"నాన్నకి మైల్డ్ ఎటాక్ వచ్చింది. అలా పడిపోడంతో భయపడ్డట్టున్నారు. కారులో వెళ్తుండగానే సడన్ గా గుండె చేత్తో పట్టుకున్నారు. ఒళ్ళంతా చెమట పట్టేసింది. నాకు చాలా భయం వేసింది. లక్కీగా డాక్టర్ అవైలబుల్ గా ఉన్నారు. వెంటనే ఎమర్జెన్సీ కింద అడ్మిట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఓ.కె. పడుకున్నారు."
"అయ్యో! ఎంత పని జరిగింది వేణూ!" బాధగా అంది మాధవి.
"ఏం చేస్తాం?" నిట్టూర్చాడు వేణు.
నీలవేణి వేణుకీ, మాధవికీ కాఫీ తెచ్చిచ్సింది.
ఆ తరువాత వేణు ఆఫీసుకు సెలవు పెట్టడం, మాధవి కూడా వేణుతో వెళ్ళి కృష్ణస్వామిని చూసిరావడం ఇదంతా జరగడంతో తాయారమ్మకి తెలిసి పోయింది. ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చిందని. ఆవిడ ఏడుపు మొదలుపెట్టింది.
"మీరేం భయపడకండి పిన్నిగారూ! ఆయనకేం కాదు క్షేమంగా వస్తారు" అంది మాధవి ఆవిడ్ని ఓదారుస్తూ.
"ఏమో తల్లీ! ఆ ఏడుకొండలవాడి దయ. ఆయన క్షేమంగా ఉండాలి."
"ఉంటారన్నాగా! నా మాట నమ్మండి" అంది మాధవి అభయం ఇస్తున్నట్టుగా.
అయితే, ఆమె మాట నమ్మేలోపలే ఆయనకి మరోసారి ఎటాక్ రావడం, క్షణాల్లో ఆయన ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోడం జరిగింది.
కళ్యాణం జరగాల్సిన ఇంట్లో విషాదం కమ్ముకుంది. కృష్ణస్వామి జీవితంలో మొదటిసారిగా అస్వస్థుడై హాస్పిటల్ పాలు కావడం, అదే ఆఖరుసారి అయి, శాశ్వతంగా కన్ను మూయడం జరిగిపోయింద్. మాధవినీ, తాయారమ్మనీ, నీలవేణినీ ఓదార్చడానికి వేణు, చక్రవర్తి గాంభీర్యం నటించాల్సి వచ్చింది. కానీ, వేణు గుండెల్లో బడబాగ్ని రగలసాగింది. నాన్న లేరు అని తల్చుకుంటే అతనికి ప్రపంచం శూన్యంగా అనిపించసాగింది. నాన్న లేరా? మరోసారి మరోసారి అలా పదే పదే తనని తాను ప్రశ్నించుకుంటూ కన్నీళ్ళు కార్చలేక, గుండెల్లో సుడులు తిరుగుతున్న సుడిగుండాలను తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు.
బ్యాంకులో వాళ్ళతో పనిచేసే మరికొందరు స్నేహితులు, ఊరినుంచి వచ్చిన బంధువులు, సన్నిహితుల సమక్షంలో మర్నాటికల్లా వేణుతో దగ్గరుండి కార్యక్రమాలు జరిపించారు చక్రవర్తి.
మాధవి కొంచెం మనసు దిటవు చేసుకుని తాయారమ్మకి తానే ఓ తల్లై ఓదార్చసాగింది.
ఎవరు ఎలా, ఎంతగా ఓదార్చినా నలభై ఏళ్ళ వైవాహిక జీవితంలోని అనుబంధాన్ని ఇరవై నాలుగు గంటల్లో మర్చిపోవడం సాధ్యమా? అలా సాధ్యమైతే ఈ అనుబంధాలకు అర్ధం ఏంటి? అనుకున్నాడు చక్రవర్తి.
వారం రోజుల్లో జరగాల్సిన నీలవేణి పెళ్ళి వాయిదా పడిందన్న సంగతి కూడా ఎవరికీ గుర్తు రాలేదు పెళ్ళివారు ఫోన్ చేస్తే తప్ప! విషయం తెలిసిన పెళ్ళివారు వెంటనే వచ్చారు. జరిగిందానికి చాలా బాధపడ్డారు. పెళ్ళి నివరధికంగా వాయిదా పడింది.
తిండీ, నీళ్ళూ లేక కన్నీళ్ళతో, వేదనతో చిక్కిశల్యమైపోయింది తాయారమ్మ పదిరోజులకే.
ఇప్పుడే మళ్ళీ నీలవేణి పెళ్ళికి ముహూర్తం పెట్టి, ఆమెని సగౌరవంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేయడానికి ఎవరూ లేరు. తండ్రిలా ఆదరించిన కృష్ణస్వామి కనుమరుగయాడు. తల్లిలా అక్కున చేర్చుకున్న తాయారమ్మ పుట్టెడు దుఃఖంతో గుండెల్లో సప్తసముద్రాలను నింపుకుంది.
వేణుకి తన గురించి తానే ఆలోచించుకునే శక్తి కూడా నశించిపోయింది.
