ఆశ్చర్యంగా చూసింది అర్చన. "ఏం? ఎందుకని?"
శ్రీపతి కాస్సేపు ఏమీ మాట్లాడలేదు. కానీ, కొంచెం మొహమాటంగా మరికొంచెం ఇబ్బందిగా చెప్పాడు.
"హరిబాబుగారికి మంచి పేరు లేదు. సబ్ కలెక్టర్ గా చేసినప్పుడు అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. పైగా ఉమనైజర్ కూడా అని విన్నాను. మీరసలే సెన్సిటివ్. ఇబ్బంది పడతారేమో అని నాకు భయంగా ఉంది."
అర్చన అతనివైపు కృతజ్ఞతగా చూసింది. తనకన్నా వయసులో కనీసం ఆరేడేళ్ళు పెద్దవాడు, నిజాయితీపరుడు, కష్టపడి పనిచేస్తాడు, తెలివైనవాడు. ఎలాంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించగల నేర్పరి. తనీవేళ ఈ ఊళ్ళో సమర్దురాలైన ఆఫీసర్ గా పేరు తెచ్చుకుందంటే అందుకు కారణం శ్రీపతే! తని సహాయసహకారాలు మర్చిపోలేనివి. అలాంటిది అతనే తనతో ఇలా మాట్లాడుతున్నాడంటే రాబోయే కలెక్టర్ నిజంగానే అంత మంచివాడు కాదేమో! పైగా శ్రీపతి అతని గురించి తనతో ఇలా చెడగా చెప్పడంలో వచ్చే లాభం ఏముంది?
"మీరన్యధా భావించకండి. నేనిలా నా పై ఆఫీసర్ గురించి చెప్పకూడదు. కానీ, మీరంటే నాకు గౌరవం. మీ మనస్తత్వం బాగా తెలిసినవాడిగా చెపుతున్నాను."
నవ్వింది అర్చన.
"నేనేం అనుకోడం లేదు శ్రీపతిగారూ! థాంక్స్ నా మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నందుకు తప్పకుండా ఆ ప్రయత్నాలో ఉంటాను. దుష్టులకి దూరంగా ఉండమన్నారు కదా పెద్దవాళ్ళు!"
శ్రీపతి తన మాటకి ఆమె ఇచ్చిన గౌరవానికి ఆనందం వెలిబుచ్చుతూ చూశాడు. "థాంక్యూ మేడమ్!" అన్నాడు చాంబర్ లోంచి బైటకి వెళ్ళిపోతూ.
అతనెక్కువ సేపు చాంబర్ లో ఉండకపోవటం చాలాసార్లు గమనించింది అర్చన. ఫైల్స్ తీసుకురావడం, సంతకాలు తీసుకోడం, వెంటనే వెళ్ళిపోదాం, లేదంటే ఏదన్నా మీటింగ్స్ ఉంటే ఆ మీటింగ్ లో కూర్చుని పాయింట్స్ నోట్ చేసుకోడం, మినిట్స్ తయారుచేయడం అంతే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవసరానికి మించి ఒక్కమాట మాట్లాడకపోదాం అతని సంస్కారంగా బావిస్తుంది అర్చన.
అర్చనకి తన వలన చెడ్డపేరు రాకూడదని, ఆ ఆఫీసులో రూమర్లు పుట్టించేవాళ్ళు చాలామంది ఉన్నారని, రూమర్లు పుట్టించడానికే వాళ్ళు పుట్టారని అతనికి తెలుసు. అతని పదిహేనేళ్ళ సర్వీసులో ఎందరినో చూశాడు. ఎన్నో మాటలు పడ్డాడు. కానీ ఏమీ పట్టించుకోడు. అన్నిటినీ ఎదుర్కొంటూ తనడైన శైలిలో పనిచేసుకుంటూ పోతాడు.
అతనికి అర్చనంటే చాల గౌరవం. ఆఫీసులో అర్చన గురించి చాటుగా విమర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారని అతనికి తెలుసు. అర్చన అందమైన అమ్మాయి. ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడూ బంధువులు, స్నేహితులు ఎవరూ వచ్చ్నట్టు చూడలేదు. పెళ్ళి అయిందో, లేదో తెలియదు. ఈ కారణాలు చాలు ఆమె గురించి మాట్లాడుకోడానికి అని అతనికి తెలుసు. అలా మాట్లాడుకోవద్దని, అది సభ్యత కాదని అతను చెప్పలేడు. వాళ్ళంతా చాలా సామాన్యులని, అలా మాట్లాడుకొడం వాళ్ళ నైజం అనీ బావిస్తాడు. ఈ సమాజంలో అలా మాట్లాడుకునేవాళ్ళే చాలామంది ఉంటారని, అందులో ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ఎక్కువమంది ఉంటారని అతనికి బాగా తెలుసు. అందరి స్వభావాలు మార్చే ప్రయత్నం అతనేం చేయడు.
