విద్యాగంధానికి తోడైన సాహితీ సుగంధం.
డాక్టర్ పరిమళా సోమేశ్వర్
-వారణాసి నాగలక్ష్మి
అరవయ్యవ దశకం నుంచి స్త్రీ పురుషుల స్వభావాలలో వచ్చిన మార్పుని నిశితంగా గమనిస్తూ, వైవిధ్యభరితమైన కథలూ, నవలలూ రచించి, పాఠకాదరణ పొందిన డాక్టర్ పరిమళా సోమేశ్వర్ ఉన్నత విద్యావంతురాలైన తెలుగు రచయిత్రులలో మొదటితరానికి చెందినవారు. శ్రీమతి పరిమళా సోమేశ్వర్ గారు తన రచనల్లో, 1960 నుంచి 1980 వరకు గల రెండు దశాబ్దాల కాలంలోని మధ్యతరగతి జీవితాలనీ, కుటుంబ వ్యవస్థనీ, మారుతున్న సమాజచిత్రాన్నీ, స్త్రీ దృష్టికోణం నుంచి ప్రతిభావంతంగా చిత్రించగలిగారు. సామాజిక వాస్తవికత, మనస్తత్వ చిత్రణ వీరి రచనలోని ప్రత్యేకతలు. స్త్రీ పురుషులు సంప్రదాయ చట్రం నుంచి బైటపడి, మానవీయ భావజాలాన్ని పెంపొందించుకుంటున్న క్రమాన్ని ఈ కథలు వ్యక్తీకరిస్తాయి. పురుషాధిక్య సమాజంలో ఒదిగి ఉండే స్త్రీ, చదువుకుని, ఉద్యోగినిగా మరి, కుటుంబంలో నిర్ణయాధికారం సంపాదించుకున్న క్రమాన్ని ఈ కథలు అక్షరబద్ధం చేశాయి. భార్యాభర్తల మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలో ఇవి సూచిస్తాయి, ఉండకపోతే కోల్పోయేదేమిటో ఇవి వివరిస్తాయి.
నలభయ్యవ దశకంలో కృష్ణాజిల్లా తేలప్రోలులో పుట్టిన పరిమళ గారు srr & cvr కళాశాలలో బియెస్సీ, మధ్యప్రదేశ్ లోని సాగర్ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీ లో ఎమ్మెస్సీ చేశారు. అణువుల్లోని అంతర్గత హైడ్రోజన్ బంధాల మీద పీహెచ్డీ చేసి, 1964లో ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లెక్చరర్ గా చేరారు. పియూసీ చదువులనాటి నుంచి తనకు సహాధ్యాయి అయిన డాక్టర్ జి. సోమేశ్వర్ గారిని వీరు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆనాటి సమాజంలో కులాంతర వివాహాలకి సమాజపు అంగీకారముద్ర లభించడం కష్టమే అయినా ఈ దంపతులకి ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదు. ఇద్దరూ విద్యావంతులు, ఆర్ధిక స్వావలంబన గల వ్యక్తులు కావడం ఒక కారణమైతే, ఇరుపక్షాల పెద్దలూ త్వరలోనే వారి నిర్ణయాన్ని గౌరవించి ఆదరించడం మరో కారణం.
పరిమళ గారు తన ఉద్యోగంలో పదోన్నతులు పొంది చివరకు ప్రిన్సిపల్ గా రిటైరయారు. సోమేశ్వర్ గారు పొలిటికల్ సైన్సెస్ లో లెక్చరర్ గా పనిచేస్తూ ఎమ్ ఫిల్, పీహెచ్డీ చేయడమే కాక LLB కూడా పూర్తి చేసి, ఉద్యోగ విరమణ తర్వాత హైకోర్ట్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. వీరిద్దరూ తాము పనిచేసే కళాశాలకి దగ్గర్లోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. పాతికేళ్ళపాటు ఒకే కళాశాలలో సహోద్యోగులుగా పనిచేసిన వీరు ఆదర్శవంతమైన దాంపత్యజీవితం సాగిస్తూ, తమ పిల్లలు ముగ్గురినీ స్నేహితులుగా పరిగణిస్తూ, వారిలోని విద్యార్జనాసక్తిని గమనించి ప్రోత్సహించారు. వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు.
