మాధవి కాస్సేపు పాపతో ఆడుకుని టైం చూసి చక్రవర్తి వచ్చే వేళయిందని అనుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
ఈ మధ్య ఇద్దరూ కూడా ఎనిమిది, ఎనిమిదిన్నర లోపే డిన్నర్ చేసేస్తున్నారు. అది కూడా పుల్కాలు, గ్లాసు మజ్జిగా. పొట్ట వచ్చేస్తోందని చక్రవర్తి డైటింగ్ స్టార్ట్ చేయడంతో మాధవి కూడా పుల్కాలే అలవాటు చేసుకుంది.
మాధవి చకచకా ఉల్లిపాయలు కట్ చేసి ఎగ్ కర్రీ చేసేసింది. గోధుమ పిండి తడిపింది. పిల్లలిద్దరికీ గుప్పెడు బియ్యం కడిగి చిన్న రైస్ కుక్కర్ లో పెట్టింది.
ఫోన్ రింగైంది.
మాధవి చేతులు నాప్ కిన్ తో తుడుచుకుంటూ హాల్లోకి వెళ్ళి ఫోన్ తీసింది.
అవతలనుంచి మృదుమధురమైన అర్చన స్వరం వినిపించింది. "హ...లో మధూ!"
మాధవి నమ్మలేనట్టు ఆశ్చర్యంగా పిలిచింది "అర్చనా!"
"యస్. అర్చననే . ఎలా ఉన్నావు మధూ? నాకసలు మళ్ళీ ఫోన్ చేయలేదేం?"
అర్చన స్వరంలో స్పష్టంగా వినిపించిన నిష్ఠూరం గమనించి "సారీ అర్చనా! వీలు కాలేదు. పైగా నువ్వు బిజీగా ఉంటావు కదా అని చేయలేదు. నువ్వెలా ఉన్నావు?"
"నేను బాగున్నాను. నేను రేపు ఉదయం హైదరాబాదు వస్తున్నాను. సి.ఎస్.గారి దగ్గర మీటింగ్ ఉంది. అది అయిపోగానే ఫోన్ చేస్తాను కలువగలవా?"
మాధవి కెందుకో కలవాలనిపించలేదు. ఈమెతో ఇంక నాకేం సంబంధం అనిపించింది. వేణుకి విడాకులిచ్చేశాక ఈమె ఎవరు? కలెక్టర్ స్నేహితురాలు అని గొప్పగా చెప్పుకోవాలనే ఆరాటం తనకేం లేదు.
"ఏంటి మధూ ఆలోచిస్తున్నావు?" అర్చన స్వరం వినిపించడంతో కంగారుగా అంది. "ఏం లేదు. తప్పకుండా కలుద్దాం. ఎక్కడ?"
"మీ ఇంటికి రాకూడదా నేను?"
"అదేం మాట అర్చనా! కానీ రాగలవో లేదో అని అన్నాను. యూ ఆర్ వెల్ కమ్."
"అదే ఇల్లుగా!"
"అదే ఇల్లు, అదే వాకిలి, అదే మనుషులం" నవ్వింది మాధవి.
"అందరూ బాగున్నారా?" అందరూ అనడంలో ఏదో ధ్వనింపచేస్తూ అడిగింది.
"చక్రవర్తి, పిల్లలు అంతా బాగున్నారు."
"పెద్దావిడ ఎలా ఉన్నారు?"
"ఎవరు మీ అత్తగా...." నాలిక్కర్చుకుంది మాధవి. "తాయారమ్మగారా? ఫర్లేదు. ఇప్పుడు కొంచెం బెటర్. కొడుకు ఓ ఇంటివాడైతే పూర్తిగా కోలుకుంటారు."
"వేణు ఇంకా మ్యారేజ్ చేసుకో'లేదా?"
"లేదు. నీలవేణి పెళ్ళి అయింది. వేణుకి చూస్తున్నాం. రెండు, మూడు సంబంధాలు రెడీగా ఉన్నాయి. వేణు పెళ్ళి చూపులకి వస్తే ఏదో ఒకటి సెటిల్ చేస్తాం. శూన్యమాసం అని వాళ్ళమ్మగారు ఇప్పుడు పెళ్ళిచూపులు వద్దన్నారు."
"ఓ...." కాస్సేపు అవతలి నుంచి నిశ్శబ్దం.
"ఓకే మీటింగ్ అవగానే నీకు కాల్ చేసి వస్తాను సరేనా?"
"ష్యూర్."
ఫోన్ పెట్టేసింది మాధవి.
అర్చన వస్తోంది. ఎంతో కాలానికి మళ్ళీ ఈ ఇంటికి అర్చన వస్తోంది.
ఈ విషయం వేణుకి చెప్పాలా? వద్దా?
చెబితే తప్పకుండా బాధపడతాడు. చూడాలనిపిస్తుంది. కలుసుకోవాలనిపిస్తుంది. కలుసుకోలేడు.నరకం కన్నా చెప్పకుండా ఉండడమే నయం.
మాధవి తిరిగి కిచెన్ లోకి వెళ్ళబోతుండగా చక్రవర్తి వచ్చాడు.
వస్తూనే హాల్లో బొమ్మలతో ఆడుకుంటున్న పాపతో కాస్సేపు కబుర్లు చెప్పి మధ్యలో 'హాయ్' అంటూ కళ్ళెగరేస్తూ భార్యని పలకరించాడు.
"అర్చన వస్తోంది."
మాధవి స్వరం చిన్న బాంబు పేల్చినట్టు వినిపించింది.
"అర్చనా!" విభ్రాంతిగా చూశాడు చక్రవర్తి. "ఇక్కడికా?"
"అంత ఆశ్చర్యపోతావేం? రేపు సి.ఎస్.గారి మీటింగ్ ఉందిట. అదయాక వస్తానంది."
"కానీ, ఎలా? మనింటికి వస్తుందా? తను కలెక్టర్!"
"అయితే అంతకన్నా ముందు నా ఫ్రెండ్" చిరాగ్గా అంది మాధవి.
"అంత చిరాకు దేనికోయ్! ఎంత ఫ్రెండ్ అయినా మనింటికి రావడం గ్రేట్ మంచిదోయ్ నీ ఫ్రెండ్."
"నాకన్నా ముందే నీకు ఫ్రెండ్" గుర్తుచేసింది మాధవి.
"అఫ్ కోర్స్" భుజాలెగరేశాడు.
"మరైతే రేపు స్పెషల్ ఏంటి?"
"దేనికి?"
"అదే డిన్నర్ కో, లంచ్ కో వస్తే కొంచెం స్పెషల్ చేయాలి కదా!"
అతని హడావుడి చూసి చిన్నగా నవ్వింది మాధవి. "నువ్వేం హడావుడి పడకు. తను ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చాక ఫ్రెండ్ గా ప్రేమని, కలెక్టర్ గా గౌరవాన్ని ఇచ్చి ఆదరిస్తాను సరేనా?"
చక్రవర్తి భార్య దగ్గరగా వచ్చి ఆమె చుబుకం పట్టుకుని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అన్నాడు "నాకు తెలుసు మధూ! నువ్వు గ్రేట్ లేడీవి. చాలామందిలో లేని ఎన్నో గుడ్ క్వాలిటీస్ నీకున్నాయి. ఐ లవ్ యూ" అన్నాడు.
మాధవి నవ్వి "ఐ టూ" అంటూ ఆని భుజం పట్టి త్సోతూ అంది "వెళ్ళి ఫ్రెషప్ అయి రా. డిన్నర్ రెడీ చేస్తాను."
"ఐధ నిమిషాల్లో వస్తాను. ఆకలిగా ఉంది" అంటూ బాత్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు.
మర్నాడు సాయంత్రం సుమారు ఆరున్నరకి ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్న మాధవి ఇంటిముందు ప్రభుత్వ వాహనం ఆగింది. మాధవి, చక్రవర్తి ఇద్దరూ పిల్లల్ని చెరో చేత్తో పట్టుకుని గేటు దగ్గరకు వచ్చారు,
లేతాకుపచ్చ రంగుకి నేవీ కలర్ బార్డర్ ఉన్న గద్వాల్ చీర కట్టుకుని ఠీవిగా కారు దిగింది అర్చన,
ఆమె కన్నా ముందే కారు దిగి తెల్లటి యూనిఫాంలో ఉన్న డ్రైవర్ డోర్ తీసి పట్టుకున్నాడు.
స్నేహితురాలి ఠీవి, దర్జా ప్రత్యక్షంగా చూస్తున్న మాధవి ఒక్కసారిగా పులకించిపోయింది.