Previous Page Next Page 
అర్చన పేజి 102


    మాధవి మనసులో భావాలు గమనించిన అర్చన కుర్చీ కొంచెం మాధవికి దగ్గరగా జరుపుకుని ఆమె చేయి అందుకుని అంది "కోపం వచ్చింది కదూ! కానీ, ఒక్క క్షణం ఆ కోపం తగ్గించుకు ఆలోచించు. నాకేం బంధం ఉంది అతనితో నేనేం ఇష్టపడి అతని కోసం తపించి పెళ్ళిచేసుకుని కాపురం చేయలేదు కదా!" 
    "ఓ... మరి నువ్వు తపించినవాళ్ళేమయారు? ఎవడో ఊరూ, పేరూ లేనివాడిని ప్రేమించావు కదా! ఏమయాడతను?"
    అర్చన మొహం మ్లానమైంది. చప్పున మాధవి చేయి వదిలేసి మౌనంగా గాలికి కదుల్తున్న మొక్కలవైపు చూస్తూ ఉండిపోయింది.
    ఆమెనలా చూడగానే మాధవికి ఆమె మనసు గాయం చేశానని అనిపించింది. కొంచెం బాధగా "సారీ అర్చనా!" అంది.
    అర్చన వెంటనే స్పందించలేదు. అలా మౌనంగా, గంభీరంగా మొక్కలవైపు చూస్తూ ఉండిపోయింది.
    తరువాత నెమ్మదిగా అంది "మాధవీ! మంచి కలలు నిజం కావు. మళ్ళీ మళ్ళీ రావు. అతనొక మంచి కల. ఆ కల ఇదివరకు రోజూ గుర్తొచ్చేది. అది నిజం కావాలన్న ఆశా ఉండేది. ఆ వయసులో అది సహజం. నేనిప్పుడు ఎదిగాను. అన్నివిధాలుగా ఎదిగాను. ఎప్పుడన్నా ఒకసారి ఆ కల తల్చుకుంటానేగానీ, అది నిజం కావాలని నేను కోరుకోడం లేదు. అలా అని నిజం కాకూడదని ఆశించడం లేదు. కలని కలగానే స్వీకరించే మానసికస్థాయిని పొందగలిగాను. అలాగే వేణుతో పరిచయం, వేణుతో పెళ్ళి, అతనితో కలిసి ఒక ఇంట్లో కొంతకాలం జీవించడం, ఆ జీవితంలో నేనెలాంటి అనుభూతుల్ని పొందకపోడం, అతని బలాత్కారం, ఆ తరవాత బలవంతంగా మోసిన గర్భం. ఇదంతా వాస్తవం. ఈ వాస్తవం అబద్ధం అని నిరూపించాలని కూడా అనుకోడం లేదు. కాకపోతే నాకూ కొన్ని ఆశలు, ఆలోచనలు ఉన్నాయి. నాకో నిర్దిష్టమైన గమ్యం ఉంది. నేను ఆల్ మోస్ట్ నా గమ్యం చేరాను. ఇక్కడనుంచి నాకిస్గ్తంలేని, నన్ను నన్నుగా కాక నన్నో యంత్రంలా మార్చే సంసార జీవితంలోకి వెళ్ళాలని మాత్రం అనుకోవడం లేదు. బహుశా నీకు నేనో బండరాయిలా అనిపిస్తున్నానేమో! కొడుకు మీద దీనికి వాత్సల్యం లేదని అనుకుంటున్నావేమో! నా కొడుక్కి తన తల్లి బతికి ఉందని, ఆమె ఉన్నతస్థాయిలో ఉందని, ఆమె దగ్గర బతికితే ఉజ్వలమైన భవిష్యత్తు పొందచ్చని తెలియజేసి నా దగ్గరకు వాడిని ఎవరన్నా పంపగలిగితే నాకంతకన్నా ఆనందం లేదు. వాడినో మంచి పౌరుడిగా తీర్చిదిద్ది తల్లిగా నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. కానీ, వేణుతోటి, వాళ్ళ వాళ్ళతోటి దెబ్బలాడి బలవంతంగా వాడిని నా దగ్గరకు తెచ్చుకోవాలని మాత్రం అనుకోడం లేదు. అందుకు నాకు అర్హత లేదు. ఎందుకంటే ఒకరోజు అగమ్యంగా తిరుగుతూ వాడినేం చేయాలో తెలియక వాళ్ళ దగ్గర వదిలేశాను. ఇప్పుడు ఏ ధైర్యంతో వాడు నాక్కావాలని అడగను?"
    మాధవి ఆశ్చర్యంగా వినసాగింది. ఈమె అర్చనేనా? తనకు తెలిసిన అర్చనేనా? ఈమ మనసులో ఇన్ని భావాలున్నాయా? కొడుకు కావాలన్న కోరిక ఉందా? ఆ కోరికను గాంభీర్యం చాటున అణచి ఉంచిన ఈమె వ్యక్తిత్వాన్ని తానెలా అంచనా వేయగలదు?
