Previous Page Next Page 
అర్చన పేజి 104


    నీలవేణి సన్నగా నిట్టూర్చి అంది "నాకు పెళ్ళే అవుతుందో లేదో అనుకున్నాను.ఎవరో ఒకళ్ళు దయతో నన్ను చేసుకోడానికి ముందుకొచ్చారు. ఇంక ఇష్టం ప్రసక్తి దేనికక్కా?"
    "అలా అనకు. నీకిష్టం లేకుండా చేయడం మాకెవరికీ ఇష్టం లేదు."    
    "అదేం లేదక్కా! ఒకసారి సంబంధం తప్పిపోయింది కదా అని మనసులో భయం, గాభరాగా ఉంది."
    "ఆ పరిస్థితులు అవి. అలా అని ఎప్పుడూ అలాగే జరగదు. తెలిసిందా? పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా ఉండు" మృదువుగా మందలించింది మాధవి.
    ఆ తరువాత నీలవేణిలో కొంచెం మార్పు గమనించి ఊపిరి పీల్చుకుంది మాధవి.
    కాకపోతే నీలవేణి అత్తగారింటికి వెళ్ళిపోతే తాయారమ్మ బాధ్యత, రిత్విక్ బాధ్యత ఎవరు తీసుకుంటారు? రిత్విక్ కూడా బాగా అలవాటైపోయాడు నీలవేణికి. వాడు గొడవేం చేయడు కదా!
    అదే విషయం ఓ రోజు వేణుతో చర్చించింది మాధవి.
    "అలా అని ఆ అమ్మాయిని జీవితాంతం ఇక్కడ ఉంచుకోలేంగా మాధవీ! చూద్దాం ఇంకెవరన్నా మేడ్స్ దొరుకుతారేమో! అయితే సడన్ గా కాకుండా కొంచెం నేమందిగా కొంచెం నెమ్మదిగా రిత్విక్ ని డైవర్ట్ చేయాలి. అలా చేయాలంటే కొద్దిరోజులు నీలవేణి ఇంటికి వస్తూ పోతూ ఉండాలి" అన్నాడు వేణు.
    "వాళ్ళత్తగారితో మాట్లాడు వేణూ! పరిస్థితి వివరించు. వాళ్ళు మంచివాళ్ళు అర్ధం చేసుకుంటారనుకుంటాను."
    "నేనూ అదే ఆలోచిస్తున్నా. చూద్దాం. రేపు మాట్లాడతాలే" అన్నాడు వేణు తలపంకిస్తూ.
    మరునాడే వేణు సికింద్రాబాద్ వెళ్ళాడు బ్యాంక్ నుంచి.
    నీలవేణికి కాబోయే అత్తగారు వాళ్ళ ఇల్లు కూడా సికింద్రాబాదే అవడంతో కొంతకాలం పాటు అప్పుడప్పుడు వచ్చి తాయారమ్మని చూసుకోడానికి అనుమతిమ్మని అడిగాడు వేణు పెళ్ళికొడుకు తండ్రిని.
    ఆయన పెద్దమనసుతో "అదేంటండి. ఆ అమ్మాయి మీ అమ్మాయి. ఇంతకాలం ఆమెని ఆదరించి, ఆశ్రయం ఇచ్చి ఇప్పుడు పెళ్ళి చేస్తున్నారు. మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి" అన్నాడు.
    వేణు గుండెల మీద నుంచి బరువు దింపినట్టు అయింది. "థాంక్స్" చెప్పాడు.
    ఆగస్టు నెల పదకొండో తేదీ ఉదయం పదిగంటల పది నిమిషాల, ఇరవై సెకన్లకి రిజిస్ట్రార్ ఆఫీసులో నీలవేణి, శ్రావణ్ కుమార్ వేణు, తాయారమ్మ, మాధవి, చక్రవర్తి, శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు, అక్కల సమక్షంలో పూలదండలు మార్చుకున్నారు.
    వేణు, చక్రవర్తి సాక్షి సంతకాలు చేశారు.
    
