Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 19


    ప్రముఖ రచయిత, విమర్శకులు వాకాటి పాండురంగారావు గారు కామేశ్వరి గారి 'కాదేదీ కథకనర్హం' సంపుటి ముందుమాటలో చెప్పినట్లు 'స్త్రీ పురుష సంబంధాల మీద ఏనాడయినా రచయితల కంటే రచయిత్రులే అర్ధవంతంగా రాయగలరని ఈ కథా సంపుటి ఋజువు చేసింది' అన్న మాటలు అక్షర సత్యాలు.

                                               ముగింపు

    తన తొలినాళ్ళ కథల్లో అమ్మాయిల విద్య, స్వేచ్చ, ఆర్ధిక స్వావలంబన, వ్యక్తిత్వ పరిపూర్ణత, ఆత్మాభిమానం వంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తూ స్త్రీల పట్ల మొగ్గు చూసిన రచయిత్రి... రాను రానూ గత దశశాబ్దంగా రాస్తున్న కథల్లో ఎక్కువగా అమ్మాయిలను జాగ్రత్తగా ఉండమనీ, సర్దుకుపొమ్మనే పాఠాలే తప్ప అబ్బాయిలను సర్దుకుపొమ్మని గానీ, మందలించినట్టు గానీ ఉన్న కథల దాఖలాలు అరుదు. బహుశా రచయిత్రి పరిశీలనకు అందిన సందర్భాల్లో యువతులు తమ స్వేచ్చను దుర్వినియోగం చేయడం ఎక్కువగా గమనించి ఉండవచ్చు.    
    అయితే యువకులెప్పుడూ కంఫర్ట్ జోన లోనే ఉన్నారు. వారికి చిన్నప్పట్నుంచీ కుటుంబంలో, సమాజంలో లభించే ప్రత్యేక సౌకర్యాలు, గుర్తింపు, బలం, అండదండలకు లోటేమీ లేదు కనుక వారు మారాల్సిన అవసరం గానీ, అవకాశం గానీ లేవు. మరోపక్క అమ్మాయిల విషయంగా గత పాతికేళ్ళుగా విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. చదువుకున్న తల్లిదండ్రులు పెరిగి, ఉమ్మడి కుటుంబాలు తగ్గి, మూఢ నమ్మకాలు, దుష్ట సంప్రదాయాలు కొంతమేరకు తగ్గాయి. కుటుంబ నియంత్రణ వల్ల చిన్న కుటుంబాల్లో అమ్మాయిలను కూడా గారంగా పెంచడం, వారి ఇష్టాలకు విలువనివ్వడం పెరిగింది. తమ ముందు తరాల స్త్రీలలాగా చదువు, పెళ్ళి, ఉద్యోగం, కనీస గౌరవం, ఆదరణ, ఆర్ధిక భద్రత వంటి విషయాల్లో పోరాడాల్సిన అవసరం ఎక్కువ శాతం యువతులకు ప్రస్తుతం లేదు. తమ అమ్మల్లా, అమ్మమ్మల్లా జీవించాల్సిన అవసరం వాళ్ళకు లేదు. అయితే వ్యక్తుల స్వభావాలకు కొంతవరకూ వ్యవస్థే కారణం అన్న సంగతి మర్చిపోకూడదు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ మార్పులు అనివార్యం.
    ఈ క్రమంలో నేటి యువతులు తమ హక్కుల్ని మాత్రం వినియోగించుకుని, బాధ్యతల్ని, ఆత్మ గౌరవాన్ని, భవిష్యత్ ని వదిలేస్తే జీవితాలు అల్లకల్లోలమవుతాయన్న హెచ్చరికను ఎక్కువ శాతం కథల్లో చేశారు కామేశ్వరి.
    ధనిక, ఉన్నత వర్గ, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లోని మహిళల జీవన స్థితిగతుల్లో చదువు, ఆర్ధిక స్వయం ప్రతిపత్తి కొంత వెసులుబాటును కల్గించిందేమో కానీ, ఇప్పటికీ స్త్రీలలో మార్జినలైజ్డ్ జీవితాల్ని గడుపుతున్న వారే ఎక్కువ. 'కొత్త మలుపు' వంటి సంచలన నవలను అందించిన రచయిత్రి కలం నుండి అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం నింపే మరిన్ని కథలను ఆశించడం ఉత్తమాభిరుచి గల పాఠకుల అత్యాశ కాదు.    
    కామేశ్వరిలోని రచయిత్రికి తన లక్ష్యం, బాధ్యత రెండూ సుస్పష్టం. ఆమె ఎంచుకున్న కథాంశాలను గమనిస్తే ఈ విషయం అర్ధమవుతుంది. దాదాపు అరవై ఏళ్ల విస్త్రుత పరిశీలనతో కూడిన సుదీర్ఘ ప్రయాణం ఆమెది. ఆమె రచించిన కొత్త కథలు ఈనాటి సామాజిక స్థితిగతులకు ప్రతిబింబాలయితే పాత కథలు గడిచిన చరిత్రకు సాక్ష్యాలు.
    టీనేజ్ అమ్మాయిలకి తన కథల ద్వారా నేక పాఠాలు చెప్పిన రచయిత్రి కూడా కామేశ్వరి గారేనని చెప్పవచ్చు. ఈ కథల్లో సంభాషణలు చాలా సార్లు పెద్ద పెద్ద పేరాగ్రాఫ్ లుగా ఏర్పడి వ్యాసాలుగా మారిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా చదివింపజేయడం వీటి ప్రత్యేకత. సూటిగా, విపులంగా ఉండే సంభాషణలు, బలమైన వాక్యనిర్మాణం, పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించి వెంట తీసుకెళ్ళే రచనా శైలి అందుకు కారణాలనిపిస్తుంది.
    రచయిత్రి ఎన్నో సందర్భాలలో చెప్పినట్లుగా ఒక రచన ఆనాటి సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల్ని ప్రతిబింబించాలి. ఆయా విషయాలను అక్షరబద్ధం చేసి చరిత్ర పుటల్లో చేర్చాలి. కామేశ్వరి గారి కథలు ఆ కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాయి.
    ప్రేమలు, వయసు తప్పిదాలు, పెళ్ళిళ్ళు, అసమ జీవనాలు, సహజీవనాలు, సహన జీవనాలు, విడాకులు, విశ్రుంఖలతలు, పశ్చాత్తాపాలు, పరివేదనలు, సర్దుబాట్లు, రాజీలు, వివాహ వైఫల్యాలు, సంతాన సాఫల్యాలు, పిల్లలు, పెంపకం బాధ్యతలు, తల్లిదండ్రులు, వృద్ధాశ్రమాలు..... ఇలా స్త్రీ పురుష సంబంధాలు, కుటంబ సంబంధాలలో కామేశ్వరి గారు స్మ్రుశించని కోణం లేదు. అత్యంత నిజాయితీగా, నిక్కచ్చిగా, బాధ్యతలు, ఒక తపస్సులా తనకు తెలిసిన, తాను పరిశీలించిన విషయాలను చక్కని పాత్ర చిత్రణ, సన్నివేశాల అల్లికతో కథలుగా మలిచి అందించిన బృహత్కథా మంజరి ఆమె.

                                           * * *

 Previous Page Next Page