బాబుని చూసుకుంటూ, తాయారమ్మని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతూ మధ్య మధ్య గుండె పగిలేలా ఏడుస్తూ కాలం వెళ్ళదీస్తోంది నీలవేణి.
* * * * *
మాధవి దాదాపు ప్రతిరోజూ బాబుని స్కూల్ కి, చక్రవర్తిని బ్యాంక్ కి పంపించి వచ్చి తాయారమ్మ దగ్గరే ఉంటోంది. తనకు చేతనైన విధంగా ఆవిడకి ధైర్యం చెబుతూ, నచ్చచెబుతూ దగ్గరుండి భోజనం తినిపించడం, కాస్సేపు పిల్లల కబుర్లు చెబుతూ ఆహ్లాదపరచడానికి ప్రయత్నిస్తూ సాయంకాలం వరకూ ఆవిడని కనిపెట్టుకుని ఉంటోంది.
ఇప్పుడు ఇంట్లో పని, బాబు పని, వంట పని మొత్తం నీలవేణి భుజస్కంధాలపైన పడింది. దానికి తోడు విషాదం మూర్తీభవించిన నిద్రాహారాలకు దూరమైనా తాయారమ్మ బాధ్యత. వేణుకి క్యారేజీ సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. డ్రైవర్ తీసుకెళ్ళి కారులో పెట్టేస్తాడు. వేణు సగం మాత్రం తింటాడు, మిగతాది అలాగే వదిలేస్తాడు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఏం తింటాడో తెలియక ఏం అడిగితే ఏం అంటాడో అనే భయంతో నీలవేణి సందిగ్ధంగా మాధవితో అంది.
"అక్కా! వేణుబాబుగారు ఉదయం ఏం తింటారో అడిగి చెప్తావా? పాపం నేనాయనకి ఏం టిఫిన్ చేయడం లేదు."
మాధవికి జాలేసింది. ఇంట్లో పెద్దదిక్కులైన వాళ్ళల్లో ఒకరు పోయారు. ఒకరు మానసికంగా ఈ లోకంలో లేరు. వేణుతో మాట్లాడదు. ఈ అమ్మాయికి ప్రస్తుత పరిస్థితి అగ్నిపరీక్షలాంటిది సన్నగా నిట్టూర్చి అంది.
"వాళ్ళ బ్యాంకులో క్యాంటీన్ ఉంటుందిలే వేణీ! నువ్వేం ఇబ్బంది పడకు. ఆకలేస్తే అక్కడ తింటాడు. ఇంకొక్క నెలరోజులు గడిస్తే అన్నీ సర్దుకుంటాయి."
ఆమె అన్నట్టుగానే నెలరోజులు గడిచి, మొదటి నెల మాసికం అయాక వేణులో కొద్దిగా మార్పొచ్సింది. తాయారమ్మ కూడా ఏడుస్తూ పడుకోకుండా లేచి తిరగడం, మధ్య మధ్య వంటగదిలోకి వచ్చి వేణుకేం కావాలో చూడడం, ఎక్కువ సేపు పూజ చేసుకోవడం చేస్తోంది. మధ్యాహ్నం నీలవేణి ఆవిడ తింటేనే తనూ తింటానని అన్నం తినకుండా మారాం చేస్తుండడంతో తప్పనిసరిగా ఎంగిలిపడుతోంది.
ఇదివరకు మధ్యాహ్నాలు కాస్సేపు పడుకునే ఆవిడ ఇప్పుడు అలా కూర్చుని శూన్యంలోకి చూడడం, లేదంటే బాబా జీవిత చరిత్ర తీసుకుని పారాయణ చేస్తూ కూర్చోడం, లేదంటే జపమాల తీసుకుని జపం చేసుకోడం చేస్తోంది. ఇదివరకులా నీలవేణితో ఆ కబురూ, ఈ కబురూ చెప్పడం లేదు. బాబుతో కాస్సేపు ఆడుకుంటుంది. వాడూ ఇప్పుడు ఆవిడ దగ్గరే పడుకుంటున్నాడు. ఆ ఒక్క మార్పు నీలవేణికి బాధ కలగచేసింది. వాడు పక్కన లేకపోతే నీలవేణికి ఏదో లోతుగా అనిపించసాగింది. తనకు తోచిన కథలేవో చెబుతూ వాడిని నిద్రపుచ్చి, నిద్రపోతున్న వాడి ముద్దు మొహం చూస్తూ ఏదో అలౌకిక ఆనందం పొందుతుండేది. అదిప్పుడు దూరమైంది. ఏదో ఒంటరితనం దిగులు కమ్మేయసాగింది.
కృష్ణస్వామి మరణంతో నీలవేణిలో అనూహ్యమైన అభద్రతాభావం చోటు చేసుకుంది. ఇంక నా భవిష్యత్తేంటి? నేనేం చేయాలి? నేనేక్క్డుండాలి? అనే ఆలోచనలు ఆమెని కుదిపేస్తున్నాయి. పగలంతా ఆ పనీ, ఈ పనీ చేసుకుంటూ ఆలోచనలు తరిమేస్తున్నా, రాత్రి కాగానే ఒంటరితనం భూతంలా భయపెట్టసాగింది.