                                                           * * * * *

    నీలవేణి తాయారమ్మ పాదాలమీద వాలిపోయింది. ఆమె కళ్ళనుంచి రాలిన కన్నీళ్ళు ఆవిడ పాదాలను అభిషేకించాయి. ఆవిడ బలహీనమైన చేతుల్తో ఆమెని లేవనెత్తి 'నిత్య సుమంగళిగా బతుకు' అంటూ దీవించింది.
    మాధవి నీలవేణిని ఆప్యాయంగా కౌగలించుకుని "కంగ్రాట్స్ వేణీ! మంచి గృహిణిగా పేరు తెచ్చుకో. అలా అని గృహహింసని మాత్రం భరించకు" అంది.
    "అలాంటివి మా ఇంట్లో ఉండవండి" అంది శ్రావణకుమార్ అక్కయ్య సరోజ.
    "నాకు తెలుసు. మీ స్వచ్చమైన మనసులే అందుకు సాక్ష్యం" అంది మాధవి నవ్వుతూ.
    ఆ తరవాత అందరూ కలిసి హోటల్లో లంచ్ చేసి ఇంటికి వచ్చాడు.
    ఆ సాయంత్రం రిసెప్షన్ ఇంట్లోనే ఏర్పాటు చేశాడు.
    ఇల్లంతా సీరియల్ బల్బులతో, పూలదండలతో డెకరేట్ చేయించాడు. కాటరింగ్ ఆర్డర్ చేశాడు.
    చాలా రోజుల తరువాత ఇల్లంతా కళకళ్ళాడింది. తాయారమ్మ పట్టుచీర కట్టుకుని అలా నట్టింట్లో కూర్చుని ఉంటే అందరి మనసులు ఆహ్లాదంగా మారాయి.
    రిసెప్షన్ సమయం దగ్గర పడుతుండగా అంది తాయారమ్మ "వేణీ బట్టలు, సామాను సర్దుకున్నావా?"
    ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి లేదన్నట్టుగా తలాడించింది.
    "వెళ్ళు, వెళ్ళు సర్దుకో. ఈ పనులన్నీ పక్కన పెట్టు. ఆనక వాళ్ళు తొందరపెడితే కంగారులో అన్నీ మర్చిపోతావు వెళ్ళు."
    "అలాగేనమ్మా!" ఆవిడ జావ తాగిన గిన్నె తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది.
    కొద్ది నిమిషాల తరువాత నీలవేణి తన గదిలోకి వెళ్ళి బట్టలు, సామాను సర్దుకోసాగింది.
    అలా సర్దుకుంటుంటే ఆమెకి కన్నీళ్ళాగలేదు. ఈ ఇంటితో తఃనకింక ఋణం తీరిపోయిందా?
    ఇకనుంచి తనీ ఇంటికి ఓ పరాయిదానిలా రావాలా? ఇంతకాలం ఎవరూ తనని పరాయిగా చూడలేదు. ఇకముందు తనకి ఈ ఇల్లు పరాయి ఇల్లు.
    గది మధ్యలో నిలబడి చుట్టూ కళ్ళతో తడిమి తడిమి చూసుకుంది.
    వెనక్కి తిరిగి తను నడిచి వచ్చే వరండా, మెట్లు చూసింది. బాల్కనీలోకి వచ్చి పెరట్లోకి చూసింది.
    ఈ మొక్కలన్నీ తను నాటినవే. తను పెంచినవే.
    రిత్విక్, కౌశిక్ ఆడుకుంటున్నారు.
    రిత్విక్ ని ఈ చేతుల్తో పెంచింది. వాడి ఉచ్చలు, పీతులు తీసింది. వాడు తన బట్టల మీద వాంతులు చేశాడు. అన్నీ ఆనందంగా భరించింది.
    ఇంక వాడితో తనకేం సంబంధం లేదా?
    అసలు తనెందుకు వేరేవాళ్ళని పెళ్ళిచేసుకోడానికి ఒప్పుకుంది?
    వేణు బాబునే పెళ్ళి చేసుకుని ఉంటే ఎంత బాగుండేది?
    "వేణీ!"
    మాధవి పిలుపుకి తుళ్ళిపడి కంగారుగా చూసింది. తన మనసులో కలిగిన ఆలోచన ఈమెకి తెలిసిందా?
    "ఏంటి? ఏం చేస్తున్నావు?" అడిగింది మాధవి ఆమెకి దగ్గరగా వస్తూ.
    "ఏం.... ఏం లేదక్కా! నా సామాను సర్దుకుంటున్నాను."
    "ఓ... బాధగా ఉందా?" ఆప్యాయంగా అడిగింది.
    నీలవేణికి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చింది.
    మాధవి కళ్ళు కూడా చెమర్చాయి. "ఏడవకు. వస్తూ ఉంటావుగా. ఇక్కడికి దగ్గరే మీ అత్తగారిల్లు."

 Previous Page Next Page