Previous Page Next Page 
అర్చన పేజి 96

    "ఇక్కడికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో రెక్కపల్లి అని ఉంది. అక్కడ జటాయువు శరీరభాగం నుంచి ఒక రెక్క విరిగిపడి ఇప్పటికీ ఉంది చూస్తారా?" అన్నాడు సుధాకర్.
    "తరువాత చూద్దాం" అంది అర్చన నవ్వి.
    "మేడమ్! లంచ్ టైం అవుతోంది" కొంచెం మెల్లగా, నమ్రతగా గుర్తుచేశాడు పి.ఏ.
    "పదండి" గంభీరంగా అంటూ ముందుకి నడిచింది.
    ఆమెని అనుసరించారు పి.ఏ, సుధాకర్. దారిలో అన్నాడు సుదాకర్ "రేపు పాపికొండలు, పేరంటాలపల్లి, ఇంకా కొన్ని ట్రైబల్ ఏరియాస్ చూడచ్చు."
    "తప్పకుండా! ఈ రోజు ఆఫ్టర్ లంచ్ ఆఫీస్ కి వెడదాం" అంది. ఇంక విజిటింగ్ ఏమీ లేదు అన్నట్టుగా.
    కాసేపట్లో కారు ఆమె క్వార్టర్స్ దగ్గర ఆగింది. అర్చన కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది.
    అప్పటికే ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారెవరో! ఆ పూటకి పులిహోర, చక్కర పొంగలి, వడ, లడ్డు మొదలైన ప్రసాడేల్ లంచ్ గా స్వీకరించింది.
    మధ్యాహ్నం మూడవుతుండగా ఆఫీస్ కి బయలుదేరింది.
    సీటులో కూర్చోగానే ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్టుగా స్టాఫ్, కొందరు పార్టీ లీడర్లు, ఇతర ఆఫీసర్లు ఫ్లవర్ బొకేలు తీసుకొచ్చి మర్యాద పూర్వకంగా కలవడం, మధ్య మధ్య బలవంతంగా స్వీట్సు ఇవ్వడం గంటసేపు అదే సరిపోయింది.
    టేబుల్ ఫ్లవర్ బొకేలతో నిండిపోయింది.
    అటెండర్ ని పిలిచి ఇంక కలవడానికి వచ్చేవాళ్ళని ఎవరినీ లోపలికి రానివ్వద్దని చెప్పింది.
    పి.ఏ.ని పిలిచి ఫైల్స్ తెప్పించింది.
    కాసేపట్లో తన విధుల్లో మునిగిపోయింది.

