ఇదంతా ఏంటండి అని చెమర్చిన కళ్ళతో అడిగిన మాధవి చెక్కిళ్ళు నిమురుతూ నవ్వింది.
"నీ దగ్గర నాకు ఆడపిల్లలు లేని లోటు తీర్చుకుంటున్నానమ్మా" అంది.
మాధవి మనసు ఆర్ద్రమైంది. ఎంత మంచిది ఈమె అనుకుంది.
శ్రావణ మాసంలో ముహూర్తం. ఇంకా ఇరవై రోజులుంది పెళ్ళికి.
నీలవేణి అసలు ఆ విషయమే తెలియనట్టు చాలా మామూలుగా తన రొటీన్ పనుల్లో బిజీగా ఉంటోంది. తనకి పెళ్ళి అన్న ఆలోచనగానీ, తన జీవితం సెటిల్ అవబోతోందన్న ఉద్విగ్నత కానీ, ఆరాటం కానీ ఏమీ లేకుండా నిర్వికారంగా ఉన్న నీలవేణిని చూస్తుంటే మాధవికి ఆశ్చర్యం కలగసాగింది.
ఓ రోజు అడిగేసింది. గార్డెన్ లో కూర్చుని తాయారమ్మ, మాధవి మాట్లాడుకుంటున్నారు. బాబుని తీసుకుని నీలవేణి దొంగా, పోలీస్ ఆడుతోంది. తుళ్ళుతూ, నవ్వుతూ ఆడుకుంటోన్న ఆమెని చూసి అంది మాధవి.
"ఈ అమ్మాయి పెళ్ళికి పూర్తిగా అంగీకరించిందా పిన్నిగారూ?"
ఆవిడ నిట్టూర్చింది.
మాధవి ఆమెవైపు వింతగా చూసింది.
"ఏంటండి? ఏమైంది?" అడిగింది.
"ఏమోనమ్మా! పెళ్ళి పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎందుకో ఆ రోజు పెళ్ళిచూపులనాడు ఒకటే ఇదిగా ఏడ్చింది."
"ఎందుకు?" ఆశ్చర్యంగా చూసింది.
"ఏమో! నాకు భయంగా ఉంది అమ్మగారూ!" అంటూ ఏడ్చింది.
"అంతేనా?" ఊపిరి పీల్చుకుంది మాధవి. ఆవిడ అలా అనగానే ఒక్క క్షణం మాధవికి భయం, అనుమానం కూడా కలిగాయి. ఈ అమ్మాయి వేణు పట్ల ఆకర్షితురాలు కాలేదు కదా అనుకుంది. ఆవిడ భయపడింది అనగానే హమ్మయ్య అనుకుంది.
కాస్సేపు మాట్లాడి ఆవిడ స్నానం చేయడానికి లోపలికి వెళ్ళగానే నీలవేణి దగ్గరకు నడిచింది మాధవి. బాబు అప్పుడే అటుగా వచ్చిన కృష్ణస్వామి దగ్గరకు పరిగెత్తాడు.
"రా నీలవేణీ! కాస్సేపు అక్కడ కూర్చుందాం!" అంది మాధవి ఓ పక్కగా అల్లుకున్న జాజిపందిరి కింద ఉన్న సిమెంటు బెంచీ చూపిస్తూ.
"రండి" అంటూ ముందుకు నడిచి బెంచీ మీద రాలిన పూలు ఏరసాగింది నీలవేణి.
కొంత భాగం తన చీరచెంగుతో తుడిచి "కూర్చోండి" అంది.
"నువ్వూ కూర్చో" అంది మాధవి తను భారంగా కూర్చుంటూ.
"ఇప్పుడే వస్తాను. దారం తెస్తాను. పూలు చాలా ఉన్నాయి కదా! మాల కడతాను" అంటూ లోపలికి పరిగెత్తింది నీలవేణి.
ఆమె వెళ్ళినవైపు చూస్తూ ఈ అమ్మాయికి హైదరాబాదు నీళ్ళు బాగానే సరిపడ్డాయి అనుకుంది మాధవి.
కొన్ని క్షణాల్లోనే దారపుండతో వచ్చిన నీలవేణి ఏరిన పూలన్నీ ఓ పక్క కుప్పగా పోసి తను మాధవికి కొంచెం ఎడంగా కూర్చుని మాల కట్టసాగింది. ఎంతో నేర్పుగా, చకచకా మాల కడుతున్న నీలవేణిని ఆసక్తిగా చూడసాగింది మాధవి. "ఇంత బాగా మాల కట్టడం ఎక్కడ నేర్చుకున్నావు?"
