అందమైన చీరలు చూస్తున్న ఆమె కళ్ళు తళుకులీనుతున్నాయి. కానీ, ఎక్కడో ఏదో నిర్లిప్తత కనిపిస్తోంది.
"నాకింత ఖరీదైన చీరలెందుకక్కా?" అంది మొహమాటంగా.
"పెళ్ళి కదా వేణీ! పెళ్ళికి ఇలాంటి చీరలు కట్టుకోవుగా" అంటూ నీలవేణి కట్టుకున్న కాటన్ చీర పట్టుకు చూపించింది మాధవి.
"అయినా, అనాధని. అమ్మగారు నాకింత మంచి చీరలు కొనివ్వడం నాకు బాధగా ఉంది" అంది.
"ష్... ఇక్కడ అలా మాట్లాడకూడదు. నువ్వు మా ఇంటి ఆడపిల్లవి. సరేనా చూడు! ఇదెంత బాగుందో! కొత్త కలర్ కాంబినేషన్ గచ్చకాయ రంగు మీద జరీ నెమళ్ళు, మెజంతా బార్డర్, బార్డర్ మీద చిన్న నెమళ్ళు. అద్బుతంగా ఉందా చీర."
నీలవేణిక్కూడా బాగా నచ్చింది. "ఖరీదెంత ఉంటుందో అక్కా! చాలా బాగుంది చీర" అంది. '
"ఖరీదు గురించి నీకెందుకు బాధ? నీకు నచ్చిందా చెప్పు!" అంది మాధవి.
తలూపింది నీలవేణి.
మాధవి రెండు పట్టుచీరలు, రెండు క్రేప్ చీరలు సెలక్ట్ చేసి, జరీ అంచున్న తెల్ల వెంకటగిరి చీర ఒకటి కొన్నది.
"ఇది తలంబ్రాల చీర నా తరఫున" అంటూ న్నీ ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బైటకొచ్చింది. మాధవిని అనుసరిస్తున్న నీలవేణి ఆమె చూడకుండా చెమర్చిన కళ్ళు చెంగుతో అద్దుకుని ఆమెని అనుసరించింది.
ఇద్దరూ కొబ్బరిబొండాలు కొట్టించుకుని, నీళ్ళు తాగి ఇంటికొచ్చారు.
ఆ చీరలు చూసి తాయారమ్మ చాలా మెచ్చుకుంది.
మర్నాడు ఆదివారం.
ఆ రోజే నీలవేణి పెళ్ళి నిశ్చయ తాంబూలాలు.
మాధవి, తాయారమ్మ కలిసి వంట చేసేశారు. పులిహోర, ముక్కల పులుసు, పప్పు, క్యాబేజీ కూర, బెండకాయ వేపుడు, టమాట పచది, పెరుగు, స్వీట్లు వేణు బైటనుంచి తెచ్చాడు.
పదింటికల్లా పెళ్ళివాళ్ళు వచ్చారు.
ముందు రోజు కొన్న పసుపుపచ్చ బార్డర్ ఉన్న లేతనీలంరంగు చీర కట్టుకుంది నీలవేణి. మాధవి నీలవేణికి చీర కట్టుకోడంలో సాయం చేసింది.
ఒక్కసారి నిలువునా ఆమెని చూస్తూ అనుకుంది మాధవి. 'ఎంత చక్కగా ఉంది ఈ అమ్మాయి! కానీ ఏదో లోపం' మాధవి మరోసారి పరిశీలనగా చూస్తుంటే నీలవేణి ఇబ్బందిగా తల వంచుకుంది. అప్పుడర్ధమైంది మాధవికి. ఆమె మెడ బోసిగా ఉంది.
మాధవి చటుక్కున తన మెడలో ఉన్న ముత్యాలదండ తీసి నీలవేణి మెడలో వేసింది.
నీలవేణి కంగారుగా అంది "అయ్యయ్యో అక్కా! నాకెందుకిప్పుడు వద్దు."
"మాట్లాడకు. పద కిందికి వెడదాం" అంటూ మాధవి నీలవేణి నోరు చేత్తో సున్నితంగా మూసింది.
నీలవేణికి మెట్లు దిగుతుంటే కాళ్ళల్లో వణుకు, అరిచేతుల్లో, నుదుటి మీద చిరుచెమట, గుండెల్లో గాభరా తడబడుతూ దిగసాగింది.
భయం భయంగా అనిపించింది. ఈ అనుభవం కొత్తగా, వింతగా ఉంది. కానీ, ఎందుకో ఇందులో ఆమెకేమీ ఆనందం కలగడం లేదు. ఏదోగా ఉంది. ఈ కార్యక్రమానికి, ఈ వేడుకకి మూలకారణం అయిన తాను అందుకు ఏ విధంగా అర్హురాలో ఆమెకే అర్ధం కాలేదు.
