వేణు నిట్టూర్చాడు. "చేసుకుంటానమ్మా తప్పకుండా చేసుకుంటాను. కానీ నా బాధ ఒక్కటే ఈ కాలం ఆడపిల్లలు బాగా చదువుకున్నవాళ్ళు, స్వతంత్ర భావాలున్నవాళ్ళు, ఏవేవో కోరికలున్నవాళ్ళు. మా బ్యాంక్ లో బాచిలర్స్ కొందరున్నారు. వాళ్ళకి ముఫ్ఫై అయిదు, నలభై దాకా వయసుంది. ఇంతవరకూ పెళ్ళి కాలేదు. ప్రతి అమ్మాయి ఇంజనీరు, డాక్టరు కావాలంటున్నారు. గవర్నమెంటు ఆఫీసర్ సంబంధం అంటే గొప్పగా భావించే రోజులు పోయాయి. అందరికీ ఎన్.ఆర్.ఐలు కావాలి."
"అంటే?" ఆశ్చర్యంగా చూసిందావిడ.
అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తూ. అక్కడ ఇల్లూ, వాకిలీ ఏర్పరచుకున్నవాడు కావాలి.
"అలాగా! అదేం దిక్కుమాలిన కోరికలు, హాయిగా మనదేశంలో దర్జాగా బతక్క."
"లేదమ్మా! ఆ రోజులు పోయాయి. అందరికీ అమెరికానే కావాలి. పైగా వయసు కూడా వాళ్ళ కన్నా ఏడాది మాత్రమే ఎక్కువుండాలిట. మూడేళ్ళు ఎక్కువ ఉంటే వాడిని అంకుల్ అనేస్తున్నారు."
"తప్పు అంత చిన్నవాడిని చేసుకుంటే అమ్మాయిలు పురుళ్ళు, పుణ్యాలతో తొందరగా వయసెక్కువైనట్లు కనిపిస్తారు. మగాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. అందుకే కనీసం అయిదారేళ్ళన్నా పెద్దవాడు అయి ఉమ్డాలి. అయినా భర్త అనేవాడు తనకన్నా పెద్దవాడైతేనే హర్యని అర్ధం చేసుకుని అపురూపంగా చూసుకుంటాడు."
"అవన్నీ ఈ ఆలోచనలు. కాలం మారిపోయింది కదమ్మా!"
"అయిఘే నీ పెళ్ళి సంగతేంటిరా?" దిగులుగా అడిగింది.
"అవుతుందిలేమ్మా!" నవ్వాడు వేణు. 'నాకిప్పుడు ముఫ్ఫై రెండేగా. మాధవి యుద్ధప్రాతిపదికన సంబంధాలు చూస్తోందిలే!" అన్నాడు.
"ఏమోరా! నీ పెళ్ళి త్వరగా అయితే ఏడుకొండలవాడి దర్శనానికి వస్తానని మొక్కుకున్నాను. ఓసారి తిరుపతి వెళ్ళి కల్యాణం చేయిస్తే బాగుండు నీ పెళ్ళి అవుతుందేమో!?" అంది ఆవిడ.
"ఆయనకి కళ్యాణం చేయించాలన్నా నా పక్కన ఒక భార్య ఉండాలి కదమ్మా! రాములవారిలా బంగారు భార్యని పెట్టుకోలేనుగా!" అన్నాడు వేణు సరదాగా.
ఆవిడ బాధగా నిట్టూర్చి అంది "ఓ తుఫానులా వచ్చి కల్లోలం చేసి వెళ్ళింది ఆ అమ్మాయి. తను మాత్రం కలెక్టర్ అయిందటగా!?" కోపంగా అంది అర్చనని ఉద్దేశించి.
వేణు మొహంలో నవ్వు ఎగిరిపోయింది.
"అవునమ్మా! అనుకున్నది సాధించింది" అన్నాడు తిరిగి న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని.
"ఏం లాభం? కలెక్టర్ అయినా, మహారాణి అయినా భర్త, పిల్లలు లేనప్పుడు ఆ జీవితానికి విలువేముంది?"
