"ఎలా ఉన్నావు? మాట్లాడవేం?" అర్చన స్వరంలో ఆప్యాయతతో కూడిన అధికారం.
ఏకవచనంతో సంబోధించాలా, బహువచనం ఉపయోగించాలా? ఆలోచిస్తున్న మాధవికి ఆ స్వరం మొత్తం సందేహాలను పటాపంచలు చేసింది. గొంతు సవరించుకుంటూ అంది "అర్చనా బాగున్నావా?"
అర్చన స్వరంలో కూడా తడి వినిపించింది "ఏంటే ఎక్కడున్నావు? ఎక్కడినుంచి మాట్లాడుతున్నావు?"
"నేను బాగున్నాను అర్చనా! నువ్వెలా ఉన్నావు?"
"నాకేం బాగున్నాను. ఇంతకీ ఎక్కడినుంచి?"
మాధవి చెప్పింది "పాల్వంచలో ఉన్నాను. ఆలయం మెట్లమీద కూర్చుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు బయల్దేరి భద్రాచలం వస్తున్నాను. నిన్నెక్కడ ఎలా కలవాలి?"
"ఎలా వస్తున్నావు?"
"కారులో."
"ఓకే. నేను నిన్ను కలుస్తాను. నేరుగా టెంపుల్ దగ్గరకు రండి. నేనక్కడ మిమ్మల్ని పికప్ చేసుకోడానికి ఏర్పాట్లు చేస్తాను. నేను కూడా వస్తాను. చక్రవర్తిగారిలా ఉన్నారు? ఇంతకీ ఎవరెవరు వస్తున్నారు?"
"నేను, నా భర్త, పిల్లలు."
"పిల్లలా? అంటే..."
"పాపాయికి మూడునెల్లు."
'ఓ గుడ్! కంగ్రాట్స్" అర్చన స్వరంలో ఆనందం.
"థాంక్యూ ఇవాళ పనులేం పెట్టుకోకుండా ఫ్రీగా ఉంటావా?"
"మీరు వచ్చేలోపల ఒక మీటింగ్ ఉంది. అది అయిపోతుంది. ఆ తరువాత ఫ్రీ నీకోసం సరేనా?"
"థాంక్స్."
"ఓ.కె. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ."
"వస్తున్నాను."
"బై..." అర్చన ఫోన్ పెట్టేసింది.
మాధవి హాయిగా నిట్టూరుస్తూ చక్రవర్తివైపు చూసింది.
"ఎట్ లాస్ట్" అన్నాడు చక్రవర్తి నవ్వి.
"ఎంత ఫ్రెండ్ అయినా ఒక పెద్ద హోదాలో ఉంది కదా! కొంచెం టెన్షన్ పడ్డాను" అంది మాధవి పాపాయిని ఒళ్ళోకి తీసుకుంటూ. కౌశిక్ వాడిలో వాడు ఏదో షూట్ చేస్తున్నట్టు చేతులు తిప్పుతూ కనిపిస్తున్న చెట్లవైపు, మైదానం వైపు చూస్తూ ఆడుకుంటున్నాడు.
"ఆ విషయం నీ మొహం చూస్తూనే అర్ధం అయింది" అన్నాడు చక్రవర్తి.
"మేడమ్ గారి దగ్గర పర్సనల్ విషయాలుమాట్లాడడానికి కొంచెం ధైర్యం కావాలి. చూద్దాం" అంది మాధవి తల పంకిస్తూ.
"అనవసరంగా వాళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావేమో అనిపిస్తోంది" అన్నాడు చక్రవర్తి కొబ్బరిచిప్ప పగలకొట్టి ముక్క తింటూ.
"అదేంటండి అట్లా అంటారు. వాళ్ళు మనకున్న ఒకే ఒక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్. మనం వాళ్ళకి అంతకన్నా ఎక్కవ. ఆ ఇంట్లో పట్టించుకునేవాళ్ళు ఎవరున్నారు? వేణుని చూస్తుంటే జాలేయడం లేదూ?"
"వేణు నా స్నేహితుడు. ఎందుకుండదు జాలి? కానీ, ఏం చేయగలం?"
