Previous Page Next Page 
అర్చన పేజి 111


    "కొన్ని నిర్ణయాలకు మార్పు అనివార్యం."
    "ఎంచేత?"
    "జీవితానికి సంబంధించినవి కాబట్టి."
    "అంటే వేణు తప్ప ఇంకెవరూ నాకు భర్తగా రారా?"
    "వస్తారు. కానీ  వాళ్ళు వేణు కారు."
    "ఏంటతని గొప్పతనం?"
    "ఏంటి అతని నేరం?"
    "అతను స్వార్ధపరుడు, నన్ను సాధించడమే తన ఆశయంగా పెట్టుకుని, నా కిష్టంలేకపోయినా నా బలహీన పరిస్థితులను అడ్డం పెట్టుకుని బలవంతంగా పెళ్ళిచేసుకున్నాడు. అంతే బలవంతంగా నన్ను అనుభవించాడు."
    ఆ మాటలు విన్న నళిని నిదానంగా అంది. "నువ్వింకా ఎదగాలి అర్చనా! యస్. యూ హావ్ టు."
    "ఎలా?"
    "చెప్తాను."
    అప్పుడే ఫోన్ మోగింది. అర్చన ఫోన్ అందుకుంది. యస్. అంది.
    అవతలినుంచి పి.ఏ. ఏదో చెప్పింది. "పావుగంటాగి కాల్ చేయమనండి" అంటూ ఫోన్ డిస్కనెక్ట్ చేసి నళిని వైపు చూసింది.
    నళిని అర్చనను నింపాదిగా చూస్తూ అడిగింది.
    "నీలో ఏ లోపం లేదని నువ్వు చెప్పగలవా? వేణు నిన్నేదో బలాత్కారం చేశాడని అనుకుంటున్నావు. ఏడాదిపాటు ప్రేమించిన అమ్మాయి, భార్య స్థానంలో తనకు అతి సమీపంగా తిరుగుతుంటే ముట్టుకోకుండా ఉండిగల శక్తి ఏ మగాడికుంటుంది? మగవాడి సంగతి వదిలేయ్. ఒక అమ్మాయి తనంటే ఇష్టం లేని వ్యక్తిని తనకిష్టమై పెళ్ళి చేసుకుని ఆ వ్యక్తి తనకి దూరంగా ఉంటుంటే ఎంత నరకం అనుభవిస్తుంది. ఒక్కసారి ఆలోచించు."
    "అర్చనా! ఈ కుర్చీలోంచి లేచి అలా గేటు బైటకి వచ్చాక నువ్వు కూడా ఒక మామూలు స్త్రీవి. అందరిలాగే నీకూ కొన్ని అనుభూతులు, కోరికలు, వాత్సల్యాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని జయించి బతుకుతున్నాం అని ఎవరైనా అనుకుంటే అది ఒక భ్రమ. అలా బతికేవాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. మనం సమాజంలో ఉన్నాం కదా!"
    "నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకర్ధం కావడంలేదు" నళిని మొహంలోకి గుచ్చి చూస్తూ అంది అర్చన.
    నళిని పల్చగా నవ్వింది.
    "అర్చనా! నీలో కలెక్టర్ కుండాల్సిన హుందాతనం, గాంభీర్యం బాగా వచ్చాయి. నిన్ను, నీ మొహంలోని భావాలను ఇప్పుడు చూస్తుంటే నాకు ఇఒంకో సందర్భం అయితే భయం వేసేది."
    అర్చన ఆ మాటలకి అలవారంగా నవ్వుతూ అంది "సారీ, నేను కలెక్టర్ గా మాట్లాడటం లేదు. నీ ఫ్రెండ్ గానే మాట్లాడుతున్నాను."
    నళిని బలవంతంగా నవ్వి, కాస్సేపు అర్చన కుర్చీ వెనకాల గోడకి ఆనించబడిన గాంధీ మహాత్ముడి ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత మెల్లిగా అంది "మన నాయకులు, అధికారులు గాంధీతత్వాన్ని గౌరవించడం మానేసి హింసాత్మక సమాజాన్ని ఇచ్చారు. అలాగే ధర్మం, న్యాయం, నీతి అనేవి జల్లెడ పట్టి వెతికినా కనిపించని మనుషులున్న సమాజం ఇది. కానీ, గాంధీ ఫోటోని, ధర్మ చక్రాన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా తీసేయలేదు. ఎంత ఆత్మవంచన కదా!"
    అర్చన ఆమె మాటలకి వింతగా తలతిప్పింది. ఆమెతో పాటు రివాల్వింగ్ చైర్ గిర్రున తిరిగింది. గాంధీ ఫోటో చూసింది. తనెప్పుడూ గమనించలేదు. పెద్ద ఫోటో. ఆమె అప్పుడే తన ఛాంబర్ ని మొదటిసారిగా పరికిస్తున్నట్టుగా చూసింది. విశాలమైన టేబుల్ మీద ఓ పక్క చిన్న జాతీయ పతాకం, మరో పక్క మూడు సింహాల బొమ్మ, ప్రభుత్వాధికరి ఛాంబర్ లో ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి.
