ఈ కథలో ఒరిస్సా లోని ప్రదేశాల వర్ణన అవసరమయినంత మేరకు కథలో ఇమిడిపోయి ఆసక్తిని కలిగిస్తుంది. 'సంసారమనే బండికి భార్యాభర్తల్లో ఒకరు గుర్రం అయితే మరొకరు రౌతు అనుకుంటే అదుపు లేకుండా పరిగెత్తే గుర్రాన్ని అదుపులో పెట్టడం రౌతు కర్తవ్యం. భార్యాభర్తల్లో పొంగేపాలపై నీళ్ళు చిలకరించేవారు ఒకరుండాలి గానీ మంట ఎగదోసేవారుంటే ఆ పాలు పొంగి నేలపాలవుతాయి. ఇద్దరూ ఒకలాంటి వారుండడం కంటే భిన్న మనస్తత్వాలవారు భార్యాభర్తలుగా ఉంటేనే ఆ కాపురం రాణిస్తుంది' కథ చివర్లో మీనాక్షి భర్త రామావతారం అన్న పై మాటలు కథకు ఆయువుపట్టు లాంటివి.
భార్య పోయి కొడుకూ, కూతురూ విదేశాల్లో ఉండి ఒంటరిగా ఉంటున్న డెబ్బయ్ అయిదేళ్ళ పార్ధసారథి, తన కాలేజీ రోజుల నాటి అవివాహిత అయిన స్నేహితురాలు అమెరికాను వదిలేసి శాశ్వతంగా తన దగ్గర ఓ స్నేహితురాలిగా ఉందామని వస్తే తన పిల్లలు ఒప్పుకున్నప్పటికీ, పిరికితనంతో, సమాజం పట్ల భయంతో ఆమెను దూరం చేసుకున్న 'సగటు మనిషి' కథ సూటిగా, ఎక్కువ వర్ణనలు లేకుండా బావుంది. సమాజం ఏమనుకుంటుందో నన్న సంకోచం యవ్వనంలో కంటే తరువాత రోజుల్లో మరీ ఎక్కువగా ఉంటుందేమోననిపిస్తుంది. సమాజం మారటం లేదని ప్రతి ఒక్కరూ అంటారు గానీ, ముందు మనం మారుతున్నామా అనే ప్రశ్న ఈ కథ చదివాక కలుగుతుంది.
పెళ్ళి స్త్రీ పురుషులిద్దరికీ సమాన అవసరమే అయినప్పటికీ వివాహం తరువాత స్త్రీ మెల్ల మెల్లగా తన పేరునీ, ఇష్టాలనీ, అభిరుచులనీ.......చివరకు తన వ్యక్తిత్వాన్నే కోల్పోవాల్సిన పరిస్థితులెన్నో! ఒకలాంటి మిధ్యా నాగరిక సమాజంలో ఇలాంటివి మరికాస్త ఎక్కువ. మేజర్ రావ్ భార్యగా ఆ వాతావరణంలో అడుగుపెట్టిన శాంతి...తను తాను గానే ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తుంది గానీ, భర్త కోరిన మీదట మెల్లమెల్లగా కట్టూ బొట్టూ అలవాట్లూ మార్చుకుంటుంది. చివరికి ఆ మార్పు భర్త అసహనానికి కారణమవుతుంది. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్న శాంతికి అన్నీ వంకర గీతలే కనిపిస్తాయి. ఏ దాటగూడని గీత తాను దాటిందో అర్ధం కాదు. శిల్పపరంగా చాలా మంచి కథ ఇది. భార్య ఎప్పుడూ తను కోరుకున్నట్టే ఉండాలని భర్త అనుకుంటాడు. అలా లేకపోతే మారాలి. ఆ మార్పు కూడా తనకు, కుటుంబానికి ఇబ్బంది కల్గించకుండా, తను కోరుకున్నంతే ఉండాలి. ఆమె మారే క్రమంలో ఏ చిన్న సర్దుబాటును అంగీకరించడానికి కూడా అతడు సిద్ధంగా ఉండడు. కొన్ని మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లే ఆధునికీకరణ కావాలనుకున్నప్పుడు దానివెంట కొన్ని అవాంఛనీయ ధోరణులూ ప్రవేశిస్తాయి. ఈ నగ్నసత్యాన్ని 'వంకర గీతలు' కథ చక్కగా వివరించింది.
మరో కథ 'మధుపం'. మధుపం అంటే తుమ్మెద. ఒక పువ్వు మీద వాలి మకరందాన్ని గ్రోలిన తర్వాత మరో పువ్వు మీదికి వాలే తుమ్మెదలాంటి గుణం చాలామందికి మగవాళ్ళకి ఉంటుంది. పెళ్ళయి కొన్నాళ్ళు సంసారం చేసి పిల్లలు పుట్టాక కొందరు భర్తలకి 'సెవెన్ ఇయర్స్ ఇచ్' అనే ఫీలింగ్ మొదలై మరో అమ్మాయి వెంట పడాలని అనిపిస్తుందట. ఇంటి ముందో వెనకో పక్కింట్లోనో లేదా ఆఫీసులో పనిచేసే చోటో ఎవరైనా అమ్మాయి కొంచెం స్మార్ట్ గా యాక్టివ్ గా కనబడితే వాళ్ళతో సినిమాలకి షికార్లకి హోటళ్ళకు పిక్నిక్ లకి తిరగాలని అనిపిస్తుందట. అవతలి స్త్రీ అంగీకరిస్తే వివాహేతర సంబంధం కొనసాగించడానికి కూడా వీళ్ళు సిద్ధపడతారు.