"ఏదన్నా చేయడానికి ప్రయత్నిద్దాం. సక్సెస్ అయితే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన సంతృప్తి దక్కుతుంది. లేదంటే ఏం చేయలేకపోయమంన్ ఆవేదన మిగులుతుంది. కానీ ప్రయత్నమే చేయలేక నామీద నాకే కోపం వస్తుంది."
చక్రవర్తి మాధవి వైపు అనురాగంగా చూశాడు. "నీదెంత మంచి మనసు మాధవి!" అన్నాడు.
మాధవి నవ్వింది. "పదండి వెడదాం" అంటూ పాపనెత్తుకుని లేస్తూ "అరే గాడిదా రా ఇటు" అంటూ అరిచింది మెట్లు దిగి కిందికి వెళ్ళిపోతున్న కౌశిక్ ని ఉద్దేశించి.
చక్రవర్తి కూడా లేచి గబగబా మెట్లు దిగి కౌశిక్ చేయందుకున్నాడు.
"మన భోజనం సంగతేంటి?" అడిగాడు మెట్లు దిగి తన పక్కగా వచ్చిన మాధవిని.
"అర్చన చూసుకుంటుంది" అంది.
"చెప్పానా?"
"ప్రత్యేకంగా చెప్పాలా?" అంటూ నవ్వి ఆఖరి మెట్టు దిగి, వెనక్కి తిరిగి చూస్తూ అంది "ఎంత హాయిగా, ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ. దేవుడు ఎక్కడున్నా దేవుడిగా! అంత హైరాన పడి కనురెప్పపాటులో చూసి రావడానికి తిరుపతి దాకా ఎందుకు వెళ్ళడం? మనం ప్రతి ఏడాదీ ఇక్కడికే రావచ్చు కదా!"
"వెంకటేశ్వరస్వామి వెలిసింది అక్కడ కదా!"
"ఎవరు చూశారు ఆ సంగతి. ఏమో లెండి. ఏ మహిమా లేకపోతే అంతంత ఆస్తులు ఎలా సంపాదించుకుంటాడాయన? పదండి" అంటూ కారు దగ్గరకి నడిచింది.
అందరూ కారేక్కగానే కారు స్టార్ట్ చేశాడు డైవర్.
భద్రాచలం చేసేసరికి గుడి ప్రధానం ద్వారం దగ్గరే అర్చన ఏర్పాటు చేసిన గుమాస్తా వాళ్ళకోసం ఎదురుచూస్తున్నాడు. మాధవి భద్రాచలంలోకి కారు ప్రవేశించగానే అర్చనకి ఫోన్ చేసి, కారు నెంబర్ చెప్పింది.
కారు నంబర్ చూసి కారు గుర్తుపట్టి ఎంతో మర్యాదగా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు గుమాస్తా.
నేరుగా గెస్ట్ హౌస్ కి వెళ్ళారు.
అక్కడ అర్చన ఎదురుచూస్తోంది.
ఏ.సి. గెస్ట్ హౌస్ విశాలంగా, నీటుగా ఆడంబరంగా ఉంది.
అర్చన అందంగా, హుందాగా ఖరీధైన ఉప్పాడ చీరలో వచ్చి మాధవిని కౌగలించుకుంది.
"సారీ చిన్న లెటర్ డిక్టేట్ చేయాల్సి వచ్చి స్టెనోనొ ఇకక్దికే రమ్మని ఇక్కడే ఉన్నాను. అందుకే మిమ్మల్ని రిసీవ్ చేసుకోడానికి రాలేదు" అంది.
"ఫర్వాలేదు. థాంక్స్ ఫర్ ద ఎరేంజ్ మెంట్" అంది మాధవి.
అర్చన మాధవి చేతుల్లోంచి పాపనందుకుని. చక్రవర్హిని చూస్తూ "ఎలా ఉన్నారు?" అంది,
చక్రవర్తిని నవ్వి "ఓ.కె." అన్నాడు.
"చెప్పండి దర్శనం ఇప్పుడు చేసుకుంటారా? సాయంకాలమా?"
మాధవి చక్రవర్తి వైపు చూసింది.