మాధవి ఆమె తలమీద చేయివేసి అంది "బాధపడకు నేనొచ్చాగా. అంతా సెటిల్ చేస్తాను. ఇంక నా కాన్సన్ ట్రేషన్ అంతా ఈ ఇంటిమీదే! పరిస్థితులు చక్కబడ్డాకే నా కాపురం సంగతి చూసుకుంటాను. సరేనా?" అంది.
నీలవేణి కళ్ళనీళ్ళతో తల ఊపింది.
ఆ తరువాత మాధవి మధ్యాహ్నం దాకా కూర్చుని కౌశిక్ ని స్కూలునుంచి తీసుకురావాలంతూ పాపని తీసుకుని వెళ్ళిపోయింది.
ఆ సాయంత్రం వేణు చక్రవర్తితో కలిసి ఇంటికి వచ్చాడు. అతడిని చూడగానే మానసికంగా ఎంత వేదన అనుభవిస్తున్నాడో అర్ధం అయింది మాధవికి. ఇదివరకటి కళ లేదు మోహంలో. చిక్కిపోయాడు. కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది. నువ్వు కూడా ఇదివరకులా పసిపాప నవ్వులా స్వచ్చంగా, హాయిగా లేదు. పేలవంగా నవ్వుతున్నాడు. అతడినలా చూడగానే మాధవికి ఏడుపొచ్చేసింది. తనలో తఃనే సర్దుకుంటూ మామూలుగా మాట్లాడింది. తాయారమ్మ ఆరోగ్య విషయాలు, ఆవిడ డాక్టర్ వివరాలు తెలుసుకుంది. నీలవేణి విషయం కూడా చర్చించింది. త్వరలోనే ఆమెకి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి పంపించే బాద్యత తనది అని అతనికి హామీ ఇచ్చింది.
మాధవిని చూడగానే సొంత చెల్లెల్ని చూసినంత ఆనందం అనిపించింది వేణుకి. మనసంతా తెలియని నిశ్చింతతో ఉండిపోయింది. పాపాయిని చూస్తూ అన్నాడు "నీ పోలికే మాధవీ పాప. అందంగా అవుతుంది."
"అంటే నేనందంగా లేనా?" సరదాగా అన్నాడు చక్రవర్తి.
"ఆ విషయం నా నోటితో ఎందుకురా చెప్పిస్తావు? వెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడు" అన్నాడు వేణు.
చక్రవర్తి మాధవి వైపు చూస్తూ అన్నాడు "విన్నావా? నీకు కోపం రావడం లేదా?"
"ఎందుకు కోపం ఉన్నమాటంటే?" చిలిపిగా నవ్వింది మాధవి.
"నీ ఉద్దేశం? నేనందంగా లేకపోతే ఎందుకు చేసుకున్నావు?"
"ఏదో రాసిపెట్టి ఉంద కదా తప్పుతుందా?"
మాధవి మాటలకి వేణు నవ్వుతూ అన్నాడు "నువ్వు ఎలా ఉన్నా, మాధవిలాంటి అమ్మాయి నీ భార్య కావడం మాత్రం నీ అదృష్టంరా."
"యస్. ఇట్స్ ట్రూ..." మనస్ఫూర్తిగా అన్నాడు చక్రవర్తి.
"సర్లే లేవండి. భోంచేద్దాం" అంది మాధవి.
ఆ రాత్రి అక్కడే చక్రవర్తితో, మాధవితో కలిసి డిన్నర్ చేసి ఇంటికెళ్ళాడు వేణు.
* * * * *
ఇదంతా జరిగిన పదిరోజులకి మాధవి చక్రవర్తిని ఒప్పించి, ఇన్నోవాలో పిల్లలని తీసుకుని భద్రాచలం బయలుదేరింది. వేణుని కూడా అడిగింది కానీ, వేణు రాననడంతో ఊరుకుంది.
కారు భద్రాచలం చేరుతుండగా మధ్యలో పాల్వంచలో ఆగి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని అక్కడినుంచి కలెక్టర్ ఆఫీసుకి ఫోన్ చేసింది. వచ్చేటప్పుడే ఫోన్ నెంబర్, మిగతా వివరాలన్నీ తెలుసుకుని డైరీలో రాసుకుంది మాధవి.