    ఇవన్నీ దేనికి? నీతికీ, న్యాయానికీ, ధర్మానికీ కట్టుబడి ఉండమని చెప్పడం కోసం కదా! నిజానికి నళిని అన్నట్టు ఎవరు కట్టుబడి ఉంటున్నారు? లంచం తీసుకోని అధికారులున్నారా? ధర్మంగా పాలించే నాయకులున్నారా? అహింసాయుత సమాజం కోసం కృషి చేస్తున్నవాళ్ళు ఎవరున్నారు?
    నళిని స్వరం వినిపించింది. "నేనిక్కడ ఇంతసేపు కూర్చుని నీ సమయం పాడుచేస్తున్నానేమో! నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో? నేనింక వెళ్తాను అర్చనా!"
    "నో, నో అదేం లేదు. పనులుంటే తరవాత చేసుకుంటాను. ఎంతో కాలానికి కలిసిన ప్రాణస్నేహితురాలివి. నీతో కాస్సేపు గడపడం వలన కొంపలంటుకుపోయిందేం లేదు నళినీ! ఇంతకీ నువ్వేదో చెబుతూ ఆపేశావు. చెప్పు ఏం చెప్పాలనుకున్నావు?"
    నళిని తలాడిస్తూ అంది "ఏం లేదులే అర్చనా! నీకు తెలియదా ఏంటి? మరీ చిన్నపిల్లను చేసి మాట్లాడుతున్నాను అనిపించింది."
    అర్చన కొంచెం ముందుకు వంగి నళిని చేయి తన చేతిలోకి తీసుకుని అంది. "మాట్లాడు చెప్పు. నేనేం అనుకోను. ఆలోచించే విషయం ఉంటే ఆలోచిస్తా. లేదంటే మర్చిపోతా."
    నళిని అర్చన కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది. అంతులేని విశ్వాసం కనిపిస్తోంది.
    "చెప్పు నళినీ!" అంది.
    "చెప్పడానికేం ఉంది అర్చనా!" నిట్టూరుస్తూ అంది నళిని.
    "అర్చనా! ఆశలు, ఆశయాలు ఉండడం వేరు. అవి తీర్చుకునే అవకాశం ఉన్నవాళ్లు తీర్చుకుంటారు. లేనివాళ్ళు తీర్చుకోరు. రాజీపడతారు. అలాగే బలహీనతలు అందరికీ ఉంటాయి. వాటిని కొందరు జయిస్తారు. కొందరు ఓడిపోతారు. ఓడిపోయాక పశ్చాత్తాపడతారు."
    "వేణు పశ్చాత్తాపపడలేదంటావా? అతనిలో కలిగిన మానసిక పరిణితిని నువ్వు గమనించేందుకు ప్రయత్నించావా? నీ అహం దెబ్బతింది. దూరంగా వచ్చేశావు. వచ్చేశావు కాబట్టి, అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వనుకున్నది సాధించావు. ఉజ్వలమైన స్థితిని చేరుకున్నావు. కానీ.."
    అర్చన తలెత్తి చూసింది.
    "నీకు తెలసా? నువ్వు చేరుకోవాల్సిన గమ్యం చేరుకోలేదు."    
    భృకుటి ముడివేసి అర్దవంతంగా చూసింది అర్చన, అంటే...?
    "అంటేనా? భర్తతో సంసారం చేస్తూ, పిల్లా, పాపలతో బతికే స్త్రీకి, నీలా ఏదో సాధించేశానని పెళ్ళి వద్దనుకుని ఒంటరిగా బతికే స్త్రీకి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఎంత అందగత్తెవైనా అనుభవించాల్సిన జీవితం అనుభవించకపోతే నీ అందం వాడిపోయిన పూవులా ఉంటుంది తెలుసా?"
    "నీ ఉద్దేశం?"
    "నన్ను చూడు. నేను వయసులో ఉండగా నాకు వివాహం మీద ఆసక్తి కలగలేదు. ఒకవేళ కలిగి ఉంటే అందంగా లేకపోయినా, వయసు ఇచ్చిన మెరుపు చూసైనా ఎవరో ఒకళ్ళు పెళ్ళి చేసుకునేవాళ్ళు. కానీ పెళ్ళి చేసుకోలేకపోయాను. సంసారజీవితం గడపలేకపోయాను. చూశావుగా నలభై ఐదేళ్ళకే అరవై ఏళ్ల దానిలా అయాను."

 Previous Page Next Page