Previous Page Next Page 
అర్చన పేజి 110


    "నేనంటే అనామకురాలిని. నా ఫోన్, చిరునామా లేకపోతే కలవడం అసాధ్యం. కానీ నువ్వలా కాదుగా! న్యూస్ పేపర్ లో నువ్వు ఛార్జ్ తీసుకున్నావన్న వార్త, నీ ఫోటో చూడగానే అనుకున్నాను వెంటనే రావాలని. కానీ, కొంచెం ఆరోగ్యం బాగోలేక రాలేకపోయాను."
    అర్చన ఆమెవైపు తేరిపార చూసింది. "అవునేంటి నళినీ! ఇలా అయిపోయావేంటి?"
    నళిని నవ్వింది. ఆమె నవ్వులో కాంతి లేదు. మొహం కూడా జీవం లేనట్టుగా ఉంది. జుట్టు నలుపు, తెలుపు మిశ్రమంతో నిర్జీవంగా ఉంది. నేత చీర కట్టుకుని, బలవంతంగా వృద్ధాప్యం మోస్తున్నదానిలా ఉంది.
    "వయసు పెరుగుతోందిగా అర్చనా!" అంది పేలవంగా నవ్వుతూ.
    "ఏమంత వయసుందని నీకు. యాభైకి చేరావా? నీ వయసులో ఇంకా గ్లామరస్ గా ఉండాలని తపించేవాళ్ళు ఎంతమందున్నారో తెలుసా?"
    "అది వాళ్ళ అదృష్టం వదిలెయ్. ఏంటి ఎలా ఉన్నావు? అన్నట్టు మర్చిపోయాను. ఒక్కనిమిషం" అంటూ భుజాన వేలాడుతున్న హాండ్ బ్యాగ్ తీసి అందులోంచి చిన్న పెట్టి తీసిస్తూ అంది "కంగ్రాచ్యులేషన్స్. అనుకున్నది సాధించావు."
    "థాంక్యూ....థాంక్స్ ఎలాట్...ఏంటిది?" అంటూ అట్టపెట్టెకున్న గిఫ్ట్ రేపర్ తీసి, పెట్టిలోంచి వెండి సరస్వతీదేవి బొమ్మ తీసింది. "వావ్ బ్యూటీఫుల్. థాంక్యూ!" అంటూ అక్కడే ఉన్న టీపాయ్ మీద పెట్టింది బొమ్మ.
    "సరస్వాతీ పుత్రికవు కదా! అందుకే ఇది తెచ్చాను" అంది నళిని.
    అర్చన నవ్వింది. ఆ నవ్వులో ఎంతో ఆనందం, తృప్తి గమనించింది నళిని.
    "ఏంటి సంగతులు నళినీ?" అడిగింది అర్చన.
    "చెప్పు అర్చనా! నీ సంగతులేంటి? ఎలా ఆంది నీ ఉద్యోగం, నీ అనుభవాలేంటి?"
    "ఓ.. చాలా ఉన్నాయి. అవన్నీ వదిలేయ్. ఇంతకీ ఆవిడ పూర్ణమ్మగారు ఎలా ఉన్నారు? నేనోసారి ఆవిడ్ని కలవాలనుకుంటున్నాను."
    "ఆవిడ పోయారు అర్చనా! హార్ట్ ఎటాక్."
    "వాట్" అర్చన కీచుగా అరిచింది. "పోయారా? ఎప్పుడు?"
    "రెండేళ్ళయింది. అవునూ నీకు తెలుసా?"
    "ఏంటి?"
    నళిని ఆమె మొహంలోకి అనుమానంగా చూసింది. ఈమెకి తన తల్లి పోయినట్టు తెలుసా? పేపర్ రోజూ చూస్తుంటుంది కదా! తెలియకుండా ఉంటుందా? చెప్పాలా వద్దా?
    "ఏంటి నళినీ! అలా చూస్తున్నావు?" అభిమానంగా అడిగింది అర్చన.
    "అర్చనా! మరి.. మరి మీ అమ్మగారు పోయారు తెలుసా?"
    అర్చన కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. తలాడిస్తూ అంది "తెలుసు. మా వదిన నాకు ఇదే ఆఫీస్ కి లెటర్ రాసింది. నేను జాయిన్ అయిన  రెండో రోజే వచ్చిందా లెటర్."
    "ఆవిడకి నువ్వెలా తెలుసు? ఐ మీన్ ఈ అర్చన తన ఆడబిడ్డ అనీ" చిత్రంగా చూసింది నళిని.
    "ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఉంది కదా! అందులో చూసిందట. చాలా పెద్ద ఉత్తరం రాసింది. మా అన్నయ్య తాగుడికి బాగా అలవాటుపడ్డాట్ట. శాడిస్టుట. మా వదిన్ని చిత్రహింసలు పెడుతున్నాట్ట. అమ్మని కూడా నాన్న పోయాక చాలా బాధలు పెట్టాట్ట. అమ్మ చాలాసార్లు నా దగ్గరికి తీసుకెళ్లమని అడిగేదట. కానీ దాని పేరు ఎత్తినవాళ్ళని మర్డర్ చేసి జైలుకి వెళ్తాను అని బెదిరిస్తుండేవాడుట. వాళ్ళకి ఇద్దరు పిల్లలుట. చివరలో పాపం..." అలా అంటూండగానే అర్చన స్వరం దుఃఖంతో ఆగిపోయింది. సన్నగా ఏడుస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాలు.
    నళినిక్కూడా దుఃఖం వచ్చింది. అర్చన భుజం మీద చేయేసి ఓదార్పుగా నిమురుతూ ఉండిపోయింది కొన్ని క్షణాలు.
    "బాధపడకు అర్చనా! ఏంటో, మీ అన్నయ్య నీ మీద అకారణంగా అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడో?"
    "ద్వేషం కన్నా అసూయ ఎక్కువ నళినీ! అసూయ ద్వేషంగా మారింది. కాకపోతే మా వదినకి, పిల్లలకి నేనే ఏదన్నా సాయం చేయాలి. లేకపోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది."
    "అంటే ఏం చేస్తావు?"
    "చూస్తాను. తను లెటర్ లో అడ్రస్ ఇచ్చింది. వాళ్ళు పిఠాపురంలో ఉంటున్నారు, ఎలాగోలా వదిన్ని, పిల్లలనీ నా దగ్గరకు తీసుకు వచ్చేస్తాను. ఆవిడ కూడా అదే కోరింది."
    "మంచి నిర్ణయం అర్చనా!" మనస్ఫూర్తిగా అభినందించింది నళిని.
    "నా వాళ్ళేగా నళినీ! వాళ్ళు నన్ను కాదనుకున్నారేగానీ, నేనెప్పుడూ వాళ్ళని కాదనలేదు. ఇంత సంపాదిస్తున్నాను. ఇద్దరు పిల్లల్ని చదివించి వాళ్ళకి జీవితం ఇవ్వలేనా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు?"
    "అంటే నువ్వింక జీవితాంతం ఇలాగే ఉంటావా?"                        
    "మరెలా ఉంటాను?"
    "ఇంక వేణు దగ్గరికి వెళ్ళనా?"
    అర్చన మొహంలో భావాలు మారిపోయాయి. కొంచెం గంభీరంగా అంది. "ఈ మధ్యే విడాకులకి నాకు అంగీకారం అని లెటర్ పంపించాను."        "వాట్?" అదిరిపడి చూసింది నళిని. "లెటర్ పంపించావా?"
    "అంత ఆశ్చర్యపోతావేం నళినీ! మేము ఆల్ రెడీ విడిపోయే కదా ఉన్నాం. చట్టప్రకారం విడిపోతున్నాం అంతే!"
    "పొరపాటు చేశావు అర్చనా! చాలా పొరపాటు చేశావు."
    "పొరపాటు చేశావు అర్చనా! చాలా పొరపాటు చేశావు."
    "పొరపాటా?" ఆశ్చర్యంగా చూసింది అర్చన. "ఇందులో పొరపాటేం ఉంది? నా స్నేహితురాలు మాధవి చెప్పింది. నేను లీగల్ గా విడాకులిస్తే గానీ, అతను వేరే పెళ్ళి చేసుకోలేడు అని. నిజమే కదా! నేను వద్దు అనుకున్నప్పుడు అతడి సుఖానికి నేనెందుకు ఆటంకం కావాలి?"
    నళిని స్వరంలో సడన్ గా సీరియస్ నెస్ వచ్చింది. "ఏనాటికైనా అతడిని కలుస్తావనుకున్నాను అర్చనా! చాలా పొరపాటు చేశావు. అంత నిజాయితీగా నిన్ను ప్రేమించేవాడు నీకు దొరుకుతాడా చెప్పు!"
    "అదేంటి నళినీ! మళ్ళీ మొదటికి వస్తావేం? నేనింక అతడిని కలవడం అసంభవం అని చెప్పా కదా!"
    "ఆ రోజులు వేరు. అప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. చిన్నదానివి. ఇప్పుడు అన్ని రకాలుగా చాలా ఎదిగావు. ఇంకా అదే నిర్ణయంతో ఉన్నావని ఎలా అనుకుంటాను?"
    "నిర్ణయాలు క్షణం క్షణం మారతాయా నళినీ?"

 Previous Page Next Page