"ఎంతమందికి పంచమంటావేంటి?" అంటూ ఒక లడ్డూ తీసి కౌశిక్ కి ఇచ్చాడు చక్రవర్తి.
అప్పుడే బట్టలు మార్చుకుని వచ్చిన మాధవి అది చూసి "అంత లడ్డూ తింటే వాడిప్పుడు అన్నం తింటాడా? ఉండరా?" అంటూ వాడి చేతిలోంచి లడ్డూ లాక్కుని సగంలో సగం తుంచి ఇచ్చింది.
బిక్కమొహం వేసిన వాడితో నచ్చచెపుతున్నట్టుగా "అన్నం తిన్నాక మిగతాది ఇస్తాను సరేనా?" అంది.
వాడొక్కసారి అర్చనవైపు.చక్రవర్తివైపు చూసి మౌనంగా లడ్డు నోట్లో పెట్టుకున్నాడు.
అందరూ కూర్చుని టి.వి. చూస్తుంటే అర్చన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, తనకి ఎదురవుతున్న రకరకాల అనుభవాల గురించి, లోకల్ లీడర్లుగా పిలవబడే లోఫర్ల గురించి చెబుతుండగానే వంటమనిషి వచ్చి డిన్నర్ రెడీ అయిందని చెప్పడంతో అందరూ డైనింగ్ హాల్ వైపు కదిలారు.
రాత్రి పదకొండు దాటింది.
చక్రవర్తి, పిల్లలు అలసిపోయారేమో త్వరగానే పడుకున్నారు.
అర్చన, మాధవి లాన్ లోకి వచ్చారు. అందంగా, ఆహ్లాదంగా ఉంది. నలుపు తెలుపు రంగుల్లో గుంపులుగా కదులుతున్న మేఘాల మీద నెలవంక హొయలు పోతోంది. లైట్ల వెలుగులో ఫౌంటెన్ నుంచి పడుతున్న నీళ్ళు రంగులు మారుతున్నాయి. రకరకాల మొక్కల మీదినుంచి చల్లగాలి వీస్తోంది. స్లిప్పర్లు వదిలేసి మెత్తటి పచ్చిక మీద నడుస్తూ అంది మాధవి "ఇలా నడిస్తే మంచిదట కదా పాదాల ఆరోగ్యానికి."
"తెలియదు కానీ, అలా ఎప్పుడన్నా సరదాగా నడుస్తాను ఆ మెత్తదనం అనుభూతించడానికి. రా! ఇక్కడ కూర్చుందాం...." అంటూ గార్డెన్ చెయిర్స్ వైపు నడిచింది అర్చన.
ఆమెని అనుసరిస్తూ ముక్కుపీలుస్తూ అంది మాధవి "ఇక్కడెక్కడో నైట్ క్వీన్ ఉన్నట్టుంది. ఎక్కడా?"
"అటు... ఆ చివర గోడమీదికి పాకింది చూడు" కుడిచేత్తో చూపించింది అర్చన.
"చాలా బాగా మెయిన్ టైన్ చేస్తున్నారు గార్డెన్" అంది మాధవి కూర్చుంటూ.
అర్చన ఆవలించి నవ్వింది.
పల్చటి వెలుగు క్రీనీడలా ఆమె చెంపమీద పడుతోంది. "బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో హీరోయిన్ లా ఉన్నావు" అంది మాధవి ఆమెని చూస్తూ.
నవ్వింది అర్చన "వాళ్ళ అందాలు చూడ్డానికే ఆ సినిమాలు చూస్తాను."
"నీకు సినిమాలు చూసే టైం ఉంటుందా?"
"అప్పుడప్పుడు డివిడిలు పెట్టుకుని ల్యాప్ టాప్ లో చూస్తుంటాను. కారులో లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడో, రాత్రిపూట నిద్రపట్టనప్పుడో..."
మాధవి నవ్వి మౌనంగా పరిసరాలను చూస్తూ ఆలోచించసాగింది. ఆమెకి అర్చనతో తాను మాట్లాడాలనుకున్న విషయం ఎలా ప్రారంభించాలో అర్ధం కాలేదు. అర్చన ఎలా స్వీకరిస్తుందో కూడా తెలియడం లేదు. కానీ, ఇదే ఆఖరి అవకాశం. ఇప్పుడు మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దపోతే ఇంకా ఆ జీవితాలంతే...ఈ జీవితం ఇంతే!