అక్కడున్నవాళ్ళంతా దేవుళ్ళలాగా, తనొక్కతే అడవినుంచి పారిపోయి వచ్చి వాళ్ళందరి అనుగ్రహానికి, ఆదరానికి పాత్రురాలైన ఓ వింతజీవిలా అనిపించసాగింది.
కృష్ణస్వామిగారి పౌరోహిత్యంలో నిశ్చయ తాంబూలాలు జరిగిపోయాయి. పెళ్ళివారు నీలవేణికి ఉల్లిపొర రంగు ఫ్యాన్సీ చీర పెట్టారు.
వేణు పెళ్ళికొడుక్కి మంచి బట్టలు తెచ్చాడు.
అందరూ కూర్చుని లగ్నపత్రిక రాసుకున్నారు.
ఆ రోజుకి సరిగ్గా ఇరవై ఏడూ రోజులకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ముహూర్తం పెట్టాడు కృష్ణస్వామి.
దడదడలాడుతున్న గుండెలు చిక్కబట్టుకుని ప్రతిమలా కూర్చుంది నీలవేణి.
పెళ్ళికొడుకుని చూస్తుంటే ఎందుకో ఆ పిల్లాడు నీలవేణికి అంతగా మ్యాచ్ అవలేదేమో అనిపించింది మాధవికి. ఆ అమ్మాయి చదువుకోకపోయినా, అణకువ, వినయం మూర్తీభవించిన అందంతో పెళ్ళికొడుకు పక్కన మెరిసిపోతోంది. అతను చామనఛాయగా, సన్నగా ఎటువంటి తేజస్సు లేకుండా మౌనంగా కూర్చున్నాడు. అతని మొహంలో ఏ భావం కనిపించలేదు. అటు ఆనందం కానీ, ఇటు మరోటి కానీ ఏమీ లేదు. చాలా నిర్వికారంగా జరిగే తంతుతో తనకేం సంబంధం లేనట్టు. మాధవి అసంతృప్తిగా నిట్టూర్చింది. పోనీలే మంచివాడైతే చాలు.
నిజానికి ఎంత పెద్దమనసుంటే ఓ అనాదకి ఇంత ఆర్భాటంగా తాంబూలాలు, పెళ్ళి చేయగలరు ఎవరైనా? కులపిచ్చి మహమ్మారిలా విశ్రుంఖలంగా ప్రబలిన ఈ సమాజంలో నీలవేణికి కులంతో సంబంధం లేకుండా పెళ్ళి కుదరడమే గొప్ప. పోనీలే ఆ అమ్మాయి సుఖంగా ఉంటే చాలు అనుకుంది.
ఆ తరువాత కార్యక్రమాలన్నీ నిరాటంకంగా జరిగిపోయాయి. పెళ్ళివాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోయారు.
నీలవేణి పట్టుచీర మార్చుకుని, సాదాచీర కట్టుకుని తిరిగి పనిలో పడింది.
మాధవి ఆమెని చూస్తూ అనుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో శాపవశాత్తూ భూమీద పడిన గంధర్వకన్యల కథలు చూసింది. కానీ, ఈ అమ్మాయి ఏ గంధర్వుడి వరంతోటో ఈ ఇంటికి వచ్చింది. కాకపోతే ఒకటే లోపం. చదువు! చదువు తెచ్చే వెలుగు ఒక్కటే ఆమె మొహంలో తక్కువైంది. కాకపోతే కనుముక్కు తీరుగానీ, తలకట్టు కానీ, అంతగా పొడుగూ పొట్టీకాని పర్సనాలిటీ కానీ, వంపుసొంపులు కానీ, ఈమె అందగత్తె కాదు అని చెప్పడం లేదు. అన్నివిధాలా జీవితం బాగుండి బాగా చదువుకుని ఉంటే ఈ అందానికి విద్య అభరణమై వెలిగిపోయేది కాదా అనుకుంది.
* * * * *
అక్షయ్ కుమార్ కి హైదరాబాద్ కలెక్టర్ గా పోస్టింగ్ వచ్చింది.
అతని స్టానంలో రిజర్వేషన్ కోటాలో సెలక్ట్ అయిన హరిబాబు అనే అతన్ని వేశారు.
ఆ విషయం తెలిసిన వెంటనే శ్రీపతి అర్చనతో అన్నాడు "మేడమ్! మీరు కూడా ఏదన్నా ప్రయత్నాలు చేసుకుని ఇక్కడినుంచి వెళ్ళిపోతే బాగుంటుంది."