దిసీజ్ ఉమన్ ఎంపవర్ మెంట్, దిసీజ్ ఉమన్ ప్రోగ్రెస్.... ఐ అప్రిషియేట్ యూ అర్చనా! అయామ్ ప్రౌడ్ ఆఫ్ యూ! అనుకుంది మనసులోనే. చిరునవ్వుతో మాధవి, చక్రవర్తి ఆమె దగ్గరగా నడిచి "వెల్ కమ్" అంటూ చేతులు చాచారు.
అర్చన అందంగా నవ్వుతూ "థాంక్యూ" అంటూ పిల్లలిద్దరినీ చెరో చేత్తో దగ్గరికి తీసుకుని భుజం మీదుగా వెనక్కి చూస్తూ డ్రైవర్ ని పిలిచింది. "రమేష్ కవర్ తీసుకురా" అంటూ.
రమేష్ అనబడే డ్రైవర్ ఎంతో నమ్రతగా ఒక పెద్ద కవర్ తీసుకొచ్చాడు. దాని ఈద 'లైఫ్ స్టైల్' అని ఉంది.
"లోపలికి పద" అంటూ మాధవి దారి తీస్తుంటే ఆమెని అనుసరిస్తూ వెళ్తున్న అర్చన వెనకాలే డ్రైవర్ కూడా లోపలికి నడిచి ఆమె కనుసైగతో చేతిలో ఉన్న కవర్ హాల్లో ఉన్న టీపాయ్ మీద పెట్టి తల వంచుకుని బైటకి వెళ్ళిపోయాడు.
అర్చన పిల్లలిద్దరినీ అలాగే పట్టుకుని సోఫాలో కూర్చుని కవర్ లోంచి చెరో అట్టపెట్టె తీసి ఇద్దరికీ ఇచ్చింది. ఇంకో అట్టపెట్టె మీద కళానికేతన్ అని ఉంది. అది చూసి "ఎందుకివన్నీ?" అంది మాధవి.
అర్చన నవ్వి కళానికేతన్ అట్టపెట్టె తిరిగి కవర్ లో పెట్టేసి "నా తృప్తికోసం" అంటూ "మీరు కూడా కూర్చోవచ్చు కదా!" అంది చక్రవర్తినుద్దేశించి.
చక్రవర్తి ఆమె ఎదురుగా మరో సోఫాలో కూర్చుంటూ "మధూ! ఆవిడకి మంచి కాఫీ ఇస్తే బాగుంటుంది కదా!" అన్నాడు.
"తెస్తాను" అంటూ మాధవి లోపలికి వెళ్ళిపోయింది.
తరువాత కాస్సేపు ముగ్గురూ కబుర్లు చెప్పుకున్నాక అర్చన మాధవిని అడిగింది "వేణు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడా ఈ టైమ్ కి?"
ఆమె ఎందుకలా అడిగిందో అర్ధం కాక కొంచెం అయోమయంగానే అంది "త్వరగా వెళ్ళిపోతాడు. వాళ్ళమ్మగారు ఒక్కరే ఉంటారు కదా!" అన్నాడు చక్రవర్తి.
మాధవి కూడా ఆర్చన వైపు చిత్రంగా చూసింది. "ఎందుకు?" అంది.
అర్చన కొంచెం స్థిరంగా అంది. "ఒక్కసారి వాళ్ళింటికి వెళదాం వస్తావా?"
"వేణు ఇంటికా నువ్వా కానీ...." మాధవి మాటలు మధ్యలోనే ఆపేస్తూ అంది అర్చన "ప్లీజ్ మధూ! వెళదాం రా. మీరు కూడా రండి" అంది చక్రవర్తితో.
చక్రవర్తి, మాధవి ఒకళ్ళవైపు ఒకళ్ళు ఏం చెప్పాలో తెలియనివాళ్ళలా చూసుకున్నారు. అర్చన అదేం గమనించనట్టు పిల్లలిద్దరికీ వేసుకున్న డ్రెస్ తీసి తను కొన్న కొత్త డ్రెస్ లు వేయసాగింది.
మాధవికి సైగ చేశాడు చక్రవర్తి లోపలికి వెళ్ళి రెడీ అవమన్నట్టు.
అర్చన వస్తోందని మాధవి అప్పటికే నీటుగా రెడీ అయి మంచి చీర కట్టుకుంది. అందుకే అవసరం లేదన్నట్టు తలాడించింది. "పదండి వెళదాం" అంది.
ఐదు నిమిషాల్లో అందరూ కలిసి అర్చన కారులోనే వేణు ఇంటికి బయలుదేరారు.
* * * * *
"వేణూ..." టీవీ చూస్తున్న వేణుని పిలుస్తూ వచ్చింది తాయారమ్మ.
"ఏమ్మా?" తలెత్తి ఆవిడ వైపు చూశాడు వేణు.
"రిత్విక్ భోజనం అయింది. వీడి హోంవర్కు చేయించావా?" అంది మూతి తుడుచుకుంటూ వచ్చిన రిత్విక్ ని చూపిస్తూ.
రిత్విక్ ని దగ్గరకు తీసుకుని అడిగాడు. "ఏరా హోం వర్కు చేసేశావా?"
"ఓ..." వాడు తల గుండ్రంగా తిప్పాడు.
"సరే అయితే వెళ్ళి పడుకో" అంటూ వాడిని ముద్దు పెట్టుకుని వదిలేశాడు.
"మనం కూడా భోంచేద్దాం నాన్నా.... ఎనిమిదవుతోంది" అంది ఆవిడ నీరసంగా.
"అయ్యో! ఆకలేస్తోందమ్మా! పద నువ్వు తినేద్ధువుగానీ. నేను వడ్డిస్తాను. నాకిప్పుడే ఆకలి లేదు" అంటూ లేచాడు వేణు.
"అదేంటిరా? ఆఫీసు నుంచి వచ్చి కాఫీనేగా తాగావు."
"లేదులేమ్మా! ఫ్రెండ్స్ తో కలిసి సమోసాలవీ తిన్నాను. దా నీకు నేను దగ్గరుండి తినిపిస్తాను" అన్నాడు.
అప్పుడే బైట గేటు ముందు కారాగింది.
ఆవిడ అద్దాల కిటికీలోంచి బైటకి చూస్తూ "కారాగింది. మాధవి వాళ్ళు వచ్చినట్టున్నార్రా" అంది.
"మాధవి వాళ్ళా?" టైం చూస్తూ "అదేంటి ఈ టైంలో వచ్చారేంటి?" అంటూ గుమ్మం దాకా వెళ్ళాడు వేణు. అతని వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ ఆవిడ కూడా బయలుదేరింది. ఆవిడకి మాధవిని చూస్తే ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది.
పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు "అమ్మమ్మా" అంటూ.
వాళ్ళ వెనకాలే చక్రవర్తి.
"ఏంటిరా ఈ టైంలో ఈ సర్ ప్రైజ్ విజిట్ ఏంటి?" అంటూ గుమ్మం దాటి ముందుకెళ్ళి చక్రవర్తి దగ్గరగా నడుస్తూ గేటులోంచి లోపలికి వస్తున్న మాధవిని, ఆమె వెనకాలే హుందాగా వస్తోన్న స్త్రీని చూస్తూ ప్రశ్నార్ధకంగా చక్రవర్తి వైపు చూస్తూ అడిగాడు. "ఏంటి పెళ్ళిచూపులా?"
చక్రవర్తి కాదన్నట్టు తలాడిస్తూ "సరిగా చూడు ఎవరో తెలుస్తుంది" అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. అతనికి గాభరాగా ఉంది. ఇప్పుడిక్కడ ఎలాంటి సీను చూడాల్సి వస్తుందో, ఏం గొడవ అవుతుందో అని భయంగా కూడా ఉంది. అందుకే తన ఎదురుగా వస్తోన్న తాయారమ్మని కూడా పలకరించకుండా "మంచినీళ్ళు కావాలి" అంటూ ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళిపోయాడు.
మాధవికి గుండె దడదడలాడుతోంది. ఇప్పుడు వేణు, అర్చన ముఖాముఖీ ఎదురుపడతారు ఎలా? ఏం జరుగుతుంది? ఇద్దరూ మాట్లాడుకుంటారా?
"ఏంటి మాధవీ! ఈ వేళప్పుడు ఈ రాక?" అంటున్న వేణు వైపు చూసి. నవ్వి గబగబా తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయింది.
అటు చక్రవర్తి, ఇటు మాధవిల ప్రవర్తన వింతగా అనిపించిన వేణు మాధవి వెనకాల వస్తోన్న స్త్రీని పట్టించుకోకుండా చిత్రంగా తలతిప్పి లోపలికి చూశాడు.
మాధవి అప్పుడే ఎదురుగా వస్తోన్న తాయారమ్మ చేయి పట్టుకుని నడిపిస్తూ గుమ్మందాకా తీసుకురావడం, అర్చన లోపలికి అడుగు పెట్టడం ఒకేసారి జరిగాయి.
అర్చన తన చేతిలో ఉన్న కళానికేతన్ కవర్ లోంచి ఖరీదైన పట్టుచీర తీసి, తాయారమ్మ భుజాలమీద శాలువాలా కప్పి వంగి ఆవిడ పాదాలకు నమస్కరించింది.
ఆవిడకి ఆమె ఎవరో, తనకి చీర ఎందుకిస్తుందో, ఎందుకు పాదాలకు నమస్కరిస్తుందో అర్ధంకాక తెల్లమొహం వేసి చూసింది మాధవి వైపు.
మాధవి "దీవించండి పిన్నీ" అంది.