Previous Page Next Page 
అర్చన పేజి 97

    
    ఆ డబ్బు అడిగి తీసుకుని ఏదన్నా చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కదా! ఏం వ్యాపారం చెయ్యాలి? చీరల వ్యాపారం, గాజుల వ్యాపారం, ఇంకా ఇంకా....
    "వేణీ!" ఉలిక్కిపడింది.
    మాధవి లోపలికి వచ్చింది. గోడనానుకుని నిలబడిన నీలవేణిని ఆమె చెంపల మీద కన్నీటి చారికలను చూసి నివ్వెరపోయింది. దగ్గరగా వచ్చి ఆమె భుజమ్మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది "ఏమైందమ్మా? ఎందుకేడుస్తున్నావు?"
    ఒక్క క్షణం కూడా ఆగకుండా మాధవి భుజం మీద వాలిపోయి బావురుమంది నీలవేణి.
    మాధవి కంగారుగా అడిగింది "అరెరె వేణీ! ఏం జరిగింది? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా! ఏంటీ ఏమైంది?"
    నీలవేణి మాట్లాడలేదు. దుఃఖం ఆమెని మాట్లాడనివ్వలేదు. అలా వెక్కి వెక్కి ఏడుస్తూ కొన్ని నిమిషాలు ఉండిపోయింది. తరువాత మాధవి భుజం మీంచి కదిలి చెంగుతో మొహం తుడుచుకుంది. అయినా వెక్కిళ్ళు మాత్రం ఆగలేదు.
    "ఏం జరిగింది నీలవేణీ?" అడిగింది మాధవి. ఆమెకి నీలవేణి హఠాత్తుగా ఎందుకలా ఏడుస్తోందో అర్ధం కాలేదు. ఈ మూడునెల్లనుంచీ మనసులో ఉన్న బాద్ పంచుకోడానికి ఎవరూ లేక మౌనంగా భరించి ఇప్పుడు తనని చూడగానే ఎమోషనల్ అయిందేమో అన్నట్టుగా ఆమెవైపు సానుభూతిగా చూస్తూ అంది "బాధపడకు వేణీ! నేనొచ్చాగా! అన్నీ సెటిల్ చేస్తాను. నువ్వు కొంచెం వేణుని కూడా అర్ధం చేసుకోవాలి. పాపం ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నాడో తెలుసా?"
    నీలవేణి ఏం మాట్లాడలేదు.
    "నాక్కొంచెం కాఫీ ఇస్తావా?" అడిగింది మాధవి.
    నీలవేణి చటుక్కున అక్కడినుంచి కదిలి పెరట్లోకి వెళ్ళింది మొహం కడుక్కోడానికి.
    మాధవి నీటుగా, అద్దంలా సర్ది ఉన్న వంటగది చూస్తూ నీలవేణి లేకపోతే ఈ పరిస్థితుల్లో ఈ ఇంటిగతి ఏంటి? పెద్దదిక్కుగా అందర్నీ క్రమశిక్షణలో పెట్ట్టిన పెద్దాయన కృష్ణస్వామి గారు చనిపోగానే ఈ ఇంట్లో కళా, కాంతీ పోయాయి. తాయారమ్మగారు అలా అవడంతో భర్తని కోల్పోయిన దిగులేనా లేక ఆవిడకేదన్నా శారీరక ఆరోగ్యం ఉందా? లేక పెరుగుతున్న వయసా? ఆవిడ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా? ఆవిడలా ఉంటే వేణు సంగతేంటి? వేణు పెళ్ళి సంగతేంటి? అర్చన విడాకులిస్తేగానీ వేణుని చేసుకోవడానికి ముందుకు రారు. వేణు అవివాహితుడని అబద్ధం చెప్పాలన్నా కళ్ళముందు కనిపిస్తున్న ఆరేళ్ళ కొడుకు మాటేంటి? వాడినెవరు చూసుకుంటారు? ఈ రోజుల్లో అమ్మాయిలు తెగేసి చెపుతున్నారు. భర్త తాలూకు బంధువులెవరూ ఇంటిమీద పడద్దని, అత్తా మావలు కూడా విడిగా ఉండాలని అలాంటివాళ్ళు సవతి కొడుకుని చూసుకుంటారా? పోనీ వాడిని తను పెంచుకున్నా విడాకులు అవకుండా పెళ్ళి చేసుకునేవాళ్ళు ఎవరు? నీలవేణి భవిష్యత్తు ఏంటి? కుదిరిన సంబంధం పోయింది. ఇప్పుడెలా?
    అర్చనని తను కలిసి విడాకుల సంగతి మాట్లాడాలి. ఆమె దగ్గర సంతకాలు తీసుకురావాలి. ఆ పని వేణు ఎలాగా చేయడు. తనే పూనుకోవాలి. చక్రవర్తితో మాట్లాడాలి. అర్చన ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉందని తెలిసింది. వెళ్ళాలి. కలవాలి ఎలా?
    ఇకపోతే నీలవేణికి సంబంధం చూడాలి. పేపర్ లో ప్రకటన ఇస్తే? అవును ఆమె వివరాలన్నీ ఇచ్చి పేపర్ లో వేయిస్తే అర్ధం చేసుకునేవాళ్ళు వస్తారు.
