Previous Page Next Page 
అర్చన పేజి 91

    "కానీ, ఏంటో?" అంది నీలవేణి నిరాశగా.
    "అంతా నీ భయం. ఇది నీకే కాదు. పెళ్ళి చేసుకునే అమ్మాయిలందరికీ ఇలాగే ఉంటుంది. కాబట్టి అంత మర్చిపోయి, హాయిగా, ఆనందంగా ఉండు. పెళ్ళి  రెండు రోజులందనగా నీకు మెహందీ పెట్టిస్తాను. నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఉంది. తఃను చాలా బాగా పెడుతుంది సరేనా?"నీలవేణి చేయి అందుకుని అంది మాధవి.
    తల ఊపింది నీలవేణి. మళ్ళీ మాల చేతికి తీసుకుని ఇంకా కొన్ని పూలు కట్టి ఆ మాల మాధవికిచ్చింది.
    "థాంక్యూ" అంటూ ఆ మాల అందుకుని జడలో తురుముకుంది మాధవి.
    మరో చిన్న ముక్క తనకి, తాయారమ్మకి కట్టి "లోపలికి వెడదామా?" అంది నీలవేణి ముసురుకుంటున్న చీకట్లు చూస్తూ.
    "పద" అంటూ లేచింది మాధవి.

