"నీలవేణీ!" తాయారమ్మ స్వరం వినిపించడంతో కంగారుగా బాత్ రూమ్ లోకి దూరి తలుపేసుకుంది. గబగబా పది నిమిషాల్లో తయారై, పసుపు పచ్చ షిఫాన్ చీర కట్టుకుని, జుట్టు వదులుగా అల్లుకుని కూర్చుంది.
తాయారమ్మ ఆయాసపడుతూ పైకి వచ్చింది "ఏం చేస్తున్నావే, పిలిస్తే పలుకవు?" అంటూ.
"అయ్యో! మీరొచ్చారేంటమ్మా? బాత్ రూములో ఉన్నాను వినిపించలేదు" అంటూ చటుక్కున ఆవిడ దగ్గరకు నడిచి చేయందుకుంది నీలవేణి.
తనకి సమీపంగా నిలబడిన నీలవేణిని ఒక్కసారిగా అలా చూడగానే ఆవిడ తన కళ్ళను తనే నమ్మలేనట్టు మ్రాన్పడిపోయి నిలబడింది. నిర్లక్ష్యంగా అల్లి వదిలేసిన పెద్ద జడ, పసుపు పచ్చ షిఫాన్ చీరలో బొమ్మలా ఉన్న శరీరం, సన్నగా కాటుక దిద్దుకున్న విశాలమైన కళ్ళు. చామనఛాయకి హైదరాబాదు నీళ్ళు వంటపట్టి కొంచెం ఎక్కువే తెల్లగా అనిపిస్తోంది. నీలవేణి ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఆవిడకి. వెంటనే చూపులు తిప్పుకుంటూ, "సర్లే పద పద వాళ్ళొచ్చారు" అంటూ తొందరపెట్టింది.
"నేను రెడీగా ఉన్నానమ్మా" నిర్లిప్తంగా అంది నీలవేణి. హైదరాబాదు వచ్చాక నీలవేణి మాటల్లో యాస పూర్తిగా పోయింది.
పద అంటూ ఆవిడ తిరిగి మెట్లు దిగుతోంటే తన చేయి అందించి ఆమెని అనుసరించింది.
మౌనంగా వాళ్ళ ముందు తల వంచుకుని నిలబడి, వాళ్ళదిగిన "నీ పేరేంటి? ఏమన్నా చదువుకున్నావా?" అనే రెండు ప్రశ్నలకి నోటితో ఒక జవాబు, తల ఊపడంతో మరో జవాబు చెప్పి కృష్ణస్వామి సైగ చేయడంతో పైకి వెళ్ళిపోయింది.
"అమ్మాయి నచ్చిందండి మాకు" అన్నారు పెళ్ళివారు.
నచ్చకేం చేస్తుంది? బంగారు బొమ్మలా ఉంది. కాస్త చదువుకుని ఉంటే కలెక్టర్ అంతటివాడు వచ్చేవాడు అనుకుంది మనసులో తాయారమ్మ.
కృష్ణస్వామి చెపుతున్నాడు. నీలవేణి వాళ్ళ కుటంబంలోకి ఎలా వచ్చింది? ఆమె పూర్వాపరాలు చెబుతూ "పిల్ల బంగారం. మేము కట్నాలు ఇవ్వము. పెళ్ళి మాత్రం మా పిల్లకి చేసినంత ఘనంగా చేస్తాం. పిల్ల మెడలో మాకు తోచినట్టు అంతో ఇంతో బంగారం పెడతాం. ఆ పిల్ల కులం ఏదైనా ఇంతకాలం మాలో కలిసిపోయి, మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంది. కాబట్టి ఆ పిల్ల మా పిల్లే. పండగలూ, పబ్బాలకూ పిలుస్తాం."
"దానికేం సార్! మాకూ మీలాంటి వాళ్ళ కుటుంబం నుంచి అమ్మాయి లభించడం గొప్ప. ఏ కులం అయినా మీ ఇంట్లో ఉంటోంది కాబట్టి మీ సంస్కారం, మీ మంచితనం ఆమెలో కూడా మాకు కనిపిస్తున్నాయి. మా వాడికి తల్లీ, తండ్రీ లేకపోవడంతో చదువులో వెనకబడి, చిన్న ఉద్యోగస్తుడైనాడు కానీ, బాగా చదువుకుని ఉంటే వాడూ బాంకు ఆఫీసర్ అయేవాడు" అన్నాడు పిల్లాడి మేనమామ గిరిధర్.
"బ్యాంకులో ఫ్యూన్ అయినా అతనికి వచ్చే జీతంతో వాళ్ళు హాయిగా బతకచ్చు. అమ్మాయి చాలా పొదుపుగా ఉంటుంది" అంది తాయారమ్మ.
ఆ తరువాత ఆ మాటా, ఈ మాటా అయాక వాళ్ళ అంగీకారం తెలిపి వాళ్ళు వెళ్ళిపోయారు.
"ఘనమైన పని చేశావురా వేణూ! మంచి సంబంధం తెచ్చావు. ఆ అమ్మాయి మనల్ని నమ్ముకున్నందుకు మనం ఈ పెళ్ళి చేసి తన రుణం తీర్చుకోవాలి" అంది తాయారమ్మ వాళ్ళు వెళ్ళాక, కృష్ణస్వామి అవునన్నట్టు తల పంకించి, "లాంఛనంగా తాంబూలాలు తీసుకుని, లగ్నపత్రిక రాసుకుందాం మంచి రోజు చూస్తాను" అన్నాడు.
