Previous Page Next Page 
అర్చన పేజి 84


    శాశ్వతంగా ఈ పిల్లనిక్కడ ఉంచాలంటే ఒకటే మార్గం. ఈ ఇంటికోడల్ని చేసుకోడం. కానీ, శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మల కుటుంబానికి ఈమెని ఏ అర్హతతో కోడల్ని చేయగలదు? పైగా చదువు, సంస్కారం, నాగరికత ఉన్న వేణూ చదువూ సంధ్యా లేని ఈ అమ్మాయిని భార్యగా అంగీకరిస్తాడా?
    ఆవిడ తన ఆలోచనలకి తానే ఉలిక్కిపడింది. ఛ, ఛ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను. తప్పు! ఈ ఆలోచన వచ్చిందని తెలిసిందంటే ఆయన తనని నిప్పుల్తో కడిగినా కడుగుతాడు. పనిపిల్ల పనిపిల్లే! ఆమె మంచితనానికో, పనితనానికో స్వేచ్చా స్వాతంత్ర్యం ఇచ్సినంత మాత్రాన ఇలాంటి నిర్ణయాలు తీసుకోడం సమంజసమా?
    అయినా ఆ పిల్ల కన్నీళ్ళకిలా కరిగిపోయి, ఇలాంటి ఆలోచనలేంటి? బుద్ధి తక్కువ కాకపోతే.
    ఆవిడ నెమ్మదిగా ఆలోచనలు వదిలించుకుని నీలవేణి తలమీద చేయి పెట్టి మనసులోనే దీవించి మౌనంగా అక్కడినుంచి వెళ్ళిపోయింది.
    ఆవిడ వెళ్ళినవైపు చూస్తూ నిలబడిపోయిన నీలవేణి కళ్ళు మూసుకుని రెండు చేతులూ జోడించి కనిపించని దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ అనుకుంది. "దేవుడా! వచ్చే జన్మ అనేహ్ది ఉంటే ఈ మనుషుల మధ్యలోనే బతికే అదృష్టం ఇవ్వు!"

