Previous Page Next Page 
అర్చన పేజి 103


    వేణు జీవితం తన వలన నాశనం అయిందా? మొదటిసారిగా అర్చన మనసులో ఈ ఆలోచన కలిగింది. ఎంత పని జరిగింది? తను తన కోణం నుంచే ఆలోచించింది ఇంతకాలం. కానీ, వేణు స్థానంలో నిలబడి ఆలోచించలేదు. ఎందుకింత మూర్ఖురాలైంది? అయ్యో! తను ఎప్పుడో విడాకులిచ్చేసి ఉండాల్సింది. ఈపాటికి వేణు హాయిగా పిల్లా, పాపలతో కళకళ్ళాడుతూ ఉండేవాడు. ఒక స్నేహితుడిగా కూడా తను అతన్ని భావించలేకపోయిందా? స్నేహితుల బాగు కోరుకోడం సంస్కారం కదా! మాధవి ఇంతదూరం వచ్చి తనతో వ్యక్తిగత విషయాలు చర్చించడం వలన ఆమెకొచ్చిన లాభం ఏంటి? కేవలం స్నేహితుల శ్రేయస్సు కోరి అటు వేణుకి, ఇటు తనకి ఏదో మంచి చేయాలన్న తపన కదా! తనలో ఆ సంస్కారం, ఆ మానవత్వం కొరవడడానికి కారణం ఏంటి?
    ఛ తప్పు చేసింది. చాలా తప్పు చేసింది. దేవుడులాంటి కృష్ణస్వామిగారు పోయారా? ఎంత మంచి వ్యక్తి! అలాంటి వ్యక్తిని మళ్ళీ కలుసుకోలేదు. పాపం ఆవిడ తాయారమ్మగారు, పార్వతీదేవిలా కళకళ్ళాడుతుమ్డే ఆవిడ వదనం ఎలా ఉందో? అర్చనకి గుండె నిండా దుఃఖం పేరుకుంది. ఆవిడని చూడాలనిపించింది. బాబుని వాళ్ళు ఆదరించకపోయి ఉంటే తనకి మహాపాపం అంటేది. తనని పాపవిముక్తురాల్ని చేసిన ఆ పుణ్యదంపతులకి తనేం చేసింది?
    అర్చన అనూహ్యంగా మాధవి ఒడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
    అనుకోని ఆ సంఘటనకి బిత్తరపోయిన మాధవి కలవరంగా అడిగింది. "అర్చనా....అర్చనా! ఏం జరిగింది? నేను బాధపెట్టానా? సారీ అర్చనా! సారీ, ప్లీజ్ ఊరుకో."
    అర్చన కాదన్నట్టు తలాడిస్తూనే ఏడవసాగింది.
    కొద్ది నిమిషాలు అల ఏడుస్తూ ఉండిపోయిణ అర్చన నెమ్మదిగా లేచి "పద పడుకుందాం" అంది వెక్కుతూ.
    మాధవి మరేం మాట్లాడకుండా ఆమెని పొదివి పట్టుకుని లోపలికి నడిపించింది.
    మర్నాడు అర్చన దగ్గర సెలవు తీసుకుని మాధవి దంపతులు హైదరాబాదు బయలుదేరారు. బొట్టు పెట్టి పట్టుచీర ఇచ్చింది అర్చన మాధవికి. పిల్లలిద్దరికీ చెరో ఐదువేలు చెక్ ఇచ్చింది. మాధవి ఇంటి ఫోన్ నెంబరు, సెల్ నెంబరు తీసుకుంది.
    వాళ్ళు వెళ్ళాక భారమైన మనసుతో ఆఫీసుకి వెళ్ళిపోయింది.
    
                                                               * * * * *

    నీలవేణికి మరో సంబంధం చూశాడు వేణు.
    ఆ అబ్బాయి ఎయిర్ టెల్ మొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లీ, తండ్రి, ఇద్దరక్కలు ఉన్నారు. చాలా మామూలు కుటుంబం.
    నీలవేణిని చూడగానే కుటుంబ సభ్యులందరికీ అమ్మాయి నచ్చింది. ఆమె పేరున తను వేసిన ఫిక్స్ డ్ డిపాజిట్ వివరాలు చెప్పాడు వేణు. పెళ్ళి చేతనైనంతలో ఘనంగానే చేస్తానని మాట ఇచ్చాడు.
    కన్యాదానంలాంటి ఫార్మాలిటీస్ లేకుండా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి చేసి, గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తానన్నాడు.
    పెళ్ళికొడుక్కి సూటు, వాచీ, ఉంగరం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.
    నీలవేణి కూడా మౌనంగానే తన అంగీకారం తెలిపింది. ఆమెకిప్పుడు ఎప్పుడెప్పుడు ఈ ఇంటినుంచి వెళ్ళిపోవాలా అనే ఆరాటం మొదలైంది. శాశ్వతంగా తనీ ఇంట్లో ఉండడం అసంభవం. అమ్మగారు ఉన్నంతకాలం కనీసం ఒక పనిమనిషిగాఅయినా తనీ ఇంట్లో ఉండగలదు. ఆవిడకే
దన్నా అయితే తన పరిస్థితి ఏంటి? వేణుబాబుగారి పెళ్ళి అయితే వచ్చే ఆవిడ తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఖాయం. అప్పుడెక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి?
    అందుకే నీలవేణి తనని పెళ్ళిచేసుకోడానికి ఎవరు ముందుకు వచ్చినా అంగీకరించాలని నిర్ణయించుకుంది. వచ్చేవాడు కుంటివాడు అయినా, గుడ్డివాడు అయినా, వృద్దుడైనా తనకో నీడనిచ్చేవాడు అయితే చాలు. కానీ, దేవుడు దయతలచి ప్రస్తుతం వచ్చినవాడు బాగానే ఉన్నాడు. చాలు, ఈ మాత్రం చాలు.
    మాధవి చేత అడిగించాడు వేణు "ఆ అమ్మాయికిష్టమేనా తెలుసుకో మాధవీ" అంటూ.
    "మనస్ఫూర్తిగా చెప్పు వేణీ!" అని అడిగిన మాధవికి నవ్వుతూ చెప్పింది "ఇష్టమే అక్కా! వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించండి."
    మాధవి విస్తుబోయి చూసింది "ఎందుకు? ఏం జరిగింది? విసుగ్గా ఉందా ఇక్కడ!"
    "ఛీ అదేం లేదక్కా ఊరికినే మళ్ళీ ఈ సంబంధం కూడా తప్పిపోకుండా త్వరగా పెళ్ళయిపోతే బాగుంటుంది కదా!"    
    మాధవి నవ్విందే కానీ, ఆమెకెందుకో నీలవేణి మనసు గాయపడిందనిపించింది.
    వేణుతో చెప్పింది "ఆ అమ్మాయి ఒప్పుకుంది వేణూ! వీలైనంత త్వరగా ముహూర్తం పెట్టించు."
    వేణు "హమ్మయ్య" ని ఊపిరి పీల్చుకున్నాడు.
    ఆ తరువాత చకచకా మిగతా ఏర్పాట్లు చేశాడు వేణు. నెల ముందుగా రిజిస్ట్రార్ ఆఫీసులో అపాయింట్ మెంట్ తీసుకున్నాడు.
    ఈలోపల అర్చన మాధవికి వేణుతో తనకెలాంటి సంబంధం లేదని అతను ఎవర్ని వివాహం చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని లెటర్ పంపించింది.
    మాధవి మనసు కలుక్కుమన్నా, పోనీలే వేణు జీవితం సెటిల్ అయిపోతుందని ఊపిరి పీల్చుకుంది. నీలవేణి పెళ్ళి అయాక ఆ లెటర్ విషయం వేణుకి చెప్పచ్చులెమ్మని ఊరుకుంది.
    అంతకుముందు పెళ్ళికోసం కొన్న పట్టుచీరలు వాడలేదు కాబట్టి మళ్ళీ కొత్తచీరలు కొనే అవసరం రాలేదు. కాకపోతే మెదలోకి సూత్రం గొలుసు కొనమని మాధవికి డబ్బులిచ్చాడు వేణు.
    నీలవేణిని తీసుకుని వెళ్ళి ఆమెకి గొలుసు కొన్నది మాధవి.
    తాయారమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. అందుకు నీలవేణే కారణం. ఆమె తీసుకున్న శ్రద్ద, ఆమె చేసిన నిరంతరాయ సేవలు ఆవిడని మళ్ళీ మనిషిని చేశాయి. పూర్తిగా కాకపోయినా తన పనులు తను చేసుకోగలుగుతోంది. ఆ విషయంలో మాత్రం అందరూ నీలవేణి పట్ల కృతజ్ఞత ప్రదర్శించారు.    
    "నీ దయతోటే ఆవిడ మామూలు మనిషయారు వేణీ!" అంది మాధవి.
    "నా స్థానంలో ఎవరున్నా చేస్తారక్కా! నాదేం ఉంది" అంది నిర్లిప్తంగా నీలవేణి.
    "మామూలు ఆడపిల్లలు పెళ్ళి అంటే చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. నీ మొహం చూస్తుంటే నీకీ పెళ్ళి ఇష్టం లేదేమో అనిపిస్తోంది. నిజం చెప్పు వేణీ! మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా?"

 Previous Page Next Page