"అట్లా అనకమ్మా! కలెక్టర్ హోదా ఎంత గొప్పది! మనలాంటి వాళ్ళం ఆమెతో ఐదు నిమిషాలు మాట్లాడడానికి గంటలు గంటలు
అపాయింట్ మెంట్ కోసం ఎదురుచూడాలి. అంతగా వెళ్ళినా వాళ్ళకి మనతో మాట్లాడే టైం కూడా ఉండదు. ఎన్ని పనులు? ఎంత గౌరవం! అడుగులకి మడుగులొత్తేవాళ్ళు ఎందరో! ఆ జీవితం వేరులేమ్మా! మొగుడికి వండిపెడుతూ, పిల్లల్ని కని. పెంచి పెద్ద చేసి, భర్త పెట్టే చిత్రహింసలు భరిస్తూ, చివరికి అనారోగ్యంతో మరణించే సాధారణ స్త్రీల జీవితం చాలా దయనీయం. అలాంటి స్థితినుంచి ఆ అమ్మాయిలు ఇంతగా ఎదగడాన్ని మనం హర్షించాలమ్మా."
"అ అమ్మాయి మరెవరో అయితే తప్పకుండా హర్షించేదాన్నిరా. కానీ ఆ అమ్మాయి వలన ఒక కుటుంబం చిందర వందర అయింది. తనని క్షమించే ఔదార్యం నీకున్నా నాకు లేదు" అంటూ ఆవిడా వేణు ఖాళీ చేసిన కాఫీగ్లాసు తీసుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది.
వేణు ఆవిడ వెళ్ళినవైపు నిర్విన్నుడై చూస్తూ, కొన్ని క్షణాల తరవాత పేపర్ లోకి దృష్టి మళ్ళించాడు.
అకస్మాత్తుగా అతని దృష్టి నిర్యాణం అని ఉన్న ఫోటో వైపు మళ్ళింది.
"అరె వీళ్ళు పోయారా?" షాక్ తగిలినట్టు అయాడు.
పాపం సావిత్రమ్మగారు పోయారు.
అర్చన తల్లి లేటెస్ట్ ఫోటో మొహాన బొట్టు లేదు. అంటే ఆయన కూడా పోయారన్నమాట.
"అర్చనకి తెలుసా?"
ఆమెని ఎంతో గారాబంగా చూసుకున్న తల్లి, తండ్రి.
ఇప్పుడు అర్చన పూర్తిగా అనాధ.
అమ్మ అన్నట్టు కలెక్టర్ అయినా భర్త అవసరం లేకపోవచ్చు కానీ, అర్చనకి తల్లీ తండ్రి కావాలి కదా! ఎవరికైనా అమ్మా, నాన్నా కావాల్సిందే. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినా అమ్మా, నాన్న అమ్మానాన్నే!
వేణుకి అర్చనని తల్చుకుంటే జాలేసింది.
ఇంక తను అనాధ అని తెలుసా ఆమెకి.
ఎందుకు తెలియకుండా ఉంటుంది? న్యూస్ పేపర్ చదువుతుంది కదా! వాళ్ళన్నయ్య సమాచారం పంపించి ఉంటాడు కదా! చివరి చూపులకి వెళ్ళి ఉండచ్చు.
పాపం వాళ్ళెంత మానసిక వేదన అనుభవించారో.
వేణుకెందుకో వాళ్ళ మీద మమకారం కలిగింది.
తను ఆ ఇంటిఅల్లుడు, తనేం చేయలేకపోయాడు.
కొడుకు చివరి రోజుల్లో ఎలా చూసుకుని ఉంటాడో? బాగా చూసుకున్నాడో లేదో? అసలే అహంభావి, మూర్ఖుడు.
వేణు మనసంతా బాధగా అయిపోయింది.
సోఫాలోంచి లేచి టి,వి. స్టాండ్ మీద పెట్టిన సెల్ తీసుకున్నాడు.
మాధవి నెంబర్ కి కలిపాడు.
మాధవి లైన్ లోకి వచ్సింది.
"మాధవి!" పిలిచాడు.
"గుడ్ మార్నింగ్ వేణూ! ఏంటి ఉదయాన్నే ఫోన్ చేశావు?"
"గుడ్ మార్నింగ్ మాధవీ! ఒక విధంగా బాద్ మార్నింగ్ కూడా!"
"ఏంటి ఏమైంది?" కంగారుగా అడిగింది.
"ఏం లేదు. ఒక బ్యాడ్ న్యూస్. పేపర్ చూశావా ఇవాళ?"