"ఇప్పుడే తెస్తానుండండి" అంటూ చివ్వున బైటకి వెళ్ళి బాల్కనీలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి వేసింది. ఆవిడ మోకాళ్ళు పట్టుకుని కూర్చుంది.
"కూర్చో నువ్వు కూడా!" అంది నిలబడిన నీలవేణిని చూస్తూ.
"పర్లేదండి చెప్పండి" అంది నీలవేణి నిలబడే.
"ఏం లేదు. నిన్న పెళ్ళి చూపులు జరిగాయి కదా! వాళ్ళకి నువ్వు నచ్చావు. మరి నీ సంగతేంటి? నీకతను నచ్చాడా?" అడిగిందావిడ.
నీలవేణి ఆపాదమస్తకం వణికింది. నిన్నటినుంచీ ఆమె అదే ఆలోచిస్తోంది. రాత్రంతా కంటిమీద కునుకు కూడా లేదు. ఈ ఇల్లు, ఈ మనుషులు తప్ప మరో ప్రపంచం గురించి ఆలోచించలేదు. అది ఎలా ఉంటుందో కూడా ఆమెకి తెలియదు. అకస్మాత్తుగా అమ్మగారు వచ్చి నీకు పెళ్ళిచూపులు అని చెప్పగానే గుండె గుభేలుమంది. అసలు పెళ్ళిచూపులంటే ఏంటో కూడా తెలియదు. తనేం చేయాలో, ఎలా నిలబడాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటిది అత్యంత కష్టంగా పది నిమిషాలు నిలబడి వచ్చేసింది. ఆ తరువాత వాళ్ళల్లో పెళ్ళికొడుకు ఎవరు? అతనేం చేస్తాడు? అతనెక్కడ ఉంటాడు? ఏమీ ఆలోచించలేద. అసలా ఆలోచనలు రావడం లేదు. ఒక్కటే తెలుస్తోంది. ఈ ఇల్లు, ఈ మనుషులను వదిలి తను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి బతకగలదా? ముక్కూ మొహం తెలియని వాళ్ళతో అసలు ఎలా మసలుకోవాలో కూడా తెలియదు. పైగా ఇక్కడ అందరితో ఏదో తెలియని ఒక బలమైన అనుబంధం పెనవేసుకుపోయింది. ఆ బంధాన్ని తెంపుకుని వెళ్ళడం అంటే తన ప్రాణాలు ఇక్కడ వదిలి కేవలం కట్టెగా వెళ్ళాలి.
"చెప్పమ్మా! నీకు నచ్చాడా?" ఆవిడ మళ్ళీ అదే మృదుస్వరంతో అడిగింది.
నీలవేణి కళ్ళు నీటితో నిండి బొటబొటా కన్నీళ్ళు కారిపోయాయి.
ఆవిడ కంగారుగా కుర్చీలోంచి లేచి ఆమె దగ్గరగా వచ్చి అడిగింది. "అరెరె. ఎందుకేడుస్తున్నావు? ఏం జరిగింది?"
నీలవేణి సమాధానం చెప్పలేదు. ఆవిడ మాటల్లోని అభిమానంమ్ వాత్సల్యం ఆమె గుండెని తాకి, చల్లగాలి సోకిన మేఘంలా వర్షించసాగింది. గుండెల్లోంచి దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించసాగింది.
ఆవిడకి అయోమయంగా అనిపించింది. ఎలా ఓదార్చాలో, ఏం చేయాలో అర్ధం కాలేదు. "ఏం జరిగింది నీలవేణి?" అంది.
"అమ్మగారూ! వెక్కుతూ పిలిచింది నీలవేణి.
"ఏంటే చెప్పు. ఎందుకేడుస్తున్నావు? నీకీ సంబంధం ఇష్టం లేదా? చెప్పమ్మా!"
"నాకిష్టాలేంటమ్మగారూ! నా బతుక్కి మీరు పెళ్ళి చేయాలనుకోడమే గొప్ప. ఇంక నాకో ఇష్టం కూడానా!"
"తప్పు! అలా మాట్లాడకూడదు. ఏం నువ్వు మనిషివి కావా? నీకూ కోరికలు, ఆశలూ ఉండవా? నీకేదన్నా మనసులో ఇలాంటివాడు కావాలని ఉందా చెప్పు, ఏదో వదిలించుకోవాలని నీకు పెళ్ళిచేయాలనుకోడం లేదు. ఎక్కువ కాలం నిన్జిలా మా చాకిరీకి వాడుకుంటే ఈ సమాజం మమ్మల్ని దుమ్మెత్తి పోస్తుంది కదా! నువ్వే చెప్పు. అదీగాక నీక్కూడా పెళ్ళి వయసు వచ్చింది. నీకు మాత్రం కోరికలు లేవూ? నీది అనే ఇల్లు, వాకిలీ, నీ మనిషి నీకు కావాలి కదమ్మా! నీకు పెళ్ళిఛేయడం మా బాధ్యత కదా! అందుకే ఈ కార్యం భుజాల మీద వేసుకున్నాడు మా అబ్బాయి."