నీలవేణి నవ్వింది. "కొన్ని పనులు కొందరికి పుట్టుకతోటే అబ్బుతాయక్కా! మీకు చదువబ్బినట్టు."
మాధవి ఆశ్చర్యపోయింది. ఎంత చక్కటి సమాధానం! ఈ అమ్మాయి తెలివైందే అనుకుంది.
"నీ పెళ్ళికి నా నుచి ఏం బహుమతి కావాలి నీలవేణి?" అడిగింది మాధవి.
నీలవేణి మొహం మ్లానమైంది. ఏం సమాధానం చెప్పకుండా తలవంచుకుని మాల కట్టసాగింది.
మాధవి కొన్ని క్షణాలు సమాధానం కోసం ఎదురుచూస్తూ పరిసరాలు గమనిస్తూ, మధ్య మధ్య ఆమె మొహంలో భావాలు పరిశీలించసాగింది.
చల్లగాలి వీస్తోంది. ఉండుండీ జాజిపూల పరిమళం వస్తోంది.
బంతిపూలు బోర్డరులా ఉన్నాయి ఆ లాన్ కి. పసుపు, నారింజ రంగుల్లో అందంగా, శోభాయమానంగా ఉన్నాయి గులాబీలైతే లెక్కలేదు. అన్ని రంగులూ తెప్పించి వేయించాడు వేణు. గులాబీల పట్ల మొత్తం అతనిదే శ్రద్ధ. రోజూ ఇంటికి రాగానే గులాబీ మొక్కలన్నిటినీ చూస్తూ, అవసరమైతే మందులు చల్లడం, కొమ్మలు కట్ చేయడం, గడ్డిమొక్కలు మొలిస్తే పీకేయడం వంటి పనులన్నీ చేస్తుంటాడు వేణు.
దూరంగా కృష్ణస్వామి బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథ చెబుతున్నట్టున్నాడు వాడు శ్రద్దగా వింటున్నాడు.
మాధవి నీలవేణి వైపు చూసింది. మాల కడుతోన్న ఆమె కుడిచేతి మీద చిన్న నీటిబొట్టు.
మాధవి కళ్ళెత్తి చూసింది. నీలవేణి కళ్ళనుంచి నీళ్ళు బొట్లుగా కారుతున్నాయి.
"నీలవేణీ....!" మాధవి ఆ చేతిమీద తన చేయి ఉంచి గాభరాగా పిలిచింది.
నీలవేణి పూలమాల పక్కన పెట్టి చెంగుతో కళ్ళు తుడుచుకుంది.
"ఎందుకేడుస్తున్నావు?" అడిగింది మాధవి.
"ఏం లేదు."
"చెప్పు! నేను నీకు అక్కని కదా! చెప్పు. ఎందుకేడుస్తున్నావు? నీకీ పెళ్ళి ఇష్టం లేదా?"
"అది కాదు" గబగబా తల ఊపుతూ అంది నీలవేణి.
"మరెందుకేడుస్తున్నావు?"
"ఏం లేదక్కా!"
"అక్కా అని పిలిచాక అబద్ధం చెప్పకూడదు చెప్పు."
బొంగురు పోయిన గొంతుతో అంది "ఈ ఇల్లు, బాబు, అయ్యగారు, అమ్మగారు ఇదంతా వదులుకుని ఎక్కడికో, ఎవరితోటో బతకడానికి వెళ్ళడం అని తల్చుకుంటేనే నాకు భయంగా ఉంది. ఇక్కడనుంచీ వెళ్ళాలని లేదక్కా!"
మాధవి హమ్మయ్య అన్నట్టు గట్టిగా ఊపిరి పీల్చుకుని అంది "పిచ్చిదానా! కని పెంచిన తల్లితండ్రులను, రక్తం పంచుకు పుట్టినవాళ్ళను కూడా వదిలి అత్తగారింటికి వెళ్ళాల్సిందే ఆడపిల్లలు. అలాంటిది ఏదో కొంతకాలం వీళ్ళింట్లో ఆశ్రయం పొందిన నీకు వాళ్ళ పట్ల అంత మమకారం, ఆపేక్ష ఉంటే ఎలా?"
"కానీ, అక్కడ వాళ్ళెలాంటివాళ్ళో, ఏంటో నాకేం తెలియదు. నాకు నలుగురిలో మాట్లాడడం, ప్రవర్తించడం కూడా రాదు."
"అదే వస్తుంది. నాలుగు రోజులు వాళ్ళతో గడిపితే నీకు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు తెలుస్తాయి. అదేం కోర్సా! చదువుకోవాలి, బట్టీ పట్టాలి అనుకోడానికి."