Previous Page
అర్చన పేజి 115


    "దీర్ఘసుమంగళీభవ తల్లీ!" అంటూ ఆమెని లేవనెత్తి ఆమె మొహంలోకి చూస్తూ "నువ్వెవరమ్మా!?" అంది.
    అప్పటిదాకా ఆమెనంతగా గమనించని వేణు ఆమె చర్యకి తాయారమ్మతో పాటు తనూ ఆశ్చర్యపోతూ ఆమె మొహంలోకి చూశాడు.
    షాక్ తగిలినట్టు అయింది.
    అమ్మాయిగా తన జీవితం నుంచి వెళ్ళిపోయిన అర్చన నేడు ఫ్రౌడ్ గా ఎదురుగా వచ్చి నిలబడింది. గుర్తుపట్టకపోవటానికి శరీరాకృతిలో, వస్త్రధారణలో మార్పు వచ్చింది కానీ, అందమైన కళ్ళు, ఆత్మవిశ్వాసం నిండిన చిరునవ్వు అలాగే ఉంది.
    ఆమె స్వరం నుంచి హఠాత్తుగా డైనమైట్ పేలినట్టు అనిపించింది తాయారమ్మకి "నేను మీ కోడల్ని, అర్చనను."
    ఆవిడ ఉలిక్కిపడి అర్చనని వదిలేసింది.
    "నువ్వా!?" అంది వెనక్కి అడుగేసి.
    "క్షమించండి. నా రాక మీకిష్టం ఉండకపోవచ్చు. కానీ," అంటూ వేణు దగ్గరగా నడిచి అంది "వేణూ! నేను ఇప్పుడు నిన్నుగానీ, మీ అమ్మగార్ని కానీ క్షమార్పణ అడగడానికి రాలేదు. కేవలం ఇంకా భర్తీకాని నా స్థానం నాకివ్వగలవేమో అని అడగడానికి వచ్చాను. క్షమార్పణలు, ఏడుపులు లాంటి డ్రామాలు నాకిష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా నీ జీవితంలో భాగం అడగడానికి వచ్చాను. నీ అంగీకారం చెప్పు" అంది.
    మాధవి, చక్రవర్తి ఊపిరి బిగపట్టుకుని వేణు నిర్ణయం కోసం చూడసాగారు. వాళ్ళకసలు అయోమయంగా ఉంది. పిల్లలు ముగ్గురూ ఆడుకోడానికి రిత్విక్ రూములోకి వెళ్ళిపోయారు. అక్కడ వాతావరణం భయంగానూ, జలదరింపుగాను ఉంది అందరికీ. ఏం జరుగుతుందో అర్ధం కాని అయోమయావస్థలో నిలబడి పోయారు.
    వేణు ఏం మాట్లాడాలో తెలియనివాడిలా జరుగుతున్నదంతా వాస్తవం అని నమ్మలేనివాడిలా బొమ్మలా నిలబడిపోయాడు. నిజంగా అర్చన వచ్చిందా?
    అర్చన అతనికి మరికొంచెం సమీపంగా వచ్చింది. "వేణూ! నీ నిర్ణయం ఏదైనా నేనేం అనుకోను. ఓ ఫ్రెండ్ లా వచ్చాననుకుని వెళ్ళిపోతాను."
    వేణు బలవంతంగా గొంతు పెగల్చుకున్నాడు.
    తన ప్రాణం, తన సర్వస్వం అర్చన తనని జీవితంలో భాగం ఇవ్వమని దర్పంగానే అర్దిస్తోంది. కాదనగల శక్తి తనకుందా? కానీ, కానీ....
    నెమ్మదిగా అన్నాడు. "మీరు, మీరు.... నువ్వు ఇప్పుడు..."
    "కలెక్టర్ ని అంటావు అవునా? కలెక్టర్ ని అయినా నేను కూడా మనిషినే వేణూ!" అంది నవ్వుతూ,
    వేణు ఏం మాట్లాడలేడు.
    అర్చన మాధవి వైపు తిరిగి ఆమెకి దగ్గరగా నడిచి అంది. "ఈ  ఇంటి ఆడపడుచువి నీ అనుమతితో నేనీ ఇంట్లో నా స్థానం తీసుకోడానికి వచ్చాను. అనుమతిస్తావా మధూ!"