ఎంత మంచివాళ్ళు వీళ్ళు! ఎంతటి దైవస్వరూపులు! ఇక్కడినుంచి వెళ్ళిపోతే తనకిలాంటి వ్యక్తులు కనిపిస్తారా? ఆ పెళ్ళివాళ్ళు ఎలాంటివాళ్ళో, ఏంటో? టీవీ సీరియల్స్ లో చూపించినట్టు తనకి విషం పెట్టి చంపేస్తే? తనని చిత్రహింసలు పెడితే, నిత్యం తనని అనాధ అంటూ హింసిస్తే?
"అమ్మగారూ!" నీలవేణి కుప్ప కూలినట్టు ఆవిడ పాదాల మీద పడిపోయింది.
"అయ్యో! ఏం పనే ఇది. లే లే" ఆవిడ వంగి నీలవేణి భుజాలు పట్టుకుని లేవనెత్తింది.
"కళ్ళు తుడుచుకో. ఏడుపు ఆపుకో. మాట్లాడు. నీ మనసులో ఏం ఉందో చెప్పు."
తల అడ్డంగా ఊపుతూ అంది నీలవేణి "అమ్మగారూ! నాకు ఇక్కడనుంచి వెళ్ళాలంటే భయంగా ఉంది. నేను ఎక్కడా బతకలేను. నాకు పెళ్ళివద్దు. మీ పాదాల దగ్గర ఉండనివ్వండి. నాకింతకన్నా ఏం వద్దమ్మా! కాదనకండి. నాకు ఎక్కడ బతకాలన్నా భయమే."
ఆవిడ నివ్వెరపోయింది. ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. నీలవేణి పెళ్ళి అంటే ఎందుకింతగా భయపడుతోందో అసలు అర్ధం కాలేదు, నెమ్మదిగా అంది "అంత భయం దేనికే? వేణుబాబు మీద నమ్మకం లేదా? మంచివాడినే చూస్తాడు. నువ్వు సుఖంగా ఉండాలనేగా మా ఆశ."
"నేను ఇక్కడే సుఖంగా ఉంటానమ్మా!"
"కానీ, ఎలా కుదురుతుంది నీలవేణీ! నువ్విక్కడ ఇలా శాశ్వతంగా ఉంటే మా సంగతి పక్కన పెట్టు, వేణుబాబుకి చెడ్డపేరు రాదా? వయసులో ఉన్న నిన్ను మా ఇంట్లో ఎలా అట్టేపెట్టుకుంటాం పెళ్ళి చేయకుండా? మా పరువు, మర్యాదలు ఉంటాయా చెప్పు! నలుగురూ నాలుగు మాటలంటారమ్మా!"
దెబ్బతిన్నట్టుగా చూసింది. ఆవిడ మాటలు నీలవేణికి కరెంట్ షాకుల్లా తగిలాయి. తనకి పెళ్ళి ఇష్టం లేదు, కానీ, ఆవిడ చెబుతోన్న విషయాలు వింటోంటే తన వలన ఈ ఇంటికి చెడు జరుగుతొందనిపిస్తోంది. తనకి ఆశ్రయం ఇచ్చి, కళ్ళల్లో పెట్టుకు చూసిన ఈ కుటుంబానికి తనవల్ల అపకారం జరగడమా? అంతకన్నా తను పొడుచుకుని చావడం నయం. అందుకే గాభరాగా అంది "అమ్మా! అంతమాట అనకండి. నా వలన మీక్కానీ, బాబుగారిక్కానీ చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు. ఒకవేళ అదే జరిగేట్టయితే నా అభిప్రాయంతో పనిలేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నా పెళ్ళి చేయండి. నాకు మాత్రం ఎవరెలాంటివారో ఎలా తెలుస్తుంది?"
"నిన్ను వదులుకోవడం మాకూ ఇష్టం లేదు. కానీ, తప్పదు. ఇది కాకపోతే మరోటి. నువ్వు ఏదో ఒక సంబంధం ఒప్పుకుని పెళ్ళిచేసుకోవాలమ్మా!"
కన్నీళ్ళతో చూస్తూ స్థిరంగా అంది నీలవేణి "అమ్మా! నా వలన మీకు ఎట్లాంటి చెడూ జరగడం నేను భరించలేను. మీరెలా చెబితే అలా జరగనివ్వండి. మీ ఇష్టం. నా భవిష్యత్తు మీకే వదిలేస్తున్నాను."
"మనస్ఫూర్తిగా అంటున్నావా ఈ మాట?"
"అవును. మనస్ఫూర్తిగా అంటున్నాను. నాకు ఇక్కడినుంచి వెళ్ళడం ఇష్టంలేని మాట నిజం. కానీ, అది జరిగే పని కాదు కాబట్టి వెళ్ళాలి. నేనెక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. మీకన్నా నా బాబోగులు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందుకే మీరేం చెబితే అది చేస్తాను. నన్ను నమ్మండి."
ఆమె మాటలకి తాయారమ్మ ముగ్దురాలైంది.
ఎంత అణకువ, ఎంత మంచితనం! ఎంతటి పనిమంతురాలు, ఎంత బుద్ధిమంతురాలు. కురూపి కాదు. అంతో ఇంతో అందమైందే. ఈమెని భార్యగా పొందినవాడు, ఈమెని కోడలిగా పొందిన కుటుంబం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. కానీ, కానీ, ఎవరి పిల్లో, ఏం కులమో తెలియని ఈ పిల్లని చోసోతూ, చూస్తూ ఊహూ.... కుదరదు.