Previous Page Next Page 
నేటి కాలపు మేటి కథకులు పేజి 14


    గత అరవై ఏళ్లుగా అట్టడుగు వర్గాల వారి జీవితాలు కొంతమేరకు ఆర్దికంగా బాగుపడినా, సామాజికంగా వారికి దక్కాల్సిన గుర్తింపు, వివక్ష లేని గౌరవం లభించడం లేదనేది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే దొరికిన సౌకర్యాలకు మురిసిపోయి, అందిన అవకాశాలకు సంతృప్తి పొందిన కొందరు తాము ఉన్న స్థానం నుంచి మెరుగైన సంస్కారం అలవర్చుకునే విషయంగా వెనుకబడే ఉండడం, ప్రయత్నమే చేయకపోవడం శోచనీయమని అంటారు రచయిత్రి 'చేయూతనివ్వండి' కథలో.
    సివిల్ సప్లైస్ ఆఫీస్ లో బంట్రోతుగా పనిచేసే యాదయ్య, రాజమ్మల కూతురు సుశీల, వెనుకబడిన సామాజిక వర్గంలో పుట్టినా ఇతరుల సహకారంతో కష్టపడి చదువుకుని, రిజర్వేషన్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని ఐ ఏ ఎస్ పూర్తి చేసి అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. తన కుటుంబం ఇక ఏ మాత్రం కష్టపడకూడదని తనదగ్గరే తెచ్చి ఉంచుకుంటుంది. అయితే వాళ్ళల్లో పాత అలవాట్లు, వ్యసనాలు పోవు సరికదా.....తండ్రి బీడీ కాల్చుతూ, తల్లి కట్టెపుల్లల్లేరుతూ కబుర్లాడుతూ ఉంటారు. తమ్ముడు జులాయి గానూ, చెల్లి బద్ధకంగా, షోకిల్లాగానూ తయారవుతారు. వాళ్ళను పద్ధతి మార్చుకోమని సుశీల కోప్పడుతూ ఉంటుంది.
    ఇదిలా ఉండగా ఐఏఎస్ ట్రైనింగ్ లో పరిచయమై, ప్రేమించిన మరో జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ రమాకాంత్ ఓ సారి సుశీలా వాళ్ళింటికి వచ్చి రెండ్రోజులుండి వెళతాడు. ఆ వెంటనే తమ కుటుంబానికీ, సుశీల కుటుంబానికీ ఏ మాత్రం సరిపడదనీ, ఈ పెళ్ళి చేసుకుంటే అనుదినం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందనీ, తనందుకు సిద్ధంగా లేననీ ఉత్తరం రాస్తాడు. దాంతో ఉక్రోషం, ఆవేశం కలగలసిన ఆవేదనలోనే ఆఫీసుకు వెళ్ళిన సుశీల.... తన కింద పనిచేసే సిబ్బంది తన కుటుంబ సభ్యుల గురించి హేళనగా మాట్లాడ్డం సహించలేకపోతుంది. తన దగ్గర క్లర్క్ గా పనిచేసే మూర్తి 'మార్పు ఒక్క రోజులో, ఒక్కసారిగా రాదు, మెల్లమెల్లగా తరం తరం మారుతుంటే వస్తుంది. ఓపికగా ప్రయత్నించాలి' అన్న మాటలకు ఆలోచనలో పడుతుంది. రచయిత్రి ఈ కథను తొంభైల్లో రాశారు. ఏ సామాజిక వర్గం వారికైనా అలవాట్లు, పెరిగిన పద్ధతులు, ఆచారాలు, ప్రవర్తన ఒక్కరోజులో మారవు, క్రమంగా వస్తాయి అనేది రచయిత్రి భావం. అంతే కాదు.... అట్టడుగు వర్గాలవారు తమకు చట్ట ప్రకారం లభించిన సదుపాయాలు, హక్కులు, అవకాశాలు వాడుకుంటున్నంతగా తమ వ్యక్తిగత సంస్కారాన్ని పెంచుకోవట్లేదు అని ఈ కథలో చెబుతారు.
