Previous Page Next Page 
అర్చన పేజి 109


    "లేదే! అప్పుడేనా? ఇప్పుడే చక్రవర్తి, కౌశిక్ బైటకి వెళ్ళారు. ఎనీ ఇంపార్టెంట్ న్యూస్?"
    "అర్చన వాళ్ళ మదర్ పోయారు."
    "అవునా! అరే... పేపర్లో వచ్చిందా?"
    "ఊ... నాకెందుకో అర్చనని చూడాలని ఉంది మాధవీ! పాపం తనకి ఎవరున్నారు ఇప్పుడు!?"        
    మాధవి చలించిపోయింది వేణు స్వరంలో వినిపిస్తున్న వేదనకి.
    "వేణూ!" విచలితంగా పిలిచింది.
    "అవును మాధవీ! ఒక్కసారి ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవా? ప్లీజ్."        
    "వేణూ!" మాధవి అభిమానం నిండిన స్వరంతో పిలిచింది. "నీదెంత సున్నితమైన మనసు వేణూ! నీకేం కాని అర్చన గురించి నీకెందుకింత కన్సర్న్?"
    "ఏం కాకపోవడం ఏంటి మాధవీ! ఆమె నా భార్య  ఇంకా నా భార్య కిందనే కన్సిడర్ చేస్తుంది కదా సమాజం."
    మాధవి మనసులో  గునపం దిగినట్లయింది. వేణు ఎంత ఆశాజీవి! అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపించిన విషయం వేణుకి చెప్పడం మర్చిపోయింది తను. తప్పు తనదే! చెప్పెయ్యాలి. ఇంక అర్చన అతనికేం కాదని చెప్పేయాలి.
    నెమ్మదిగా బరువుగా అంది "అర్చన విడాకులకి అభ్యంతరం లేదని లెటర్ పంపింది వేణూ! ఇంక అర్చన మనకేం కాదు."
    వేణు ఒక్కసారి తుళ్ళిపడ్డాడు. "పంపించిందా? ఎప్పుడు?"
    "నీలవేణి పెళ్ళికి ముందే నీకు చెప్పడం మర్చిపోయాను. నీ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సంతోషించాను."    
    వేణు చేతిలో రిసీవర్ జారిపోయింది.
    అవతలనుంచి మాధవి "హలో, హలో వేణూ..." అంటుంటే గాల్లో వినిపిస్తున్న ఆమె స్వరం కఠోరంగా అనిపించి గట్టిగా చెవులు మూసుకున్నాడు.
    నిస్తేజంగా అక్కడే ఉన్న కుర్చీలో వాలిపోయాడు.
    అర్చన ఇంక నాకేం కాదా?
    వేణుకి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది. ఇంతకాలం అస్పష్టంగా ఉన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తేటతెల్లంగా కనిపిస్తుంటే' ఆ వాస్తవాన్ని జీర్ణించుకోడానికి అతనికి ధైర్యం సరిపోనట్టు, అంతో ఇంతో మిగిలిన ఆశ సమూలంగా కొట్టుకుపోయినట్టు అనిపించి సర్వావయవాలు చచ్చుపడినట్టు అనిపించింది.
    అలాగే శూన్యంలోకి చూస్తూ కూలబడిపోయాడు.
    
