చక్రవర్తి వాచీ చూసుకుంటూ అన్నాడు "పన్నెండు దాటింది. గుడి మూసేస్తారు కదా!"
అర్చన నవ్వింది. "ఫర్వాలేదు. మీకు బిఫోర్ లంచ్ దర్శనం చేసుకోవాలన్న సెంటి మెంటు ఉంటే చెప్పండి ఏర్పాట్లు చేస్తాను."
"లేదులే అర్చనా! మిట్టమధ్యాహ్నం పూజలు పద్ధతి కూడా కాదు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన ఏర్పాటు చేయగలవా?"
"ష్యూర్ అయితే సాయంత్రం దర్శనానికి వెళదాం. ముందు లంచ్ సంగతి చూద్దాం" అంటూ అక్కడే చేతులు కట్టుకుని నిలబడ్డ గుమాస్తా వైపు చూసింది.
"అలాగే మేడమ్! ఏ లోపల కాఫీ చెప్పమంటారా?"
అర్చన మాధవి వైపు చూసింది.
"అవును కాఫీ కావాలి" అంది మాధవి.
"మూడు కాఫీ, ఒక బోర్నవిటా" అంది అర్చన.
గుమాస్తా వెళ్ళిపోయాడు.
"ఇప్పుడు చెప్పండి. ఏంటి సంగతులు?" అడిగింది అర్చన.
"ఇప్పుడు మాకో పెద్ద సందేహం ఉంది. ముందది తీర్చండి" అన్నాడు చక్రవర్తి.
"చెప్పండి" అంది అర్చన.
"మిమ్మల్మి మీరు అనాలా ఇదివరకులా?" ఆగిపోయాడు.
"నేను మీతో ఇదివరకులా ఉన్నానా, వేరుగా ఉన్నానా గమనించి మీరెలా కావాలంటే అలా పిలవండి" అంది అర్చన.
అర్చన మానసికంగా ఎదిగింది అనుకుంది మాధవి.
"సర్లేగానీ, నువ్వు ఇక్కడికొచ్చి ఎంతకాలమైంది?" అడిగింది మాధవి.
"ఈ మధ్యేగా."
"ఎలా ఉంది ఇక్కడ? రాజమండ్రిలో వరదలు, తుఫాను చాలా అవస్థపడ్డావేమో కదా!"
"అది అవస్థ అనిపిస్తుంది కానీ, చాలా ఛాలెంజింగ్ సిట్యుయేషన్. మానసికంగా, శారీరకంగా అనుభవించిన ఎంతో టార్చర్ ఆ తరువాత పొందిన తృప్తితో ఎగిరిపోతుంది. ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేయడంలో ఎంత తృప్తి ఉందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా వృత్తిలో సేవాధర్మం ఉంది. అది నాకు చాలా నచ్చింది. అంతేకాదు, దుర్మార్గులతో ఆడుకునే అవకాశం కూడా ఉంది. అందుకు చాలా మానసిక స్థైర్యం కావాలి. అఫ్ కోర్స్ ఇప్పుడిప్పుడే నేను అందుకు ప్రిపేర్ అవుతున్నాను."
"కష్టం కదూ! అనుక్షణం మెంటల్ టార్చర్ భరించాలి."
"తప్పదు. అదే జాబ్ అంటే రొటీన్ గా ఆఫీస్ కొచ్చి ఫైల్స్ సంతకం చేసి, నెలయేసరికి జీతం తీసుకోడంలో ఏం ఉంది చెప్పు."
అర్చన మాటలకి అభినందనగా చూసింది మాధవి.
అర్చన పాపవైపు చూసి "పేరేం పెట్టావు?" అడిగింది.
"లక్షణమైన తెలుగు పేరు పెట్టాను అరుంధతి."
"అదేంటే అందరూ పేర్లకోసం ఇంటర్ నెట్ సెర్చ్ చేసి మరీ పెడుతోంటే నువ్వింత పాత పేరు పెట్టావేంటి?"
"ఇంటర్ నెట్ మొత్తం జల్లెడ పట్టి నాకు తెలిసినవాళ్ళు వాళ్ళమ్మాయికి పెట్టిన పేరేంటో తెలుసా?"