    అయితే, మరో పక్క వారెంత ఎదగాలని ప్రయత్నించినా సమాజంలోని సో కాల్డ్ ఉన్నత వర్గాలు వాళ్ళను తమలో కలుపుకోవడానికి అంగీకరించరు అనే చేదు వాస్తవం కూడా రచయిత్రి విస్మరించరాదు. ఆ కారణంగానే ఇవాళ జరుగుతున్న పరువు హత్యలు. గత మూడు దశాబ్ధాలుగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా అనుకున్నంతగా రాలేదన్నది నిజం. ముఖ్యంగా కులం, మతం వంటి విషయాల్లో కొన్ని సామాజిక వర్గాల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతున్నదనేది అంగీకరించాల్సిన సత్యం. అయితే, ఈ కథ ఒక కోణంలో రాయబడింది కనుక ఆ వైపు వాళ్ళు ఎదగలేదనుకుంటున్నాం గానీ, వారు ఎదిగే క్రమంలో అడుగడుగునా వారిని అవమానాలకూ, అవహేళనలకూ గురిచేసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఒక వర్గం ఎప్పుడూ ఉంటారనేది మరో కోణం.
    యువతరానికి దిశానిర్దేశం చేసే కథలను కూడా చాలా ప్రభావవంతంగా రాశారు రచయిత్రి.
    'వ్యక్తిత్వ వికాస' పుస్తకాలు ప్రత్యేకంగా రాయకపోయినా..... ఆ విభాగానికి చెందిన ఎన్నో కథలు రాశారీమె. 'గట్టి మేలు తలపెట్టవోయ్' అన్న కథలో' యువతరం ఎంతో శక్తివంతమైనది, ఈనాటి యువతీ యువకులు తల్చుకుంటే దేశంలో నెలకొని ఉన్న ఎన్నో దురాచారాల్ని పోగొట్టి, మరెన్నో సమస్యలకి పరిష్కారాలని చూపగలరు. కానీ, వ్యర్ధంగా విలాసాలతో కాలం గడుపుతూ ఎవర్నో నిందిస్తూ, బస్సుల్ని తగలబెడుతూ, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉండవద్దు' అంటూ తన శిష్యులకు చిన్నప్పుడు చదువు చెప్పిన ఓ మాస్టారు ఉద్భోధ చేస్తాడు. ఆ తరువాత స్టూడెంట్స్ తమ పరిధిలో కొందరు అమ్మాయిల, ఇల్లాళ్ళ సమస్యలను పరిష్కరించడం నాటకీయంగా ఉన్నప్పటికీ ఆకట్టుకుంటుంది. ఇది పాత కథ అయినా ఇప్పటికీ వర్తించే కథ.
    సమాజంలో ఓ మూలకు విసిరి వేయబడ్డ, విస్మృతికి గురైన నిర్భాగ్యుల జీవితాల పట్ల ఎంతో స్పష్టమైన అవగాహనతో, పరిశీలనతో కథలు రాశారు కామేశ్వరి. 'నగరంలో నాలుగిళ్ళు', 'నిమిత్త మాత్రులు', 'స్వంతలాభం కొంత మానుకో' వంటి ఎన్నో కథల్ని ఇక్కడ ఉటంకించలేకపోయినా అవన్నీ రచయిత్రిగా కామేశ్వరి నిర్వహించిన బాధ్యతను తెలిపేవే.
    ఆకలి, చీకటి కథల్లో ఎన్ని కోణాలుంటాయో అన్ని కోణాల్లోంచీ కథలు రాసారు కామేశ్వరి. గుడిసెల్లో బ్రతికే నిర్భాగ్య జీవుల జీవితాల్లో ఉండే బాధ, దుఃఖం పట్ల ఎంతో స్పష్టమైన అవగాహన ఉంటే తప్ప ఇలాంటి కథలు రాయలేరు. మారుతున్న సమాజంలో అనునిత్యం తలెత్తుతున్న ప్రతి సమస్యనూ తనదైన అవగాహనతో కథగా మలిచిన రచయిత్రిగా ఆమెను పేర్కొనవచ్చు. అంతే కాదు. అలాంటి కథాంశాలు తీసుకున్నప్పుడు కూడా వీలయినంత వరకూ స్త్రీల కోణం లోంచి రాసే ప్రయత్నం చేశారు.
