Previous Page Next Page 
అర్చన పేజి 112


    "నువ్వు మెయిన్ టైన్ చేయలేదు."
    "నిజానికి అర్చనా! వేణు పాపం చాలా మంచివాడు. అతనిలోని బలహీనతని చూశావు గానీ, మంచితనం చూడలేదు. చూసి ఉంటే ఇంత నిర్దయగా విడాకులిచ్చేదానివి కాదు. ఏం ఇంత చదువుకున్నావు. సాంఘికంగా, ఆర్దికంగా ఎదిగావు. నీ తెలివితేటలు, నీ హోదా వేణులోని బలహీనతని క్షమించే ఔదార్యం నీకివ్వలేదా? ఇంకెందుకమ్మా నీకీ హోదా?"
    అర్చన అయోమయంగా చూసింది.
    "అంటే అతడిని క్షమిస్తేనే నేనీ హోదాకి అర్హత సంపాదించినట్టా?"
    "అలా కాదు. అతడిని క్షమించి ఉంటే నువ్వింకా ఎత్తుకు చేరేదానివి. నీ చదువులకి, నీ అంతస్తుకీ నీ సంస్కారం ఒక మెరుపునిచ్చేది."
    "అవునా!" అర్చన ఆలోచనలో పడింది. తను వేణుని ఇంకా ద్వేషిస్తోందా? అదేం లేదే! అతడిని క్షమించడం అంటే ఏంటి? తనేం చేయాలి? వెళ్ళి నిన్ను క్షమించాను వేణూ! అని చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అలా చెప్పినందువలన ప్రయోజనం ఏంటి? అలా చెప్పగానే తను తిరిగి వచ్చేసిందని వేణు అనుకుంటే.
    అసలు క్షమించడం అంటే ఏంటి? అతడిని ద్వేషించకపోవడం, తన పట్ల అతని దురుసు ప్రవర్తనకి అతనికే శిక్ష వేయకపోవడమే కదా! తనేం శిక్ష వేసింది. అతనికి తనేం శిక్ష వేయలేదే! తనకు తనే శిక్ష వేసుకుంది. తను అతడిని వదిలేసి రావడమే శిక్షా! అవునేమో!
    పాపం తన వలన వాళ్ళ కుటుంబం ఉన్న ఊళ్ళో తలెత్తుకోలేకపోయింది. వేణు జీవనమాధుర్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. కృష్ణస్వామిగారు చనిపోయారు. తాయారమ్మగారు అనారోగ్యంతో మంచం పట్టారు. అన్నిటికీ మించి బాబు. తన కొడుకు తల్లిలేనివాడయాడు. ఒక్కటి కాదు చాలా చాలా శిక్షలు పడ్డాయి వాళ్ళకి.
    కానీ, తనకి అమ్మా, నాన్నా, అన్నయ్యా దూరమయారు. కారణం తనే. వేణు కాదు. వేణుని దూరం చేసుకున్నందుకు వాళ్ళు తనని వెలేశారు. బహుశా వేణుతో బతికి ఉంటే అంతా తనని ఆదరించేవాళ్ళేమో! అంటే మనసు చంపుకుని, ఆత్మను చంపుకుని, వ్యక్తిత్వాన్ని చంపుకుని ఆడపిల్లలు భర్త అనేవాడితో అన్ని విధాలుగా రాజీపడి బతికితేనే బంధువులు, మిత్రులు అనబడే ఈ సమాజం ఆడదాన్ని ఆదరిస్తుందన్నమాట. ఎంత అన్యాయం? ఈ అన్యాయం గురించి నళిని, మాధవిలాంటి సాధారణ స్త్రీలకి విపులంగా తెలియజేయడం ఎలా? 
    నళిని స్వరం మళ్ళీ వినిపించింది. "నాకు తెలుసు, నా మాలు నీకు నచ్చలేదు. కానీ నే కోరేది ఏంటంటే నీ హోదా, అభిప్రాయాలు, భావాలు పక్కన పెట్టి ఒక విద్యావంతురాలైన స్త్రీగా, సంస్కారవంతురాలిగా ఆలోచించు చిన్న క్షమ నీ మనసుకి ఎంత తృప్తినిస్తుందో! మనం గుంపులో ఉంటాం. ఎవరో కాలు తొక్కుతారు. మనం బాధతో కెవ్వుమని అరిచి మనసులో వాళ్ళని గుడ్డివాళ్ళా? కళ్ళు కనిపించడం లేదా, ఇడియట్స్ అని తిట్టుకుంటాం. వాళ్ళు మనవైపు క్షమార్పణగా చూసి సారీ అండీ అంటారు. అప్పుడు ఏం అంటాం? నవ్వేసి ఊరుకుంటామా లేదా? అదే సంస్కారం. అలా కాకుండా మన మనసులో క్షణంలో కలిగిన భావాల తాలూకు భాష ఉపయోగించి తిడితే ఏం జరుగుతుంది? మాటా మాటా పెరుగుతుంది. ఉచితానుచితాలు, సభ్యతా, సంస్కారాలు, విచక్షణా జ్ఞానం అన్నీ కోల్పోతాం. అందరూ మనల్ని వింతగా చూస్తారు. ఇంటికొచ్చి ఆవేశం తగ్గించుకుని ఆలోచిస్తే ఛ పొరపాటు చేశాం. అందరిలో అలా ప్రవర్థించకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపపడతామా? లేదా?"