"ఆ అమ్మాయి అభిప్రాయం అడిగారా?" అన్నాడు వేణు.
అప్పుడు గానీ ఆ దంపతులకి ఆ విషయం గుర్తుకు రాలేదు. అవును సుమా! ఇంతకీ నీలవేణికి నచ్చాడో లేదో అనుకుంది.
"అడగడానికేం ఉందిరా? మనం ఏదంటే అదే కదా! తనకేం తెలుసని" అన్నాడు కృష్ణస్వామి.
"తెలిసినా తెలియకున్నా అడగడం ధర్మం కదా నాన్నా! అమ్మా! నువ్వే అడిగి చెప్పు. నాకు తెలిసి వద్ధనదు కానీ, అడగాలి" అన్నాడు వేణు.
వేణు మాట నిజమే అనిపించింది ఆవిడక్కూడా! "అలాగే అడుగుతాలేరా" అంది.
మర్నాడు మధ్యాహ్నం భోజనాలు పూర్తయాక వంటగది కడిగేసి, నీలవేణి తన గదిలోకి వెళ్ళిపోయింది.
వంట చేయడం తప్ప మిగతా పనులన్నీ నీలవేణి తన ఇల్లు అన్నంత జాగ్రత్తగా, శ్రద్దగా చేస్తుంది. హైదరాబాదు వచ్చాక నీలవేణికి అక్కడ తిరగకూడదు, అది ముట్టుకోకూడదు అనే నిబంధనలు పోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని వంటగదిలోకి రానివ్వాల్సి వచ్చింది. కొత్తల్లో తాయారమ్మకి నీలవేణి అలా వంటగదిలో యధేచ్చగా తిరగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సిటీలో తప్పదు కాబట్టి ఆవిడ అతికష్టం మీద సరిపెట్టుకుంది. రాను రానూ అలవాటై పోయింది. ఇప్పుడు ఆమె ఇల్లంతా శుభ్రం చేయడం, కిటికీ అద్దాలు రోజు విడిచి రోజు తుడవడం, టేబుల్స్, టీపాయ్, సోఫాలు బట్టతో తుడవడం, మధ్య మధ్య ఫ్రిజ్ కడగడం ఇలాంటి పనులు ఎవరూ చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా చేసుకుపోతుంటే ఆవిడ చాలా మామూలుగా చూస్తూ ఉంటుంది. ఆవిడకి తెలుసు ఆ పనులన్నీ చేయడం తనవల్ల కాదని, చేయకపోతే ఇల్లు చండాలంగా ఉంటుందని, అందుకే నీలవేణి చేస్తుంటే ఏం మాట్లాడదు. ఇల్లు ఎప్పటికప్పుడు అద్దంలా ఉంచుతుంది నీలవేణి. పగలు భోజనాలు కాగానే హాల్లో పడుకుంటే హాయిగా అనిపిస్తుంది ఆవిడకు. ఒక్కోసారి ఈ పిల్ల పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే ఈ ఇల్లు ఎలా? అనిపిస్తుంటుంది ఆవిడకి. కానీ అలా అని ఆమెకి పెళ్ళి చేయకుండా ఇంట్లో చాకిరీకి శాశ్వతంగా ఉంచుకొడం అమానుషం అని అనుకుంటుంది తనకి తానే.
తాయారమ్మ రోజులా పడుకోకుండా నీలవేణి వెళ్ళిన కొద్ది నిమిషాలకి తను కూడా మెట్లెక్కి పైకి వెళ్ళింది. నీలవేణి గది తలుపు ఓరగా వేసి ఉంది. ఆవిడ తలుపు కొద్దిగా తోసి గదిలోకి తొంగిచూసింది. నీటుగా ఉంది గది. మంచం లేదు. కిందనే పరుపు వేసుకుంది. ఓ మూల పాత స్టూలు మీద చిన్న కూజా, దానిమీద బోర్లించిన గ్లాసు, అలమరలో నీటుగా సర్దుకున్న ఆమె బట్టలు, అక్కడక్కడా ఒకటీ రెండూ రిత్విక్ బొమ్మలు. అప్పుడప్పుడూ రిత్విక్ ని తీసుకుని తన గదిలోనే ఆడించుకుంటుంది. ముఖ్యంగా వేణు ఇంట్లో ఉన్న సమయం దాదాపు తన గదిలోనే గడుపుతుంది.
పరుపు మీద కుడివేపు తిరిగి పడుకుంది. ఎడం చేయి కళ్ళ మీద పెట్టుకుంది. ఆవిడ మృదువుగా "నీలవేణి" అని పిలుస్తూ లోపలికి నడిచింది.
దిగ్గున లేచింది. కంగారుగా లేచి నిలబడి "అయ్యో ! అమ్మగారూ! మీరిలా వచ్చారేంటి? నేనే వస్తా కదా పిలిస్తే" అంటూ ఆవిడ దగ్గరగా నడిచింది.
"ఫర్వాలేదులే! అప్పుడప్పుడూ మెట్లెక్కాలిట. అబ్బాయి చెప్పాడు. అవునేంటి నీ గదిలో ఒక్క కుర్చీ కూడా లేదా?" అందావిడ చుట్టూ చూస్తూ.