                                                                     * * * * *

    అర్చన ఆరోజు ఉదయం ఆఫీసుకి రాగానే ఆమెకోసం ఎదురుచూస్తూ కూర్చుని ఉంది ఒక వృద్దురాలు.
    కారు దిగి వెనకాల ఫ్యూన్ అనుసరిస్తుంటే ఠీవిగా తన ఛాంబర్ లోకి వెళ్ళిపోయిన అర్చన ఆమెని గమనించలేదు.
    తన సీటులో కూర్చుని రిలాక్స్ అవుతుండగా ఫ్యూన్ వెనకాలే టిఫిన్ క్యారియర్, వాటర్ బాటిల్ తీసుకొచ్చి యాంటీ రూములో పెట్టాడు.తళతళలాడే గ్లాసులో మంచినేలెలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. అప్పటికే ఏసీ ఆన్ లో ఉందేమో గదంతా చల్లగా, మంచి పరిమళంతో నిండి ఉంది.
    ఫ్యూన్ బైటికి వెళ్ళిపోయాడు. పి.ఏ. లోపలికి వచ్చి "గుడ్ మార్నింగ్ మేడమ్!" అంది.
    "గుడ్ మార్నింగ్. ఏదన్నా ఇంపార్టెంట్ మాటర్ ఉందా? ఇవాళ ఎంగేజ్ మెంట్స్ ఏంటి?" అడిగింది అర్చన.
    "ఈవినింగ్ ఆర్ డి.వోలతో మీటింగ్ ఉంది. మూడు గంటలకి సి.ఎం.గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉంది."
    "ఓకే నెక్ట్స్."
    "మీ కోసం ఒక ఓల్డ్ లేడీ వచ్చి చాలా సేపట్నించీ వెయిట్ చేస్తున్నారు."
    "ఎవరు?"
    "తెలియదండి."
    "ఇప్పుడు టైం పదిన్నర. ఆఫీసు పదిన్నరకి తీస్తారు కదా! అంత త్వరగా ఎందుకొచ్చినట్టు ఆవిడ? అంటే విజిటర్స్ టైమింగ్స్ ప్రకారం అటెండ్ అవాలా?" సీరియస్ గా అడిగింది అర్చన.
    "అదికాదు మేడమ్! నేను చెప్పాను. ఆమె 'ఫర్వాలేదు. మేడమ్ ఎప్పుడొచ్చినా ఫర్లేదు. వెయిట్ చేస్తాను' అని కూర్చుంది."
    అర్చన కనుబొమలు ముడిపడ్డాయి. "ఎవరు ఆమె?" అడిగింది.
    "మీ ఫ్రెండ్ నని చెప్పారు."
    "నా ఫ్రెండా?" అర్చన అర్ధం కానట్టు చూసి, "పంపించండి లోపలికి" అంది.
    "అలాగే" అంటూ పి.ఏ. బైటకి వెళ్ళిపోయింది.
    తనకి ఫ్రెండ్స్ ఎవరున్నారబ్బా? అర్చన కనుబొమలు ముడిపడ్డాయి. ఆలోచిస్తూ లోపలికి రాబోయే ఆ స్త్రీ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.

                                                                          * * * * *

    "నమస్కారం మేడమ్" అంటూ లోపలికి వచ్చిన వృద్ధురాలిని చూడగానే అర్చన ఉలిక్కిపడింది. ఈమె.... ఈమె....!!    
    "న....ళి....నీ...." చివ్వున కుర్చీలోంచి లేచింది.
    ఆమెతో పాటే లోపలికి వచ్చిన పి. ఏ. వాళ్ళిద్దరినీ చూసి కలెక్టర్ గారికి కావలసినవాళ్ళు అనుకుంటూ వెంటనే బైటకి వెళ్ళిపోయింది.
    అర్చన తన పెద్ద టేబుల్ చుట్టూ తిరిగి నళిని దగ్గరగా వచ్చి ఆమెవైపే చూడసాగింది.
    నళిని కూడా చిరునవ్వుతో ఆమెవైపే చూస్తుండగా అప్రయత్నంగా అర్చన కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. చటుక్కున నళినిని కౌగలించుకుంది.
    ఎంతో కాలానికి కలిసిన ప్రాణస్నేహితురాళ్ళిద్దరూ కొద్దిసేపు సర్వం మరచిపోయి హృదయాలను హత్తుకుని తమ భావాలను పరస్పరం నివేదించుకుంటున్నట్టు అలా ఉండిపోయారు.
    అర్చన తేరుకుని ఆమెని వదిలి, చేయి పట్టుకుని తన విశ్రాంతి గదివైపు తీసుకుని వెళ్ళింది.
    సోఫాలో కూర్చోబెట్టి తనూ ఆమె పక్కనే కూర్చుని "ఎంతకాలమైంది నళినీ! నేను ఇక్కడికి వచ్చేముందు నీ ఫోన్ నెంబర్ కోసం చాలా వెతికాను. కనిపించలేదు. ఎంత బాధపడ్డానో తెలుసా? నిజంగా అయామ్ లక్కీ! నువ్వే రావడం, మనం కలుసుకోడం నేనసలు ఊహించలేదు."

 Previous Page Next Page