ఆమెకి పెళ్ళి వాయిదా పడిందన్న దిగులు కానీ, బాధ కానీ లేదు. కానీ, తన భవిష్యత్తు గురించిన ఆలోచనలు మొదటిసారిగా ఆమె మనసులో నిండిపోయి అశాంతి కలగజేస్తున్నాయి. తండ్రిలాంటి కృష్ణస్వామి మరణించడం, తాయారమ్మ విషాదంలో పడిపోడంతో ఆమెకి ఇదివరకటి ఆప్యాయత, అభిమానం లభించడం లేదు. ఇప్పుడు బాధ్యతలు బాగా ఎక్కువయాయి. కానీ ఏదో కోల్పోయిందనిపిస్తోంది.
కొత్తగా ఈ మధ్య నీలవేణికి వేణు పట్ల సానుభూతి కలగసాగింది. ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. తననేమీ అడగడు. అతనికి ఏం ఇష్టమో, ఏం చేయాలో తనకి తెలియదు. ఇన్నేళ్ళలో వేణుతో తను మాట్లాడిన మాటలు వేళ్ళ మీద లెక్కపెట్టచ్చు. అలాంటిది మీకేం కావాలి ఏం చేయను? అని అడిగే సాహసం ఆమెకి లేదు. తననేమీ అడగడు. అలా అని ఏదో ఒకటి తింటాడులే నాకెందుకు అని కూడా అనుకోలేకపోతోంది. అందుకే రాత్ర్ డిన్నర్ కి మాత్రం ప్రత్యేకంగా వంట చేయడం అన్నీ టేబుల్ మీద అమర్చి కొంచెం దూరంగా తలుపు చాటున నిలబడి అతను తినేటప్పుడు పరిశీలించడం, ఏదన్నా వెతుక్కుంటున్నట్టు కనిపించగానే గబుక్కున వెళ్ళి అందించడం చేస్తోంది. అలా చేయడంలో ఆమెకేదో ఆనందం కలుగుతోంది. ఆ ఆనందంలో కృతజ్ఞత తప్ప మరో భావం లేదు.
ఏది ఏమైనా నీలవేణి సేవలు ఆ ఇంటికిప్పుడు కావాలి. ఆ మనుషులకి ఆమె అవసరం ఉంది. అందుకే ఆమె పెళ్ళి గురించి ఆలోచించడం లేదు. ఒక్క మాధవి మాత్రమే మధ్య మధ్య అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మయి జీవితం ఇలా అర్దాంతరంగా ఆగిపోయింది. ఎవరూ ఈమె సంగతి ఆలోచించరా అనుకుంటుంది. మళ్ళీ తనకు తనే ఆలోచించడానికి ఏం ఉంది? పెళ్ళి చేయాలి. అందుకు ముహూర్తం చూడాలి. కానీ, ఇంట్లో అశుభం జరిగాక ఏడాది వరకూ శుభకార్యం చేయకూడదంటారు. మరి ఏం చేయాలి? అలా అనుకుంటుండగానే మాధవికి నెలలు నిండాయి.
ఈసారి పురుడు తన చేత్తో పోస్తానన్న తాయారమ్మ ఇప్పుడా శక్తిలేనిధనిలా నిస్సహాయంగా ఉంది. మాధవి తల్లి వచ్చి ఆమెని పుట్టింటికి తీసుకెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు మాధవి తాయారమ్మకి తనకు తోచిన విధంగా కొన్ని ఓదార్పు మాటలు చెప్పి మనసు దిటవు చేసుకుని మామూలు ప్రపంచంలోకి రమ్మని వేడుకుంది. అలాగే నీలవేణి క్కూడా వేణు బాధ్యతలు, బాబు, తాయారమ్మల బాధ్యతలు అప్పగించి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పింది.
నీలవేణి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మౌనంగా తలూపి, ఆమెకి వీడ్కోలు పలికింది.
ఇప్పుడు నీలవేణికి మరీ భయంగా అనిపిస్తోంది.
ఎలా ఈ ఇంటిని, ఈ ఇంట్లో మనుషుల్ని కాపాడాలి? ఈ ఇంట్లో తన బాధ్యత ఏంటి? ఎంతవరకు?
వంట చేయడం, బాబుకి తినిపించడం, తాయారమ్మని బతిమాలి కొద్దిగా తినేలా చేయడం, వేణుకి క్యారియర్ సర్ది ఇవ్వడం, ఆ తరువాత తను తినాలంటే భయం వేస్తుంది. తను తినేటప్పుడు ఎవరన్నా చూస్తారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనిపిస్తుంది. ఇంతకాలం ఇంట్లో ఎలా తిరిగినా వంటగదిలోకి వెళ్ళడానికి బెరుగ్గానే ఉండేది. ఇప్పుడు వంటగది మొత్తం నీలవేణి అధీనంలోకి వచ్చేసింది. ఏం చేయాలో, ఎలా చేయాలో అంతా అయోమయం. ఎలాగోళా వంట చేసేసి బైటపడిపోతుంది. వండిన పదార్ధాలన్నీ డైనింగ్ టేబుల్ మీదకి చేర్చి ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తరువాత ఇల్లంహ తిరుగుతూ ఏ పని చేసినా ఏమీ అనిపించదు. కానీ వంటగదిలోకి వెళ్ళేటప్పుడే ఎక్కడ లేని వణుకూ వస్తుంది.