    
   హాస్య వ్యంగ్య కథలు

 

    సాహిత్య సృజన చేసేవారిలో అన్ని రకాల సాహిత్య ప్రక్రియలనూ స్పృశించేవారు కొందరుంటే కథ, నవల, నాటకం, కవిత్వం, విమర్శ..... ఇలా ఒక ప్రక్రియకే కట్టుబడి అందులో నిష్ణాతులై పేరు తెచ్చుకునేవారు మరికొందరుంటారు. కథాంశాల దృష్ట్యా ఏ రకమైన రచనైనా అలవోకగా చేయగలవారు కొందరుంటే.. ప్రేమ, కుటుంబ సంబంధాలు, అణగారిన వర్గాల కథలు, డిటెక్టివ్ కథలు, సస్పెన్స్, పరిశోధనాత్మకాలు, హాస్యం ఇలా ఒక ప్రత్యేక విభాగంలో పేరు తెచ్చుకునేవారు మరికొందరుంటారు. అయితే హాస్య రచన అంత తేలిక కాదనీ, అన్నింటికంటే కష్టమనీ అనుభవజ్ఞులు చెబుతుంటారు.
    కామేశ్వరి గారి టార్గెట్ రీడర్స్ వేరు, కథాంశాలు వేరు. ఆవిడ చాలా తక్కువ సంఖ్యలో హాస్య కథలు రాశారు. కొన్ని పూర్తి హాస్య కథలు రాస్తే, మరికొన్ని ఇతర కథల్లో కూడా అవకాశమున్నంత మేరా హాస్యాన్ని ప్రవేశపెట్టారు. ఇది కృతకంగా కాక, కథలో ఇమిడిపోయేలా చేయడం కామేశ్వరి గారి ప్రత్యేకత. ముఖ్యంగా 'బాయ్ మీట్స్ గర్ల్' లాంటి టీనేజ్ లవ్ స్టోరీస్ లోనూ, తిండి వస్తువులు, భోజనాలు వంటి వాటిలోనూ, భార్యాభర్తల అనుబంధాల్లోనూ హాస్యం సృష్టించారామె.
    కామేశ్వరి గారి మొదటి కథే పూర్తి హాస్య కథ. దానిపేరు 'ఆనందరావు-ఆకాకరకాయలు'. ఈ కథ 30.11.1962 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది. ఏడాదిలో ఒకసారి మాత్రమే అరుదుగా దొరికే ఆకాకరకాయలంటే బ్రహ్మచారి ఆనందరావుకు విపరీతమైన ఇష్టం. ఉద్యోగం కోసం వేరే ఊళ్ళో ఉండి అయ్యరు హోటల్లో భోజనం చేసే ఆనందరావుకు ఆకాకరకాయలు తినే అవకాశం దొరకదు. పెళ్ళయ్యాక వంట రాని భార్యతో అయినా సరే ఆ కూర పండించుకుని తినాలని ఆనందరావు పడిన పాట్లు ఎంతో హాస్యస్ఫోరకంగా వర్ణించారు రచయిత్రి.
    'వడ్ల గింజలో బియ్యపు గింజ' కథలో రాజేశ్వరికి సినిమాలన్నా, బయటికి వెళ్ళాలన్నా చాలా ఇష్టం. భర్తకేమో ఇల్లేమో, ఆఫీసేమో అదే లోకం. భర్త తనతో సినిమాలకు, షికార్లకు రానంటే చాలా నిరుత్సాహపడుతుంది రాజేశ్వరి. చివరికి అతన్ని మార్చాలని ఒక్కతే సినిమాకు వెళ్ళి, ఓ యువకుడి పక్కన కూర్చుని అతడిచ్చిన కూల్ డ్రింక్ తాగాననీ, అతడే స్కూటర్ పై డ్రాప్ చేస్తానన్నాడనీ చెప్పి నడివయసు భర్తను కవ్విస్తుంది. ఆ తరువాత నుండి రాజేశ్వరి పథకం ఫలించి ఎటు వెళ్ళినా వెంట వచ్చేలా భర్త మారుతాడు.
