Previous Page Next Page 
అర్చన పేజి 107


    ఆమెకి కృతజ్ఞతలు చెప్పి వచ్చేసింది అర్చన,
    తిరిగి సామాను ప్యాక్ చేయించి. విశాఖపట్టణం రైలెక్కింది.
    అర్చన చార్జ్ తీసుకుంది. మళ్ళీ రొటీన్...పాత కలెక్టర్ ని రిలీవ్ చేయడం, కొత్త కలెక్టర్ స్వాగతం.
    కలెక్టర్ రాగానే ఎందరో వస్తారు కలుస్తాం అంటూ. వాళ్ళంతా స్వార్ధపరులే! వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం గౌరవం, అభిమానం, శ్రద్ధ ఒలకపోసేవాళ్ళే. లోకల్ లీడర్లు, రాజకీయాల్లో తిరిగేవాళ్ళు, కంట్రాక్టర్లు.
    వాళ్ళలో కనిపించే అతివినయం, అతి మర్యాద అర్చనకి చిరాకు.
    కానీ, ఆ చిరాకు బైట పడకుండా జాగ్రత్త పడాలి.
    ప్రవాహంలా వస్తున్న విజిటర్స్ తో విసుగొచ్చేసింది.
    పాత కలెక్టర్ చాలా మంచివాడు, ఆంధ్రుడు. పేరు విద్యాధర్. అతను కెమిస్ట్రీలో పి హెచ్.డి. చేశాడు.
    విద్యాధికుడు, సంస్కారవంతుడు, చక్కనివాడు. చూడగానే పాత సినిమాల్లో హీరోలైన హరనాథ్, శోభన్ బాబులాంటి అందగాళ్ళు గుర్తొస్తారు.
    "మీ గురించి విన్నాను అర్చనగారూ! మీరు చాలా డైనమిక్ అని తెలిసింది. కీప్ ఇట్ అప్. వీళ్ళంతా దొంగలు. మనకి ఈ స్వీట్లు, పూలదండలు, బొకేలు ఇవన్నీ ఇస్తున్నారంటే మనమీద అభిమానం అనుకోకండి. అఫ్ కోర్స్ మెకెఉ తెలిసే ఉండచ్చు. మనల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళు పంపించిన ప్రతి ఫైలూ మనం కళ్ళు మూసుకుని సైన్ చేసేస్తామన్న వెధవ నమ్మకంతోటి."
    అర్చన ఆ మాటకి నవ్వింది.
    "వీళ్ళని చూడగానే అర్ధం అవుతుంది సార్!" అంది.
    "ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ తీసేస్తారా?"
    "ష్యూర్."
    "మీకేం డౌట్స్ వచ్చినా, క్లారిఫికేషన్ కావాలన్నా కాంటాక్ట్ చేస్తుండండి. మీకో విషయం చెప్పాలి. మీ పర్సనల్ స్టాఫ్ ని కూడా ఎక్కువగా నమ్మకండి. మన దగ్గర నమ్మకంగా ఉంటూనే డబ్బుల కోసం అమ్ముడుపోతుంటారు. కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ జిరాక్స్ లు వెళ్ళిపోతుంటాయి. స్టెనో శ్వేత గుడ్ గర్ల్. ఆ అమ్మాయిని నమ్మచ్చు. నేను చెప్తాను. షి విల్ కోపరేట్."
    "థాంక్యూ విద్యాధర్ గారూ!" అని "మీ పేరు షార్ట్ చేయడం ఎలా?" అడిగింది అర్చన.
    అతను ఆలోచిస్తున్నట్టు ఒక్కక్షణం కళ్ళు మూసుకుని "విద్యా... ఈజిట్ ఓకె?" అన్నాడు.
    "యా!" నవ్వింది అర్చన.
    "ఓకె. మనం నైట్ డిన్నర్ చేద్దాం. మీ కభ్యంతరం లేదుగా."    
    "నాటెటాల్. తప్పకుండా చేద్దాం."
    ఆ తరువాత మరి కొంచెంసేపు కూర్చుని విద్యాధర్ వెళ్ళిపోయాడు.
    అర్చన విజిటర్స్ అందరూ వెళ్ళిపోయారని పి.ఏ. ద్వారా కన్ ఫర్మ్ చేసుకుని తన బంగళాకి బయలుదేరింది.
    బిళ్ళబంట్రోతు తెల్లటి యూనిఫామ్ లో అత్యంత వినయంగా ఛాంబర్ డోర్ తీసి పట్టికున్నాడు. ఆమె బైటకి రాగానే అక్కడ ఉన్న స్టాఫ్ కొందరు వినయంగా లేచి నిలబడ్డారు.
    పి.ఏ. ఆమె ఏమన్నా చెబుతుందేమోనన్నట్టు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.
    అర్చన చాంబర్ లోంచి బైటకి వచ్చి ఒక్కసారి తలతిప్పి చూసింది.
    'అర్చన, ఐ.ఏ.యస్, కలెక్టర్ తూర్పుగోదావరి జిల్లా' నేమ్ ప్లేట్ మెరుస్తోంది. ఆమె గుండె ఝల్లుమంది. అర్చనా శభాష్ అనుకుంది.
    ఛార్జ్ తీసుకునే ముందు లేని నేమ్ ప్లేట్, తీసుకుని బైటకి రాగానే కనిపించింది. అప్పుడే మార్చేశారన్నమాట.
    అప్పటిదాకా విద్యాధర్ అనే కలెక్టర్ తో ఇలాగే ఇదే వినయంతో ఉన్న వీళ్ళు కొత్త కలెక్టర్ ని అదే భావంతో చూడ్డానికి పెద్దగా మానసిక సంసిద్ధత అవసరం లేదన్నమాట. రొటీన్ ఉద్యోగం... రొటీన్.
    ఆమెను చూడగానే డ్రైవర్ మరెంతో వినయంగా కారు డోర్ తీసి పట్టుకున్నాడు.
    అర్చన ఠీవిగా కారెక్కింది.
    డ్రైవర్ పక్కన ఫ్యూన్ కూడా కూర్చున్నాడు. కారు కదిలింది.
    రాజు వెడలె రవితేజములలరగ, కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగ. 
    నవ్వుకుంది అర్చన.
    విశాఖపట్నం రోడ్లమీద ఆశ్రయం కోసం అన్వేషిస్తూ తిరిగిన అర్చన, మహారాణిలా ఏ.సి. కారులో దర్జాగా ఒక పెద్ద బంగళాకి తనదైన బంగళాకి బయలుదేరింది.

