"అతను వద్దు అని ఆవిడ వెళ్ళిపోయాక ఇంక విడాకుల గోలెందుకు?"
"ఏమో! ఆవేశంలో వెళ్ళిపోయింది. ఆవేశం తగ్గాక రావచ్చుగా?"
"ఏం మూడేళ్ళదాకా తగ్గని ఆవేశం హఠాత్తుగా తగ్గిపోతుందా?"
ప్రీతి స్థిరంగా అంది. "అక్కా! భార్యాభర్తలు, మాంగల్యబలం, నూరేళ్ళ పంట వగైరా స్లోగన్స్ నిజమో, అబద్ధమో నాకు తెలియదు కానీ, ఆడపిల్లగా పెళ్ళిచేసుకోబోయే ముందు నా సెక్యూరిటీ నేను ఆలోచంచుకోవాలి. కీడెంచి మేలెంచమన్నారుగా పెద్దలు. లీగల్ గా విడిపోని భార్యాభర్తలు, పైగా అతనికి ఆవిడంటే ప్రాణం అని తెలుసు నాకు. ఏ క్షణాన అయినా కలిసే అవకాశం మన ఇండియన్ సొసైటీలో ఉంది. అలా అయితే నా పరిస్థితేంటి?"
మాధవి మ్రాన్పడిపోయింది,
* * * * *
వేణు ఎంతో అందంగా, ఆధునికంగా కట్టించిన ఇంట్లోకి తాయారమ్మ, కృష్ణస్వామి దంపతులతో గృహప్రవేశం చేయించాడు. మొత్తం స్నేహితులందరినీ ఆహ్వానించాడు. వేణు పెళ్ళి చేసి, ఆ దంపతులతో గృహప్రవేశం చేయించాలనుకున్న తాయారమ్మ కోరిక తీర్చలేకపోయినందుకు మాధవికి చాలా బాధగా అనిపించింది. ప్రీతి అభిప్రాయం ఆవిడతో చెప్పడానికి భయం వేసింది. ఏం చెప్పాలో తెలియక మాధవి కొద్దిరోజులు తప్పించుకు తిరిగింది. కానీ, అనుభవజ్ఞురాలు, వివేకవంతురాలు అయిన తాయారమ్మ మాధవి చెప్పకుండానే విషయం గ్రహించి చూపులతోటే ఆమెని ఓదార్చింది. గృహప్రవేశం పనుల్లో మాధవి ఆ ఇంటి ఆడపడుచుగా అన్ని పనులూ చేసింది. తాయారమ్మ సూచించినట్టుగా వేణు మాధవి దంపతులకు మంచి బట్టలు పెట్టాడు.
ప్రీతి నెమ్మదిగా వేరే ఉద్యోగం చూసుకుని బెంగుళూరు వెళ్ళిపోయింది. వెళ్ళేముందు తన ఫియాన్సీని వేణుకి పరిచయం చేసింది. అతని పేరు సిద్ద్రార్ద. ప్రీతితో పాటే సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరికీ బెంగుళూరులో వేరే ఉద్యోగం వచ్చింది. ఇద్దరూ కలిసే వెళ్తున్నారు. ఆ విషయం మాధవికి అప్పుడే చెప్పద్దని, సమయం చూసి తనే చెప్తానని వేణుతో మాట తీసుకుంది ప్రేతి.
"వేణూ! అక్క మనసు ఒక విషయంలో కష్టపెట్టాను. అందుకే ఇప్పుడే ఈ విషయం చెప్పడం నాకిష్టం లేదు. నా ఆత్మీయుడిగా నీకు మాత్రం పరిచయం చేస్తున్నాను సిద్దూని నీకు నచ్చాడా?" అంది వేణుతో కలిసి హోటల్లో కూర్చుని కాఫీ తాగుతూ.
"సిద్దూకేం చక్కగా ఉన్నాడు. మాధవి వద్దంటుదనుకోను" అన్నాడు వేణు.
"వద్ధనదు, మెచ్చుకోదు."
"ఏం? ఎందుకలా అనుకుంటున్నావు?" ఆసక్తిగా అడిగాడు.
"ఏం లేదు" అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది ప్రీతి "నీ అభిప్రాయం నాకు తెలియదు కానీ, అక్క నీ గురించి నాతో ప్రస్తావించింది. కానీ" ఇబ్బందిగా ఆగిపోయింది.
వేణు ఆశ్చర్యంగా చూశాడు. "అలాగా ఏమంది?" అడిగాడు.
