స్త్రీ పురుష సంబంధాలు
మనుషుల్లో రెండే జెండర్లు. స్త్రీలు, పురుషులు, ఇటీవలి కాలంలో థర్డ్ జెండర్ గురించి మాట్లాడుకోవడం, వారిపై సాహిత్యం వెలువడడం మొదలమయింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా సమాజంలో వారి సంఖ్య, ప్రభావం కూడా తక్కువే.
కుటుంబంలో గానీ, సమాజంలో గానీ స్త్రీ పురుష సంబంధాలెలా ఉన్నాయి అన్నదాని పైనే సమాజం యొక్క పరిస్థితి, ఉన్నతి ఆధారపడి ఉంటాయి. ఏ సమాజంలోనైనా స్త్రీలు, పురుషులూ సమాన హక్కులు, బాధ్యతలు కలిగి ఉన్నప్పుడే అది ఆరోగ్యకరమైన సమాజంగా చెప్పబడుతుంది. అయితే... జనాభాలో సగం ఉన్న స్త్రీలు పురుషులతో సమానంగా అవకాశాలు, సౌకర్యాలు, స్వేచ్చ, గౌరవాలు పొందుతున్నారా అంటే ఈనాటికీ లేదనే చెప్పాలి. కనీసం స్త్రీలను సాటి మనుషులుగా కూడా గుర్తించని వారు, వారిని భోగ వస్తువులుగా, అవసరాలు తీర్చే యంత్రాలుగా భావించేవారు, వారి ఉన్నతిని సహించలేనివారు, వారిని శారీరకంగా, మానసికంగా హింసించే వారు..... ఇంకా చాలామంది పురుషులు ఉన్నారు, ఆశ్చర్యకరంగా కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. అందుకు ఈ వ్యవస్థే కారణం అనే ఎరుక కలిగించేది నిస్సందేహంగా సాహిత్యమే. ఆ పనిని కామేశ్వరి గారి కథలు చాలా వరకూ నెరవేర్చాయి.
తొలి యవ్వనంలో యువతీ యువకుల మధ్య ఆకర్షణ ఏర్పడడం అత్యంత సహజమైన విషయం. అందుకు సామీప్యత, స్వేచ్చ, అవకాశం తోడైతే వారు శారీరకంగా దగ్గరపడడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. అయితే తదనంతర పరిణామాలను ఈ కాలంలోనూ స్త్రీలే ఎక్కువగా ఎదుర్కోవలసి రావడం విచారకరం, చేదు నిజం కూడా. ఈ విషయాన్ని రచయిత్రి చాలా కథల్లో పదేపదే చెప్పారు.
'కాలాన్ని వెనక్కి తిప్పకు' కథలో రచయిత్రి ఈ అంశాన్ని ఎంతో సున్నితంగా చర్చకు పెట్టారు. కల్యాణి లాంటి మహిళలు తమ తరంలో చదువు కోసం పోరాడి, ఆర్ధిక స్వాతంత్ర్యం, వ్యక్తిత్వం, ఆత్మాభిమానం లాంటి వాటి కోసం స్వేచ్చను వాడుకుని హుందాగా, గౌరవంగా జీవితాన్ని కొనసాగిస్తుంటే.......తరువాతి తరంలో ఆమె కూతురు చిత్రలాంటి వాళ్ళు అదే స్వేచ్చను అబ్బాయిలతో అర్ధరాత్రుల దాకా పబ్బులకీ, పిక్ నిక్ లకీ తిరగడానికీ, కురచ దుస్తులతో ఫాషన్ సీతాకోక చిలుకలుగా మారడానికీ, థ్రిల్ పేరుతో ప్రీ మారిటల్ సెక్స్ లో పాల్గొనడానికీ ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల కలిగే కష్టం, నష్టం మాత్రం ఎప్పటికీ అమ్మాయిలదే, 'మీ ప్రవర్తన ద్వారా ఎంతో కష్టపడి తెంచుకున్న సంకెళ్ళను తిరిగి బిగించేలా చేయకండి' అన్న నిజాన్ని కల్యాణి పాత్ర ద్వారా చెప్పారు.
ఒక దశలో చిత్ర తన తల్లి కళ్యాణిని ఒక మంచి గైనకాలజిస్ట్ ను సజెస్ట్ చేయమని అడుగుతుంది. ఎందుకంటే.. తను బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నందుకు కన్సీవ్ అయ్యననీ, అబార్షన్ చేయించుకుంటాననీ చెబుతుంది. ఈ రోజుల్లో మితిమీరిన స్వేచ్చ యువతను ఎంత దూరం తీసుకెళ్తుందో చెప్పే మంచి కథ ఇది. ఆలోచింపజేసే ఇలాంటి కథలు నిజానికి ఈనాటి అమ్మాయిలకు చేరాల్సి ఉంది.
