Previous Page Next Page 
అర్చన పేజి 89

    ఆమెని ఇంటిదగ్గర జాగ్రత్తగా దింపి, గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు శ్రీపతి.
    అర్చన లోపలికొచ్చి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.
    ఇతనికి భయపడి తను వెళ్ళిపోడం అంటే ఓటమిని అంగీకరించడం. కానీ, శ్రేయోభిలాషిగా శ్రీపతి చెప్పిన మాటని మన్నించాలి. లేకుంటే ఇబ్బంది పడాల్సింది తనే. గొడవలు వచ్చాక బాధపడేకన్నా రాకుండా తప్పుకోడం మంచిది కదా! నొప్పించక, తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ!
    ఎలా? ఎవరిని కలవాలి? తనకి ఇక్కడనుంచి బదిలీ కావాలి. ఆలోచిస్తూనే స్నానం చేసి, ఫ్రెష్ అయింది.
    కాసేపట్లో వంటమనిషి ఆమెకి యాపిల్ ముక్కలు, కీరా, క్యారట్ ముక్కలు కట్ చేసి ప్లేటులో పెట్టుకుని వచ్చింది. దాంతోపాటే ఒక పెద్ద గ్లాసు నిండా మజ్జిగ కూడా తెచ్చి బల్లమీద పెట్టి వెళ్ళిపోయింది.
    కిటికీలోంచి బైట లాన్ లో పరచుకున్న వెన్నెల చూస్తూ, ఆలోచనలు ముసురుకుంటుంటే తఃరిమేస్తూ ఒక్కోముక్కే తింటూ కూర్చుండిపోయింది అర్చన.
    మర్నాడు ఉదయం అర్చన అక్షయ్ కుమార్ ని, హంసని వాళ్ళింట్లో కలిసింది.
    హంస నైటీతో, అక్షయ్ పైజామా, లాల్చీతో చాలా క్యాజువల్ గా ఉన్నారు. అర్చన వెళ్ళేటప్పటికి పనివాళ్ళు సామాను సర్దుతోంటే వాళ్ళిద్దరూ అటూ, ఇటూ తిరుగుతూ వాళ్ళకేవో సూచనలు ఇస్తూ కొంచెం హడావుడిగా కనిపించారు.
    "సారీ, టైం కాని టైంలో వచ్చానా?" నొచ్చుకుంటూ అంది అర్చన.
    "నో నో ఇట్స్ ప్లెజర్. రండి" ఆదరంగా ఆహ్వానించాడు అక్షయ్.
    హంస ఆమెని ఆప్యాయంగా కౌగలించుకుంది.
    "నాకు కొంచెం బెంగగా ఉంది అర్చనగారూ! యూ ఆర్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ" అంది.
    అర్చన కూడా మనస్ఫూర్తిగా అంది "నాకూ అలాగే ఉంది. అయామ్ మిస్సింగ్ యూ."
    "రండి కూర్చోండి. మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను" అర్చన చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి ఆమె పక్కనే కూర్చుంది.
    "అర్చనగారూ! మీరు నిన్న చాలా ఇన్ కన్వీనియన్స్ ఫీలైనట్టున్నారు" అడిగాడు అక్షయ్ తను కూడా మరో సోఫాలో కూర్చుంటూ.
    "ఎందుకలా అనుకుంటున్నారు?" అడిగింది అర్చన.
    అక్షయ్ నవ్వాడు.
    "చూడండి. నేను మీకన్నా సీనియర్ ని కదా! నాకు అందరి గురించి తెలుసు. మేమిద్దరం ఒకే బ్యాచ్ వాళ్ళం. హరిబాబు గురించి కథలు కథలుగా తెలుసు. కానీ, హి ఈజ్ లక్కీ ఫెలో. ఎప్పుడూ పట్టుపడలేదు. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్. సర్వీసులో తప్పకుండా అతను దెబ్బతింటాడు."
    అర్చన మాట్లాడలేదు. అతను చెప్పేది వినసాగింది.
    అక్షయ్ హరిబాబు గురించి చాలా విషయాలు  చెప్పాడు. "మీరు ఎదురు చెప్పారంటే తన కులం పేరుతో తిట్టారని మీమీద కేసు పెడతాడు జాగ్రత్త" అన్నాడు.
    అర్చన నవ్వింది. "సార్ అతనికి కమ్యూనిటీ బలం ఉంటే నాకు జండర్ బలం ఉంది. ఆడవాళ్ళని హెరాజ్ చేస్తున్నాడని నేను తిరిగి కేసు పెట్టచ్చు కదా!"