    హఠాత్తుగా అంది "అలాంటప్పుడు విడాకుల ప్రసక్తి దేనికి? వేణుతో కలిసి ఉండచ్చుగా?"
    "పిల్లల కోసం జీవితాంతం ఇష్టంలేని భర్తను భరించే సాధారణ స్త్రీని కాదు కదా!"
    "ఏం పైనుంచి దిగివచ్చావా?" కసిగా అంది మాధవి.
    అర్చన మెత్తగా నవ్వింది "కోపం తెచ్చుకోకు మధూ! నాకు వేణు మీద కోపం, ద్వేషం లేదు. అలాగని భర్తగా ప్రేమించలేను. ఎలా కాపురం చేయను చెప్పు!"
    మరి జీవితాంతం ఇలాగే ఉంటావా?"
    "ఎందుకుంటాను? నన్ను అర్ధం చేసుకుని, నన్నుగా ప్రేమించి, నా ప్రేమను కూడా పొందగల వ్యక్తి తారసపడితే పెళ్ళి చేసుకుంటాను."        "మరి కొడుకు కావాలంటున్నావుగా! వాడిని ఆ వ్యక్తి ఆదరిస్తాడా?"
    "కొడుకు కావాలంటం లేదు. వస్తే ఆదరిస్తానంటున్నాను. అయినా నన్ను ప్రేమించి ఆదరించే వ్యక్తి లభిస్తే ఆ వ్యక్తికి నా కొడుకుని ఆదరించడంలో ఇబ్బందేం ఉంటుంది?"    
    "చాలా ఉంటుంది. నిన్ను చేసుకునేవాడు నీ డబ్బుకోసం, నీ అందం కోసం, నీ హోదా కోసం చేసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు నీ కొడుకుని ఆదరించడు."
    ఒక్కసారిగా ఉలిక్కిపడింది అర్చన. అంతేనా? తనని తానుగా స్వీకరించే వ్యక్తి లభించడా? మాధవి అనేది నిజమేనా? అలా అయితే తను ఎప్పటికీ పెళ్ళి చేసుకోదు. అలా అని ఈ ఒంటరి జీవితం ఇలా కొనసాగించడం కూడా ఇష్టం లేదు. ఏం చేయాలి? బాబుని తెచ్చేసుకుంటే... అవును తనకో తోడు, తన జీవితానికో అర్ధం ఉంటుందా? ఎవరికోసం ఈ సంపాదన, ఎవరికోసం ఈ ఆరాటం, ఈ పరుగులు? తనకంటూ ఎవరున్నారు? అమ్మా, నాన్న అన్నయ్య, అత్తగారు మావగారు!
    "ఇంతకీ పెద్ధవాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు?" అడిగింది అర్చన.
    "ఏ పెద్దవాళ్ళు?" సూటిగా చూసింది మాధవి.
    "అదేనే వేణు తల్లితండ్రులు!"
    "నీకు తెలియదా? పెద్దాయన పోయారు. ఆవిడ ఉన్నా లేనట్టుగా ఉన్నారు అనారోగ్యంతో. ఆ ఇల్లు స్మశానంలా ఉంది. నీలవేణి అని ఒకమ్మాయి తాయారమ్మగార్ని, బాబుని కనిపెట్టుకుని ఉంటోంది. ఆ అమ్మాయికి పెళ్ళి చేసి పంపించేయలన్నది వేణు భాద్యతగా భావిస్తున్నాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఆ ఇంట్లో దిక్కులేదు."
    "వేణు ఇంతకాలం పెళ్ళెందుకు చేసుకోలేదు?"
    "తెలిసి అడుగుతున్నావా? వేణు నిన్ను నిజంగా ప్రేమించాడు అర్చనా! అతన్ని పెళ్ళిచేసుకోడానికి ఒప్పించడానికి నేను చాలా కష్టపడ్డాను. అతను ఒప్పుకునేసరికి అమ్మాయిలంతా తెలివిమీరారు. విడాకులు తీసుకోకుండా చేసుకోం అంటున్నారు."
    "అయ్యో! అలాగా పాపం! నేను తప్పకుండా విడాకులిస్తాను మధూ! అతను బాగుండాలన్నదే నా కోరిక. చాలా సంతోషం."
    మళ్ళీ ఇద్దరి మధ్యా మాటలు ఆగిపోయాయి. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు చీకటి, వెలుగుల మిశ్రమన్ని చూస్తూ కూర్చున్నారు.

                                                                       * * * * *

 Previous Page Next Page