టెలిఫోన్ ఆపరేటర్ లైనులోకి రాగానే ఏమని అడగాలో అర్ధం కాలేదు.
అర్చన కలెక్టర్ మేడమ్ అనాలా? ఏమనాలి? కొంచెం ఆలోచిస్తూనే అర్చన ఉందా? అనడిగింది.
"అర్చనా! వన్ మినిట్" అంటూ "అర్చనా... అర్చనా నీకు ఫోన్" అంటూ ఆపరేటర్ గట్టిగా పిలిచింది.
మాధవికి అప్పుడనిపించింది. బహుశా తన అర్చనని కాదు అంత గట్టిగా అమర్యాదగా పిలిపించుకునే స్థాయిలో కాదుగా అర్చన ఉంది. ఇంతలో "హలో" ఎవరూ అంటూ ఓ స్వరం వినిపించడంతో మాధవి అసహనంగా అంది "ఆపరేటర్ కి ఇవ్వమ్మా ఫోను."
"ఎవరండి మీరు?" మళ్ళీ అడిగింది ఆ అమ్మాయి.
"నువ్వు ఆపరేటర్ కి ఇవ్వు ఫోను" విసుగ్గా అంది మాధవి.
"ఎవరో....క్రాక్" అంటూ ఆ అమ్మాయి ఆపరేటర్ కి ఫోన్ ఇస్తూ అన్నట్టుంది ఆ మాట వినిపించింది మాధవికి.
ఆపరేటర్ లైన్లోకి వచ్చి "హలో ఎవరు కావాలండీ మీకు?" అడిగింది.
మాధవి అంది "మీ కలెక్టర్ మేడమ్ అర్చనగారు కావాలి."
"ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడమ్ కావాలా? ఆమెకి ఇక్కడినుంచి ఇవ్వలేనండి. పేషీ నంబరు ఇస్తా రాసుకోండి" అంటూ పేషీ నెంబరు చెప్పింది.
"థాంక్స్" అంటూ ఊపిరి పీల్చుకుని పేషీకి చేసింది మాధవి.
అర్చన పి.ఏ. ఫోన్ తీసుకున్నాడు.
"మేడమ్ ఉన్నారా?" అడిగింది మాధవి మర్యాదగా.
"మీరెవరు?" అడిగాడతను.
మాధవి కొన్ని క్షణాలు సందేహించి చెప్పింది "ఆవిడ ఫ్రెండ్ ని. నా పేరు మాధవి."
"లైన్లో ఉండండి" అంటూ కొన్ని క్షణాల తరువాత "మాట్లాడండి" అంటూ కట్ చేశాడు.
అవతలి నుంచి అర్చన మృదుమధుర స్వరం వినిపించింది. "హలో అర్చనా హియర్."
మాధవి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది. ఆ రోజు తిరుపతిలో కలిశాక మళ్ళీ కలవలేదు. మాట్లాడలేదు. ఎందుకో టెన్షన్ గా అనిపించింది. ఎంతైనా కలెక్టర్! ఎలా మాట్లాడాలి? ఏంటి అర్ధం కాలేదు.
గొంతు సవరించుకుని "నేను మాధవిని" అంది.
చక్రవర్తి ఆమె మోహంలో మారుతున్న భావాలు గమనిస్తూ పిల్లల్ని ఆడిస్తూ కూర్చున్నాడు.
"మధూ..." అర్చన స్వరంలో హఠాత్తుగా ఆప్యాయత, అభిమానం కలిశాయి.
మాధవికి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎంతకాలమైంది ఈ స్వరం విని. ఎంతైనా ఇద్దరూ కలిసి దాదాపు ఏడాది ఒకే దగ్గర పనిచేశారు. తెలియని అనుబంధం. అర్చన తన స్నేహితురాలు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉంది. వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా ఇంత మంచి స్నేహితురాలు లబించడం తన అదృష్టం. ఒక కలెక్టర్ కి ఏదన్నా పని విషయంలో కలవాలన్నా ముందుగా అపాయింట్ మెంట్ దొరకాలి. దొరికినా వాళ్ళు టైమ్ కేటాయించి తనతో మాట్లాడాలి.
"మధూ! నువ్వేనా?" మరోసారి అర్చన స్వరం వినిపించడంతో కలవర పడుతూ "నేనే మా... మాధవిని" అంది.