                                                                    * * * * *

    అర్చన ఆర్.డి.వోగా రాజమండ్రిలో మంచి పేరు తెచ్చుకుంది.
    మొదట్లో కొన్ని సంఘటనలకు భయపడి, బెదిరిపోయి తల్లడిల్లినా క్రమంగా తనకి తనే ధైర్యం చెప్పుకుని క్లిష్టసమస్యలని కూడా చాకచక్యంగా పరిష్కరిస్తూ, అటు ప్రభుత్వాధికారుల ద్గాగారా, ఇటు లోకల్ ఎమ్.ఎల్.ఏల్, ఇతర నాయకుల దగ్గరా తన తోటి ఉద్యోగుల దగ్గరా, సబార్దినేట్స్ దగ్గర కూడా మంచి ఆఫీసర్ గా పేరు పొందింది.
    ఆ రోజు అర్చన ఆఫీసుకి వెళ్ళేటప్పటికి ఆమె కోసం నలుగురైదుగురు విజిటర్స్ ఎదురుచూస్తున్నారు. లాండ్ తగాదాకి సంబంధించిన విషయం.
    అర్చన తన చాంబర్ లోకి వెళ్తూనే వాళ్ళ హడావుడీ మొదలైంది.
    చాలాసేపట్నుంచీ ఎదురుచూస్తున్నాం. ఇంకా ఎంతసేపు అని అరుస్తున్నారు. బహుశా పి.ఏ. ఆపి ఉంటాడు. "మేడమ్ ఇప్పుడే వచ్చారు. కొంచెం రిలాక్స్ అవనివ్వరా" అని అతని స్వరం అస్పష్టంగా వినిపించింది.
    తన సీటు దగ్గరకు వెళ్తూనే బెల్ కొట్టి వాళ్ళని పంపించమని చెప్పింది ఫ్యూన్ కి.
    ఆ వచ్చినవాళ్ళల్లో ఒకమ్మాయి కూడా ఉంది. ఆమె, ఆమెతో పాటు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ అమ్మాయి చాలా ఫెరోషియస్ గా ఉంది. చూగానే బాగా డబ్బున్నవాళ్ళ అమ్మాయిలాగా ఉంది. సుమారు 30, 32 ఏళ్ళు ఉండచ్చు. తెల్లగా ఉంది. ఖరీదైన సిల్కుచీర, మెడలో పుస్తెల తాడు, చంద్రహారం, రెండు పేటల ముత్యాల గొలుసు, రెండు చేతులకీ నిండుగా బంగారు గాజులు, వేళ్ళకి ఉంగరాలు, చెవులకి డైమండ్ దిద్దులు, డైమండ్ ముక్కుపుడక.
    "నమస్కారం మేడమ్ గారూ!" అంటూ నమస్కరిస్తూ వచ్చారు.
    అర్చన తల పంకించి "చెప్పండి ఏంటి ప్రాబ్లమ్?" అంది.
    వాళ్ళల్లో ఒకతను మొదలుపెట్టాడు.
    "వీళ్ళాయన మా ల్యాండ్ ఇల్లీగల్ గా ఆక్రమించుకుని ఇప్పుడు అక్కడ కల్టివేషన్ ప్రయత్నాలు చేస్తున్నాడు మేడమ్. మేము మా ల్యాండ్ అని అన్నందుకు ఇదిగో ఈ అమ్మాయి తండ్రి మా మీదకు తఃగాదాకి వచ్చాడు" అన్నాడు. అతను కొంచెం చదువుకున్నవాడిలా ఉన్నాడు.
    "నోరు మూసుకో! అది మా తాతల నుంచి మాకు సంక్రమించిన భూమి. మధ్యలో అక్రమంగా ఆక్రమించుకున్నది నువ్వు" అంటూ రయ్యిన లేచాడు అమ్మాయి తండ్రి. ఎత్తుగా, లావుగా పంచెకట్టుతో, బుర్రమీసాలతో అచ్చు సినిమాల్లో చూపించే భూస్వామిలాగా ఉన్నాడు.
    అర్చన కొంచెం గట్టిగా అంది. "మీరు, మీరూ దెబ్బలాడుకునేట్టయితే ఇక్కడికెందుకు వచ్చారు?"
    "అది కాదు మేడమ్! అది మా నాన్నగారు నాకు పసుపు కుంకాల కింద నా పెళ్ళిలో ఇచ్చారు. మా ఆయన దాన్ని సాగుచేసి వరి పండించాలనుకుని ఈ మధ్యే ఆ పని మొదలుపెట్టాడు. ఈలోగా ఈ పెద్దమనిషి మాతో యుద్ధానికి వచ్చాడు" అంటూ ఆ అమ్మాయి మొదలుపెట్టింది. ఆ అమ్మాయి వైపు సూటిగా చూస్తూ అడిగింది అర్చన.
    "ఏం చేస్తాడు మీ ఆయన?"
    "మా ఆయన రూలింగ్ పార్టీ లీడరు" అంది వయ్యారాలు పోతూ.
    "ఓ సరే మీరు వెళ్ళి బైట కూర్చోండి పిలుస్తాను" అంటూ వాళ్ళని బైటకి వెళ్ళమని, బెల్ నొక్కి పి.ఏ.ని పిలవమని చెప్పింది ఫ్యూనుకి.
    శ్రీపతి వచ్చాడు. వస్తూనే ఆమెకి విష్ చేసి ఆ ల్యాండ్ గురించిన సమాచారం మొత్తం చెప్పాడు.
    నిజానికి అది పోరంబోకు భూమి. ఆ అమ్మాయి తండ్రి పేరు వీరాస్వామి. అతను పెద్ద రాజకీయనాయకుడు. ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టి పెత్తనం చెలాయిస్తుంటాడు. అతనికి ఒక కూతురు విజయదుర్గ, కొడుకు వరప్రసాద్. కూతుర్ని మరో రాజకీయనాయకుడైన మునిస్వామి కొడుకు కిచ్చి పెళ్ళి చేస్తూ కట్నం కింద యాభై లక్షల బంగారం, విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, ఈ పోరంబోకు భూమి ఇచ్చాడు. ఈ భూమిని తన పరపతి, పదవి, దాదాగిరీ ఉపయోగించి సంపాదించాడు. ఒక విధంగా అన్యాయంగా ఆక్రమించాడు. అల్లుడు ఈయనని మించినవాడు. రాజకీయం అడ్డు పెట్టుకుని భూ ఆక్రమణలు, గుండాయిజాలు చేస్తుంటాడు. అతనికి ఈ అమ్మాయి కూడా వత్తాసు. దొంగలు, దొంగలు ఊళ్ళు దోచుకున్నట్టు ఆ ఆక్రమణలో తనకీ భాగం ఉందంటూ ఇప్పుడీ కొత్త వ్యక్తి వచ్చాడు. వీళ్ళందరికీ తహసీల్దారుగారి వత్తాసు ఉంది. ఆయన ప్రోద్బలంతోటే చుట్టుపక్కల చాలా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారు.
    వింటుంటే రగిలిపోయింది అర్చన - ఎంత అన్యాయం! పైగా అన్యాయాన్ని సమర్ధించుకోడం సిగ్గన్నా లేదా వీళ్ళకి? తహసీల్దారు అసలలాంటివాడని తను ఎన్నడూ అనుకోలేదు. అంటే చాపకింద నీరులా చాలా చేస్తున్నాడన్నమాట! తను ఎంత అమాయకురాలు! అర్చన అప్పటికప్పుడు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ని ఫైల్స్ తో సహా రమ్మని కబురు చేసింది.
    ఆఘమేఘాల మీద ఆక్రమించుకున్న భూమిని తిరిగి ప్రభుత్వ పరిధిలోకి తీసుకోడానికి తన ప్రయత్నాలు తాను చేయసాగింది. ఆ పరంపరలోనే తెరమీదికి వచ్చాడు నాగరాజు. విజయదుర్గ భర్త. పెద్ద మీసాలు, బాగా వళ్ళొచ్చి, ఫెళఫెళ్ళాడే ఖద్దరు చొక్కా వేసుకుని వస్తాదులా వచ్చాడు.

 Previous Page Next Page