                                               * * * * *

    వేణు చాలాకాలం తరవాత ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు.
    తాయారమ్మ పనిమనిషి సహాయంతో వంట చేస్తోంది.
    తల్లి చేతుల్లోంచి కాఫీ కప్పు అందుకుని "కూర్చోమ్మా" అంటూ తన పక్కన సోఫాలో కూర్చోమన్నట్టు కొంచెం జరిగాడు.
    ఆవిడ కొడుకు పక్కన కూర్చుని అతను చదివేసి పక్కన చిందరవందరగా పడేసిన కొన్ని న్యూస్ పేపర్ లోని భాగాలు సరిగా పెడుతూ "నీలవేణి ఎలా ఉందో ఓసారి ఫోన్ చేయకపోయావా?" అంది.
    "చేశావమ్మా! వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఆ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అదృష్టవంతురాలు" అన్నాడు.
    "పోనీలే, మనం ఆ అమ్మాయిని చేరదీసి ఇంతకాలం ఉంచుకున్నందుకు మంచి సంబంధం చేశామన్న తృప్తి దక్కింది" నిట్టూర్చింది ఆవిడ.
    "నీ ఆరోగ్యం పూర్తిగా బాగుందామ్మా? నీకేం ప్రాబ్లం లేదు కదా!"    
    "ఏ లేదురా. కానీ ఎంతైనా వచ్చే వయసే కానీ, పోయే వయసు కాదుగా? ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం."
    "అలా అనకమ్మా! నాకు భయం వేస్తుంది" కలవరంగా అన్నాడు వేణు.
    "భయం దేనికిరా? ప్రకృతి సహజం కదా నాయనా! అన్నిటికీ మానసికంగా సంసిద్ధంగా ఉండాలి" ఆప్యాయంగా కొడుకు చేయి చేతిలోకి తీసుకుని నిమిరింది.
    "వేణూ! నీ మీద కాస్త శ్రద్ధ పెట్టరా! మంచి అమ్మాయి లభిస్తే పెళ్ళి చేసుకో నాన్నా! నాకు రిత్విక్ ని చూస్తుంటే భయంగా, దిగులుగా అనిపిస్తోంది. వాడికి తల్లి కావాలిరా!" అంది ఆవేదన మిళితం చేసిన స్వరంతో.

 Previous Page Next Page