వీరి పెద్దబ్బాయి డాక్టర్ మనోజ్ దంతవైద్యులు. తల్లిదండ్రులతో కలిసి ఉంటూ, ఇంటిపై భాగంలో తమ స్వంత క్లినిక్ నడుపుతూ వచ్చారు. వీరు తన తొమ్మిదో ఏటి నుంచి ఆంగ్లంలో కథలూ, వ్యాసాలూ రాయడం చూస్తే 'ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుం'దనిపించక మానదు. పరిమళ గారు కూడా తన రచనా వ్యాసంగాన్ని ఎనిమిది తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే మొదలుపెట్టి, ఛందోబద్ధమైన పద్యాలు పోటీపడి వ్రాసేవారట. డాక్టర్ మనోజ్ చదివినది దంతవైద్యమే అయినా ఆసక్తి కొద్దీ MBA చేసి తర్వాత అయిదు ph.d. పట్టాలు పొందడం విశేషంగా చెప్పుకోవలసిన విషయం. వీరి రెండవ సంతానమైన డాక్టర్ అజంత, వైద్యవిద్య నభ్యసించి టెక్సాస్ లో డాక్టర్ గా పని చేస్తున్నారు. ఈమెకు ఆంగ్ల కవిత్వంలో అభిరుచి ఉంది. వీరి మూడవ సంతానమైన కిరణ్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పనిచేస్తున్నారు.
వీరు పుట్టిపెరిగినది వామ పక్ష భావాలున్న గ్రామ వాతావరణం. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆ ఊరిలో ఒక గ్రంధాలయం ఉండడం చెప్పుకోతగ్గ విశేషం. ఈమె పుట్టింట్లో సాహితీ సుగంధాలు విరబోస్తూ ఉండవి. చిన్నవయసులోనే ఆమె తన బాబాయి గారి ప్రభావంతో రఘువంశం, కుమార సంభవం వంటి కావ్యాలు చదివి సాహిత్యం పట్ల అభిరుచి పెంచుకున్నారు. చిన్న వయసులోనే వీరికి దేవులపల్లి రామానుజ రావుగారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, పోతుకూచి సాంబశివరావు గారు వంటి సాహితీవేత్తల ప్రోత్సాహం లభించింది. 1975లో ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహక మండలి సభ్యులుగా ఉన్నారు. సాహిత్య అకాడమీ సలహా మండలిలో సభ్యులుగా పనిచేశారు. ఈమె సాహిత్యంలో కొందరి శైలినీ, కొందరెన్నుకునే ఇతివృత్తాలనీ ఇష్టపడి చదువుతూ తనదైన శైలిని క్రమంగా అలవరచుకున్నారు. తొమ్మిదేళ్ళ వయసు నుండి ఈమెకి రచనా వ్యాసంగంతో పరిచయం ఏర్పడింది.
1965 లో వీరి మొదటి కథ మిస్ సుధారాణి యువ మాసపత్రికలో అచ్చయింది. తర్వాత అన్నిరకాల ప్రక్రియల్లోనూ రచనలు చేసినా కథారచనే తనకెక్కువ సంతృప్తి నిచ్చిన ప్రక్రియగా ఈమె చెప్పుకున్నారు. ఉద్యోగరీత్యా నాలుగు సంవత్సరాలపాటు తుంగభద్రా ఎక్స్ ప్రెస్ లో మహిళా ఉద్యోగులకు వేసిన ప్రత్యేక బోగీలో ప్రయాణిస్తూ ఎందరో ఉద్యోగులతో సంభాషించడం, కష్టసుఖాలు తెలుసుకోవడం జరిగిందనీ ఆ అనుభవసారాన్ని లేడీస్ స్పెషల్ అనే నవలలో పొందుపరచాననీ చెప్పే పరిమళ గారు తన జీవితంలో తారస పడ్డ ప్రతి వ్యక్తీ ఏదో ఒక రూపంలో, ఎక్కడో ఒకచోట చూచాయగానో, పరిపూర్ణంగానో తన రచనల్లో చోటు చేసుకుంటారంటారు. తాను చదివిన లేదా విన్న ఒక్క వాక్యమే అయినా అది తనకెంతో ప్రేరణగా పనిచేస్తుందంటారు.
అరవయ్యోదశకం నాటికి విద్యావంతులైన యువతులే తక్కువ కాగా, వారిలో ఉద్యోగబాధ్యతలు చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్న స్త్రీలు మరీ తక్కువ. అలాంటి నేపథ్యంలో పరిమళంగారు వృత్తిరీత్యా రసాయనశాస్త్ర అధ్యయనం సాగిస్తూనే, ప్రవృత్తిరీత్యా కథలూ కవితలతో రచనారంగంలో చురుకుగా పాల్గొనేవారు. వీరి మొదటి కథ అచ్చయిన తర్వాత వీరి రచనా వ్యాసంగం వేగంగా సాగింది. సాహితీ లోకాన్ని రచయిత్రులు ఏలుతున్న కాలమది. యద్ధనపూడి సులోచనారాణి, ద్వివేదుల విశాలాక్షి, మాదిరెడ్డి సులోచన, చిట్టారెడ్డి సూర్యకుమారి, పోల్కంపల్లి శాంతాదేవి వంటి ప్రముఖ రచయిత్రులు ఈమెకు సమకాలీనులు.