    మాధవి ఉద్వేగంగా అర్చనని గభాల్న కౌగిలించుకుంది. ఆమె కన్నీటితో అర్చన భుజం తడిసిపోయింది.
    చక్రవర్తి మెల్లిగా నడుస్తూ వేణు దగ్గరగా వెళ్ళి అతని భుజం పట్టుకుని మాధవి, అర్చనల దగ్గరకు నడిపించాడు.
    మాధవి అర్చనని వదిలి ఆమె చేయి పట్టుకుని, వేణు చేతికి అందించింది.
    "వేణు మనసారా నన్ను ఆహ్వానించాలి మాధవీ!" అంది అర్చన అంటీ అంటనట్టు తన చేయి తాకిన వేణుని చూస్తూ.
    వేణు అప్రయత్నంగా గట్టిగా పట్టుకున్నాడామె చేయి.
    "క్షమించావా వేణూ!" అంది అర్చన పల్చగా కదిలిన కన్నీటి మధ్య నవ్వుతూ.
    "నాలోని బలహీనతలని అర్ధం చేసుకుని, క్షమించిన నీ ఔదార్యం ముందు నేను ఓడిపోయాను అర్చనా! నన్ను క్షమించు" అన్నాడు వేణు. "వద్దొద్దు. నో క్షమార్పణలు" అంది అర్చన. ఆమె నవ్వుతున్నా ఆమె కళ్ళల్లో అస్పష్టంగా కదులుతున్న బాధ, కన్నీళ్ళు అందరూ గమనించారు.
    కన్నీళ్ళు తుడుచుకుంటూ తాయారమ్మ గాద్గదికంగా అంది "అమ్మా మాధవీ! కోడలికి హారతివ్వు."
    అర్చన నవ్వింది. వేణు చేయి గట్టిగా పట్టుకుని ఆమె దగ్గరగా నడిచి "అలాంటివేం వద్దత్తయ్యా! మీ దీవెనలు చాలు" అంటూ ఆవిడ పాదాలకు నమస్కరిస్తూ వేణు వైపు చూసింది. ఆమె చూపు అర్ధం చేసుకున్నవాడిలా వేణు వంగాడు.
    "రిత్విక్ కి వాళ్ళమ్మని పరిచయం చేయవా?" అంది మాధవి.
    వేణు కొంచెం గట్టిగా "రిత్విక్" అని పిలిచాడు.
    లోపలినుంచి "కమింగ్ డాడ్" అంటూ అరిచి రెండు నిమిషాల్లో పరిగెత్తుకొచ్చాడు రిత్విక్.
    వేణు పోలికలు, తన పోలికలు పుణికి పుచ్చుకుని అందంగా ఉన్న రిత్విక్ ని చూసి చేతులు చాపింది అర్చన.
    కొత్తావిడ అలా పిలుస్తుంటే ఆమె ఎవరో అర్ధం కాని రిత్విక్ వేణు వైపు చూశాడు.
    "కమ్ రిత్విక్! షి ఈజ్ యువర్ మామ్" అన్నాడు వేణు.
    "మామ్..." వాడి కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం ముప్పిరిగొన్నాయి. మరోసారి "మామ్!?" అంటూ నమ్మలేనివాడిలా అర్చనవైపు చూశాడు. ఆ చూపులకి నిలువెల్లా కరిగిపోయిన అర్చన చప్పున రెండు అడుగులేసి వాడిని దగ్గరకు తీసుకుంది.
    ఆమె గుండెల్లో గువ్వలా ఒదిగి "మామ్, మామ్" అంటూ పదే పదే ఉచ్చరించసాగాడు రిత్విక్.
    "యస్ బాబూ! నేను నీ మామ్ ని... కాదు, నీకు అమ్మ... అమ్మని" అంది అర్చన.
    వేణు వాళ్ళిద్దరినీ చూసి తృప్తిగా నవ్వాడు. మాధవి, చక్రవర్తి హాయిగా నవ్వారు.
    తాయారమ్మ ఆ అపురూపమైన సన్నివేశాన్ని చూస్తూ "వీళ్ళిద్దరూ చిరకాలం ఇలాగే ఉండేలా దీవించు తండ్రీ" అంటూ చేతులు జోడించి తల పైకెత్తి కళ్ళు మూసుకుంది.            
                                                                * * * * *
                                                                 --అయిపోయింది--

 Previous Page