"ఏంటి మధూ! ఏం ఆలోచిస్తున్నావు? నిద్రొస్తోందా?" మృదువుగా అడిగింది అర్చన.
"నిద్ర రోజూ పోవచ్చు. ఇంత అపురూపమైన క్షణాలు మళ్ళీ వస్తాయా అర్చనా?"
అవునన్నట్టు తలాడించింది అర్చన.
"అర్చనా!" నెమ్మదిగా పిలిచింది మాధవి.
అర్చన ఆమెవైపు చిరునవ్వుతో చూసింది.
"నీతో మాట్లాడాలి."
"మాట్లాడు."
"ఏం ఆలోచించావు?"
"దేని గురించి?"
"నీ భవిష్యత్తు... నీ కొడుకు భవిష్యత్తు..."
"నా భవిష్యత్తు ఆలోచించడానికేం ఉంది? నా బిజీ లైఫ్ లో ఆలోచించే సమయం నాకు లేదు. ఇకపోతే నా కొడుకు. నాకో కొడుకున్నాడన్న విషయం నాకు చాలా తక్కువసార్లు గుర్తొస్తోంది. అది కూడా అప్పుడు పడిన ప్రసవవేదన, నేను భరించిన బరువు గుర్తొస్తేనే. వాడి భవిష్యత్తు చూసుకోడానికి వాడి తండ్రి ఉన్నాడుగా!"
"పోనీ...ఆ తండ్రి భవిష్యత్తు?"
"ఎవరో తండ్రి భవిష్యత్తు నేనెందుకు ఆలోచిస్తాను మాధవీ! నాకంత టైం లేదు."
మాధవికి చర్రున కోపం వచ్చింది. ఏంటీ ఈ మనిషి? ఈమెకి అనుభూతులు, అనుబంధాలు అంటూ ఏం లేవా? ఇంత యాంత్రికంగా బతకగలరా ఎవరైనా అనుకుంటూ కోపం తమాయించుకుంటూ అంది.
"అర్చనా! సూటిగా అడుగుతున్నాను చెప్పు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలి. నువ్విలా ముఫ్ఫై ఏళ్ళు దాటినా వైవాహిక జీవితాన్ని అనుభవించకపోతే త్వరగా ముసలిదానివవుతావు. పెళ్ళి సంగతన్నా ఆలోచించవా?"
"చెప్పాగా మధూ! నాకంత టైం లేదని."
"రెడిక్యులస్..." అసహనంగా అంది మాధవి.
అర్చన నవ్వింది.
"సరే వేణుకి విడాకులివ్వడానికి అభ్యంతరం లేదని, అతను మరో వివాహం చేసుకోడానికి అంగీకరిస్తున్నానని రాసివ్వు."
అర్చన చిత్రంగా చూసింది. "ఎందుకు?"
"ఎందుకేంటి? అతను మరో వివాహం చేసుకోవాలంటే మొదటి భార్యనుచి లీగల్ గా విడిపోకపోతే ఎవరు చేసుకుంటారు?"
"ఓ! అందుకా రాయబారం వచ్చావు. దానికోసం ఇంత దూరం రావాలా మధూ! ఈమెయిల్ చేసేదాన్ని కదా! దానికేం రేపే ఇచ్చేస్తాను. నాకీ ఆలోచనే రాలేదు. పాపం అతను వివాహం చేసుకోలేదా? తప్పకుండా ఇస్తాను."
ఎంత ఈజీగా అంటోంది.
విడాకులివ్వడం అంటే ఏ.టి.ఎమ్. నుంచి డబ్బులు తీసివ్వడంలా ఉంది ఈమెకి. అవునులే సంపాదిస్తోంది కదా!
మాధవి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. మొహం తిప్పుకుని అర్చన చూడకుండా మొహం మీద పడిన ముంగురులు సవరించుకున్నట్టుగా చిటికెనవేలితో కంటి చివరకు వచ్చిన నీటిబిందువు బైటకి జారకుండా తుడుచుకుంటూ అంది "నీ విశాలమైన మనసుకు థాంక్స్. అయితే డైవోర్స్ కి అంగీకరిస్తున్న వన్నమాట. నువ్వెప్పటికైనా మారతావనుకున్నాను. అవునులే నీ స్థాయికి వేణు ఏం తూగుతాడు?" కొంచెం కోపం, కొంచెం ఆవేదన, మరికొంచెం వ్యంగ్యం కలిసిన స్వరంతో అంది మాధవి.