"మాధవి.... పాపం నాకు పెళ్ళి చేయాలన్న ఆరాటంలో అవతలివాళ్ళ మనోభవలను పట్టించుకోవడం లేదు. నేను చెబుతాలే తనకి డోంట్ వర్రీ."
"థాంక్యూ ఇంక వెడదామా?" టేబుల్ మీద పర్సు చేతిలోకి తీసుకుంటూ అంది.
"ష్యూర్" వేణు ఊదా సెల్ ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ లేచాడు,
ఆ తరువాత ప్రీతి బెంగుళూరు వెళ్ళిపోయింది. వెళ్తూ మాధవితో అంది "త్వరలో నా పెళ్ళికి విజయవాడ వద్దువుగానిలే అక్కా! కోపం పెట్టుకోకుండా తప్పకుండా రా!"
మాధవి చాలా బాధ అనిపించింది. కనీసం వెళ్ళేటప్పుడు అయినా వేణు డైవర్స్ తీసుకుంటే చేసుకుంటాను అంటుందని ఆశించింది. కానీ, తన పెళ్ళికి రమ్మని ఆహ్వానించిందంటే తను ఆల్ రెడీ అబ్బాయిని చూసుకుందన్నమాట అనుకుని నిట్టూర్చింది మాధవి.
* * * *
ఆ రోజు వేణు ఆఫీసునుంచి హడావుడిగా వచ్చాడు. "అమ్మా, అమ్మా" అంటూ.
"ఏంటిరా ఏంటి హడావుడి?" అడిగింది తాయారమ్మ హాల్లోకి వస్తూ.
"ఆ అమ్మాయిని చూసుకోడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. ఆ అమ్మాయిని కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పు" అన్నాడు.
"ఏ అమ్మాయి?" ఆశ్చర్యంగా అడిగిందావిడ.
"అదేనమ్మా! మన రిత్విక్ ని చూసుకునే అమ్మాయి నీలవేణి."
"ఓ నీలవేణికి సంబంధం చూశావా? ఎంత మంచి మాట చెప్పావురా!" ఆవిడ సంతోషం వెల్లివిరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది "నీలవేణి....నీలవేణీ..."
వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు.
రిత్విక్ తో లాన్ లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికెనవేలు పట్టుకుని వచ్చింది "ఏంటమ్మగారూ?" అంటూ.
"వాడిని నాకిచ్చి నువ్వెళ్ళి మొహం కడుక్కుని, కాస్త మంచి చీర కట్టుకుని తయారవు" అందావిడ వేణు గదివైపు వెళ్తూ.
ఆవిడ వెళ్ళినవైపు చూస్తూ అచేతనంగా మెట్లెక్కి తన గదివైపు వెళ్ళిపోయింది నీలవేణి.
బట్టలు మార్చుకుంటున్న వేణు దగ్గరకు వెళ్ళి అడిగింది తాయారమ్మ. "ఇంతకీ ఎవరి కుర్రాడురా? ఏం కులం? ఏం చేస్తాడు?"
వేణు చిరునవ్వుతో చూశాడు. "మా బ్యాంకులో కొత్తగా చేరాడమ్మా ఫ్యూను. వాడికి కూడా ఎవరూ లేరుట మేనత్తో ఎవరో పెంచారుట. వాళ్ళు కాపులనుకుంటా. ఈ అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి బాగుంటే చాలన్నారు బుద్దిమంతురాలు కావాలన్నారు. అమ్మాయి బాగానే ఉంటుందిగా తయారైతే, మంచమ్మాయి అందుకే రమ్మన్నా."
"మంచిపని చేశావు. ఆ పిల్లనో ఇంటిదాన్ని చేస్తే మన బాధ్యత తీరిపోతుంది. ఈ ముక్క నాన్నగారి చెవిన కూడా వేసొస్తానుండు" అంటూ ఆవిడ కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళింది. పెరట్లో పాదులకు నీళ్ళు పెడుతూ, పిచ్చిమొక్కలు ఏరి పారేస్తూ, కాలక్షేపం చేస్తున్న కృష్ణస్వామి దగ్గరకు వడివడిగా నడుస్తూ "ఇది విన్నారా?" అంది తాయారమ్మ.
ఆయన చేతిలో పని ఆపి ఆవిడవైపు ప్రసన్నంగా చోసోతూ "ఏది?" అన్నాడు.
