తనతోబాటు పనిచేసే పవన్ పట్ల చతుర అతి చనువుగా ఉండడం చూసి తల్లి సహించలేక మందలిస్తుంది. ఈ కథకంతా కీలక ఘట్టం అదే! అందువల్ల ఈ కథ కొంత ఉపన్యాస ధోరణిలో సాగుతుంది. తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కూతురికి చూపించి ఒక కాంపౌండ్ వాల్ గానీ, గేట్ గానీ లేనప్పుడు ఆ జాగాను ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించి ఎంత గలీజుగా ఉంచారో, ఇప్పుడు ప్రహరీ గోడ కట్టి గేట్ అమర్చి తాళం వేసి దానికి ఒక రక్షణ కల్పించాక ఎవరైనా అందులో ప్రవేశించడానికి ఎలా భయపడుతున్నారో చెబుతుంది. ఆడపిల్ల జీవితం కూడా అంతేననీ, గతకాలం కంటే ఇప్పుడు ఆడపిల్లలకు అవకాశాలు, స్వేచ్చ ఉన్నా కూడా ఆడ, మగ ఫ్రీగా సంచరించినప్పుడు వయసు తొందరలో తప్పు చేస్తే ఆ ప్రభావం యువతి మీద ఉన్నట్టుగా యువకుడి మీద ఉండదనీ జయలక్ష్మి పాత్ర ద్వారా చెప్పిస్తారు రచయిత్రి. 'ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువులు, ఉద్యోగాల పేరుతో వంటరిగా ఉండే పరిస్థితిలో ఆడ, మగ స్నేహాలు ఎక్కువై, పరిచయాలు ఎటో దారితీసి, ప్రేమలతో మోసపోయే ఆడపిల్లలు ఇప్పుడింకా ఎక్కువయ్యారు. వివాహం స్తీకి రక్షణనిస్తుంది. ఏదైనా జరిగితే చట్టం న్యాయం చేస్తుంది. నా ఇష్టం నేనే అంటే ఆ విచ్చలవిడితనానికి చట్టం, సమాజం తోడు రావు' అంటుంది జయలక్ష్మి. ఒక రక్షణ వ్యవస్థను గౌరవించకపోతే నష్టపోయేది ఆడపిల్లలే అంటూ కూతురికి 'గీతోపదేశం' చేస్తుంది.
ఒక మామూలు ప్రేమ కథను కూడా ట్రీట్ మెంట్ ద్వారా ఎలా ఎలివేట్ చేయొచ్చో 'క్షంతవ్యులు' కథలో చూడొచ్చు. డాక్టర్ నీరజ, ఇంజనీర్ కృష్ణమూర్తి ఒక స్నేహితురాలి పెళ్ళిలో కలిసి ఆ తరువాత ఒకర్నొకరు ఇష్టపడతారు. అతనికి ఎవరూ లేరు. ఆమె తండ్రి అడ్డుచెప్పడు. ఇద్దరూ మంచివారే, సంస్కారవంతులే. పరస్పరం అర్ధం చేసుకోవడానికి నీరజ కోరిక మీద ఓ వారం పాటు నాగార్జునసాగర్ కు వెళతారు సరదాగా. అక్కడ సుశీల అన్న యువతి కృష్ణను కలవడానికి పదేపదే ప్రయత్నిస్తుంది. ఉద్యోగపు తొలిరోజుల్లో బోర్ కొట్టి ఆమెతో గడిపిన విషయం కృష్ణ చెప్పి...... ప్రయాణం కోసం ఒక బస్ ఎక్కి గమ్యం రాగానే దిగి వెళ్ళిపోయిన తర్వాత బస్ తో ఎలాంటి సంబంధమూ లేనట్టుగానే తమ పరిచయం అని చెబుతాడు. ఆ తరువాత నీరజ అతనితో మామూలుగానే ఉన్నా మనసులో ఇదమిద్ధంగా చెప్పలేని ఒక వెలితి ఏర్పడుతుంది. ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుంది. ఆమె మధ్యలోనే ట్రిప్ కాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతుంది.
అనుభూతి ప్రధానమైన కథ ఇది. ఏ కాలంలోనైనా, ఎంత చదువుకున్న స్త్రీకి అయినా తను ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలనుకున్న పురుషుడి జీవితంలో వేరొక స్త్రీ పాలుపంచుకున్న విషయం మనసులో ముల్లులా గుచ్చుతూనే ఉంటుంది. అది గతమయినా, ప్రస్తుతం అప్రస్తుతమయినా గాయం రేపుతూనే ఉంటుంది. ఉదయ సూర్య కాంతిలా ఆహ్లాదంగా మొదలైన ఈ కథ... సాయంకాలం మెల్లమెల్లగా చీకటి నీడలు దించినట్లుగా... పాఠకుడి మనసుని విచారంలో ముంచుతుంది. యాభై ఏళ్ల నాటి ఈ కథ చదివితే అప్పటి కథన శిల్పం అబ్బురంగా తోస్తుంది. అంతే కాదు ఆనాటి యువతీ యువకుల మధ్య ప్రేమలో ఉండే సంస్కారం కూడా తెలుస్తుంది. శిల్పపరంగా మంచి కథ ఇది.
