పాపని మరోసారి చూడాలన్న గుండె ఆరాటాన్ని అరికడుతూ తలమీంచి చీరచెంగు కప్పుకుని కనిపించే గోడలు, చెట్లు చాటుచేసుకుంటూ, తిరిగి బస్టాండుకి చేరింది.
    అప్పటికి సూర్యుడు తూర్పు కొండలనుంచి నింపాదిగా ప్రయాణం కట్టి ఆ ఊరివైపు కదిలి వస్తున్నాడు. ఆయన వెనక చిరువెచ్చదనం గాలిలో కలిసి వస్తోందేమో, వణుకు తగ్గినట్టు అనిపించిందా యువతికి. ఆమె నుదుట చిరుచెమట పోసింది కానీ, తనని ఎవరన్నా చూస్తారేమో అనే కంగారు వలన కలిగిన చెమటే కానీ, వాతావరణంలో మార్పు కాదని ఆమెకి అర్దమైంది. అప్పటికే చాలామంది పొలాలవైపు రావడం, కొందరు చెంబు తీసుకుని ఊరిబైటికి బయలుదేరడంతో తనని ఎవరన్నా గుర్తుపడతారేమోనని ఆమె గజగజలాడుతూ బస్ స్టాండులో ఓ మూల, పైకప్పు కూలిపోయి, సున్నం, విరిగిపోయిన ఇటుకలతో నిండిన ఓ పాత ఇంటి గోడ వెనక నక్కి కూర్చుంది, మరో బస్సు కోసం ఎదురుచూస్తూ.