చెప్పమన్నట్టు ఆసక్తిగా చూసింది అర్చన.
"శ్రాద్ధవి."
ఫక్కున నవ్వింది అర్చన. "బాప్ రే! మీనింగ్ తెలుసా వాళ్ళకి?"
"బాగుందని పెట్టిందిట వాళ్ళమ్మ."
"ఓ గాడ్" నవ్వి నవ్వి అలసినట్టుగా అంది అర్చన.
ఆమె నవ్వుతో శృతి కలుపుతూ అన్నాడు చక్రవర్తి "వెర్రి వేయి విధాలు."
ఇంతలో గుమాస్తా కాఫీతో రావడంతో అర్చన అంచరికీ కాఫీలిచ్చి కౌశిక్ ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంది.
"బోర్నవిటా తాగుతావా? చల్లార్చి ఇవ్వనా?" అంటూ.
మాధవి కంగారుగా అంది "నేను పడతాలే. నీ చీరమీద పడుతుందేమో?"
అర్చన అవునన్నట్టు తలూపి కౌశిక్ ని వదిలింది.
* * * * *
అర్చన పరపతితో సీతారాముల దర్శనం సుఖంగా, ప్రశాంతంగా జరిగింది.
మాధవి భక్తిగా వేడుకుంది "అర్చనని, వేణుని కలుపు తండ్రీ! వాళ్ళ జీవితాలు ప్రశాంతంగా, హాయిగా సాగిపోనీ, నీలవేణి కి మంచి సంబంధం కుదరాలని దీవించు. నా పిల్లలనీ, నా భర్తనీ చల్లగా చూడు నాయనా!"
అర్చకస్వామి ఎంతో శ్రద్దగా మాధవి, చక్రవర్తి పేర్లు, గోత్రం, పిల్లల పేర్లు తెలుసుకుని అర్చన చేశాడు.
దగ్గరుండి తీర్ధ, ప్రసాడాలు ఇప్పించాడు అర్చన పి.ఏ.
అక్కడినుంచి పర్ణశాల, గోదావరి తీరం అన్నీ చూసి గెస్ట్ హౌస్ కి వచ్చేటప్పటికి ఎనిమిది అయింది.
అప్పటికే అర్చన ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయి విశ్రాంతిగా కూర్చుని టీవీలో వార్తలు చూస్తోంది.
లోపలికి అడుగుపెట్టిన మాధవిని, చక్రవర్తిని చూస్తూ చిరునవ్వుతో అడిగింది "దర్శనం బాగా జరిగిందా?"
"నువ్వున్నాక లోటేముంది?" మాధవి పాపాయిని అర్చన చేతికి అందించి బట్టలు మార్చుకోడానికి లోపలికి వెళ్ళిపోయింది.
"త్వరగా వచ్సినట్టున్నావే!" అన్నాడు చక్రవర్తి.
"ఆ...సాధారణంగా ఈ టైంకి వచ్చేస్తాను. ఏదన్నా కొంపలంటుకుపోయే పరిస్థితి వస్తే తప్ప లేట్ అవదు" అంది అర్చన పాపాయిని ముద్డుచేస్తూ. కౌశిక్ అలా నిలబడిపోయి టీవీ చూస్తుంటే అంది మళ్ళీ "వీడేంటి టివి పిచ్చోడా?"
"ఈ జనరేషన్ పిల్లలకి టీవీ, సెల్ ఫోన్, ఐ-పాడ్, టాబ్లెట్ ఇవేగా ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్స్. వాడిని బైటకెళ్ళి ఆడుకోరా అంటే కూడా వెళ్ళడు."
నవ్వింది అర్చన.
అప్పుడే పి.ఏ. వచ్చి లడ్డూల పాకెట్లు ఇచ్చాడు.
"అబ్బా ఎందుకిన్ని?" అన్నాడు చక్రవర్తి బరువైన ఆ పాకెట్ అందుకుంటూ.
పి.ఏ. అర్చన దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
"పంచిపెట్టుకోండి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చాక ప్రసాదాలు పంచడం అలవాటు కదా!" అంది అర్చన.