Previous Page Next Page 
అర్చన పేజి 95

    దేశంలోనే అయోధ్య తరవాత భద్రాచలమే రెండో  రామక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. మూలవిరాట్టుల విగ్రహాలు పడమటివైపు తిరిగి ఉన్నాయి. రాముడు పద్మాసనంలో కూర్చుని ఉండి, శంఖం కుడిచేతిలో, చక్రం ఎడం చేతిలో ధరించి, మిగతా రెండు చేతుల్లో శూలం, బాణం ధరించి ఉన్నాడు. రాముడికి ఎడమవైపు సీతాదేవి, ఆమెకి ఎడమ పక్కన లక్ష్మణుడు ఉన్నారు.
    దీపం వెలుగులో వెలిగిపోతున్నాయి విగ్రహాలు.'
    సాధారణంగా తూర్పువైపు ఫేస్ చేసి ఉంటాయి కదా విగ్రహాలు అడిగింది అర్చన ఎం.ఆర్.వో. సుధాకర్ ని.
    "ఇది ఈ ఆలయ ప్రత్యేకత. మూలవిరాట్టులు పడమర ప్రవహిస్తున్న గోదావరి నదివైపు చూస్తున్నాయి" అన్నాడు సుధాకర్.
    అలాగా అన్నట్టు తల ఊపింది.
    ప్రతి శ్రీరామనవమికి టీవీలో సీతారామకళ్యాణం లైవ్ చూడడం తప్ప ఇంతవరకూ భద్రాచలం రాలేదు. ఈ విధంగా రప్పించాడన్నమాట రాముడు అనిపించింది అర్చనకి.
    "శ్రీరామనవమికి చూడాలి ఇక్కడ ఉత్సవం. చాలా అధ్బుతంగా ఉంటుంది" అన్నాడు మళ్ళీ.
    తల పంకించింది అర్చన. ఆమె చూపులు విగ్రహాల వైపు మళ్ళాయి.
    ఆమెకా క్షణంలో భక్తిభావం నిలువెల్లా ప్రవహిస్తున్నట్టు అనిపించింది. ఆ పరిసరాల్లో తిరుగుతూ ఆ విగ్రహాలను అంత దగ్గరగా చూస్తుంటే ఒళ్ళు జలదరించినట్టు అయింది.
    ఉద్యోగంలో చేరేముందు తిరుపతి వెళ్ళింది. కానీ, ఒకే ఒక క్షణం దర్శనం చేసుకోగలిగింది. అప్పటికే అక్కడి వాలంటీర్లు తోసేశారు. జరుగు జరుగు అంటూ కానీ, ఇప్పుడు ఇక్కడ ఒక హోదాలో ఎంత దగ్గరగా ఒక్కసారి ఆ ఏడుకొండలవాడి విగ్రహం కూడా చూడగలిగితే!
    "మీ గోత్రనామాలు చెప్పండమ్మా! అర్చన చేస్తాను" అర్చనస్వామి మాటలతో కళ్ళు తెరిచి సన్నగా నవ్వి అంది "ఆ భగవంతుడి గోత్రంతోటే చేయించండి. నా పేరులోనే ఉంది అర్చన" అంది.    
    అర్చకస్వామి మంత్రాలు చదువుతూ విగ్రహాలకు పూలతో, అక్షింతలతో పూజ చేస్తోంటే కళ్ళప్పగించి విగ్రహాలను చూస్తూ ఉండిపోయింది. అమ్మా, నాన్న ఉంటే వాళ్ళెంత సంతోషించేవాళ్ళు! తను దగ్గరుండి పూజ చేయించేది కదా! ఇలాంటి అవకాశం వస్తుందని ఎప్పుడైనా ఊహించి ఉంటారా? ఇప్పటికైనా కూతురు ఉన్నతస్థాయిలో ఉందని తెలిసిన తరవాతైనా రావచ్చు కదా!
    రారు. కొడుకు చేతిలో వాళ్ళు బానిసలు. వాళ్ళే కాదు, ఈ పిత్రుస్వామ్య వ్యవస్థలో మగవాడిదే పెత్తనం అనే భావజాలం నిలువునా నిండిన ఈ సమాజంలో కొడుకు సంరక్షణలో ప్రతి తల్లీ తండ్రి ఉండాలన్న నియమానికి కట్టుబడిన ప్రతివాళ్ళూ అంతే! నిట్టూర్చింది అర్చన.
    "ఇదిగోండమ్మా! హారతి అద్దుకోండి" హారతి పళ్ళెంతో వచ్చిన అర్చకస్వామి ముందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అర్చన తల వంచి, భక్తిగా హారతి కళ్ళకద్దుకుంది. ఆమె నుదుట కుంకుమ పెట్టి, తల మీద అక్షింతలు చల్లి, శఠగోపం పెట్టి ఆశీర్వదించాడు అర్చకస్వామి.