    "అది కేవలం ఒక చిన్న సంఘటన కానీ, ఒక రోజంతా మన మనసుని కలవరానికి, ఆందోళనకి గురిచేస్తుంది."
    నళిని మాటలు వింటోంటే కన్నతల్లి చల్ల చల్లగా మంధలిస్తున్నట్టు, తనకి తెలియని ఎన్నో విషయాలు కమ్మగా చేబుతునంట్టు అనిపించసాగింది అర్చనకి. అలాగే ఆమెవైపు కన్నార్పకుండా విభ్రాంతిగా చూడసాగింది.
    మళ్ళీ ఫోన్ మోగింది. అర్చన విసుగ్గా ఫోన్ తీసింది.
    అవతలినుంచి పి.ఏ. స్వరం "సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడమ్. సి.ఎస్.గారి ఫోన్."
    అర్చన కంగారుగా "యస్... యస్.... కనెక్ట్ చేయండి" అంది. ఆమె మొహంలో, స్వరంలో స్పష్టంగా ఉన్న కంగారు చూసి ఇంపార్టెంట్ ఫోన్ అనుకున్న నళిని చేతి వాచీ చూసుకుంది. మాటల్లో గమనించలేదు. తనొచ్చి అరగంట దాటింది. ఒక కలెక్టర్ దగ్గర ఆమె ఆఫీసులో ఇంతసేపు కూర్చోడం అంటే తను చాలా తప్పు చేసినట్టు అనిపించింది. ఎన్ని పనులుంటాయి వీళ్ళకి. ఛ అనుకుంటూ సోఫాలో పక్కనే పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ తీసి భుజాన వేసుకుంది. అర్చన "యస్ సర్, యస్ సర్" అంటూ ఎంతో నమ్రతగా అవతలి వాళ్ళ మాటలకి స్పందిస్తోంది. మూడు నిమిషాల తరువాత ఫోన్ పెట్టేసింది.
    నళిని మెల్లగా అంది "సారీ అర్చనా! చాలాసేపు కూర్చుని నీ పనికి ఆటంకం కలిగించాను. ఇంక వెళ్తాను."
    అర్చన లేస్తూ అంది. "ఓకే నళినీ! మళ్ళీ కలుద్దాం. నీ ఫోన్ నెంబర్ పి.ఏ.కి ఇచ్చి వెళ్ళు."
    "అలాగే! నా మాటలు నీకు బాధ కలిగిస్తే క్షమించు. కానీ, ఆలోచించడం మాత్రం మర్చిపోకు. వేణు చాప్టర్ ముగిసింది. ఇంకెవరినైనా పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను" అంది నళిని గది బైటకి నడుస్తూ.
    అర్చన తల పంకిస్తూ నవ్వింది. అలా నవ్వడంలోనే అనుభవజ్ఞురాలైన నళినికి అర్ధమైంది. ఈమె ఖచ్చితంగా ఆలోచిస్తుంది అనుకుంది.
    నళినిని పంపించాక మీటింగ్ లతో, కలవడానికి వచ్చిన కంట్రాక్టర్ల తో బిజీ అయిపోయింది అర్చన. కానీ, అస్పష్టంగా ఆమె మెదడులో నళిని మెట్ట మెత్తగా వేసిన మాటల తూటాలు చిటచిట పేలుతున్నట్టుగా మధ్య మద్యలో పరధ్యానంలోకి వెళ్ళిపోతూ తనను తాను సంబాళించుకుంటూ గడిపేసింది.
    
                                                        * * * * *

    సాయంత్రం ఆరు, ఆరున్నర మధ్య బైట ఉధృతంగా వర్షం కురుస్తోంది. మాధవి ఇటీవలే కొన్న కారులో తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి కౌశిక్ ని స్కూలునుంచి ట్యూషన్ కి, అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చి వాడికి స్నాక్స్, పాలు ఇచ్చింది. వాడు హోం వర్కు చేసుకుంటున్నాడు. పాప హాల్లో బొమ్మలతో ఆడుకుంటోంది.
    పిల్లలిద్దర్నీ బైటకి తీసుకువెళ్ళాలంటే బండి మీద ఇబ్బందిగా ఉందని చక్రవర్తి మాధవికి వేరే కారు కొనిచ్చాడు. ఆమె డ్రైవింగ్ స్కూల్లో చేరి డ్రైవింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రవర్తి కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండడం లేదు. ఆమె కోసం పనులన్నీ మానుకుని చక్రవర్తి పరుగులు పెడుతూ ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. బ్యాంకు అయిపోగానే కాస్సేపు స్నేహితులతో గడిపి తాపీగా వస్తున్నాడు.

 Previous Page Next Page