    "యస్. హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్. మీరేం భయపడకండి" హుషారుగా అంది హంస.
    "యూ కెన్ డూ ఎనీ థింగ్. బట్ మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనకి మాన్ కెరియర్ ఇంపార్టెంట్ ఎదగాల్సినవాళ్ళం. అలాంటివాడి వలన దిగజారిపోకూడదు. అసలు కేసులు, గొడవలు అనే వాటి జోలికి పోకుండా మీరు మీ ప్రయత్నాలు ప్రారంబించండి. నేను కూడా హెల్ప్ చేస్తాను. అయినా మీకింక జె.సి. వచ్చేస్తుంది" అన్నాడు.
    అతనలా తనపట్ల ప్రత్యేకమైన అభిమానం, శ్రద్ధ చూపించడం అర్చనకి ఆనందంగా అనిపించింది. నిజంగా అక్షి లాంటి ఆఫీసర్ మళ్ళీ ఎదురవుతాడా అనిపించింది.
    "థాంక్యూ సర్. థాంక్స్ ఎ లాట్. నేను జాగ్రత్తగా ఉంటాను. వీలైనంత త్వరగా ఇక్కడినుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాను" అంది.
    పనమ్మాయి మూడు గాజుగ్లాసుల్లో ఆరెంజ్ జ్యూస్ తెచ్చింది.
    కాస్సేపు కూర్చుని, తను హంస కోసం తెచ్చిన వెండి కుంకుమభరిణ ఇచ్చింది. నెమలి ఆకారంలో ఉన్న ఆ భరిణ హంసకి బాగా నచ్చింది. "థాంక్యూ అర్చనా!" అంది మురిపెంగా అందుకుంటూ.
    "హైదరాబాదు వచ్చినప్పుడు మీరు తప్పకుండా రావాలి మా ఇంటికి" అంది హంస.
    "తప్పకుండా వస్తాను" అంటూ ప్రామిస్ చేసింది అర్చన. ఇద్దరి దగ్గరా సెలవు తీసుకుని వచ్చేసింది.
    అక్షయ్ అన్నట్టుగా వారం రోజుల్లో అర్చానకి జాయింట్ కలెక్టర్ గా విజయవాడ పోస్టింగ్ ఇచ్చారు.
    ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆ క్షణంలో విజయదుర్గా సృష్టించిన కలకలం అంతా చల్లారిపోయింది. తన కల..... తన కల సాకారం అయింది. ఇంతకన్నా ఏం కావాలి? కుక్కలు మొరగనీ, తను ఏనుగు..... ఏనుగు ఎక్కడున్నా ఏనుగే! దాని రాజసం ఎవరికుంటుంది?
    దాని విలువ ఎవరికుంటుంది? డోంట్ కేర్ అర్చనా! డోంట్ కేర్! నీ భవిష్యత్తు బాటనిండా భగవంతుడు సుకుమారమైన పూల తివాచీ పరిచాడు. దానిమీద మహారాణిలా తలెత్తుకుని ఠీవిగా నడిచి వెళ్ళిపో. నీ గమ్యం చేరు. అప్పుడు ఈ కుక్కలే నీకు దాసోహం అంటాయి. వెళ్ళు అర్చనా! బీ బ్రేవ్. బెస్టాఫ్ లక్! ఎక్కడి నుంచో ఆకాశవాణి ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపించింది. హరిబాబు ఆకలిచూపుల నుంచి త్వరగా విముక్తి లభించినందుకు శ్రీపతి అభినందించాడు. ఆమెకు చక్కటి వీడ్కోలు పారీ ఏర్పాటుచేశాడు.
    అభినందనల పరంపరలో పూలగుత్తుఅల పరిమళాలతో ఉక్కిరి బిక్కిరి అయింది, నోరంతా తీయగా తన అభిమానులు పంచిన స్వీట్స్ తో.
    మనసంతా ఆహ్లాదంగా తేలిగ్గా హాయి హాయిగా ఆమని సాగే... పెదాలు అస్పష్టంగా పాడసాగాయి.
    హాయిగా నిద్రపోయింది.
     
                                                                           * * * * *

    మాధవి మళ్ళీ నెల తప్పింది. నాలుగో నెల.
    నీలవేణి నిశ్చయతాంబూలాలు తీసుకున్న రోజే ఈ విషయం తాయారమ్మకి తెలిసింది.
    ఆవిడ చాలా సంతోషించింది. ఓ మంచి రోజు చూసి అయిదో నెల రాగానే సీమంతం జరిపించింది. నలుగురు ముత్తైదువులను పిలిచి, చలిమిడి, స్వీట్లు చేసి, ఒక మంచి చీర పెట్టి, చేతులకు గాజులు వేయించింది.

 Previous Page Next Page