"మన వేణు నీలవేణికి సంబంధం చూశాడు. వాళ్ళు పిల్లను చూసుకోడానికిప్పుడు వస్తున్నార్ట."
ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం, మొహంలో కనిపిస్తున్న ఆనందం చిత్రంగా చూశాడాయన. ఏనాటి ఋణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టూర్చి అలాగా అన్నాడు.
"అలాగా అని అంత మెల్లిగా అంటారేం? పదండి కాళ్ళూ, చేతులూ కడుక్కుని బట్టలు మార్చుకుని హాల్లోకి రండి. మంచీ, చెడూ మాట్లాడాలి మీరే" అందావిడ.
"మాట్లాడదాంలే. ముందు అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదా!"
"నచ్చకేం చేస్తుంది? నీలవేణి మంచి చీర కట్టుకుని కాస్త తయారైతే సినిమా స్టారులా ఉంటుంది. పదండి, పదండి నేనీలోగా ఏవన్నా టిఫిను చేస్తాను" అంటూ హడావుడిగా వంటగదివైపు వెళ్తూ, అయ్యో మాధవికి కబురు చేస్తే బాగుండేదే అనుకుంది. ఆమెకీ మధ్య ఏ విషయమైనా మాధవితో పంచుకోకపోతే వెలితిగా ఉంటోంది. మాధవి ఆ ఇంటి ఆడపడుచు అయిపోయింది.
నీలవేణి తఃన గదిలో కిటికీ దగ్గర స్థాణువులా నిలబడి బైటకి చూడసాగింది. వేణు బట్టలు మార్చుకుని తెల్లటి పైజామా, లాల్చీ వేసుకున్నాడు. రిత్విక్ చిటికెన వేలు పట్టుకుని లాన్ లో తిరుగుతూ వాడితో ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే కృష్ణస్వామి అక్కడకి వచ్చాడు. లాన్ లో మొక్కలన్నీ గాలికి సుతారంగా కదుల్తున్నాయి. రంగు రంగుల గులాబీలు విరగబూసి ఉన్నాయి. గోదామీదుగా పాకి అవతలి వైపుకి వంగి ఉంది బోగన్ విల్లా. లేత నారింజరంగులో వింత అందంతో అలరారుతున్నాయా కాగితం పూలు. లాన్ లో గడ్డి మెత్తగా తివాచీ పరిచినట్టు ఉంది.
నీలవేణి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి.
తను పెళ్ళి చేసుకుని ఈ ఇంటినుంచి వెళ్ళిపోవాల? ఈ అమ్మగారిని, ఆవిడ అమాయకపు వాత్సల్యాన్ని, అయ్యగారి అభిమానాన్ని, రిత్విక్ తో అనుబంధాన్ని అన్నిటినీ వదులుకుని వెళ్ళిపోవాలా? ఈ ఇంట్లో ప్రతి అడుగులో తనకెన్నో మరిచిపోలేని అనుభూతులున్నాయి. ఈ మనుషులతో సుమారు ఐదేళ్ళ నుంచీ విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది. ఇంతకాలం నుంచీ ఈ ఇంట్లో తానూ ఒకతిగానే భావించుకుంది తనని తాను. ఏనాడూ తనకి పెళ్ళిచేస్తారని, అక్కడినుంచి పంపిస్తారని అనుకోలేదు. ఇప్పుడు హఠాత్తుగా పెళ్లిచూపులు అంటోంటే దుఃఖం ఆగడం లేదు. వద్దు. తనకి పెళ్ళొద్దు. ఈ ఇంటి నుంచి తనెక్కడికీ వెళ్ళలేదు వెళ్ళలేదు.
నీలవేణి రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తనకి ఎందుకంత ఏడుపొస్తోందో ఆమెకే అర్ధం కావడం లేదు.
కిందనుంచి ఒక్కసారిగా సందడి వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుని కిటికీలోంచి బైటకి చూసింది. గేటు తోసుకుని ఒక స్త్రీ, ఇద్దరు మగవాళ్ళు, ఒక బాబు లోపలికి వస్తున్నారు. వాళ్ళని చూడగానే పెళ్ళికొడుకు ఎవరో తెలిసిపోయింది నీలవేణికి. వాళ్ళని వేణు నవ్వుతూ లోపలికి ఆహ్వానించడం చూడగానే మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది.