Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 18


    'మనసుతో అడొద్దు' పై కథాంశంతో వ్రాయబడింది. శిల్ప, రాహుల్ ఒకే ఐటీ కంపెనీలో పనిచేస్తూ చాలా సన్నిహితంగా తిరగడం వాళ్ళ స్నేహితులందరికీ తెలుసు. సడన్ గా శిల్ప జాబ్ మారడం, తనని తప్పించుకుని తిరగడం చూసిన రాహుల్ ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని ప్రయత్నిస్తుంటాడు. శిల్ప అందుకు అవకాశమివ్వదు. రాహుల్ వాళ్ళది తమ కులం కానందున ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనీ, ఓల్డ్ ఫ్యాషన్డ్ గా ఉండే రాహుల్ కుటుంబం తనకు నచ్చలేదనీ, ఇంట్లో వాళ్ళు తనకి అమెరికా సంబంధం చూశారనీ స్నేహితురాలు అఖిలతో చెబుతుంది. అయితే రాహుల్ తనను సినిమాలకీ, షికార్లకీ, హోటళ్ళకీ తిప్పడం, ఖరీదైన బహుమతులు కొనివ్వడం, తమ ఇద్దరి మధ్యా ఉన్న శారీరక సంబంధం.... ఇవన్నీ అడ్వాంటేజ్ గా తీసుకుని గొడవ చేస్తాడేమోననే భయం కూడా ఉంటుంది. అతన్ని అవాయిడ్ చేస్తే అతనే కొన్నాళ్ళకు సర్దుకుంటాడనుకుంటుంది. ఏదేమైనా ముఖాముఖీ మాట్లాడి కన్విన్స్ చేస్తే బావుంటుందంటుంది అఖిల.
    ఆ మర్నాడే శిల్ప పైన యాసిడ్ దాడి చేసి పోలీస్ స్టేషన్ కి రాహుల్ వెళ్ళినట్టు కబురొస్తుంది అఖిలకు. టీవీ ఛానల్స్, పేపర్లు ఈ వార్తకు ప్రాచుర్యం కలిగిస్తాయి. గాయాలతో శిల్ప హాస్పిటల్ లో కోలుకుంటుండగానే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ రాహుల్ కు శిక్ష విధిస్తుంది. శిల్ప కోలుకున్నాక ఆమెను పెళ్ళి చేసుకోవాలి లేదా రెండు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి అని. నిద్ర నుండి మెలకువ వచ్చాక తన పైన యాసిడ్ దాడి కల అని తెలుస్తుంది శిల్పకు. అతనితో మాట్లాడి పెద్దలనెదిరించి పెళ్ళి చేసుకుంటే సుఖపడలేమని నచ్చచెప్పాలి అనుకుంటుంది శిల్ప.
    దశాబ్దం కిందటి ఈ కథ పాఠకులకు రెండు ప్రశ్నల్ని సంధిస్తుంది. ఒకప్పుడు ప్రేమ అనేది జీవితంలో ఒకరితోనే అన్నట్లుగా భావించే రోజులో ఏ కారణంగానైనా ప్రేయసీప్రియులు పెళ్ళి చేసుకోలేకపోతే బాధతోనే అయినా, గౌరవంగా విడిపోయేవారు. తిరిగి ఒకరి జీవితంలోకి ఒకరు దూరి నష్టం చేసే ప్రయత్నం చేసేవారు కారు. అనుకోకుండా తటస్థపడ్డా హుందాగా మెలిగేవారు, తాము ప్రేమించినవారు సుఖంగా ఉండాలనే కోరుకునేవారు. మరి ఇప్పుడు...యువతీ యువకుల మధ్య ప్రేమ అనే గాఢమైన అనుబంధం లేనప్పుడు, చుట్టూ ఉన్న ప్రపంచం 'బాయ్ మీట్స్ గర్ల్' కల్చర్ లో ఎంతో ఈజీ గోయింగ్ గా ఉండి, డబ్బు, హోదా, పరువు ఇలాంటి భౌతికమైన విషయాలకు ప్రాధాన్యత పెరిగినపుడు, ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ అనుకునే కల్చర్ లోనే ఉన్నామని తెలిసీ, బ్రేక్ అప్ అనేది వారిలో ఎందుకు ఇంత పగనూ, ద్వేషాన్నీ పెంచుతోంది అనేది మొదటిది.