                                                                                                                         * * * * *

    అపుడే తాయారమ్మ పూజ ముగించి, నీళ్ళు కారుతున్న పెద్ద జుట్టు వేలుముడి విప్పి, జుట్టు చిక్కుల్లో డాగిన కుంకుడుకాయ తొక్కలు దులుపుతూ వీధివాకిట్లోకి వచ్చింది. నీలవేణి పదమూడు చుక్కల ముగ్గు వేయడం ముగించి, పాత చాటలో గొబ్బెమ్మలు తీసుకొస్తోంది. పెరట్లోంచి తాయారమ్మగారిని చూసి, చిరునవ్వుతో అంది.
    "పెద్దమ్మగారూ! పూజ అయిందా? ప్రసాదం పెడతారా? ఇయాల అయ్యగారి పెసాదం పులిహోర, అమ్మగారి పెసాదం చక్కెర పొంగలా?" అంది ముగ్గు మధ్యలో పసుపు, కుంకుమలు, బంతిపూలతో అలంకరించిన గొబ్బెమ్మలు పెడుతూ.
    "తెల్లవారనీయవుటే ప్రసాదానికీ!" నవ్వుతూ వేళ్ళతో జుట్టు చిక్కులు విడదీయసాగింది తాయారమ్మ.
    నీలవేణి గొబ్బెమ్మలు తీర్చిదిద్దడం ముగించి, బంతిపూల రెక్కలు చల్లుతూ 
    "ఈ ధనుర్మాసం అంతా పెసాదంతోటేగా పెద్దమ్మగారూ గడిచేది" అంది.
    ఆవిడ నీలవేణివైపు నడిచి కొన్ని రెక్కలు చేతిలోకి తీసుకుని తనూ గొబ్బెమ్మలపైన చల్లింది.
    "ఆడపిల్లలు లేక కొంతకాలం అసలు గొబ్బెమ్మలు పెట్టలేదే నీలవేణి! కోడలొచ్చాక పెడుతుందనుకుంటే ఆ కోడలు పట్నం పిల్ల అయిపోయింది. ఏడాది అవుతోంది కొడుకూ, కోడలూ ఇక్కడికొచ్చి, ఎన్నిసార్లు రమ్మని ఉత్తరాలు రాసినా సెలవు దొరకడం లేదమ్మా అంటూ రావడమే లేదు. ఏవిటో ఉన్న ఒక్కకొడుకూ, కోడలూ దూరంగా ఉంటోంటే మనసుకేం శాంతిగా లేదే. ఈ వయసులో మాకు తోడుగా ఉండమనే కాబోలు ఆ విష్ణుమూర్తి దయతలచి నిన్ను పంపించాడు. మళ్ళీ మా లోగిలి కళకళ్ళాడుతోంది" అన్నదావిడ.
    నీలవేణి చాట అరుగుమీద పెట్టి, పక్కన ఉన్న సిమెంటు తొట్టిలోంచి నీళ్ళు తీసుకుని చేయి కడుక్కుంది. నడుం చుట్టూ దోపిన ఓణీ తీసుకుని చెంగుతో చేయి తుడుచుకుంటూ వచ్చి, తాయారమ్మ చేతిలోంచి ఆవిడ జుట్టు అందుకుని వెనక్కేసి మృదువుగా చిక్కులు తీస్తూ అంది. "కులం, గోత్రం లేని ఈ అనాధని సొంతబిడ్డలా ఆదరించే తల్లి ఎవరుంటారు పెద్దమ్మా! మీరు ఆదరించారు కాబట్టి ఊరంతా ఆదరిస్తోంది. లేకపోతే నాకు గోదారితల్లేగా గతి!"
    "అంతమాటనకే నీలవేణీ! ఎక్కడినుంచి వచ్చావో ఊరికే ఆడబడుచువి అయావు. అంతా నీ మంచితనం తల్లీ! నీలో మంచితనం, అణకువ లేకపోయి ఉంటే నిన్ను ఎవరాదరించేవాళ్ళీ పల్లెటూళ్ళో అయినా మన ఊళ్ళో ఏం ఉన్నా లేకపోయినా మానవత్వం మాత్రం పుష్కలంగా ఉంది. అందుకే మన గోదావరి నీళ్ళు తియ్యగా ఉంటాయి. మన ఊరిగాలి స్వచ్చంగా ఉంటుంది."
    దాదాపు ఏడు నెలల క్రితం గోదావరి ఒడ్డుకి కొట్టుకొచ్చింది నీలవేణి, ఉదయాన్నే స్నానానికి వెళ్ళిన కృష్ణస్వామిగారి పాదాల దగ్గర స్పృహలేని స్థితిలో వచ్చి పడింది. వయసులో ఉన్న ఆడపిల్లని ఆ స్థితిలో చూసిన కృష్ణస్వామిగారు అప్పటికప్పుడు ఊరందరినీ పిలిపించి, ఆ పిల్ల తాగిన నీళ్ళు కక్కించి, ప్రథమ చికిత్స చేసి, తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. తనకి ఎవరూ లేరని, వరదల్లో ఇల్లు, తల్లీ, తండ్రి, తమ్ముడు, చెల్లెలు కొట్టుకుపోయారని చెప్పింది నీలవేణి. ఆ పిల్ల అణుకువ, మంచితనం, పనితనం ఊరందరికీ సాయం చేసే సద్గుణం ఆమెని ఆ ఊరికి ఆడపడుచుని చేశాయి.
    "తాయారమ్మ గారూ! తాయారమ్మగారూ!"
    ఆ పిలుపుకి ఉలిక్కిపడిన తాయారమ్మ నీలవేణి చేతుల్లోంచి జుట్టు విడిపించుకుని చివ్వున వెనక్కి తిరిగింది.
    నుదుట కుంకుమ బొట్లతో, జుట్టునుంచి కారిన నీళ్ళతో తడిసిన జాకెట్లతో, నలిగిన పట్టుచీరలతో, మొహం నిండా గాభరా నిండి ఉండగా పరిగెత్తుకుని వస్తున్నారు వెంకటలక్ష్మి, ఆండాళ్ళు, ఆండాళ్ళు చేతిలో పొత్తిళ్ళలో ఉన్న పసిపాప, వెంకటలక్ష్మి చేతుల్లో అరటిదొప్పల్లో చక్కరపొంగలి.
    నీలవేణి పరిగెత్తుకుని వెళ్ళి ఆండాళ్ళు చేతుల్లో ఉన్న పాపని అందుకుంది. "ఎవరీ బంగారుతల్లి చిన్నమ్మగారూ?" అంది. పాప మొహం చూసి మురిసిపోతూ.
    ఆండాళ్ళు కంగారు అణచుకోడానికి అన్నట్టుగా అరుగుమీద కూలబడి, "ఎవరో గుళ్ళో రావిచెట్టు కింద ఈ పాపని వదిలేసి వెళ్ళారు. మేము గుళ్ళోకి అడుగుపెడుతూనే కనిపించింది."

 Previous Page Next Page