    'అమ్మమ్మ గారి వంట'లో ఓ టీవీ ఛానల్ వాళ్ళ వంటల ప్రోగ్రాం కోసం సింగారించుకుంటుంది కనకమహాలక్ష్మి. తనకు అంతగా వంటలేవీ రాకపోయినా నానా హడావుడి పడి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టిస్తుంది. తీరా షూటింగ్ టైంలో వాళ్ళతో మాట్లాడుతూ వంటలు చెడగొట్టి ఏదో విధంగా వాళ్ళే కవర్ అప్చేస్తారని అనుకుంటుంది. కనక మహాలక్ష్మి 'కాలంతో కదలాలి'లో కాబోయే మొగుడి భుజంపై తలవాల్చి 'ఎనీ ప్లాన్స్ ఫర్ హనీమూన్ హనీ?' అనడిగే సూపర్ ఫాస్ట్ అమెరికా అమ్మాయి చరిత్ర, ఈ అమ్మాయిని చేసుకుని చవట దద్దమ్మలా అయిపోతానా అని భయపడే చరణ్, 'వంటొచ్చిన పెళ్ళా' కథలో ఇంటిపట్టున ఉండి వండిపెడుతూ ఇల్లూ, సంసారం, పిల్లల్ని చూసుకునే అమ్మాయి కావాలన్న అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పండుబాబు ఉరఫ్ చైతన్యను ఏ మాత్రం వంట రాకపోయినా పెళ్ళాడి, అతడి కోపానికి గురై మొత్తానికి వంటలన్నీ నేర్చుకుని అమెరికా వెళ్ళి ఇటు మొగుడ్నీ, అటు కేటరింగ్ సర్వీస్ తో కస్టమర్స్ నీ మెప్పించి భర్త కంటే ఎక్కువ సంపాదించిన శ్రీవల్లీ.. ఇలా అందరూ మనకు కావాల్సినన్ని నవ్వుల్ని సరఫరా చేస్తారు.
    రచయిత్రి తన గురించి తాను రాసుకున్న హాస్య కథ 'నరకంలో నిముషం'. కథలో కొత్తదనం లేకపోయినా వర్ణనలు, సంభాషణలు బావున్నాయి. ప్రమాదంలో చనిపోయి యమలోకం దాకా వెళ్ళిరావడం ఈ కథాంశం. మన అధ్వాన్నమయిన రోడ్లు, సూదిమొనంత సందు లేని పేవ్ మెంట్లు, చిత్రగుప్తుడు కంప్యూటర్ వాడడం వంటి వర్ణనలు నవ్విస్తాయి.
    'కాలంతో కదలాలి' హాస్య ధోరణిలో చెప్పిన వాస్తవ కథ. రామ్ చరణ్ ఇండియాలో పుట్టి పెరిగి, అమెరికాలో ఎమ్మెస్ చేసి ఉద్యోగం చేస్తున్న మధ్య తరగతి యువకుడు. అమెరికాలోనే పుట్టి పెరిగిన తెలుగమ్మాయి చరిత్ర. ఇద్దరూ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఇష్టపడ్డారు, పెద్దవాళ్ళు ఒప్పుకున్నాక పెళ్ళి కోసం ఇండియా వచ్చారు. ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. సంపాదించడం, పొదుపుగా నాలుగు డబ్బులు కూడపెట్టుకోవడం, విలాసాలకు పోకుండా సంతృప్తిగా బతకడం ఇష్టపడే చెర్రీ అనబడే చరణ్ కు, చరిత్ర పద్ధతులూ, పెట్టే ఖర్చులూ, ఫ్రీగా తిరగడం.... ఇవన్నీ చూసి తననో చవటను చేసి డామినేట్ చేస్తుందేమోనని భయం వేస్తుంది. వాళ్ళిద్దరినీ చూస్తూ చరణ్ నాయనమ్మ కలవరపడి భార్యను ముందునుంచే కంట్రోల్ లో పెట్టాలి అని సలహా ఇస్తుంది. అది విని 'పాతకాలానికీ, ఇప్పటికీ తేడా తెలిసుకొని కాలంతో మారాలని' చరణ్ తండ్రి ఆమెకు నచ్చచెబుతాడు.
    దాదాపుగా ఇలాంటి కథే 'వంటొచ్చిన పెళ్ళాం'. అమెరికాలో ఎమ్మెస్ చేసి ఉద్యోగం చేస్తున్న పండుబాబు తెలుగు వంటలంటే పడి చచ్చిపోతాడు. చిన్నప్పట్నుంచీ ఇండియాలో నాయనమ్మ మంచి రుచులతో కూడిన రకరకాల వంటలు చేసిపెట్టి అతన్ని భోజన ప్రియుడ్ని చేసింది. అందుకే పెళ్ళి మాటొచ్చేసరికి ఏదో డిగ్రీ చదివి బాగా వంటొచ్చిన ఇల్ల అయితే చాలని మాట్రిమోనీ లో చూసి శ్రీవల్లిని పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక భార్యకు మామూలు వంటే వచ్చనీ, అబద్దమాడి పెళ్ళి చేశారనీ తెలిసి.... కోపగిస్తాడు. మొత్తానికి రెండు నెలల్లో అన్ని వంటలూ నేర్పి పంపిస్తామని చెప్పి అతన్ని కన్విన్స్ చేస్తారు ఇరువైపులా పెద్దలు. అన్నీ ఫర్ఫెక్ట్ గా నేర్చుకున్న శ్రీవల్లి అమెరికా వెళ్ళాక పండుబాబుకు నచ్చినట్లుగా వండిపెట్టడమే కాదు, అతని స్నేహితుల సలహాతో శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ కేటరింగ్ సర్వీస్ మొదలుపెట్టి హెల్పర్స్ ని పెట్టుకుని అన్ని రకాల వంటలు చేస్తూ అతని కన్నా ఎక్కువ సంపాదిస్తూ తెలుగు వంటలే కాదు, ఏది వండితే అది తినమంటుంది. హాస్య కథ అయినా ఆడవాళ్ళు తల్చుకుంటే ఏదైనా సాధిస్తారు అని అంతర్లీనంగా ఓ సందేశం ఉంది ఇందులో.
    తనే ముఖ్యపాత్రగా రచయిత్రి రాసిన మరో కథ 'సునాయాస మరణం'. ఇది వ్యంగ్య ధోరణిలో భక్తుల అతి కోరికలు, వ్యామోహం, భౌతికమైన సుఖాలపట్ల వెంపర్లాట మొదలైన వాటి గురించి ఎత్తిచూపుతూ రాశారు. రచయిత్రికి కలలో దేవుడు కనిపించి ఒక వరం కోరుకోమంటాడు. ఆ పరంపరలో రకరకాలుగా ఆలోచిస్తాది ఇది కోరుకున్న అది ఆమెకు మాత్రమే ఉపయోగపడేలా ఉండే వరం కోరుకో అంటాడు ఆ పరంపరలో రకరకాల వ్యక్తుల గురించి వాళ్ళ ఆశల గురించి కోరికల గురించి వ్యామోహాల గురించి దేవుడితో సరదా సంభాషణలు ఈ కథాంశం చివరికి ఏం కోరుకోవాలో తెలియక సునాయసమరణాన్ని కోరుకుంటుంది అయితే అది ఎప్పుడో చెప్పమని భగవంతున్ని అడుగుతుంది అడిగితే ఆయన ఆ ఒక్క రహస్యం మీకు చెప్పేస్తే ఎలా అని మాయమవుతాడు వ్యంగ్య ధోరణిలో సాగిన ఈ కథలో కూడా కొంత సామాజిక స్పృహను జోడించి మనుషులకి నిజానికి ఏది అవసరం ఎంత అవసరం అది మాత్రమే కాకుండా విపరీతమైన వ్యామోహాలకు లోబడి ధనానికి వస్తువులకు హోదాలకు ప్రాధాన్యతనిస్తూ జీవితంలో ఆనందాన్ని శాంతిని కోల్పోతున్నారు అని రచయిత్రి చెపుతారు.
    చేయి తిరిగిన రచయిత్రి కనుక హాస్యరసాన్ని కూడా పండించగలనని ఈ కథల ద్వారా నిరూపించుకున్నారు. హాస్య కథల్లో కూడా హాస్యం కన్నా వ్యంగ్య ధోరణి, ఎత్తిపొడుపు ఈ కథల్లో కనిపిస్తాయి. ఇవి హాస్య కథలయినప్పటికీ పూర్తి అతిశయోక్తులు కాకుండా సహజంగా జరిగే సంఘటనల్నే హాస్య కోణంలో చూపారు.

 Previous Page Next Page