అఖిల, మహిమ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అఖిల భర్త కార్తీక్ తన ఆఫీసులో పనిచేసే మేధ అనే అమ్మాయి వెంట పడుతున్నాడని మహిమ ఆడపడుచు నిత్య ద్వారా తెలుస్తుంది. అయితే మహిమ అఖిలతో ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు 'నాకు ఇంట్లో ప్రశాంతత కావాలి. రొటీన్ లైఫ్ నుంచి సమస్యలు ఆందోళనలు కల్గించే పరిస్థితులు సృష్టించుకోవడం నాకిష్టం లేదు. మగబుద్ధి మారదు. దీనికోసం ప్రశాంతతని వదులుకునేలాగా నేను లేను. అతని నేర నిర్ధారణ చేసి అతన్నుంచి విడిపోయి ఈ పిల్లల్ని సింగల్ పేరెంట్ గా పెంచలేను.' అన్న అఖిల జవాబు విన్న మహిమ చాలా ఆశ్చర్యపోతుంది.
'తన భర్త మరో స్త్రీతో తిరుగుతాడని తెలిసీ, పట్టించుకునే కోరిక, తీరిక భార్యకు లేదనేంతగా మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. చదువు, ఉద్యోగం, సంపాదన, స్థిరత్వం తప్ప మనిషికి మరోటి అక్కరలేనంతగా.......భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు గానీ, భర్త దూరమైతే పడే బాధ, అవమానం, అసహనం ఏవీ లేకుండా ఏదో ఏడవనీ అనుకునేటంత నిర్లిప్తత, నిస్తేజం మానవ సంబంధాలలో వచ్చేసాయా అని ఆశ్చర్యంగా ఉంది' అంటుంది మహిమ. చివరికి అలా అని మరీ వదిలిపెట్టకుండా మహిమ సలహాతో అఖిల ఫోన్ కి కూడా ఎవరో అతను ప్రేమిస్తున్నాడని మెసేజెస్ పంపి అవి కార్తీక్ చూసేలాగా చేస్తారు. దాంతో కార్తీక్ కి అనుమానం వచ్చి భార్యని నిలదీస్తాడు. 'నువ్వు చేసినప్పుడు లేని తప్పు నేను చేస్తే వచ్చిందా? భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకమే తప్ప మరొకటి కాదు. నిజమేమిటో నీకు తెలుసు...నాకు తెలుసు. ఇక నుంచి నా పిల్లలకి తండ్రిగా, నా ఇంట్లో గృహస్తుగా తప్ప నీకు నా భర్తగా నా జీవితంలో చోటు లేదు.' అని తెగించి చెప్తుంది అఖిల.
భార్య భర్తల మధ్య విశ్వాసం అనేది సన్నటి పొరలాంటిది. ఆ పొర కరిగిపోతే మళ్ళీ అతకడం చాలా కష్టం. అయినా కూడా ఇప్పటి యాంత్రిక జీవన సంబంధాలలో ఇలాంటి విషయాలను తెలివిగా పరిష్కరించుకోవాల్సిందే తప్ప గొడవలకు పోయి కుటుంబంలో అశాంతిని కోరి తెచ్చుకొని పిల్లల జీవితాలను అస్తవ్యస్తం చేసుకోవడం అవివేకం......అని ఈ కథలో అఖిల పాత్ర ద్వారా రచయిత్రి చెప్తారు. ఎంత రోషం, బాధ కలిగినప్పటికీ, ఎప్పటికైనా కుటుంబ సంబంధాల్లో సంయమనం ఉండడమే మంచిది అనే అభిప్రాయాన్ని పాఠకులకి చెబుతారు. ఇది కాలానుగుణంగా రచయిత్రి ఎంచుకున్న కథాంశాలలో వచ్చిన మార్పుగా గమనించాలి. ముఖ్యంగా భార్యాభర్తల జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించిన సందర్భాల్లో ఆ వ్యక్తి స్త్రీ అయినా, పురుషుడు అయినా మళ్ళీ స్త్రీకే బాధలూ, అవమానాలూ తప్పవననే విషయాన్ని ఎన్నో కథల్లో చెబుతారు రచయిత్రి.
ఈనాటి అమ్మాయిలు చదువు, దానివల్ల వచ్చిన ఆర్ధిక స్వావలంబన, తద్వారా లభించిన స్వేచ్చను సరిగ్గా అర్ధం చేసుకోక, సక్రమంగా ఉపయోగించుకోనూ లేక ఇక్కట్లపాలవుతున్నారని రచయిత్రి చాలా కథల్లో అంటారు. 'గీతోపదేశం' అన్న కథలో సత్యమూర్తి, జయలక్ష్మిల కూతురు చతుర.సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. అలాంటి అందరమ్మాయిల్లాగే వీకెండ్ పార్టీల్లో గడిపి రాత్రి ఒంటిగంటకు ఇంటికి రావడం, పొద్దున పదకొండింటికి లేవడం, ఏదో దేశాన్నుద్దరిస్తున్నట్టు తల్లికి ఒక్క పనిలో కూడా సహాయం చేయకపోవడం, కాఫీకి కూడా తల్లి మీద ఆధారపడడం, జంక్ ఫుడ్ తినడం, కురచ దుస్తులేసుకుని తిరగడమే డెవలప్ మెంట్ అనుకోవడం, ఎవరైనా సలహాలివ్వబోతే చిరాకుపడడం.....ఇలాంటి లక్షణాలతో ఉంటుంది.