ఇంటిపనితో రోజంతా బొంగరంలా క్షణం కూడా ఖాళీ లేకుండా తిరిగేస్తుంటే ఏ బాధా ఉండదు. కానీ, రాత్రి కాగానే ఏదో భయం, మరేదో దిగులు మనసంతా ఆవరించి, నిద్ర కూడా తొందరగా పట్టడం లేదీ మధ్య.
ఇటీవల ఆమెలో కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటున్నాయి. వాటిలో ఎంతకాలం ఈ ఇంట్లో ఇలా ఉండాలి. ఎంతకాలం ఉన్నా ఈ ఇంటికి తానేమీ కాడు అనే భావన ప్రధానంగా ఆమె మనసుని కుమ్మరిపురుగులా తొలిచేస్తోంది. రేపు తాయారమ్మగారికి ఏమన్నా అయితే తన పరిస్థితేంటి అనిపించగానే నిలువెల్లా వణికిపోతోంది. ఎవరితోనన్నా ఈ విషయాలు చర్చించాలన్నా, ఏం చేయాలన్నా ఏమీ తెలియడం లేదు. తనకి ఎవరూ తన అనేవాళ్ళు లేరు. మనసులో ఉన్నదేదైనా పంచుకోడానికి ఎవరూ లేరు.
ఇంతకాలం కృష్ణస్వామిగారున్నప్పుడు ఇంటిల్లపాదీ తనను ఇంట్లో మనిషిగా చూస్ఘుంటే ఇలాంటి ఆలోచనలు రాలేదు. ఇప్పుడు తాయారమ్మ కూడా మంచం పట్టడంతో ఆమెతో ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. మాధవి అయినా ఉంటే బాగుండేది. తను కొంచెం చదువుకుని ఉంటే ఎంత బాగుండేది అనిపించసాగింది. ఇప్పుడు తనేదన్నా చదువుకోవచ్చా? కొద్దిగా తెలుగులో రాయడం, చదవడం వచ్చు. పోనీ కుట్టుపనో, ఇంకేదన్నా నేర్చుకుంటే?
అలాంటి ఆలోచనలతో కొంతకాలం గడిచాక నీలవేణి ఏదో ఒక శుభక్షణం చూసి తాయారమ్మనే అడగాలని నిశ్చయించుకుంది. కానీ, అలాంటి క్షణాలు ఎన్ని వచ్చినా అడగదానకి ఆమెకి ధైర్యం మాత్రం చాలడం లేదు. నీలవేణికి జీవితం అలా పరాధీనగా గడిచిపోతుండగానే మరికొంతకాలం గడిచింది.
ఈలోగా బ్యాంకులో వేణుకి పెళ్ళివాళ్ళ దగ్గర్నించి ఒత్తిడి మొదలైంది. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని కబురు చేశారు. వేణుకేం చేయాలో తోచలేదు. చక్రవర్తి సలహా అడిగాడు పెళ్ళికొడుకు తొందరపడుతున్నాడని.
"నేను మాత్రమేం చెప్పగలను వేణూ! మీ ఇంటి పరిస్థితి నీకే తెలియాలి. మీ మమగారు మామూలు మనుషుల్లో పడి ఇదివరకులా పనిచేయగలిగితే ఆ అమ్మాయినింక పెళ్ళిచేసి పంపించేయడం మంచిది. ఎందుకైనా మంచిది మీ అమ్మగారిని అడుగు" అన్నాడు.
వేణు ఆ రోజే తాయారమ్మని అడగడానికి ఆవిడ గదిలోకి వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి స్తంభించిపోయాడు.
తాయారమ్మ తలని ఎడం చేత్తో పైకి ఎత్తి, మంచానికి ఆనించి కూర్చోబెట్ట్టింది నీలవేణి. ఆవిడ ఒడిలో దిండుపెట్టి, దానిమీద సగ్గుజావ ఉన్న స్టీలు బౌలు పెట్టి స్పూనుతో తాగిస్తోంది. ఆవిడ నీరసంగా కళ్ళు మూసుకుని కొద్దిగా నోరు తెరిచి బలవంతంగా తాగుతోంది జావ. ఆ క్షణంలో వాళిద్దరినీఅలా చూశాక వేణుకి మతిపోయింది. అమ్మకేమైంది? ఆందోళనగా అనుకున్నాడు.
అప్రయత్నంగా అనేశాడు.
అప్పుడు నీలవేణి తలతిప్పి వేనువైపు చూసింది. కంగారుగా చూపులు తిప్పేసుకుని "అమ్మగారికి విరేచనాలు అవుతున్నాయి" అంది.
"ఎప్పటినుంచి?" అడిగాడు.
"ఈ రోజు ఉదయం నుంచే" నీలవేణి మళ్ళీ చెప్పింది.
వేణుకేం చేయాలో, ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కళ్ళు తెరవలేదు. ఓపిక లేనిదానిలా నిస్సత్తువగా ఓ పక్కకి తలవాల్చి కూర్చుంది.
వేణు బైటకి వచ్చేశాడు.