    పర్సులోంచి ఐదువందల నోటు తీసి హుండీలో వేసింది.
    "ఇవి ఉత్సవ విగ్రహాలు. శ్రీరామనవమికి బైటకి తీసి కళ్యాణం జరిపిస్తాం" అని వివరించాడు మరో అర్చకస్వామి ఆమె గర్భగుడిలోంచి బైటకి వస్తుంటే ఆమె వెనకాలే నడుస్తూ.
    అర్చన ఆ విగ్రహాల వైపు చూసింది. కంచు విగ్రహాలు.
    "ఎక్కువగా రద్దీ లేదు ఎంచేత?" అంది.
    "తిరుపతిలో లాగా అస్తమానం రద్దీ ఉండదు మేడమ్ గారూ! గోదావరి పుష్కరాలు వచ్చినపుడు, శ్రీరామనవమికి, వైకుంఠ ఏకాదశికి ఇలా ప్రత్యేకమైన రోజుల్లోనే లక్షల మంది భక్తులు వస్తారు. మిగతా రోజుల్లో ప్రశాంతంగా దర్శనం అవుతుంది" అన్నాడాయన.
    "రండి మేడమ్! అదిగో అది సుదర్శన చక్రం" అంటూ ఆలయ శిఖరం మీద ఉన్న సుదర్శన చక్రం చూపించాడు సుధాకర్ గుడిలోంచి బైటకి రాగానే.
    అర్చన తలెత్తి సుదర్శన చక్రం చూసింది.
    "ఈ చక్రం గోదావరి నదిలో రామదాసుకి లభించిందట" అన్నాడు సుధాకర్.
    అతను చెపుతోన్న విషయాలన్నీ వింతో తల పంకిస్తూ, మధ్య మధ్య అలాగా అంటూ మొత్తం ఆవరణ అంతా తిరగసాగింది.
    బాపు చిత్రించిన దశావతారాలు చూసి ముచ్చటపడింది.
    "కళ్యాణం ఎక్కడ జరిపిస్తారు?" అడిగింది.    
    "రండి చూపిస్తాను" అంటూ నమ్రతగా ముందుకు దారితీశారు అర్చకులు.
    వారిని అర్చన అనుసరిస్తే ఆమెని పి.ఏ, ఎమ్.ఆర్.ఓ. మరికొందరు అనుసరించారు.
    కళ్యాణమంటపానికి తీసుకొచ్చి చూపించాడు అర్చకస్వామి "ఇదేనండి కళ్యాణమంటపం."
    "ఇక్కడ లక్షల మంది ఎలా సరిపోతారు?" ఆశ్చర్యంగా అడిగింది.
    నవ్వాడు. "మీరు చూసేఉంటారు కదమ్మా! ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ, ఒకళ్ళమీద ఒకళ్ళు పడిపోతూ, తొక్కుకుంటూ మీరే చూస్తారుగా! ఇంకో నెలలో శ్రీరామనవమి రానే వస్తోంది" అన్నాడు.
    అర్చన మౌనంగా ఉండిపోయింది.
    అక్కడినుంచి బైటకి వచ్చి పర్ణశాలకి వెళ్ళారు. రాముడి దండకారణ్యంలో వనవాసం చేసినప్పటి ప్రదేశంగా చెప్తారు. మొత్తం వనవాసం చిత్రిస్తూ చెక్కిన శిల్పాలు, సీతాదేవి పాదముద్రలు.
    సీతాదేవి మూర్చతో కింద పడిపోయిన విగ్రహం చూస్తూ ఆ శిల్పి చాతుర్యానికి అబ్బురపడిపోయింది. ఎంత బాగున్నాయి! నిలువునా జీవంతో కళకళ్ళాడుతున్నాయి.
    ఓ పక్క నిండుగా ప్రవహిస్తున్న గోఅవారి, మరో పక్క పర్ణశాల నిజంగానే అక్కడ సీతారామలక్ష్మణులు కొలువైనారేమో అనిపించింది. అక్కడనుంచి కదలబుద్ధి కాలేదు. ఇంకా వేసవికాలం పూర్తిగా మొదలవలేదు. నది మీంచి చల్లగాలి వీస్తోంది. ఎండ ఉన్నా చురుక్కుమనడం లేదు. చల్లగా, హాయిగా, ఆహ్లాదంగా ఉంది.
    కొంచెం ఎక్కువసేపు అక్కడ గడిపింది. రావణాసురుడి విగ్రహం, బంగారులేడిని చూపిస్తున్న సీత ఎంత బాగుంది!
    అక్కడనుంచి జటాయువు పాకకి వెళ్ళారు. రావణాసురుడు సీతనపహరించుకుని వెళ్తున్నప్పుడు రావణుడిని అడ్డగించి భీకరపోరాటం సల్పిన జటాయువు రావణుడి దెబ్బలకు రెక్కలు విరిగి కూలబడి అక్కడే రాముడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాడని చరిత్ర.

 Previous Page Next Page