ఇంచుమించు ఇలాంటి కథే 'లక్ష్మణ రేఖ' ఆడపిల్లలు పెద్ద చదువులు చదివినా ఎమ్మెస్ లు చదవడానికి అమెరికా లాంటి దేశాలకి వెళ్ళి వచ్చినా మగ పిల్లలని అంచనా వేయడంలో విఫలమవుతారని చెప్పిన కథ ఇది. చదువు రీత్యా పెద్ద ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలకి మునుపటి కన్నా స్వేచ్చ లభించింది అన్న మాట నిజం. కార్తీక అనే అమ్మాయి తన ఆఫీసులోనే పనిచేస్తున్న దినేష్ అనే అబ్బాయితో ప్రేమలో పడి చాలా క్లోజ్ గా తిరుగుతుంది. అయితే కొన్నాళ్ళకి వాడితో మాట్లాడావా, వీడితో వెళ్ళావా,వాడిని చూసి నవ్వాడా లాంటి మాటలు దినేష్ నోటితో వినడం వల్ల అతనికి తనకు పొసకదు అన్న విషయం తెలుసుకొని అతని అంగీకారం తోటే బ్రేకప్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమెకి గౌతమ్ అనే యువకుడితో పెళ్ళి నిశ్చయమవుతుంది. ఈ విషయం తెలిసి దినేష్ ఈగో హర్ట్ అయి కార్తీకతో తాను ఇంటిమేట్ గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆ అమ్మాయి వివాహాన్ని ఆపుదామని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఈ సమయంలో కార్తీక తల్లి సావిత్రికి ఈ విషయం తెలుస్తుంది. ఏదేధైనా సరే, పెళ్ళయ్యాక గౌతమ్ కి అసలు విషయం తెలిసి కార్తీక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే బదులు ముందుగానే అతనికి ఈ విషయం చెప్పమని తల్లిదండ్రులు ఆమెను కోరుతారు.
అయినా సరే..... అతన్ని అలాగే వదిలేయడం ఇష్టం లేక తన స్నేహితురాలు హరిత సహాయంతో దినేష్ తో మాట్లాడుతుంది. 'ఒక్కసారి నా కోరిక తీర్చు. ఆ తర్వాత నీ జోలికి రాను' అంటాడు. 'సరే రేపు కలుసుకుందాం' అని చెప్పి తెల్లారి అతను ఇంటికి రాగానే ఫేస్బుక్లో నువ్వు పెట్టే కన్నా ముందే 'దినేష్ అనే ఒక వెధవ ఇలా ఆడపిల్లల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఇతడి మాటలు నమ్మకండి' అని 'నేనే పోస్ట్ పెట్టి మొత్తం బయట పెడతాను' అని అతనితో మాటల్లో ఉండగానే హరిత అతని సెల్ ఫోన్ తీసుకొని ఆ ఫోటోలు అన్నిటిని డిలీట్ చేస్తుంది. ఆ తర్వాత కార్తిక తన కాబోయే భర్త గౌతం దగ్గరికి వెళ్ళిఉన్నాననీ చెప్తుంది. కార్తీక తల్లి ద్వారా అప్పటికే సంగతంతా తెలుసుకున్న గౌతం ఆ అమ్మాయి తనంతట తను విషయం చెప్పడాన్ని ఆహ్వానిస్తాడు. 'నేను ఆశించింది ఇదే! అమ్మాయిలు చాలామంది బాగా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ, అబ్బాయిల అంతరంగం తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. పెళ్ళికి ముందు అబ్బాయిలతో సినిమాలకు వెళ్ళడం, హోటల్స్ కెళ్ళడం స్నేహాలు చేయడం తప్పు కాకపోయినా హద్దుల్ని అతిక్రమిస్తే అది ఎప్పటికైనా అమ్మాయిలకే ఎక్కువ నష్టం అనే అనే విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. ఈ లక్ష్మణ రేఖని అమ్మాయిలు ఎవరికి వారే గీసుకోవాలి!' అంటాడు గౌతం. కార్తీక్ మనసు తేలిక అవుతుంది. అయితే, ఎంత చదువుకున్నా అబ్బాయిలందరూ గౌతమ్ లా ఉండరనే గౌతమ్ మాటలు రచయిత్రిగా కామేశ్వరి ఈనాటి ఆడపిల్లలకు ఇచ్చే సందేశం అని అర్ధం చేసుకోవచ్చు.
భార్యాభర్తల సంబంధాల గురించి, పెళ్ళయిన కొన్నాళ్ళ తర్వాత ఇద్దరి మధ్యా ఏర్పడే శూన్యత గురించి ఎన్నో కథలు వచ్చాయి. వాటిలో డి. కామేశ్వరి 'చీకటి తొలగిన రాత్రి' ఒక విశిష్టమైన కథ. ఇది పెద్ద కథ అయినా ఎక్కఆ విసుగు కలిగించక పోగా తరువాతేమి జరుగుతుందా అనే ఆసక్తిని పాఠకుల్లో కలిగిస్తుంది. అమెరికాలో ఉండి పదకొండేళ్ళ తర్వాత ఇండియాలో స్థిరపడిన మీనాక్షి భర్త, పిల్లలతో కలిసి ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్న మేనబావ ఇంటికి వస్తుంది. రెండు కుటుంబాలూ ఇరవై రోజుల పాటు ఒరిస్సా రాష్ట్రం లోని పర్యాటక ప్రదేశాలన్నీ చూసే నేపథ్యంలో తన భార్య శాంతినీ, చలాకీగా ఉండే మీనాక్షినీ పోల్చుకొని తన జీవిత భాగస్వామి పట్ల అసంతృప్తి కలుగుతుంది అతనికి. మీనాక్షి కూడా బాహాటంగానే బావ పట్ల తన ఇష్టాన్ని ప్రదర్శిస్తుంది. మొదట్లో పిరికిగా ఉన్నా, అవకాశం దొరికినప్పుడు చొరవ తీసుకోబోయిన అతడిని మీనాక్షి వారిస్తుంది. ఆ తరువాత తాత్కాలిక ఆకర్షణ వేరు, జీవితాంతం వెంట నడిచే తోడు వేరు, క్షణికావేశంలో తప్పు చేస్తే జీవితాంతం పశ్చాత్తాపపడాల్సి ఉంటుంది అని తెల్సుకుని తన భార్యను ఇష్టపడడం మొదలు పెడతాడు.