                                                                      * * * * *

    మాధవి పాపాయిని ఎత్తుకుని మూడోనెల్లో పుట్టింటినుంచీ వచ్చేసింది. వస్తూనే తాయారమ్మ ఆశీర్వాదం కోసం తీసుకెళ్ళింది.
    ఆవిడని చూడగానే మాధవి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. శుష్కించిన దేహం, జీవకళ కోల్పోయిన వదనం. మాధవిని చూస్తూనే ఆవిడ కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. పాపాయికోసం శుష్కించిన చేతులు చాచింది. జాగ్రత్తగా పాపాయిని ఆవిడ ఒళ్ళో పడుకోపెట్టి ఆమె పాదాలకు నమస్కరించింది మాధవి.
    "పిల్లా, పాపలతో కళకళలాడుతూ బతుకమ్మా" అని ఆవిడ సన్నని స్వరంతో ఆశీర్వదించింది.
    అప్పుడే ఆవిడ కోసం సగ్గుజావ తీసుకొచ్చిన నీలవేణి మాధవిని చూస్తూనే ఆనందంతో పొంగిపోతూ "ఎప్పుడొచ్చావక్కా?" అంటూ జావగిన్నె టీపాయ్ మీద పెట్టి ఆత్రంగా కౌగలించుకుంది.
    "బాగున్నావా వేణీ?" ఆప్యాయంగా అడిగింది మాధవి.
    నీలవేణి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. దుఃఖం పెగిలి వచ్చింది. మౌనంగా తలూపింది బాగున్నానన్నట్టు.
    మాధవి ఆమె వీపుమీద చేత్తో మృదువుగా నిమిరింది. అలా నిమరడంలో ఒక చల్లని ఓదార్పు, ఒక అభయం కనిపించినట్టు అనిపించి ఆమెవైపు కృతజ్ఞతగా చూస్తూ, తాయారమ్మకి జావ తాగించడానికి పూనుకుంది.
    ఆవిడ చేతుల్లోంచి పాపాయిని అందుకుని కొన్ని క్షణాలు తదేకంగా పాప మొహంవైపు చూసి చిరునవ్వుతో మాధవి చేతికి అందించింది నీలవేణి. తాయారమ్మ మంచం మీద వెనక్కి వాలి, గోడనానుకుని కూర్చుంది.
    మంచం చివరగా కూర్చుని జావగిన్నె ఆవిడ చేతికి అందించి జారిపడకుండా కళ్ళతోటే కాపాడుతూ ఆవిడవైపే చూస్తూ కూర్చుంది నీలవేణి.
    "జావ ఎందుకు? లంచ్ టైం కదా అన్నం తినడం లేదా?" అడిగింది మాధవి ఆవిడవైపు బాధగా చూస్తూ.
    "అరగడం లేదక్కా! ఒక ముద్ద తిన్నా అరగడం లేదు" నీలవేణి సమాధానం చెప్పింది.
    ఆవిడ ఖర్మ అన్నట్టుగా కుడిచేత్తో సన్నగా నుదిటిమీద కొట్టుకుని సైగ చేసింది మాధవికి.
    మాధవికి కొంచెం ముందుకు నడిచి మంచానికి ఎడంవైపు వచ్చి, కొద్దిగా వంగి తాయారమ్మ భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేసి మృదువుగా అంది "మీరు త్వరలో అన్నం తింటారు. నేను వచ్చాగా! చూసుకుంటాను."
    నీలవేణి మనసు కలుక్కుమంది. అంటే తను ఆవిడని సరిగా చూడడం లేదా? తెల్లవారి లేచిం దగ్గర్నించి ఆవిడకి పళ్ళు తోమడంతో ప్రారంభం అయే దినచర్య రాత్రి పడుకునేవరకూ నిరంతరాయ్మ్గా సాగుతూ ఒక యంత్రంలా చేస్తోన్న సేవలన్నిటి సంగతి ఏంటి? మాధవి అలా అనడం చాలా బాధగా అనిపించింది. కళ్ళల్లో నీళ్ళు కనిపించకుండా ఖాళీ అయిన జావగిన్నె తీసుకుని, అక్కడినుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. ఆ క్షణంలో మొదటిసారిగా నీలవేణికి నేను పనిమనిషిని, జీతం బత్తెం లేని పనిమనిషిని అనే భావన కలిగింది.
    వంటగదిలోకి వెళ్ళిపోయి కొద్దిక్షణాలు ఆపుకోలేని దుఃఖంతో గోడననుకుని ఏడుస్తూ నిలబడిపోయింది. మాధవిని చూడగానే ఎంతో ఆత్మీయురాలీని చూసినట్టు అనిపించింది. ఈ మూడునెల్లుగా తను పడిన మానసిక వేదనకి ఆమె దగ్గర ఓదార్పు లభిస్తుందని ఆశించింది. కానీ, ఇదేంటి? మాధవి వస్తూనే తన మనసునింత గాయం చేసింది.
    మాధవి మారిపోయిందా? ఇదివరకులా లేదా? తనని పనిమనిషిలా చూస్తోందా?
    ఇంకా ఎంతకాలం తనీ ఇంట్లో ఇలా ఊరికే కూర్చుని తింటుందని అనుకుంటోందా?
    అయితే తనేం ఊరికే తినడం లేదే! గొడ్డు చాకిరీ చేస్తోంది. తనకి ఈ చాకిరీకి లభిస్తున్న ప్రతిఫలం ఏంటి? నెలకి జీతం ఇస్తున్నారా?
    జీతం....నీలవేణికి హఠాత్తుగా గుర్తొచ్చింది. తనీ ఇంటికి వచ్చిన కొత్తలో వేణు కొంత డబ్బు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశాడు.
    ఆ రోజు బ్యాంకు కాగితాల మీద సంతకాలు తీసుకుంటూ దీనిమీద నెలకి వడ్డీ వస్తుంది. అది నీ సేవింగ్స్ అకౌంట్ లో జమ అవుతుంది. నీకేమన్నా కావాలంటే ఆ డబ్బు తీసుకుని వాడుకోవచ్చు అంటూ ఒక చిన్న పుస్తకం ఇచ్చాడు. అదే పాస్ బుక్. అవును ఆ డబ్బు ఏమైంది? మళ్ళీ తను ఆ మాటే మర్చిపోయింది.
    ఇన్నేళ్ళ తన పనిమనిషి ఉద్యోగానికి అది పారితోషికం కదా! తను ఏమన్నా చేసుకోవచ్చు.

 Previous Page Next Page