    నీలవేణి మొహం కడుక్కుని వచ్చింది. ఎర్రగా కందిపోయిన చెంపలు, ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్ళు. నీలవేణి పరిపూర్ణ స్త్రీత్వం సంతరించుకుంది అనుకుంది మాధవి ఆమెవైపు తదేకంగా చూస్తూ నీలవేణి ఆమె చూపులకి పల్చగా నవ్వి కాఫీ డికాషన్ చిన్నగిన్నెలోకి వంపి పాలు పోస్తోంది.
    మాధవి మారలేదా? తనే అపార్దం చేసుకుందా? నీలవేణి మనసులో పశ్చాత్తాప కెరటం ఉవ్వెత్తున లేచినట్లైంది. కాఫీ కప్పులో పోసి, నురగ వచ్చిందాకా కలిపి మాధవి వైపు తిరిగి ఆమె చేతికిచ్చింది.
    "కౌశిక్ ఎలా ఉన్నాడక్కా?" అడిగింది.
    "బాగున్నాడు వేణీ! అన్నట్టు రిత్విక్ పేచీ పెట్టకుండా స్కూల్ కి వెళ్తున్నాడా?" అడిగింది మాధవి కాఫీ సిప్ చేస్తూ.
    "వెళుతున్నాడు కానీ..." ఆగిపోయింది నీలవేణి.
    ఆ మధ్య రిత్విక్ ఇంటికొస్తూనే చిన్న గొడవ చేయడం గుర్తొచ్చింది.
    స్కూలునుంచి వస్తూనే నీలవేణి దగ్గరకు వచ్చి "నీలవేణీ! నా అమ్మ ఎక్కడుంది?" అన్నాడు రిత్విక్.
    నీలవేణి ఊహించని ఆ ప్రశ్నకి నిర్ఘాంతపోయి కలవరపడింది.
    "చెప్పూ! అమ్మెక్కడ?" అన్నాడు.
    "అమ్మ... అమ్మ..." నీలవేణి కంగారుపడుతుండగా అప్పుడే వేణు అడుగుపెట్టాడు.
    రిత్విక్ వేణుని చూడగానే నీలవేణిని వదిలి వేణు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి "డాడీ! అమ్మ కావాలి నాకు" అన్నాడు.
    వేణు ముందు కంగారుపడ్డాడు. వాడేం అడుగుతున్నాడో అర్ధం కాలేదు. రిత్విక్ మళ్ళీ వేణు చేయి పట్టుకుని ఊపుతూ "డాడీ, డాడీ! వేరీజ్ మమ్మీ? ఐ వాంట్ మమ్మీ. చెప్పు డాడీ మమ్మీ జేజి దగ్గరికి వెళ్ళిందా?" అని అడుగుతుంటే లాగి వాడి వీపు మీద కొట్టి "డర్టీ ఫెలో నోరు మూసుకుని వెళ్ళి ఆడుకో వెధవ పశ్నలు, వెధవ అల్లరి. వెళ్ళు" అంటూ వాడి వీపు మీద రెండు చేతులేసి తాయారమ్మ గదివైపు నెట్టాడు.
    వాడు కెవ్వుమంటూ గట్టిగా ఏడుస్తూ వెళ్తోంటే నీలవేణి గబుక్కున వెళ్ళి వాడిని ఎత్తుకుని బుజ్జగించసాగింది.
    వేణు వెంటనే నీలవేణివైపు ఆగ్రహంతో చూసి "నువ్వు నేర్పిస్తున్నావా వీడికి అన్నీ?" అంటూ మండిపడ్డాడు.
    ఊహించని ఆ అపవాదుకి నీలవేణి నిశ్చేష్టురాలైపోయింది.
    వేణు రిత్విక్ వైపు చూస్తూ "నీకెందుకురా అన్ని విషయాలు. చెత్త విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు" అన్నాడు.
    "డాడీ! నా స్కూల్లో అందరికీ మమ్మీ ఉంది. నాకు లేదు. ఓ వాంట్ మమ్మీ" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే వేణు తల పట్ట్టుకుని సోఫాలో కూలబడిపోయాడు. నీలవేణి ఇంక అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది రిత్విక్ ని ఎత్తుకుని.
    రిత్వి వెక్కుతూ "నా అమ్మ చచ్చిపోయింది కదా నీలవేణీ!" అంటూ పదే పదే అడగడంతో వాడిని ఆ సంఘటన నుంచి, ఆ ఆలోచన నుంచి మరల్చడం ఆ రోజు చాలా కష్టమైపోయింది.
    మాధవికి ఆ సంఘటన చెపుతూంటే దుఃఖం పొంగి వచ్చింది. అతికష్టం మీద ఏడవకుండా జాగ్రత్తపడుతూ అంది నీలవేణి. "పెద్దయ్యగారు చనిపోవడంతో నా బతుకు తలకిందులైపోయిందక్కా! నా పొడ వేణుగారికి గిట్టకుండా ఉంది. ప్రతిరోజూ ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నేనేం చేశాను చెప్పు?" అంటూ మళ్ళీ దుఃఖం అడ్డుపదాడంతో ఆగిపోయింది.

 Previous Page Next Page