"ఏముంటుంది? నువ్వు చాలా మంచివాడివని, యోగ్యుడివని, నిన్ను పెళ్ళి చేసుకుంటే నేను చాలా సుఖంగా ఉంటానని."
"ఓ గాడ్!" వేణు గాభరాగా అన్నాడు. "మాధవి ఎందుకలా తొందరపడింది? నన్ను ఒక మాట అడగచ్చు కదా! సారీ ప్రీతీ! నేను మాధవికెప్పుడూ చెప్పలేదు నాకు సంబంధాలు చూడమని. మరి తనెందుకు తొందరపడుతోందో నాకర్ధం కావడం లేదు ఎనీవే సారీ."
"ఛ ఛ సారీ ఏంటి? తఃప్పేం లేదు అక్క అలా అడగడంలో కానీ, నేను ఆల్ రెడీ సిద్దూని ప్రేమిస్తున్నాను. తనది మన కులం కాదు. ఈ సంగతి చెబితే గొడవ అవుతుందని నేను చెప్పలేదు. అయినా వేణూ! అక్క సంగతి పక్కన పెట్టు. నేను అడుగుతున్నాను. నువ్వెందుకు మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు?"
వేణు మాట్లాడలేదు.
ప్రీతి రెట్టిస్తూ అంది. "చెప్పు వేణూ! నువ్వింక అర్చన తిరిగి వస్తుందని అనుకుంటున్నావా?"
వేణు చురుక్కున చూశాడు. "లేదు, రావాలని కూడా ఆశించడం లేదు. కానీ..."
"ఊ... కానీ...."
"మంచి అమ్మాయి దొరకాలి కదా! నేనీసారి నాకు నచ్చడం కన్నా అమ్మా, నాన్నలకి నచ్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను."
"ఓ..." సంతోషంగా చిన్నగా అరిచింది ప్రీతి. "సో నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు. మరి ఒకటడగనా?"
"చెప్పు."
"అర్చనతో డైవర్స్ తీసుకోవచ్చు కదా!"
అప్పుడే ఆ విషయం గుర్తొచ్చినవాడిలా చూశాడు. "అవసరమా?" అన్నాడు.
"ఏమో చెప్పలేం కదా! తను తిరిగి వస్తే?"
"రానివ్వను" కోపంగా అన్నాడు.
నవ్వింది ప్రీతి. "అవన్నీ కాదు కానీ, చూడు వేణూ! కనీసం ఆవిడకి ఒక లెటర్ రాయి. ఇలా నువ్వు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంతున్నావని, ఆమె అంగీకారం కావాలని."
"చస్తే రాయను" జేవురించిన మొహంతో అన్నాడు. "ఎందుకు రాయాలి? రాయను. నాకు, మా పేరెంట్స్ కి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్ళి చేసుకుని వెళ్ళి ఆవిడని కలుస్తాను."
అతని స్వరంలో వినిపించిన కసికి ముందు నివ్వెరపోయినా తరువాత అతడిని అర్ధం చేసుకున్నదానిలా మెత్తగా నవ్వింది ప్రీతి. "ఆల్ ది బెస్ట్ వేణూ! నీ పెళ్ళికి పిలవడం మాత్రం మర్చిపోకు" అంది.
"నిజం చెప్పనా ప్రీతీ?" ఆమె మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు.
అతనలా హఠాత్తుగా అడగాదంతో కంగారుగా చూసింది ప్రీతి ఏం చెప్తాడు అన్నట్టు.
"అంత కంగారుపడతావేం? నిన్ను ఇబ్బంది పెట్టే మాట ఏం చెప్పనులే. నాకెందుకో నిన్ను చూడగానే నాకు నీలాంటి అల్లరి చెల్లెలుంటే ఎన్య్హ బాగుండేది అనిపించింది. అందుకే నీతో చాలా త్వరగా కలిసిపోయాను. లేకపోతే నేను ఏ ఆడపిల్లతో ఇంత చనువుగా ఉండడం జరగదు."
ప్రీతి నమ్మలేనిదానిలా చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు, ఆ మెరుపులో ఒక రిలీఫ్ చూసిన వేణు మనసారా నవ్వాడు. "నిజం ప్రీతీ! నువ్విది నమ్మాలి" అన్నాడు.
ప్రీతి కూడా చిరునవ్వుతో మనస్ఫూర్తిగా అంది "నమ్ముతాను. నీ కళ్ళల్లో నిజాయితీ నన్ను నమ్మమంటోంది. అయితే నేను అక్క ప్రపోజల్ అంగీకరించక పోవడం ఎంత మంచిదైంది?"