    ఇక రెండవది....రచయిత్రి కథలో జడ్జి మెంట్ ద్వారా చూపిన పరిష్కారాల్లో మొదటిది రాహుల్ శిల్పను పెళ్ళాడడం. ఒక వ్యక్తి మీద కోపమో, ద్వేషమో అంత తీవ్రస్థాయికి వెళ్ళాక తిరిగి వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ గానీ కలిసి కాపురం చేయడం గానీ ఎలా సాధ్యం? ఇరువురి మధ్య అంత అవగాహన, రాజీ ఉంటే మొదటే కలవడమో, స్నేహంగా విడిపోవడమో జరిగేది కదా! ఇదొక్కటే కాదు, మౌన పోరాటాలూ, పెద్దమనుషుల ముందు పంచాయితీలూ జరిగాక ఏ జంట అయినా అన్నీ మరిచి కలిసి ఉండగలరా? ఈమె నన్ను తిరస్కరించింది అని అతనికీ, ఇతడు నన్ను చంపడానికి చూసాడు అని ఆమెకూ అనుక్షణం గుర్తుకు వస్తుంటే ఎలా కలిసి ఉంటారు?
    ఇదంతా ఈ కథకు సంబంధించక పోవచ్చు, లేదా ఏ రచయిత్రి అయినా ప్రతి కథలోనూ లేవనెత్తే సమస్యలకు తానే పరిష్కారాలు చూపాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఆలోచన, నిర్ణయంపాఠకులకు వదిలి పెట్టనూ వచ్చు. కానీ, ఇలాంటి ఆలోచన రేకెత్తించే కథలు ఎప్పటికప్పుడు రాశారు కామేశ్వరి గారు.
    మరో కథ సరిగ్గా పై కథకు రివర్స్ గా ఉంటుంది. కథ పేరే 'తారుమారు'. శృతి అనే అమ్మాయి ఓ రోజు కళ్యాణి ఇంటికి వచ్చి 'మీ అబ్బాయీ, నేనూ ప్రేమించుకున్నాం, కలిసి తిరిగాం. ఇప్పుడు పెళ్ళి మాట అనగానే మీ అబ్బాయి వద్దంటున్నాడు. మీరే నచ్చచెప్పాలి' అనడుగుతుంది. కళ్యాణి ఓ ప్రొఫెసర్, స్త్రీ పక్షపాతి కూడా. కొడుకు సంకల్ప్ ను వివరాలు అడిగితే తాము అప్పుడప్పుడూ కలిసి తిరిగిన మాట నిజమేననీ, అంతకు మించి తొందరపడలేదనీ, ఎవరినైనా చూడగానే నచ్చిందో లేదో చెప్పలేమనీ, ఆమెను అర్ధం చేసుకునే క్రమంలో ఆమె చాలా గ్రీడీ అనీ, కేవలం తన ఉద్యోగమూ, సంపాదనా, తల్లిదండ్రుల సంపాదనా, ఆస్తిపాస్తులూ..వీటన్నిటి మీదే ఆమె దృష్టి అని తెలిసిందనీ, చాలా డబ్బు ఖర్చు పెట్టించిందనీ, ఎప్పుడూ ఖరీదైన హోటల్స్, పార్టీలు, బహుమతులూ ఇదే పిచ్చి తప్పితే తన మనసుకు దగ్గరగా రాలేకపోయిందనీ, ఆమెను పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉండలేననిపిస్తుందనీ చెబుతాడు.
    కొడుకు చెప్పిన విషయాలు నిర్ధారించుకోవడానికి శృతి వాళ్ళింటికి వెళ్తుంది కల్యాణి. శృతి ధోరణిలో ప్రేమ కన్నా అధికారం, అహంకారం కల్యాణి పసిగడుతుంది. శృతి, వాళ్ళ నాన్న మాటలు విన్నాక తన కొడుకు చెప్పింది నిజమేననిపించి వాళ్ళు హార్ట్ అవకుండా నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు శృతి 'మీ అబ్బాయి నాతో తిరిగినట్లు నా దగ్గర ఆధారాలున్నాయి. అంత తేలిగ్గా అతన్ని వదిలిపెట్టను లెండి' అని బెదిరిస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి తనకు సరిపడదని తెలుసుకుని ఎక్కువ దూరం పోకుండా మొదట్లోనే తెలుసుకున్న కొడుకు నిర్ణయానికి సంతోషించాలా లేక ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయిల స్థానాలు తారుమారయినందుకు ఓ స్త్రీగా సంతోషించాలా అనుకుంటుంది కల్యాణి. 
    'భావన కథలో ప్రసాద రావు, సునంద దంపతుల కుమార్తె భావన. చదువు, మంచి ఉద్యోగం, స్వేచ్చ... వీటి ధీమాతో బోలెడు అహంభావంలా అగుపించే ఆత్మవిశ్వాసం దీనికి తోడు పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, సరదాలు, ఫ్యాషన్లు......ఇదే జీవితం అనుకునేంత భ్రమ! ఏన్నర్ధం పాటు సినిమాలు, షికార్లు, ప్రేమలు అయ్యాక మొదట నచ్చిన కశ్యప్ ను పెళ్ళి చేసుకుని కొన్నాళ్ళకే అతను తను ఆశించిన విధంగా లేడని డైవర్స్ తీసుకుంటుంది.    
    ఆ తరువాత ఆఫీస్ లో తనతోబాటే పనిచేస్తున్న కార్తీక్ ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెబుతుంది. కార్తీక్ సరదాగా, చలాకీగా, స్మార్ట్ గా ఉంటాడని అంటుంది. ఈ సారైనా సరైన నిర్ణయం తీసుకొమ్మని వాళ్ళు సలహా ఇస్తారు. కొన్నాళ్ళకు పెళ్ళి గురించి ఒత్తిడి రాగానే తప్పించుకు తిరుగుతాడు కార్తీక్. నిలదీస్తే 'నీ కంటే పెద్ద అమ్మాయిని, విడాకులు తీసుకున్న దాన్ని పెళ్ళి చేసుకునే ఖర్మ నీకేంటీ?! అంటున్నారు ఇంట్లోవాళ్ళు' అంటాడు. అంతేకాదు 'నీ మాటే చెల్లాలనే నీ మనస్తత్వం, నువ్వన్నదే రైటనే నీ అహం నాకు సరిపడదేమో!' అని కూడా చెబుతాడు. భావన అహం దెబ్బ తింటుంది. 'మీరే ఓ మంచి సంబంధం చూడండి' అని తల్లిదండ్రులతో చెబుతుంది. 'ప్రేమలు ఎంజాయ్ చెయ్యడానికే తప్ప పెళ్ళి చేసుకోవడానికి కాదు. పెళ్ళి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ, మనస్తత్వాలు కలవక మళ్ళీ గొడవలు, విడిపోవడాలు పెద్ద బాధ' అనుకుంటారు వాళ్ళు. ఎవడో ఒకడికి పిల్లను ఇచ్చి బాధ్యత తీర్చుకోవడం, కష్టమో నిష్టూరమో వాడితోనే ఉండడం మంచిదనే ఒకప్పటి తల్లిదండ్రులకే ఇప్పటి తల్లిదండ్రులకీ మధ్య తేడాను చూపించారు రచయిత్రి. అదే సమయంలో ఆడపిల్లలు తమకు లభించిన స్వేచ్చనూ, చదువు వల్ల, ఉద్యోగం వల్ల వచ్చిన ఆత్మవిశ్వాసాన్నీ దుర్వినియోగం చేస్తూ మితిమీరిన అహంకారంతోనో, తొందరపాటు తోనో, రాజీ ధోరణి లేకపోవడం తోనో జీవితాల్ని నాశనం చేసుకోవడం కూడా చాలా కథల్లో చూపిస్తారు.

 Previous Page Next Page