చాలా ఏళ్ల క్రితం రాసిన 'వాన చినుకులు' ఒక ప్రత్యేకమైన కథగా చెప్పవచ్చు. 'భూమిని శూలాల్లా గుచ్చే వానచినుకులు మరుక్షణంలో ఇంకిపోతాయి. గుంటలు పడినా కొన్నాళ్ళకు ఆ గుర్తులు కూడా మిగలవు. సంఘటనలూ, వాటి జ్ఞాపకాలూ అంతే, కొన్నాళ్ళకు సమసిపోతాయి' అనుకుంటాడు ఈ కథలో రావ్ పాత్రధారి. మిత్రుని రికమండేషన్ తో తన ఆఫీస్ లోనే ఉద్యోగమిచ్చి రత్నమాలను ఇష్టపడతాడు. ఆమె కూడా అతన్ని అభిమానిస్తుంది. చివరికి రిజైన్ చేసి వెళ్ళిపోయి, ఎన్నాళ్ళుగానో ఇష్టపడ్డ బావను పెళ్ళి చేసుకున్నట్టు అతనికి తెలుస్తుంది. రావు తానే అనుకున్నట్టు 'మొదట్లో జాలి, సానుభూతి, తర్వాత దయ, అభిమానం, మధ్యలో అసూయ, చివరికి మమత, అనురాగం తనను వశం చేసుకున్నాయి. అయామ్ ఏ బ్లడీ ఫూల్' అన్న మాటల ద్వారా మొహమాటం, మంచితనం కొన్ని సార్లు మనల్ని మనమే పోగొట్టుకునేలా చేస్తాయన్న సత్యం తెలుస్తుంది. అప్పటికీ ఇప్పటికీ ఇష్టపడడంలో గానీ ఆ ప్రేమను వ్యక్తం చేయడంలో గానీ వచ్చిన మార్పు.....ముఖ్యంగా అప్పటి నిదానం, ఆరాధన, మూగప్రేమ స్థానంలో ఇప్పటి దూకుడు, పొసిసివ్ నెస్, తొందరపాటు స్పష్టంగా తెలుస్తాయి.
ఈ కథా శీర్షికతో వచ్చిన సంకలనానికి రాసిన ముందుమాటలో ఈ కథను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.
'తమ పరిధిని విశాలం చేసుకుని లోకాన్ని చూడగల్గిన బహుకొద్ది మంది రచయిత్రులలో కామేశ్వరి ఒకరు. ఈమె కథలు దాదాపుగా అన్నీ కూడా సంఘటనల ప్రధానంగా కాక మనస్తత్వ చిత్రణ ప్రధానంగా ఉంటాయి.' అంటూ రచయిత్రిని ప్రశంసించారు ప్రముఖ రచయిత, కవి, చిత్రకారులు శీలా వీర్రాజు గారు. ఆ మాటలు చాలా నిజమని ఆమె కథలన్నీ చదివితే తెలుస్తుంది.
ఎప్పటికప్పుడు సమకాలీన కథాంశాలను తీసుకొని రచనలు చేసే కామేశ్వరి గారు యువతీ యువకుల మధ్య ఆకర్షణలు, ప్రేమల మీద స్పెషలైజేషన్ చేశారని చెప్పవచ్చు. స్త్రీ పురుషుల మద్య ఏర్పడే సహజమైన ఆకర్షణ, బాహ్య రూపం, వయసుపెట్టే తొందర, ఒకే చోట చదువుకోవడమో, కలిసి పనిచేయడమో వల్ల కలిగే సామీప్యత, బాధ్యతలు పట్టని కేర్ ఫ్రీ లైఫ్.....వీటన్నిటి వల్లా నేటి యువత తొందరగా ప్రేమ అని పిలవబడే మోహంలో పడిపోతున్నారు అంటారామె.
కొన్నాళ్ళయ్యాక బోర్ కొట్టి చేంజ్ కోసమో, పెళ్ళి పేరుతో ఇంకా గొప్ప జీవిత భాగస్వామి దొరుకుతున్నారనో, రక్షణ, భద్రత, పరువు లాంటి కారణాలతో తల్లిదండ్రులు కట్టడి చేయడం వల్లో, ఇంకొక బెటర్ లవర్ దొరకడమో..మొత్తానికి..మొదటి వారిని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. ఆ బంధంలో శారీరక సంబంధం కూడా ఉన్న చోట్ల కొద్ది మంది యువతులు అబ్బాయిల్ని నిలదీస్తున్నారేమో కానీ, చాలామంది అమ్మాయిలు మనసుకు సర్ది చెప్పుకుని వదిలేస్తున్నారు. మగపిల్లలు మాత్రం తమతో సినిమాలకూ, షికార్లకూ, పార్టీలకూ తిరిగిన అమ్మాయిల పట్ల చాలా పోసిసివ్ గా ఉండడమే కాదు, అమ్మాయిల తిరస్కారం, నిరక్ష్యాన్ని ఏ మాత్రం తట్టుకోలేక ప్రేమించిన అమ్మాయిల మీద దాడులకు దిగి ప్రాణాలు తీసేదాకా తెగిస్తున్నారు.