                                                                   * * * * *

    పెళ్ళి వారం అనగా జరిగింది ఆ సంఘటన. కృష్ణస్వామి రోజులాగే ఆ రోజు కూడా ఐదింటికే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానానికి వెళ్ళాడు. ఇంతలో హఠాత్థుఆ వినిపించింది ఆయన గొంతు "అమ్మా..." అంటూ గట్టిగా.
    అప్పటికే తానూ లేచి వాకిలి ఊడుస్తున్న నీలవేణి ఆయన పిలుపుకి చీపురు కింద పారేసి ఒక్క ఉదుటున పెరటి వైపు వెళ్ళింది.
    కృష్ణస్వామి బాత్ రూమ్ లోకి వెళ్ళబోతూ జారిపడ్డాడేమో ఆ పడడం, పడడం సిమెంటు తొట్టిమీద పడ్డాడు.
    నీలవేణి పరిగెత్తుకుని వెళ్ళి ఆయనని లేపి కూర్చోబెట్టింది.
    మళ్ళీ వెనక్కి పైకి చూస్ఘూ గట్టిగా పిలిచింది "అమ్మగారూ, వేణు బాబుగారూ..."
    ఆ పిలుపుకి అప్పుడే మెలకువ వచ్చిన తాయారమ్మ కంగారుగా లేచి కూర్చుంది మంచం మీద. నీలవేణి స్వరం మరోసారి వినిపించడంతో బలవంతంగా మంచం దిగి, మోకాళ్ళు పట్టేసినట్టు అయి, కుంటుకుంటూ పెరటివైపు వెళ్ళింది.
    "ఏమైందే?" గట్టిగా అడిగింది నిద్రమత్తు వదలని స్వరంతో.
    "అయ్యగారు పడిపోయారమ్మా" ఏడుపు గొంతుతో అంది నీలవేణి.
    "అయ్యో పడ్డారా?" కంగారుగా అని గట్టిగా "వేణూ!" అని అరిచిందావిడ.
    ఆమె పిలుపుకి వేణు ఉలిక్కిపడి లేచాడు. గబగబా బాల్కనీలోకి వచ్చి చూడగానే బాత్ రూము వైపు వెళ్ళే చోట వాష్ ఏరియాలో సిమెంటు తొట్టి దగ్గర నిస్సహాయంగా కూలబడిన కృష్ణస్వామి, కన్నీళ్ళతో ఆయన పక్కనే నిలబడ్డ నీలవేణి, నడవలేక ఆయనవైపు నడుస్తూన్న తాయారమ్మ కనిపించారు.
    గబగబా మెట్లు దిగి, ఒక్క అంగలో వచ్చి తండ్రిని రెండు చేతుల్తో లేవనెత్తాడు.
    ఆయన తన రెండు చేతులూ వేణు భుజమ్మీద వేసి, కుంటుకుంటూ నడుస్తూ వసారాలోకి వచ్చాడు.
    అప్పటికే నీలవేణి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి ఒక కేన్ కుర్చీ తెచ్చి అక్కడే వేసింది.
    "దెబ్బ తగిలిందా నాన్నగారూ?" ఆయన్ని కుర్చీలో కూర్చోబెడుతూ అడిగాడు వేణు.
    "తగిలినట్టుందిరా, నడుం దగ్గర కలుక్కుమంది. లేవలేకపోతున్నాను" బాధ అణుచుకుంటూ అన్నాడాయన.
    "ఇప్పుడే డాక్టర్ దగ్గరకు వెడదాం నాన్నా! నేను బట్టలు మార్చుకుని కారు బైటికి తీస్తాను" అంటూ వేణు చకచకా వెళ్ళి బట్టలు మార్చుకుని కారు గరాజ్ లోంచి బైటకి తీశాడు. తిరిగి వచ్చి ఆయన్ని పట్టుకుని లేపి తాయారమ్మ సాయంతో జాగ్రత్తగా కారు దాకా తీసుకొచ్చి కారులో కూర్చోపెట్టాడు.
    "నేను కూడా రానుట్రా?" అడిగింది తాయారమ్మ.
    "ఎందుకమ్మా! నేను చూపించి తీసుకొస్తాను. కంగారేం లేదు. పెద్ద వయసు కదా! బెణికి ఉంటుంది. తగ్గిపోతుందిలే" అంటూ డ్రైవింగ్ సీటులోకి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు.
    "ఏంటో ఇవాళ నిద్ర లేచి ఎవరి మొహం చూశారో పొద్దున్నే" అంటూ తాయారమ్మ నీరసంగా లోపలికి నడిచింది.
    నీలవేణి మనసు చివుక్కుమంది.
    ఆవిడ ఆ మాట చాలా క్యాజువల్ గా అన్నా ఆ అమ్మాయికెందుకో తనే ఆయన పడడానికి కారణమేమో అనిపించసాగింది. నిజానికి అలా అనుకోడానికి కారణం ఏమీ లేదు. పడినప్పుడు తనేం చేయలేకపోయానన్న న్యూనతా భావం తప్ప మరోటి కాదు. కానీ, నీలవేణి అలా అనుకుంది.
    పనిచేస్తూనే ఉన్నా మనసంతా వేణు, కృష్ణస్వామి తిరిగి రావడం కోసం వేయి కళ్ళతో ఎదురుచూడసాగింది.
    దాదాపు గంట తరువాత వేణు ఫోన్ చేశాడు.
    తాయారమ్మ మాట్లాడింది. "నాన్నని హాస్పిటల్ లో అడ్మిట్ చేశానమ్మా. రెండు రోజులుండాలన్నారు డాక్టర్లు" అంటూ అతను చెప్పడంతో ఆవిడ గాభరాపడిపోయి ఏడవసాగింది.
    నీలవేణికి ఆవిడ దుఃఖం చూస్తుంటే తనకీ బాగా దుఃఖం వచ్చింది.
    "ఏడవకండమ్మగారూ! అయ్యగారికి తగ్గిపోతుంది. భయపడమాకండి" అంటూ తనకి తోచిన విధంగా ఓదార్చడానికి ప్రయత్నించసాగింది.
    సుమారు తొమ్మిది దాటుతోంటే తాయారమ్మ సూచనతో మాధవికి ఫోన్ చేసి విషయం చెప్పింది.
    తిరుగుటపాలో వచ్చింది మాధవి "ఏమైంది పిన్నిగారూ! ఎలా పడ్డారు? అసలేమైంది?" అంటూ.
    నీలవేణి జరిగింది చెబుతుండగా వేణు వచ్చాడు. "ఏం జరిగింది వేణూ! డాక్టర్ ఏమన్నారు?" అడిగింది మాధవి.
    వేణు ఏం లేదన్నట్టు తలూపుతూ "నడుం దగ్గర ఎముక జరిగిందిట. ఎక్స్ రేలు, ఇ.సి.జిలు అవుతున్నాయి" అన్నాడు.
    "ఇ.సి.జి. దేనికి?" ఆశ్చర్యంగా చూసింది మాధవి.
    "వయసు కదా! పెద్దవారు. ఏం జరక్కూడదని ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేస్తారు. నీకు తెలియందేముంది మాధవీ!" అంటూ మాధవి మొహంలోకి చూశాడు.
    అప్పుడే మాధవి కూడా వేణు వైపు చూడడంతో అతని సైగ అర్ధం చేసుకున్న దానిలా అప్పటికి ప్రశ్నల పరంపర ఆపేసింది. కాస్సేపయాక తాయారమ్మ పూజ చేసుకోడానికి, నీలవేణి వంటగదిలోకి వెళ్ళడంతో వేణు మాధవికి చెప్పాడు.

 Previous Page Next Page