కాకపోతే ఇప్పుడు రాబ్యే హరిబాబు గురించి అతనికి ఇంకా బాగా తెలుసు, లంచగొండి, అమ్మాయిల పిచ్చి. అతనికి ఎథిక్స్ లేవని, తనకి ఎదురుచేప్పిన వాళ్ళమీద తనని కులం పేరుతో దూషించారని కేసులు పెట్టాడని చాలా విషయాలు తెలుసు. ఇంతకుముందు ఆర్.డి.వో. గా చేసిన సుకన్య అనే స్త్రీతో అతనికి సంబంధాలుండేవి. అతని అండ చూసుకుని ఆమె అక్కడ స్టాఫ్ ని హింసించేది. ఆమె చేత హింసించబడినవాళ్ళలో శ్రీపతి కూడా ఒకడు. అందుకే అతను ధైర్యంగా అర్చనతో ఆ విషయం చెప్పగలిగాడు. చెప్పాక అతని మనసు తేలిగ్గా ఉంది. చెప్పడం తప్పు కావచ్చు కానీ, చెప్పకపొతే మరీ తప్పు అని అతనికి అనిపించింది. చెప్పాడు నిర్ణయం ఆమెది.
శ్రీపతి ఆ తరువాత ప్రశాంతంగా పనిచేసుకోసాగాడు.
ఆవేళే అక్షయ్ కుమార్ రిలీవ్ అయే రోజు.
హరిబాబు జాయిన్ అయే రోజు. సి.టి.సిలు సంతకాలు చేశారు. ఛార్జీ ఇచ్చాడు అక్షయ్ కుమార్.
సాయంత్రం ఆరింటికి పెద్ద ఎత్తున సెండాఫ్ పార్టీ ఏర్పాటుచేశారు.
ఆ పార్టీకి అర్చన వెళ్ళాల్సి వచ్చింది. ఆమె వెనకే శ్రీపతి కూడా వెళ్ళాడు. తహసీల్దారు కూడా వచ్చాడు. నాగరాజు ల్యాండ్ విషయంలో సస్పెండ్ అవకుండా తనని తాను కాపాడుకున్నాడు తహసీల్దారు. కానీ, అతనికి అర్చన మీద బాగా కోపంగా ఉంది. అయినా ఆకోపం పైకి కనిపించనివ్వకపోవడం అతని ప్రత్యేకత. కొంతమంది మొహంలో భావాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. కానీ, తహసీల్దారులాంటి వాళ్ళ మొహంలో ఏ భావమూ కనిపించదు. పైకి చిరునవ్వుతో ఉంటారు. అలాంటి వాళ్ళనే గోముఖవ్యాఘ్రాలని, వయోవిషకుంభాలనీ అంటారు. ఆ ఉపమానాలు అతనికి సరిగ్గా సరిపోతాయి.
అక్షయ్ కుమార్ అర్చనని పరిచయం చేశాడు హరిబాబుకి.
అతను ఆమెని ఒక్క చూపుతో నఖశిఖపర్యంతం స్కాన్ చేసినట్టు చూస్తుంటే అర్చన ఇబ్బందిగా కదిలింది. ఆ తరువాత పూలదండలు వేయడం, బొకేలు బహూకరించడం జరిగింది. ప్రముఖులు కొందరు వెళ్ళిపోతున్న కలెక్టర్ గుణగణాలు పొగుడుతూ మాట్లాడారు. కొందరు కొత్తగా వచ్చిన కలెక్టర్ గుణగణాలు కీర్తించారు. పార్టీ పూర్తి అయేసరికి ఎనిమిది దాటింది.
శ్రీపతి నెమ్మదిగా ఆమె దగ్గరకు అవ్చ్చి హాస్యంగా అన్నాడు. "ఇప్పుడు డిన్నర్ కి ఆహ్వానిస్తాఉర్. మీరు ఏదన్నా రీజన్ చెప్పి తప్పించుకోండి ఏం ఫర్వాలేదు."
అర్చనకి కూడా ఎప్పుడెప్పుడు అక్కడినుంచి వెళ్ళిపోదామా అనిపిస్తోంది. అంతమంది జనంలో ఊపిరాడనట్టుగా ఉంది. ఈ భేషజాలు, ఈ కృత్రిమ మర్యాదలు ఆమెకి నచ్చలేదు. ముఖ్యంగా హరిబాబు మధ్య మధ్యలో తనవైపు అదోరకంగా చూడడం చాలా చిరాగ్గా ఉంది. అందుకే శ్రీపతి మాటకు విలువ ఇచ్చి డిన్నర్ కు ఆహ్వానించిన అక్షి కుమార్ కి చెప్పింది.
"నాక్కొంచెం ఫీవరిష్ గా ఉంది సర్! నేను రేపు ఉదయం మిమ్మల్ని హంసగారినీ కలుస్తాను సారీ! ప్లీజ్ ఎక్స్ క్యూజ్ మీ."
"ఓ... ఓకె. నో ప్రాబ్లం. మీరు వెళ్ళిపొండి" అన్నాడు అక్షయ్.
అర్చన అతనికి థాంక్స్ చెప్పి అక్కడ ఉన్న అందరికీ మర్యదగా తన ఇబ్బంది చెప్పి సెలవు తీసుకుంది.
హరిబాబు మొహంలో క్షణకాలం కదిలిన ప్రశ్నార్ధకం గమనించింది. కానీ అతనికి ఏమీ చెప్పకుండా నమస్కరించి సెలవు తీసుకుంది. అతని కళ్ళు మరోసారి స్కాన్ చేశాయి.
మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయింది.